కబీరు గొప్ప వేదాంతి. ఆయన తత్త్వం హిందూ-ముస్లింల మధ్య సామరస్యానికి పతాక. కవిత్వం, తత్త్వం ఆయనకు ప్రాణప్రదం. ఆడంబరం వద్దన్నాడు. విగ్రహారాధన అసలే తగదన్నాడు. 15వ శతాబ్దంలో సంస్కరణ వాదాన్ని తన కవితల ద్వారా ప్రపంచానికి అందించాడు. సరళమైన కబీరు మార్గాన్ని ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా కోటి మంది వరకు అనుసరిస్తున్నారు. ఆయన తాత్వ్తిక ధార ఇది.
దార్శనికుడు కబీర్
హిందువులు, ముస్లింల మధ్య గొప్ప సామరస్య భావాన్ని నెలకొల్పడంలో అగ్రగణ్యుడు సంత్ కబీర్ అన్నారు ప్రముఖ చరిత్రకారుడు ఆర్. సి. మజుందార్. మహనీయుల పుట్టుక గురించి అడగకూడదంటారు పెద్దలు. అలానే 1440 - 1518 సంవత్సరాల మధ్యకాలంలో జీవించినట్లు భావిస్తున్న సంత్ కబీర్ పుట్టుపూర్వోత్తరాలు కూడా కడువిచిత్రం. ఎక్కడో పుట్టిన కబీర్‌ను వారణాసిలోని చేనేత కుటుంబానికి చెందిన దంపతులు పెంచి పెద్ద చేశారు. వారణాసిలో పెరగడంతో హిందూతత్త్వం గంగాతరంగాల్లా ఆయన సొంతమయ్యాయి. మరోవైపు జన్మతః వచ్చిన సూఫీతత్వం ఆయనకు మరింత వన్నె తెచ్చింది. బట్టల వ్యాపారిగా, చేనేత నిపుణుడిగా, గొప్ప తత్త్వవేత్తగా, కవిగా కబీర్ బహుముఖ ప్రజ్ఞ చూపారు.
పూజలు, పునస్కారాల సంస్కృతిని తన కవితల్లో ఎండకట్టారు కబీర్. తాత్త్విక చింతనతో, ఆడంబరాలు లేని జీవన విధానాలే భగవంతుడిని చేరుకొనే నిజమైన మార్గాలని బోధించారు కబీర్. విలక్షణమైన ఆయన బోధనలు ఎంతో మందిని ఆకర్షించాయి. కబీర్ మార్గ అనుయాయులు సిక్కు మతస్థులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోటిమంది వరకు ఉన్నారంటే సరళమైన ఆయన తత్త్వం ఎందరిని ఆకర్షించిందో అర్థం అవుతుంది. కవిత, భజన, సంస్కృత పద్యాల ద్వారా వేదాంతాన్ని సరళంగా ప్రజలకు అందించారు కబీర్. పలు భాషల్లో ఆయన భజనలు నే టికీ భక్తుల హృదయరాగాలై పలుకుతున్నాయి. ఆయన తాత్త్విక కవితలు అనేకం ఖవ్వాలీ పాటల రూపంలో నేటికీ పాకిస్తానీ గాయకుల గళాల నుంచి జాలువారుతూనే ఉన్నాయి.
హిందూ, ఇస్లాం వేదాంత మార్గాలను సమర్థిస్తూనే వాటిలో ఉన్న దురాచారాలను ఆయన ఎండకట్టారు. విగ్రహపూజల్ని, వ్యక్తి ఆరాధనల్ని వ్యతిరేకించారు. రెండు మతాల మధ్య వేదాంత వారధిగానే కాకుండా గొప్ప తాత్వికుడిగా, కవిగా, నిరాడంబర వాదిగా, సంస్కరణా శీలమైన దార్శనికుడిగా సంత్ కబీర్ చిరస్మరణీయుడు.
'ఎంతవరకు శరీరంలో ఊపిరి ఉంటుందో అంతవరకు అన్నీ కుశలమే. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిలిచిపోతాయో, అప్పుడు భార్యకూడా అతనిని చూసి భయపడుతుంది' అన్నారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో.
బతుకు ఓ మాయ
ఇదే తత్త్వాన్ని సంత్ కబీరు తన భక్తునికి ఒక ప్రయోగం ద్వారా ఆత్మావగతం ఆయ్యేలా చేశారు. కబీరుకు ఓ భక్తుడు ఉండేవాడు. ధనవంతుడు. కొందరు సంతానం. ఎందరో మిత్రులుండేవారతనికి. సమాజంలో గౌరవ మర్యాదలుండేవి. ఆ భక్తునికి బతుకుమీద అంతులేని ప్రీతి. ఒకరోజు కబీరు అతనితో మాట్లాడుతూ 'ప్రాపంచికమైన ఈ బంధాలన్నీ ఈ దేహం దానికి సంబంధించిన వస్తువులున్నంత వరకే.
అందుకే బతుకు ఒక మాయ' అన్నారు. భక్తుడు క బీరు మాటలకు సమ్మతించలేదు. ' మీరు చేప్పేది సరికాదు... నా భార్య సంగతి తీసుకుందాం. మా దాంపత్య జీవితం నలభయ్యేళ్లు. ఎంతో ప్రేమానురాగాలతో జీవిస్తున్నాం. ఒకవేళ నేను మరణిస్తే వెంటనే ఆమె గుండె పగిలి చస్తుంది' అన్నాడు శిష్యుడు చాలా విశ్వాసంతో. ఇక నా మిత్రులు నాకోసం ప్రాణాలైనా ఇస్తారు. నా పిల్లలు నేను లేకుండా జీవించరు' అన్నాడు.
చస్తే ఏమవుతుందో చూద్దాం!
కబీరు నవ్వుతూ, 'అలాగైతే నీవు చస్తే ఏమవుతుందో చూద్దాం. నీకొక ఔషధం ఇస్తాను. దాన్ని తిన్న తరువాత ఒక గంటలోగా నీ దేహం బిగుసుకుపోతుంది. చూసేవారికి నీవు చనిపోయినట్లే ఉంటుంది. కాని నీ బుద్ధి శక్తి యథాతథంగా ఉంటుంది. అన్నీ తెలుసుకుంటావు. నీ భార్య, పిల్లలు, మిత్రులు, బంధువులు నీ వియోగాన్ని ఏ రీతిగా భావిస్తారో చూద్దాం' అన్నాడు. భక్తుడు సమ్మతించాడు.
గురు, శిష్యుల పథకం ప్రకారం భక్తుడు ఔషధం మింగాడు. గంటలోగా భక్తుడు నిశ్చలుడైనాడు. దేహం బిగుసుకుపోయింది. ఇంట్లో కోలాహలం ప్రారంభమైంది. భార్య, పిల్లలు భోరుమని ఏడవసాగారు. ఆ వార్త దావానలంలా వ్యాపించింది. మిత్రులు పరుగు తీస్తూ వచ్చారు.
మధ్యంతరంగా పోయారే...!
భార్య దుఃఖంతో పొర్లాడుతూ భర్త దేహంపై పడి రోదిస్తూ ఉంది. "తల నిండా పూలు పెట్టుకొని, వంటి నిండా నగలను ధరించి, పట్టుచీర కట్టుకొని పేరంటాలకు వెళ్లినప్పుడు నన్ను చూసిన వారందరూ మహాలక్ష్మి వచ్చినట్లుంది అనేవారు. ఇప్పుడు మీరు చస్తే నా గతేం కాను? విధవగా సమాజంలో ఎలా ఉండగలను? పోయేవారు మరో పదేళ్ల తర్వాత పోకూడదా? సుఖంగా జీవించడానికి కావలసిన వసతులు సమకూర్చి మధ్యంతరంలో పోయారే!'' అని రోదించింది భార్య.
కొడుకులు గుసగుసలు ప్రారంభించారు. "చచ్చేముందు ఇనప్పెట్టె తాళం గుత్తులు ఎక్కడున్నదీ చెప్పకనే పోయాడు. అడిగిన మిత్రులందరికీ అప్పులిచ్చాడు. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో! ఆ పత్రాలెక్కడ దాచాడో!'' అంతా వింటున్నాడు నిశ్చలదేహుడైన శిష్యుడు. మిత్రులు తమలో తాము చర్చించుకోవడం భక్తుని చెవిలో పడింది.
"కావలసినప్పుడు డబ్బులిచ్చి ఆదుకునేవాడు. ఆకస్మికంగా చనిపోయాడే. బంగారు గుడ్లు పెట్టే కోడి చచ్చిపోయింది''. వ్యాపారంలో పోటీ పడుతున్నవారు "పీడ విరగడ అయింది. హాయిగా ఉండవచ్చు''.... ఇలా ఒక్కొక్కరు ఒక్కో తీరున మాట్లాడటం వింటూనే ఉన్నాడా కబీరు భక్తుడు. అదరూ తమకు కలిగిన నష్టాన్ని గురించి బాధపడుతుండగా కబీర్ ఆ వ్యవహారాన్నంతా ఒక మూల కూర్చుని నాటకంలా తిలకిస్తున్నాడు.
భర్త... దేహం... భయం
ఈ లోగా సూర్యాస్తమయం అయింది. ఇరుగుపొరుగువారు ఆకలితో బాధపడుతున్నారు. భార్య కన్నీరు కారుస్తూ "చీకటి పడేలోగా అంత్యక్రియలు జరగాలి. పోయినవారు మరలిరారు కదా''. అంది. భక్తుడు నిజంగానే నిశ్చేష్టుడయ్యాడు.
కబీరు నవ్వుతూ భక్తునితో అన్నాడు. 'తెలిసిందా బంధుమిత్రులు, భార్యాపిల్లల తీరు చూశావు కదా. అర్ధాంగి అని భావించిన భార్య శవంతో ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నది. తక్కినవారు ఇక ఏ తీరుగా స్పందిస్తారో చెప్పేదేముంది... అంటూ చేష్టలుడి గిన శిష్యుడిని అనునయించారు సంత్ కబీర్. అంతటి గొప్ప సత్యాన్ని సులభగ్రాహ్యంగా అనుభవంలోకి తీసుకురావడం ఆ మహనీయుడైన కబీరుకే చెల్లింది.
కన్ను మూస్తే మరణం
మరణం ఒక మిథ్య. దేనిని భౌతిక దేహంతో అనుభవించలేమో దాన్ని మిథ్య అంటున్నాం. ఒక వ్యక్తి మరణించాడంటే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్తబ్దం అవుతాయి. నేటి వైద్యులు గుండె ఆగింది. మెదడు మొద్దుబారింది. వ్యక్తి మరణించాడని ప్రకటిస్తారు.
మరణించిన తరువాత అందులోని చైతన్యం ఏమవుతుంది. అనుభవించి చెప్పగలవారెవరు? ఆధునిక కవి అన్నట్లు, "కన్ను తెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం. రెప్పపాటే గదా జీవన ప్రయాణం. ఊపిరి పోయిన తరువాత మరల ఊపిరి ఆడకపోవడమే మరణం''. ఇదంతా సత్యమే. మిథ్యాజీవితంలో మన కర్తవ్యం ఏమిటి? అంటే 'అల్పమైన విరామ కాలంలో జీవితం యొక్క భౌతికతను, పారమార్థికాన్ని తెలుసుకోవడమే వివేకం' అన్నారు శంకరులు.
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి