Wednesday, January 25, 2012

డాటరాఫ్ ఆర్ట్

అఫ్సా తంకనత్, ప్రియాంక ఏలే... వీరిద్దరూ ప్రముఖ ఆర్టిస్టులైన ఫవాద్ తంకనత్, లక్షణ్ ఏలేల డాటరాఫ్‌లు మాత్రమే కాదు, వారి కళకు కూడా వారసులు. ఈ నవతరం ఆర్టిస్టుల పరిచయమే ...

నేనేమిటో అదే నా సబ్జెక్ట్
- అఫ్సా తంకనత్

ఎవరైనా నా పెయింటింగ్ చూసి అది వారి జీవితాన్ని ప్రతిబింబించిందనుకుంటే చాలు. అంతకంటే నా చిత్రకళలో ఇంకేమీ ఉండదు. ఇటీవల నేను వేసిన చిత్రాల్లో నా ముఖమే వాడుకున్నాను. అదేదో సరదాకోసం చేసిన పనికాదు. ఒక సాధారణ అమ్మాయి తన ఫీలింగ్స్‌ను ఎలా తెలియజేస్తుందో చెప్పడానికే.

ప్రతీదీ నాకు కాన్వాసే...

నాన్న రంగుల లోకంలో పెరిగాను. చిన్నప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నా చిత్రకళకు బలైపోయేవి. దిండులు, గోడలు, గచ్చులు, బెడ్‌షీట్స్ ఇలా ఏది కనపడితే దానిపై ఒక కొండ, ఆ కొండ చుట్టూ చెట్లు వేసేదాన్ని. అలా మొదలై ఫైన్ఆర్ట్స్ బ్యాచిలర్స్ వరకు వెళ్లాను. పీజీ చేయడం కోసం ఎదురుచూస్తున్నాను.

అరగంట నుంచి నెల వరకు...

నా పెయింటింగ్స్‌కు స్ఫూర్తి నేనే. ఏదైనా ఆర్ట్ వేయాలనుకుంటే అరగంట పట్టొచ్చు, ఒక్కోసారి నెల కూడా సరిపోకపోవచ్చు. దైనందిన జీవితాన్నే ఎంచుకుంటాను. నా చిత్రాల్లో సమస్యలు, ఇజాలు, ఉద్యమాలు ఉండవు. మున్ముందు నా ఆలోచనలు మారొచ్చేమో తెలియదుగానీ ప్రస్తుతానికైతే ఇంతే. నాకు సంతృప్తినిచ్చినంతవరకు పని చేస్తూనే పోతాను. రాజీ పడను. తాజ్‌కృష్ణలో పెట్టిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నాను. నా పెయింటింగ్స్ కొన్ని అమ్ముడయ్యాయి. ఎంతకు పోయాయే తెలియదు. అవన్నీ నాన్న చూసుకున్నారు.

పెయింటింగ్ పర్యటనలు...

విదేశాల్లో నాన్న ఆర్ట్ ఎగ్జిబిషన్‌లు జరుగుతుంటాయి. అన్నిటికీ వెళ్లలేదు కానీ ఇండోనేషియాకు ఒకసారి వెళ్లాను. ఆర్ట్ వేయడంలో పొందే ఆనందాన్ని అక్కడి ఆర్టిస్టుల్ని చూసి నేర్చుకున్నాను. మన దేశంలో కూడా ఇతర నగరాల్లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్‌లు చూస్తుంటాను. వాటన్నిటినీ చూశాక మనదైన ముద్రకోసం ప్రయత్నించాలని అర్థమయింది.

ఆర్ట్ టీచర్...

ప్రపంచంలోని ప్రముఖ ఆర్టిస్టుల జీవితాన్ని తెలుసుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. హెన్రీ, బెక్‌మిన్, సూజా, మానే, పికాసో వీరందరినీ అధ్యయనం చేస్తుంటాను. ఒక్కొక్కరిదీ ఒక్కో టెక్నిక్. కొంతమంది పిల్లలు ఆర్ట్ నేర్పమని వస్తుంటారు. అది చూసి నాన్న 'ఆర్ట్ టీచర్ గారూ' అంటూ నా మీద జోకులేస్తుంటారు. నేను దేవుణ్ణి నమ్ముతాను. దేవుడు మహిమలు నమ్మను. నా ఆర్ట్‌లో సందేశాలు ఉండవు. నేనేమిటో అదే నా పెయింటింగ్.

" నాన్న ఆర్ట్‌లో 20 సంవత్సరాలుగా ' స్త్రీ' యే ప్రధాన సబ్జెక్టుగా ఉంటోంది. అన్నేళ్లపాటు అదే కాన్సెప్ట్ చుట్టూ బొమ్మలేయడం బోరు కొట్టదా? అని అడిగాను. 'ఎవరైనా ప్రతీ రోజూ మంచి ఆహారమే తినాలనుకుంటారు. అందులో బోరు అనే ప్రశ్న ఉండదు' అన్నారు నాన్న''.
-అఫ్సా తంకనత్


లాభం.. నష్టం రెండూ ఉన్నాయి

తండ్రి వా రసత్వం అందుకోవడంలో అఫ్సాకు లాభం, నష్టం రెండూ ఉన్నాయి. ఆరంభానికి నేను ఉపయోగపడతాను. కానీ తరువాత నా పెయింటింగ్స్‌తో ఆమె పనిని పోల్చడం మొదలు పెడతారు. అది ఎక్కువ శాతం నష్టమే చేస్తుంది. ఆర్ట్ బాగుంటే మేలు చేయొచ్చు కూడా. తనకు నేనేమీ సలహాలు ఇవ్వను. నేర్చుకోమంటాను. మనం దేన్నయితే కెరీర్‌గా ఎంచుకున్నామో దానికోసం 24 గంటలూ పని చేయాలని చెబుతుంటాను.
- ఫవాద్ తంకనత్


మావనసంబంధాలే ముడిసరుకు
- ప్రియాంక ఏలే

నగర వాతావరణంలో పెరిగాను. నా ఆర్ట్‌కు నేపథ్యం కూడా ఇదే. నాన్న చిత్రాల్లో తెలంగాణ స్త్రీ ఉంటుంది. ఆ పల్లెల సౌందర్యం ఉంటుంది. నేనలా గీయలేను. నాది పూర్తిగా మోడ్రన్ ఆర్ట్. అయితే సంప్రదాయ చిత్రకళ నుంచి నేర్చుకున్న లైన్, కర్వ్, టెక్నిక్‌ను ఉపయోగించుకుంటాను.

కళాత్మక అభ్యాసం...

సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్ట్‌లో పీజీ చేస్తున్నాను. తరగతులు ఉంటే వెళతాను. లేదంటే సోమాజిగూడలోని మా స్టూడియోలోనే ఉంటాను. డిగ్రీ చేస్తున్నప్పుడు ఖాళీసమయంలో మెక్సికన్ ఆర్టిస్టు 'ఫ్రిదా కాలో' ఆర్ట్‌పైన డిసర్టేషన్ చేశాను.

నేను దేవుణ్ణి నమ్మను. మన సమస్యలకు వేరే ఎవరో పరిష్కారం చూపుతారనుకోను. స్త్రీలు తమ ఇబ్బందుల్ని తామే ఎదుర్కోవాలి. తమకు తామే వాటిని అధిగమించేలా ఆలోచించాలి. ఈ దృక్పథం కూడా 'ఇరిగరి' అనే ఫెమినిస్టు రచనల్లోంచే అలవడింది నాకు. నా కొలాజెస్‌ల్లో దీనిని చెప్పడానికే ప్రయత్నిస్తుంటాను. వాటిల్లో స్త్రీ గొప్ప గొప్ప సాహసాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదంతా స్త్రీల్లో హీరోయిజం ఉందని తెలియజేయడానికే.

ఇది నా స్పందన ...

స్వేచ్ఛ ఒకరిస్తే వచ్చేది కాదనే స్ఫూర్తితో ఒక పెయింటింగ్ వేశాను. మానవ సంబంధాల్లోని కళాత్మకత మరింతగా చూపాలనుకుంటున్నాను. నా చిత్రకళకు ఇదే ప్రధాన ముడిసరుకు. వీటి నుంచి తీసుకున్న థీమ్‌ను ప్రత్యేకమైన మీడియంతో ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటున్నాను. సినిమా, టీవీలలో పని చేయాలనే ఆసక్తి లేదు. థియేటర్ ఆర్ట్ అంటే ఇష్టమున్నా ఇప్పటివరకు దాని జోలికీ వెళ్లలేదు. ఎప్పటికైనా అందులో పనిచేస్తాననే నమ్మకముంది.

తొలి సంపాదన...

ఐదో తరగతి చదువుతున్న సమయంలో తొలి పెయింటింగ్ వేసినట్టు గుర్తు. నాన్న వేస్తుండగా కాపీ కొట్టాను. నా తొలి కస్టమర్ మా అక్క, ఆమె స్నేహితులు. నాలుగు అడుగుల పొడవున్న పెయింటింగ్‌ను 15,000 రూపాయలకు కొన్నారు. గతేడాది రెండు చోట్ల నా పెయింటింగ్స్ ప్రదర్శనకు పెట్టాను. మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో 'ఫ్లోరా అండ్ ఫోనా' పేరిట గ్రూప్ షో జరిగితే అందులో ఉంచాను. అప్పుడు ఓ రెండు పెయింటింగ్స్ 3000, 5000 చొప్పున అమ్ముడయ్యాయి. నాన్న స్టూడియోకు వచ్చిన వాళ్లు నా చిత్రాలు చూసి కొంటామంటుంటారు. కానీ ఇవ్వదలచుకోలేదు. కొన్నాళ్ల తరువాత సోలో షో పెట్టాలనే ఆలోచన ఉంది.

" నేను వేసిన పోర్ట్రెయిట్స్ చూసి నాన్న ఏదో చెబుతారని ఆసక్తిగా ఎదురుచూశాను. వాటన్నిటినీ దగ్గరిగా పరిశీలించాక ఆయన వాటిని దయ్యాల్లా ఉన్నాయన్నారు''
- ప్రియాంక ఏలే


నా బెస్ట్ క్రిటిక్...

ప్రియాంక మంచి మెరిట్ విద్యార్థిని. డాక్టర్‌గా చూడాలనుకున్నాను. ఇంటర్ తరువాత నా దగ్గరకు వచ్చి ఆర్ట్‌లో బ్యాచిలర్స్ చేస్తానని చెప్పింది. అదే రంగంలో కొనసాగుతున్న నాకు అదొక మంచి వార్త అనిపించింది. ఎన్నో పుస్తకాలు, ఎంతో ఆర్ట్ మెటీరియల్, ఇంకెన్నో పెయింటింగ్స్ ఇవే నా సంపాదన. వీటన్నిటినీ ప్రియాంకకు ఇచ్చి నిశ్చింతగా ఉండొచ్చని భావించాను. ఆమె మంచి ఫోటోగ్రాఫర్ కూడా. అందుకే కెమెరా ఒకటి బహుమతిగా ఇచ్చాను. నా కలర్ ప్యాలెట్ వేరు. ఆమె ఉపయోగించే రంగులు వేరు. ప్రియాంక ఆలోచనలు బాగుంటాయి. ఇప్పుడు నా చిత్రాలకు తనే తొలి, దిబెస్ట్ క్రిటిక్.
- లక్ష్మణ్ ఏలే
- బల్లెడ నారాయణమూర్తి
ఫోటోలు: శివ

Thursday, January 19, 2012

మాటల్లో, జీవితంలో... ‘విన్‌’ ఫ్రే - అమెరికా టాక్‌ షో క్వీన్ .. ఒప్రా విన్‌ఫ్రే

 http://www.wikeez.com/en/sites/default/files/imagecache/L300/oprah-winfrey-22-1-2010%20(3)_0.JPG
భారతీయ మీడియా మార్కెట్‌ హాలీవుడ్గ తారలతో పాటు అమెరికా టీవీ మాధ్యమ దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటోంది. 
http://static.ibnlive.in.com/ibnlive/pix/sitepix/01_2012/oprah-jan18.jpg
ఈ నేపథ్యంలో అమెరికా టాక్‌ షో క్వీన్‌గా పేరొందిన ఒప్రా విన్‌ఫ్రే భారత్‌లో వారం రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఆమె పర్యటన బాలీవుడ్ తారలతో పాటు జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకట్టు కుంటోంది. న్యూస్‌వెబ్‌సైట్లలో, సోషల్‌ మీడియా సైట్లలో ఎక్కడ చూసినా విన్‌ఫ్రే కబుర్లే ఉంటున్నాయి.
http://www4.pictures.zimbio.com/pc/Oprah+Winfrey+hits+streets+Mumbai+India+wearing+kxYWztiaTlWl.jpg
విన్‌ ఫ్రే సాధించిన విజయాలు ఎన్నెన్నో...ఆమె స్ఫూర్తిగా ఎంతో మంది యువతులు మీడియా రంగప్రవేశం చేశారు. బాల్యంలో కడు పేదరికాన్ని చవిచూసిన విన్‌ఫ్రే నేడు ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ఎన్నో కష్టనష్టాలను భరించి అట్టడుగు స్థాయి  నుంచి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు.

ప్రొఫైల్‌
oprah-winfrey

పూర్తి పేరు : ఒప్రా గలి విన్‌ఫ్రే
జననం  : 1954 జనవరి 29 
    (మిసిసిపి, అమెరికా)
నివాసం   : కాలిఫోర్నియా (అమెరికా)
చైర్‌పర్సన్‌, సీఈఓ : ఒప్రా ప్రొడక్షన్స్‌
సీఈఓ, సీఒఒ : ఒప్రే విన్‌ఫ్రే నెట్‌వర్క్‌
తొలి ప్రదర్శన : 1983
రాజకీయపక్షం : డెమెక్రటిక్‌ పార్టీ
 http://i43.tower.com/images/mm101531879/oprah-winfrey-biography-helen-s-garson-hardcover-cover-art.jpg

అమెరికా టాక్‌ షో క్వీన్‌, ప్రొడ్యూసర్‌ ఒప్రా విన్‌ఫ్రే వారం రోజుల పాటు భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పర్యటనలో భాగంగా అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబాన్ని, బాలీవుడ్‌ తారలను, ఇతర ప్రముఖులను ఆమె కలుసుకున్నారు. భారత్‌లో ఆమె ఎందుకు పర్యటిస్తున్నారన్న అంశంపై రకరకాల ఊహాగానాలు నెలకొన్నాయి. ఆమె మాత్రం నవతరం ఆధ్యాత్మిక గురువు దీపక్‌ చోప్రా షూటింగ్‌ కోసం వచ్చినట్లు ఓ సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌లో స్వయంగా తెలిపారు. భారతదేశంలో కొనసాగుతున్న కుటుంబ అనుబంధాలను ఆమె ఈ సందర్భంగా ఎంతగానో ప్రశంసించడం విశేషం.
http://www.mswritersandmusicians.com/writers/winfrey/oprah-girl.jpg
‘భారతీయుల సహనశీలత నాకెంతో నచ్చింది. పరస్పరం ప్రేమించుకోవడం, కలసి జీవిం చడం ఇక్కడి కుటుంబాల్లో చూస్తున్నాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రముఖు లను మీరు తల్లిదండ్రులతో కలసి ఎలా జీవిస్తున్నారని అడిగేదాన్ని. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను’ అని విన్‌ఫ్రే వ్యాఖ్యానించారు. 
http://cdn-channels.netscape.com/gallery/i/o/oprah/2317088.jpg
ముంబయి చేరుకున్న విన్‌ఫ్రే మొదట అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ప్రిన్సెస్‌ ‘బేటీ బి’ని చూసి ముచ్చటపడ్డారు. సుమారు గంట సేపు ఆమె అమితాబ్‌ నివాసంలో గడిపారు. సోమవారం రాత్రి పరమేశ్వర్‌ గోద్రెజ్‌ ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారు. బాలీవుడ్‌ ప్రముఖులు షారూఖ్‌ఖాన్‌, ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, లారా దత్తా, శిల్పా శెట్టి, అనిల్‌ కపూర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, నేహా దుపియా, సమీరా రెడ్డి, డినో మోరియా, రచయిత్రి శోభా డే, జ్యుయలరీ డిజైనర్‌ ఫరా ఖాన్‌ తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు.


నూతన షో ఇంటర్వ్యూల కోసం...
chalenge 
‘ఒప్రా నెక్ట్‌‌స ఛాప్టర్‌’ అనే తన నూతన షో కార్యక్రమంలో భాగంగా దీపక్‌ చోప్రాను ఇంటర్వ్యూ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం ఆమె ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దేశదేశాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. 
http://timesofindia.indiatimes.com/photo/11526075.cms
తాను గతంలో భారత్‌ను ఎన్నడూ సందర్శిం చలేదని, భారతీయ జీవిత కోణాలను తెలుసుకునేందుకు వచ్చానని తెలిపారు. ముంబయిలో బాలీవుడ్‌ తారలను కలుసుకోవడంతో పాటు మురికివాడల్లోనూ ఆమె పర్యటించారు. భారత్‌పై ఆమె ఐదు గంటల కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. పర్యటనలో భాగంగా దేశంలోని ప్రముఖ చారిత్రక, పర్యాటక కట్టడాలను ఆమె సందర్శిస్తున్నారు. 
  
ముంబై మురికి వాడల్లో ఓఫ్రా విన్‌ఫ్రే
అమెరికన్ టాక్ షో క్వీన్ ఓఫ్రా విన్‌ఫ్రే దక్షిణ ముంబైలోని కొలాబా మురికి వాడల్లో పర్యటించారు. ‘ఓఫ్రా నెక్ట్స్ చాఫ్టర్’ అనే కార్యక్రమం కోసం విన్‌ఫ్రే భారత్‌లో పర్యటిస్తున్నారు. త్వరలో భారత్‌పై ‘ఓఫ్రా న...ెక్ట్స్ చాఫ్టర్’అనే ఐదు గంటల కార్యక్రమాన్ని రూపొందిస్తున్నానని ఆమె తెలిపారు.
http://media2.intoday.in/indiatoday/images/stories/oprah-winfreay_350_011612095715.jpg
భారత పర్యటనలో బాలీవుడ్ ప్రముఖుల్ని, ఇతర వ్యక్తుల్ని కలవడం సంతోషానికి గురి చేసిందన్నారు. భారత దేశ ప్రజల సహనం, ఓపిక చూస్తే ముచ్చటేసిందన్నారు. కుటుంబాలు ప్రేమతో కలిసి మెలిసి జీవించడం గొప్ప విషయమన్నారు.
http://img2.timeinc.net/people/i/2011/database/110117/oprah.jpg
సామాన్యులను కలుసుకోవాలి...
విన్‌ఫ్రే పర్యటనపై బాలీవుడ్‌, ఇతర రంగాల ప్రముఖులు సైతం ఎంతగానో స్పందిస్తున్నారు. ‘ఆమె మా ఇంటికి రావడం, చిన్నారిని ఆశీర్వదించడం ఎంతో ఆనందదాయకం. చీరకట్టులో ఆమె ఎంతో అందంగా ఉందని’ బిగ్‌ బి ట్వీటారు. ఆమె సామాన్యులను సైతం కలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సినీనిర్మాత, దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ట్వీట్‌ చేశారు. 
http://celebrityandglobal.files.wordpress.com/2010/04/oprah-winfrey1.jpg
రామ్‌గోపాల్‌ వర్మ కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. ఆమె పేరు పామ్‌ఫ్రెట్‌ అనే చేపజాతిని పోలిఉండడాన్ని ప్రస్తావిస్తూ ...పామ్‌ ఫ్రే... విన్‌ఫ్రే... విన్‌ ఫ్రే ఓ చేపనా అంటూ సరదాగా ట్వీట్‌ చేశారు. ఈ సరదా శృతి మించి ఉందంటూ విమర్శలూ అనేకం వచ్చాయి. ‘విన్‌ ఫ్రే, షారూఖ్‌...వీరిద్దరినీ నేనెంతగానో ఆరాధిస్తాను’ అంటూ లారా దత్త ట్వీట్‌ చేసింది. వారిద్దరితో తాను కలసి ఉన్నప్పటి ఫోటోను కూడా ఆమె పోస్ట్‌ చేసింది. నేహా దుపియా కూడా తాను విన్‌ఫ్రేతో కలసి ఉన్న ఫోటోను పోస్ట్‌ చేయడం విశేషం. ‘విన్‌ఫ్రే ఎంతో అందంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేసింది. ‘చీరలో ఆమె ఎంతో అందంగా ఉంది’ అని ప్రీతి జింతా పేర్కొంది. ‘అలాంటి వ్యక్తిని ఇంతకు ముందెన్నడూ కలుసుకోలేదు. ఎంతో ఆనందం కలిగింది’ అంటూ సమీరా రెడ్డి ట్వీట్‌ చేసింది. 
http://img.xcitefun.net/users/2012/01/280310,xcitefun-oprah-winfrey-india-3.jpg
చిన్నతనంలో కటిక దారిద్య్రాన్ని అనుభవించిన విన్‌ ఫ్రే నేడు అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. తొమ్మిదేళ్ళ వయస్సులోనే ఆమె అత్యాచారానికి గురైందని, 14 ఏళ్ళ వయస్సులో తల్లి అయిందని చెబుతారు. హైస్కూల్‌లో ఉన్న రోజుల్లోనే ఆమె రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత షికాగో టాక్‌ న్యూస్‌ను మెగా హిట్‌ చేయడంతో మీడియాలో ఆమె పేరు మార్మోగిపోయింది. ఆమె సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
http://www.x17online.com/oprahbookshock.jpg
సాహిత్యం, వ్యక్తిత్వం, ఆధ్యాత్మికం...ఇలా ఆమె స్పృశించని అంశాలంటూ లేవు. ఎంతోమంది హేమాహేమీలను ఇంటర్వ్యూ చేశారు. అమెరికా ఇప్పటి అధ్యక్షుడు ఒబామా ఎన్నికల్లో పాల్గొన్న సందర్భంలో ఆయనను ఓటర్లకు పరిచయం చేసే కార్యక్రమాల్లో కూడా విన్‌ఫ్రే చురుగ్గా పాల్గొన్నారు.
భారతీయత ఉట్టిపడేలా...చీరకట్టులో!
neha 
భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో, చేతులకు బంగారు గాజులతో విన్‌ఫ్రే ఓ వేడుకలో దర్శనమివ్వడం విశేషం. ఆ దుస్తులను తరుణ్‌ తహ్లియాని డిజైన్‌ చేశారు. ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ డిజైన్‌ చేసిన దుస్తులను కూడా తాను ధరించనున్నట్లు వెల్ల డించారు. ఇటీవల డర్టీపిక్చర్‌ తార విద్యా బాలన్‌కు దుస్తులు డిజైన్‌ చేసింది ఆయనే కావడం విశేషం. విన్‌ ఫ్రే కోసం చీరను డిజైన్‌ చేసిన తరుణ్‌ మాట్లాడుతూ, మొదట తాము ఆమెకు నచ్చే రంగులు తెలుసుకున్నామని అందుకు అనుగుణంగా డిజైన్‌ చేశామని చెప్పారు. నారింజ రంగు చీర కట్టుకోవాల్సిందిగా తాను సూచించానని, భారతీయత ఉట్టిపడేలా కాంజీవరం ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్నానని తెలిపారు. ఆ చీరకు జిప్‌ ఉందని, దాన్ని స్కర్ట్‌లా ధరించవచ్చని చెప్పారు. గత ఏడాది లేడీ గాగా భారత్‌ను సందర్శించినప్పుడు ఆమె కట్టుకున్న చీరను డిజైన్‌ చేసింది ఆయనే కావడం విశేషం. అప్పట్లో లేడీ గాగా కు ప్రత్యేకంగా డిజైన్‌ చేయలేదని, తన కలెక్షన్‌లలో నుంచి రెండు చీరలను ఆమె ఎంపిక చేసుకుందని, ఈ దఫా మాత్రం తాను స్వయంగా ఈ చీరను డిజైన్‌ చేసినట్లు తరుణ్‌ తెలిపారు.
ఏనాటి అనుబంధమో...
aahabhi 
బాలీవుడ్‌ ప్రముఖులతో మరీ ముఖ్యంగా అమితాబ్‌ బచన్‌ కుటుంబంతో విన్‌ఫ్రే అనుబంధం ఈనాటిది కాదు. 2005లోనే ఐశ్వర్యారాయ్‌ విన్‌ఫ్రే షో లో దర్శనమిచ్చారు. 2009లో మరోసారి ఆమె తన భర్త అభిషేక్‌తో కలసి ఆ షోలో పాల్గొన్నారు. 

టాక్‌ షోక్వీన్‌గా...
 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgPEC1XQAK2N996Y7psHhyphenhypheny3c1p8qKjv-fyKUfzkdv0TC_rp3MpABL1hLeaKw7Xbt9XGkY8BcNFk6-UrXp6xbscNZZeLHiKDH0QBuJjZ6Ax8rx4zWedNZTdMANqQEBMccvLuoBx3aesZtpX/s400/ashoprah.jpg
విన్‌ ఫ్రే టాక్‌ షో అమెరికాలోనే గాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంది. ఈ కార్యక్రమానికి ఎన్నో అవార్డులు లభించాయి. 20వ శతాబ్ది సంపన్న ఆఫ్రికన్‌ అమెరికన్‌గా ఆమె పేరొందింది. ఎన్నో దాతృత్వ కార్యకలాపాలతో మహా దాతగా కూడా ప్రఖ్యాతి చెందారు. ప్రపంచంలో స్ఫూర్తిదాయక మహిళల్లో ఒకరిగా ఆమెను గుర్తించారు.
http://i.telegraph.co.uk/multimedia/archive/01408/oprah_1408177c.jpg

Wednesday, January 18, 2012

మధ్యధరాలో ఆ రాత్రి...

 

కోస్టా కంకార్డియా మరో టైటానిక్ అవాల్సింది. అదృష్టవశాత్తూ కాలేదు. టైటానిక్‌లా సముద్రగర్భంలో మునిగిపోయినా ఎక్కువ ప్రాణనష్టం జరగలేదు. నాలుగు వేల మందికి పైగా బతికి బయటపడగా ఐదుగురు మాత్రమే మరణించారు. ఇటలీకి సమీపంలోని ఓ చిన్న దీవి దగ్గర ఈ నౌక మునిగిపోయినపుడు అందులో ఆరుగురు తెలుగు వాళ్లు చెఫ్‌లుగా పనిచేస్తున్నారు. వారిలో జొనాథన్ పాటూరి ఒకరు. ప్రస్తుతం రోమ్ నగరంలో సేదతీరుతున్న ఆయనను ఫోన్‌లో పలకరించినప్పుడు జరిగిన సంఘటన గురించి ఇలా చెప్పుకొచ్చారు..

రాత్రి 9.25 అవుతోంది. మధ్యధరా సముద్రం ఈదురుగాలులతో భయపెడుతోంది. ఆ చల్లటి నీళ్లలో కోస్టా కంకార్డియా అనే ఒక విలాస నౌక ఇటలీ సమీపంలో వెళుతోంది. అందులో 3,200 మంది ప్రయాణికులు, వెయ్యి మంది సిబ్బంది ఉన్నారు. సగం మంది రాత్రి డిన్నర్‌ను పూర్తి చేశారు. మిగిలిన వారంతా డైనింగ్ హాల్ వద్దకు చేరుకున్నారు. వేడి వేడి ఫ్రెంచ్, ఇటాలియన్ రుచులను సిద్ధం చేస్తున్నారు చెఫ్‌లు. టేబుళ్లను సర్దుతున్నారు వెయిటర్లు.

లయబద్ధంగా వెళుతున్న నౌక ఒక్కసారిగా గట్టి కుదుపుకు గురైంది. వైన్ బాటిళ్లు, వోడ్కా సీసాలు, ఫోర్క్‌లు, స్పూన్లు, పింగాణి ప్లేట్లు.. టపటపా జారి పడిపోయాయి. గాజు సీసాలన్నీ ఫెళ్లున పగిలిపోతున్నాయి. "నౌకలో ఏమైంది.. ఏమైంది..!!!!'' ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు.  "సముద్రంలో ఒక్కోసారి పెద్ద అలలు వస్తుంటాయిలే'' అన్నారు కొందరు. షిప్పుల్లో ఇదంతా మామూలే అన్నారు మరికొందరు.

వారి అంచనాల్ని కొట్టిపారేస్తూ.. మరో పెద్ద కుదుపుకు గురైంది నౌక. ఈసారి వస్తువులే కాదు, మనుషులూ చెల్లాచెదురయ్యారు. "అమ్మో! మనమంతా మునిగిపోతున్నాం..'' గట్టిగా కేకలు పెట్టారంతా. ఆహ్లాదంగా సాగిపోతున్న ప్రయాణం ఒక్కసారిగా మృత్యుభయంతో గంభీరంగా మారిపోయింది. అప్పుడు ఆ నౌకలో ఆరుగురు హైదరాబాద్ కుర్రాళ్లు, ఒక చీరాల వ్యక్తి ఉన్నారు. వీళ్లంతా నౌకలో పనిచేసే వంటవాళ్లు. పదిహేను రోజుల కిందటే ఈ నౌకలో చేరిన జొనాథన్ పాటూరి ఆ నాటి సంఘటనను కళ్లకు కట్టినట్లు వినిపించారు.

నౌక ఒక్కసారిగా గట్టి కుదుపుకు గురైంది. వైన్ బాటిళ్లు, వోడ్కా సీసాలు, ఫోర్క్‌లు, స్పూన్లు, పింగాణి ప్లేట్లు.. టపటపా జారి పడిపోయాయి. గాజు సీసాలన్నీ ఫెళ్లున పగిలిపోతున్నాయి. "నౌకలో ఏమైంది.. ఏమైంది..!!!!'' ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాయి.
- జొనాథన్ పాటూరి


ఉన్నట్లుండి చిమ్మ చీకటి..
"కోస్టా కంకార్డియా ప్రపంచంలోనే పేరున్న క్రూయిజ్ (విలాసనౌక). సముద్రంలో ఏడు రోజుల ట్రిప్‌లు వేస్తుంది. ఈ సారి ఇటలీలోని రోమ్ నుంచి సవోనా వెళుతోంది. నేను మొన్న క్రిస్‌మస్ రోజునే ఇందులో చెఫ్‌గా చేరాను. శుక్రవారం రాత్రి 9.20 అవుతోందనుకుంటా. డిన్నర్‌కు వస్తున్నారంతా. కిచెన్‌లో తొంభైమంది వంటవాళ్లు ఎవరి బిజీలో వారు ఉన్నారు. నౌకలో ఒక్కో రోజు ఒక్కో దేశపు ప్రత్యేక వంటను వండుతారు. నేను 'పాస్తా' అనే రకం వంట చేస్తున్నాను.

నౌకలో వచ్చిన కుదుపును చూసి అందరిలాగే మేము కూడా.. సముద్రంలో ఇలాంటివి మామూలే అనుకున్నాం. పది నిమిషాల తర్వాత కిచెన్‌లోని సామాన్లన్నీ గలగలమంటూ కిందికి పడిపోయాయి. నౌకలో నిల్చున్న వాళ్లంతా మెల్లగా ఒరిగిపోతున్నారు. నా కాళ్లు వాటంతటవే వాలిపోతున్నాయి. నౌక దేన్నో ఢీకొట్టింది అని అర్థమైంది మాకు. చెఫ్‌లందరూ ఒక చోటికి చేరారు. అప్పటికే ప్రయాణికుల అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. కెప్టెన్‌కు ఫోన్ చేద్దామనుకునే లోపే ఫట్ ఫట్‌మంటూ కరెంటు తీగలు మండిపోయినట్లు.. శబ్దం వచ్చి.. కరెంటు పోయింది. నౌక మొత్తం చిమ్మచీకటి కమ్ముకుంది. క్షణాల్లోనే ఎమర్జెన్సీ లైట్లు పడ్డాయి. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం.

అందరం డెక్‌ఫోర్‌లో..
మేమంతా కిచెన్‌లో నుంచి బయటికొచ్చి.. డెక్‌ఫోర్ (నౌకలో బాల్కనీ ప్రదేశం)లో నిలబడ్డాం. అప్పటికే ప్రయాణికులంతా గుమిగూడారక్కడ. నౌకల్లో ప్రమాదాలు జరిగినప్పుడు డెక్‌ఫోర్‌కి చేరుకుని, లైఫ్‌బోట్లలో ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో.. నౌక ఎక్కేటప్పుడే అందరికీ చిన్నపాటి శిక్షణ ఇస్తారు. నౌకలో పనిచేసే మాకైతే ప్రతి వారం ఈ ప్రాక్టీస్ ఉంటుంది. మా నౌకలో 26 లైఫ్‌బోట్లు ఉన్నాయి.

వాటిని నీళ్లలోకి పడేసి.. ప్రయాణికులను అందులో ఎక్కించాం. ఆ బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు సేఫ్టీ ట్రైనర్ ఒకడుంటాడు. ప్రతి లైఫ్‌బోటుకు ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. రాత్రి పూట ఆ సముద్రంలో మేమెక్కడున్నామో అర్థం కాలేదు. నౌకలో ఉన్నంతసేపూ తెలియలేదు కాని బయటికొచ్చాక చలి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకుని.. వణికిపోయాం. అప్పుడు ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలుంది.

నౌక ఓ పెద్ద రాయిని గుద్దుకోవడంతో.. ఇంజన్‌లోకి నీళ్లొచ్చాయని తెలిసింది. కొన్ని గంటల్లోనే షిప్పు పూర్తిగా మునిగిపోవడం ఖాయం అనుకున్నాం. నాకైతే భయం వేయలేదు. ఎందుకంటే మిత్రులంతా ఒకేచోట ఉన్నాం. కొద్దిమంది ప్రయాణికులనైనా రక్షించి తీరాలని.. రంగంలోకి దూకాం. 'మమ్మల్ని కాపాడండి.. మమ్మల్ని కాపాడండి' అంటూ నౌకలో ఉన్నవాళ్లంతా మా మీద పడిపోయారు. గందరగోళ వాతావరణం ఏర్పడింది.

రహస్య సంభాషణ..
నౌకలు ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు.. ప్రయాణికులు భయపడకుండా సిబ్బంది మాట్లాడుకునేందుకు కొన్ని రహస్య కోడ్స్ ఉంటాయి. నీళ్లు నౌకలోకి ప్రవేశిస్తుంటే 'డెల్టా ఎక్స్ రే' అంటాం. అగ్నిప్రమాదం జరిగితే 'ఇండియా విక్టర్' అనాలి. బాంబు బెదిరింపులొస్తే 'బ్రేవో సెరా' అని మాట్లాడుకోవాలి. మా సహోద్యోగి వచ్చి 'డెల్టా ఎక్స్‌రే' అని చెప్పగానే నౌకలోకి నీళ్లొచ్చాయని తొలి సమాచారం తెలిసింది. లైఫ్ బోట్లలో ప్రయాణికులందరినీ ఎక్కించాం.

అయితే ఆ బోట్లు మా నౌక కెప్టెన్ అనుమతి లేనిదే బయలుదేరకూడదు. కెప్టెన్ 'అబాండన్ షిప్' అని మూడుసార్లు గట్టిగా అరిచి చెప్పాకే వెళ్లాలి. అతని ఆదేశం కోసం టెన్షన్‌తో ఎదురుచూస్తున్నాం. ఎంతసేపటికీ ఆదేశాలు రాలేదు. మరోవైపు షిప్పు మునిగిపోతోంది. అందులో ఇంకా సగం మంది ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు. ఇక, చేసేది లేక లైఫ్ బోట్లను ఒడ్డుకు చేర్చాం. అదృష్టమేమిటంటే.. మా నౌకకు కేవలం యాభై మీటర్ల దూరంలోనే పోర్టు ఉంది.

ప్రయాణికులను ఒడ్డున వదిలేసి.. రెండు మూడు సార్లు నౌక వద్దకు తిరిగి వచ్చి మిగిలిన వాళ్లందర్నీ రక్షించాం. అప్పటికే నౌక చాలా భాగం మునిగిపోయింది. రాత్రి 12.30 గంటలకు ఒడ్డుకు చేరుకుని ప్రాణాలను రక్షించుకున్నాం కాని చలి పులికి దొరికిపోయాం. ఒడ్డునున్న ప్రాంతం ఒక చిన్న దీవి. కనుచూపు మేర ఎవ్వరూ కనిపించలేదు. తెల్లవారుజామున అలికిడి విని.. స్థానికులు మా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. చలికి వణికిపోతున్న మమ్మల్ని దగ్గర్లోని చర్చికి తీసుకెళ్లారు. అంత రాత్రి పూట ఫాదర్ వచ్చి అందరికీ బ్రెడ్డు పంచిపెట్టారు.

ఆ తర్వాత హెలికాప్టర్లు, తీరప్రాంత రక్షక దళం మా దగ్గరికి చేరుకున్నాయి. ప్రయాణికులందరూ కట్టుబట్టలతో ఉన్నారు. అయిదారుగురు చనిపోయినట్లు పత్రికల్లో వార్తలు చూశాక తెలిసింది. మావైతే పాస్‌పోర్టులు, లగేజి అన్నీ సముద్రంలో పోయాయి. హైదరాబాద్ మిత్రులైన శశిధర్, శరణ్, సురేషాచారి, శ్రీకాంత్, రవి (చీరాల) ఒక చోట ఉండిపోయాం. ప్రస్తుతం కోస్టా కంకార్డియా యాజమాన్యం మమ్మల్ని రోమ్ నగరానికి చేర్చింది. ఇండియాకు వెళ్లేందుకు విమాన టికెట్లను బుక్ చేసింది. ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్ చేరుకోనున్నాం.
- మల్లెంపూటి ఆదినారాయణ

Sunday, January 8, 2012

మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా - శ్రీమతి టెస్సీ థామస్... డి.ఆర్.డి.ఓ. సైంటిస్ట్.

టెస్సీ థామస్ బయోగ్రఫీ చదివితే...  అమె గురించి పెద్దగా ఏమీ తెలీదు. అయితే -
పిల్లల్ని ఎప్పుడూ బడికే కాకుండా... అప్పుడప్పుడు కొత్త ప్రదేశాలకూ పంపాలని తెలుస్తుంది.
సైన్సు - మేథ్స్ అంటే వారు భయపడుతుంటే కనుకఅంత సీన్ లేదు. అర్థమైతే పీచు పిఠాయే అని వెన్ను తట్టాలని తెలుస్తుంది. అప్పుడే పెళ్లి వద్దు నాన్నా ఎం.టెక్ చేస్తాను అంటే
అలాగే తల్లీ నీ ఇష్టం అనడమే కరెక్ట్ అని తెలుస్తుంది. ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి.
రోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేవాలని లేచిన క్షణం నుంచి లక్ష్యం కోసమే పాటుపడాలని
ప్రశంసల్ని , విమర్శల్ని సమానంగా తీసుకోవాలని పదిమందికి ఆదర్శంగా ఉండాలని... తెలుస్తుంది.
‘మిస్సైల్ ఉమెన్’ టెస్సీలోంచి  మీలోకి  ‘అగ్ని’కణాలు చొరబడి మీకొక కొత్తచూపును ఇస్తాయి!


ఊరికే - ‘కలలు కనండి... కనండి’ అని ముఖం మీది దుప్పటి లాగేసి బ్రెష్షూ పేస్టూ చేతికిస్తారు కానీ... కలలు కనడానికైనా ఒక ఇన్‌స్పిరేషన్ ఉండొద్దా?!
నాన్న ఏరోనాటికల్ ఇంజినీరు. ఒక ఇన్‌స్పిరేషన్.
అమ్మ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్. ఒక ఇన్‌స్పిరేషన్.
మామయ్య లెఫ్టినెంట్ కల్నల్. ఒక ఇన్‌స్పిరేషన్.
పిన్ని పెద్ద ఫ్యాషన్ డిజైనర్. ఒక ఇన్‌స్పిరేషన్.
కానీ మనలో ఎంతమందికి ఇలాంటి ఇన్‌స్పిరేషన్... పాలపీక గుండా గొంతులోకి దిగి ఉంటుంది?
ఎ.ఆర్. రెహమాన్ ఒక ఇన్‌స్పిరేషన్.
పెప్సీ నూయీ ఒక ఇన్‌స్పిరేషన్.
సచిన్ టెండూల్కర్ ఒక ఇన్‌స్పిరేషన్.
మైక్రోసాఫ్ట్ నీలమ్ ఒక ఇన్‌స్పిరేషన్.
దేశంలో రోజూ లక్షలమంది వీళ్ల ఘనతల్ని వార్తల్లో చూస్తూ ఉంటారు కదా.. ధీమాగా ఎంత మంది ఇన్‌స్పైర్ అవగలరు? ధీమా ఎందుకంటే - ఇంట్లో సచిన్ ఫొటో ఉన్నంత మాత్రాన మన ఇంటి దగ్గర శివాజీ పార్క్ ఉండదు కదా! రెహమాన్‌ని తలచుకుని కీ బోర్డుపై వేళ్లు కదిలించినంత మాత్రాన మన ఇంటికి కాస్త దూరంగానైనా సినిమా ఇండస్ట్రీ ఉండదు కదా!
వాస్తవం ఏమిటంటే - వందకోట్లు దాటిన ఏ దేశంలోనైనా జనాభాకు సరిపడా ఇన్‌స్పిరేషన్ లభ్యం కావడం కష్టం.
మరి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి?
కేరళలోని అలప్పుళ వెళ్లాలి.
అక్కడ దొరుకుతుందా ఇన్‌స్పిరేషన్?
అక్కడి నుంచి ‘తుంబా’ వెళ్లే అవకాశం రావాలి.
అప్పుడు దొరుకుతుందా ఇన్‌స్పిరేషన్?
మే బీ, మే నాట్ బీ. ఒకటి మాత్రం నిజం. అమ్మానాన్నల్నుంచే, ఏఆర్ రెహ్మాన్‌లనుంచే మనం ఇన్‌స్పిరేషన్ పొందాలనేం లేదు!!
*********

భువనేశ్వర్ : జనవరి 3 మంగళవారం 2012

కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్శిటీ ప్రాంగణం.
భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మాట్లాడుతున్నారు.
పదిహేనువేల మంది సైంటిస్టులు, ఇరవై మంది నోబెల్ గ్రహీతలు, ఐదొందల మంది విదేశీ ప్రతినిధులు, లక్షమంది యువకులు, యువతులు శ్రద్ధగా వింటున్నారు. తొంభై తొమ్మిదవ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ మొదలైన రోజది!
సైన్స్ అండ్ టెక్నాలజీలో మనమింకా ఎంతో సాధించాలని అంటున్నారు మన్మోహన్. అంటూ అంటూ... మధ్యలో స్కూల్ పిల్లలు, కాలేజీ అమ్మాయిలు ఉన్న వైపు చూసి... మిస్సయిల్ ఉమన్ టెస్సీ థామస్‌ను మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని అన్నారు.
సదస్సు ఒక్కసారిగా బర్త్‌డే బెలూన్‌లా పేలింది. హర్షధ్వానాలు చెమ్కీ ముక్కలై గాల్లో తేలాయి! నెలన్నర క్రితం - నవంబర్ 15న (ఆవేళ కూడా మంగళవారం!) ఒడిషా తీరంలోని వీలర్స్ ఐలండ్ నుంచి భారత ఉపరితల క్షిపణి ‘అగ్ని-4’ను డి.ఆర్.డి.ఓ. ప్రయోగించినప్పుడు మిన్నంటిన విజయధ్వానాలకివి రీసౌండ్‌లా అనిపించాయి! అగ్ని ఫోర్... మూడువేల ఐదు వందల కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి. ఆ క్షిపణిని వృద్ధి పరిచింది టెస్సీ, అమె బృందం.
టెస్సీ థామస్ వంటి కృతనిశ్చయం గల మహిళలు మన అమ్ముల పొదిలో ఉంటే భారత్ ఇలాంటి అగ్నులు ఎన్నింటినైనా అలవోకగా కురిపించగలదనే భావం కూడా మన్మోహన్ మాటల్లో ధ్వనించింది.
టెస్సీ... అగ్ని ప్రాజెక్టుకు డెరైక్టర్!
ఈ అగ్నిపుత్రికకు ఇన్‌స్పిరేషన్... తుంబా.
కేరళ రాజధాని తిరువనంతపురానికి శివార్లలో ఉన్న అరేబియా తీర ప్రాంత గ్రామం ‘తుంబా’కు, టెస్సీ చదువుకున్న తీరప్రాంత పట్టణం అలప్పుళకు మధ్య కొన్ని వందల కి.మీ. దూరం ఉన్నప్పటికీ, ఆ దూరాన్ని ఇప్పుడు మనం... పన్నెండేళ్ల వయసులో టెస్సీ ఏర్పరచుకున్న జీవిత ధ్యేయంతో మాత్రమే కొలవాలి! టెస్సీకి ఇన్‌స్పిరేషన్ మనుషుల నుంచి రాలేదు. తుంబాలో ఆనాడు తను చూసిన ప్రదేశం నుంచి వచ్చింది.
ఏం చూసింది ఆ అమ్మాయి?
*********

పిల్లలకు ఇష్టమైన సంగీతం... డబడబలు.
పిల్లలకు ఇష్టమైన ఎక్కం... టెన్ వన్స్ ఆర్..!
టెస్సీకి ఏ ఎక్కమైనా ఒకటే. పదమూడో ఎక్కాన్ని కూడా పదో ఎక్కంలా తేలిగ్గా చెబుతుంది. బ్రైట్ అండ్ బ్రిలియంట్. అయితే ఓరోజు ఎక్కం తప్పింది. థర్టీన్ ఫోర్స్ ఆర్... దగ్గరో, థర్టీన్ ఫైవ్స్ ఆర్... దగ్గరో తప్పింది. తప్పిన వెంటనే సర్దుకుంది. కరెక్ట్‌గా చెప్పింది. టెస్సీ ఎందుకు కన్ఫ్యూజ్ అయిందో టీచర్‌కు తెలీదు. కానీ టెస్సీకి తెలుసు. తనకు ఇష్టమైన సంగీతాన్ని వెదుక్కుంటూ ఆ అమ్మాయి మనసు అలప్పుళ నుంచి మధ్యలో రెండు జిల్లాలు దాటుకుని తిరువనంతపురం వెళ్లింది. కొన్ని క్షణాలు అక్కడి
‘తుంబా’లో ఆగింది!
క్రితం రోజే టెస్సీ, ఆమె క్లాస్‌మేట్స్ తుంబా లోని రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కు విజ్ఞానయాత్రగా వెళ్లొచ్చారు. రయ్‌మని ఎగిసిన రాకెట్‌లను చూశారు. వాటి ధ్వని టెస్సీకి శ్రావ్యంగా అనిపించింది. అప్పటినుంచీ డబడబలకు ఎంటర్‌టైన్ అవడం మాని రాకెట్ సౌండ్‌ని మధ్యమధ్య గుర్తుచేసుకుని ఎంజాయ్ చేస్తోంది ఆ అమ్మాయి.
స్కూల్ ఫేర్‌వెల్‌లో ఎవరెవరు ఏమేం కావాలనుకుంటున్నారో చెబుతున్నారు.
డాక్టర్, ఇంజినీర్, ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్...
టెస్సీ వంతు వచ్చింది. రాకెట్ స్పెషలిస్ట్ అవుతానంది! అప్పుడు ఆమెకది మిస్సైల్ టెక్నాలజీ అని తెలీదు. తెలియకపోయినా కచ్చితంగానే తన భాషలో చెప్పింది. సెయింట్ జోసెఫ్ గళ్స్ హైస్కూల్‌లో అదే చెప్పింది. సెయింట్ జోసెఫ్ కాలేజీలోనూ అదే చెప్పింది. ఎదురుగా బొమ్మను పెట్టుకుని ఇన్‌స్పైర్ అవడానికీ, ఇన్‌స్పిరేషన్ కలిగించే అవకాశం అప్రయత్నంగా కలగడానికీ మధ్య వ్యత్యాసమే టెస్సీ బయోగ్రఫీ.
*********

శ్రీమతి టెస్సీ థామస్... డి.ఆర్.డి.ఓ. సైంటిస్ట్.

టెస్సీ గురించి నెట్‌లోగానీ, ఇంకెక్కడైనా గానీ ఇంతకు మించి ఎక్స్‌ట్రాగా ఒక్క ముక్క సమాచారం దొరకదు. ‘ఇండియా టుడే’ లాంటి పత్రిక అవార్డు ఇచ్చినప్పుడో, అగ్ని సఫలమైనప్పుడో, మరీ అంతగా సఫలం కాలేకపోయినప్పుడో టెస్సీ పేరు బయటికి వస్తుంది. అంతే!
మీడియాకు టెస్సీ థామస్ ఇచ్చే ఇంటర్వ్యూలు కూడా తట్టెడు పరిమితులకు లోబడి ఉంటాయి. బహుశా దేశ రక్షణ కోసం తన సైంటిస్టులు ఈ మాత్రం గోప్యనీయతను పాటించడం అవసరమని డి.ఆర్.డి.ఓ. భావిస్తుండవచ్చు. ఈ సంస్థ భారత రక్షణ మంత్రిత్వ్ర శాఖ పరిధిలో ఉంటుంది. డి.ఆర్.డి.ఓ. అంటే డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. ఇందులో జరిగే పరిశోధనలు ఎంత గోప్యమో. సిబ్బంది వ్యక్తిగత వివరాలు అంత గుంభనం. వారి సాధారణ ప్రయాణ వివరాలు సైతం ఫైళ్లలో దూరిపోతాయి.
గత ఏడాది డిసెంబర్ 8న అలప్పుళ లోని పుట్టింటికి వెళ్లివచ్చారు మిసెస్ టెస్సీ. ఆమె డెయిరీలో అది అతి ముఖ్యమైన రోజు. తల్లి కుంజమ్మ (75) పుట్టినరోజు! బరువు బాధ్యతలు గల ఉద్యోగంలో క్షణం తీరిక లేకుండా ఉండే కూతురు తన కోసం అంతదూరం రావడం చూసి ఆ వృద్ధమూర్తి హృదయం పులకించింది. తల్లి స్పర్శకు ఈ ‘మిస్సైల్ ఉమన్’ కొన్ని క్షణాలైనా పసిపిల్ల అయి ఉంటుంది. తోబుట్టువు టెస్సీ వస్తుందని తెలిసి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కూడా అలప్పుళ చేరుకున్నారు. ఇండియన్ మిస్సైల్ ప్రాజెక్టు తొలి మహిళా డెరైక్టర్ టెస్సీకి అవి ఎంతో అపురూపమైన క్షణాలు.
త్రిచూర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయ్యాక పుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్స్ టెక్నాలజీ (డైట్)లో ఎం.టెక్ లో చేరారు టెస్సీ. అక్కడే డి.ఆర్.డి.ఓ. ఆఫర్ చేసిన ‘గెడైడ్ వెపన్ కోర్సు’లో చేరారు. అప్పుడూ ఇంతే. వెళ్లేందుకు సెలవలు, వెళ్లాక సెలవు కొనసాగింపులు ఒకట్రెండు విజ్ఞప్తులతో దొరికేవి కాదు. అలప్పుళ నీటికయ్యల్ని చూడగానే ఆమెకు ప్రాణం లేచివచ్చేది మరి! అక్కడి నుంచి కదలబుద్ది అయ్యేది కాదు.
టెస్సీ తండ్రి టి.టి.థామస్ 1991లో చనిపోయారు. ఆనాటి విషాద ఉద్వేగాలను వృత్తిపరమైన బాధ్యతలతో నియంత్రించుకోగలిగారు.
టెస్సీ ఇంజినీరింగ్ చదివి తీరాల్సిందేనని ఇంట్లో అందరికన్నా ఎక్కువ పట్టుపట్టింది ఆమె తల్లి కుంజమ్మ! నచ్చిన ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే ముందు నచ్చిన జీవితం ఏదో ఎంచుకోవాలి. టెస్సీ మిస్సైల్స్‌ను ఎంచుకున్నారు. ఆమె ఎంపికకు అప్పుడే పెళ్లి అడ్డుపడకుండా ఆమె తల్లి జాగ్రత్తలు తీసుకున్నారు. టెస్సీ రాకెట్ ఇంజినీర్ అయ్యారు.
‘‘ఎంతో కష్టపడి సాధించుకున్న కెరీర్‌ను కూడా పెళ్లి తర్వాత అమ్మాయిలు వదిలేస్తుంటారు. అది కరెక్ట్ కాదు’’ అంటారు టెస్సీ... తల్లి కుంజమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ. అగ్ని-4 పరీక్ష తర్వాత ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌లో మాట్లాడేందుకు బెంగళూరు వెళ్లినప్పుడు టెస్సీ బుర్రను కొందరు ఇంజినీరింగ్ అమ్మాయిలు ప్రశ్నలతో తోడేశారు. టెస్సీ తన సమాధానాలతో వాళ్ల హృదయాలను నింపేశారు!
‘‘ఆడవాళ్లు ఎంత పెద్ద సక్సెస్ సాధించినా గుర్తింపు రాదు. చిన్న ఫెయిల్యూర్ కూడా పెద్ద సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది - అన్‌ఫిట్ అని. నిజమే కదా మేమ్’’
టెస్సీకి అర్థమైంది. అగ్ని-4ని, అగ్ని-3ని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు ఈ అమ్మాయిలు. అగ్ని-3 తన గమ్యాన్ని చేరుకోడానికి ముప్పై సెకన్ల ముందుగానే బంగాళాఖాతంలో కూలిపోయింది. ఆ ఘటన తో మహిళల శక్తిసామర్థ్యాలను శంకించినవారు... అగ్ని-4 విజయవంతం అయ్యాక ఆ స్థాయిలో ప్రశంసించలేకపోవడం వారిని బాధిస్తోంది.
‘‘గుర్తింపు, సక్సెస్ వేర్వేరు అంశాలు. గుర్తింపు కోసం సక్సెస్ అవ్వాలని చూస్తామా? మన పని మనం చేసుకుపోవాలి.’’
‘‘కానీ మేమ్... ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏమిటి?!’’
‘‘అలా ఎందుకు అనుకోవాలి. ఆడామగ తేడాలను ఎవరైనా ఎత్తిచూపుతున్నప్పుడు ఇంకా చక్కగా పని చేసి మనం ఏమిటో నిరూపించుకుందాం. అప్పుడు జెండర్ గురించి మాట్లాడ్డానికి అవకాశమే ఉండదు. అగ్ని-3 ఫెయిల్ అయినప్పుడు అంతా దిగ్భ్రాంతికి లోనై చూస్తున్నాం. అది వైఫల్యమే కానీ, పూర్తిగా కాదని మాకు తెలుస్తూనే ఉంది. కొంతమంది మమ్మల్ని సపోర్ట్ చేశారు. మరింత ఉత్సాహంగా పని చేశాం. విమర్శగానీ, విచక్షణగానీ మనల్ని బాధిస్తోందంటే... మన పోరాట పటిమ తగ్గుతున్నదేమో గమనించుకోవాలి.’’
‘‘ఎదగనీయకుండా అడ్డుకునే పరిస్థితులకు సర్దుకుని పోవడం తప్ప దారి లేదా?
‘‘ఉంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. చేస్తున్న పనిలోనే కాకుండా, సంబంధం ఉన్న ప్రతి పనిలోనూ సామర్థ్యాలను పెంచుకోవాలి. అకస్మాత్తు అవసరాలు మన పాత్రను కీలకం చేస్తాయి. అప్పుడు కాలుడ్డుపెట్టిన వారే పక్కకు తప్పుకుని దారిస్తారు.’’
‘‘నిజం. చెప్పండి. ఒక మహిళగా మీరు మీ వృత్తిలో సంతృప్తికరంగానే ఉన్నారా? ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా!’’
‘‘ఎస్. ఉన్నాను. నా టీమ్‌లో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరే కాకుండా అగ్ని ప్రోగ్రామ్‌లో ఇరవై మంది మహిళలు ఉన్నారు. మొత్తం డి.ఆర్.డి.ఓ.లో చూస్తే పదిహేను నుంచి ఇరవై శాతం వరకు మహిళలు ఉన్నారు. ఇంకా బయటి నుంచి వస్తున్నారు. ప్రతిభను నిరూపించుకునే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లు ప్రతిభను మెరుగుపరిచేవిగానే ఉంటాయి తప్ప మాకొక అవరోధంగా అనిపించవు.’’

టెస్సీ ఇంత చెప్పాక ఏ అమ్మాయి మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఉబలాటపడకుండా ఉంటుంది?

సాదా సీదా చీరలో, చిరునవ్వుతో కనిపించే టెస్సీతో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు తక్షణ శక్తిలా ఆడపిల్లలకు తక్షణ ఆత్మవిశ్వాసం కలుగుతుంది. భవిష్యత్తుపై కొత్త ఆశతో వారి కళ్లు మెరుస్తాయి. ఏదైనా సాధించగలం అన్న ధీమా వస్తుంది!

1988లో పుణె నుంచి హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబరేటరీకి బదలీ అయిన కొత్తల్లో ప్రాజెక్టు డెరైక్టర్ ఎ.పి.జె. కలామ్ ఇదే విధమైన ధీమాను, ఆత్మవిశ్వాసాన్ని టెస్సీలో కలిగించారు. ఆమె ప్రావీణ్యాలను మలిచిన మరో గురువు అవినాశ్ చందర్. త్వరలోనే ఈ శిష్యురాలు తన గురువులిద్దరి ప్రఖ్యాతిని, డి.ఆర్.డి.ఓ. ప్రతిష్టను మరోసారి నిలబెట్టేందుకు అగ్ని-5 ను సంధించబోతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో గానీ, మార్చిలోగానే టెస్ట్ ఫైర్ జరిపేందుకు టెస్సీ బృందం తమ లంచ్ టైమ్‌ను కూడా తగ్గించుకుంది!

*********

డి.ఆర్.డి.ఓ.లో టెస్సీ ప్రస్థానం మరో రెండేళ్లలో రజతోత్సవానికి దగ్గరౌతుంది. పాతికేళ్లు అంటే పాదరసం లాంటి మనిషి జీవితంలో పెద్ద అమౌంటే! ఇదంతా వృత్తిపట్ల అంకితభావంతో టెస్సీ వెనకేసుకున్న సంపద. డి.ఆర్.డి.ఓ.లో శాస్త్రవేత్తలు, భారత రాజకీయ రంగ ప్రముఖులు ఆమెను ‘రాకెట్ లేడీ’ అంటారు. మంద్రస్థాయిలో ఇది ‘భారత రత్న’ అన్నట్లుంటుంది టెస్సీని అభిమానించే మహిళలకు, ఇంజినీరింగ్ విద్యార్థినులకు.
అగ్ని-1 నుంచి ప్రస్తుతం సిద్ధమౌతున్న అగ్ని-5 వరకు ప్రతి దశలోనూ ఉపరితల క్షిపణుల తయారీలో టెస్సీ అతి కీలకమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఎలా సాధ్యం ఇంటి కోసం, దేశం కోసం బ్యాలెన్సింగ్‌గా పని చేసుకుంటూ పోవడం!
ఆ క్రెడిట్ అంతా తన భర్తదేనని అంటారు టెస్సీ. ఆయన కూడా గెడైడ్ మిస్సైల్ టెక్నాలజీలోనే పోస్టు గ్రాడ్యుయేట్. కొన్నాళ్లు డి.ఆర్.డి.ఓ.లో చేశారు కనుక అక్కడి బాధ్యతల గురించి బాగా తెలుసు. అందుకే టెస్సీ ఇంటికి వచ్చే సమయానికి పూచికపుల్లనయినా ఇటు తీసి అటు పెట్టే అవసరం లేకుండా జాగ్రత్త పడతారు. ఒకేసారి అనేక బాధ్యతలు మీద పడి ఆమె సతమతమౌతున్నట్లు కనిపిస్తే ఎంకరేజ్ చేస్తూ ఆ భారాన్ని కొంత తగ్గిస్తారు. వారి ఏకైక కుమారుడు తేజస్. మన దేశవాళీ తేలికపాటి యుద్ధ విమానం పేరునే టెస్సీ తన కొడుక్కి పెట్టుకున్నారు. అతడూ ఎంటెక్‌కి వచ్చేశాడు!
పిల్లల్ని సైన్స్ కోర్సుల్లోకి ఎంకరేజ్ చెయ్యాలని టెస్సీ చెబుతుంటారు. ‘‘సైన్స్, మేథ్స్ లేకుండా నిత్యజీవితంలో మనిషి రెండడుగులైనా ముందుకు వేసే పరిస్థితి లేనప్పుడు... టఫ్‌గా ఉంటాయని సైన్స్ సబ్జెక్టులు తీసుకోడానికి విద్యార్థులు వెనకంజ వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోగలం? ఇంట్రెస్ట్ లేనంత వరకే ఏదైనా టఫ్. ఆ సంగతి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశ అవసరాలను తీర్చవలసిన బాధ్యత తమ పిల్లలపై కూడా ఉందని ప్రతి తల్లీ తండ్రీ గ్రహించాలి’’ అంటారు టెస్సీ.
లాబ్‌లో తన జూనియర్ కలీగ్స్‌తో టెస్సీ కూడా ఇదే విధంగా ఉంటారు. అంటే... స్ట్రిక్ట్‌గా ఉండే ఒక పేరెంట్‌లా. వారి నుంచి ఆవిడ పూర్తిస్థాయి అంకితభావాన్ని మృదువుగా పిండుకుంటారు. ఒక దేశపు అత్యున్నతస్థాయి సంస్థలో బాధ్యతలు సక్రమంగా అమలవడానికి ఈ మాత్రం ‘కాఠిన్యం’ అవసరమే! అలాగని టెస్సీ బాసిజం చూపించరు. చెప్పడం చేతకాకపోతే కదా అరవడం.
*********

ఒక సాధారణ ఉద్యోగి లేచినట్లే రోజూ ఉదయం నాలుగింటికే నిద్రలేస్తారు టెస్సీ. అప్పటి నుంచి ఆమె డ్యూటీ మొదలౌతుంది.

తెల్లవారుజామున వచ్చే కలలు నిజమౌతాయని అంటారు. ఆ మాటలో ఎంత నిజం ఉందో కానీ, కలల్ని నిజం చేసుకోడానికి ఆ మాత్రం ముందుగా లేవడం అవసరం. ఎందుకంటే - అసలు కలలే కనని వారికి కూడా ఇన్ స్పిరేషన్ ఇచ్చే టైమ్ అది.

టెస్సీ థామస్
డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్త (48)

జన్మస్థలం : అలప్పుళ (అలెప్పీ) కేరళ
తల్లిదండ్రులు : 

టి.టి.థామస్, కుంజమ్మ
భర్త : సరోజ్
కుమారుడు : తేజస్
తొలి ఉద్యోగం : పుణె లోని డి.ఆర్.డి.ఓ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో
గెడైడ్ మిస్సైల్ ఫ్యాకల్టీ మెంబర్‌గా (1987)
పదోన్నతి : గెడైడ్ మిస్సైల్స్‌లో ఎం.ఇ. డిగ్రీ అయ్యాక హైదరాబాద్‌లోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్
లేబరేటరీలో ‘బి’ సైంటిస్ట్‌గా (1988)
ప్రస్తుత హోదా: మిస్సైల్ ప్రాజెక్ట్ తొలి మహిళా డెరైక్టర్

టైటిల్ : మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా

అవార్డులు

అగ్ని సెల్ఫ్ రిలయన్స్ అవార్డు (2001)
పాత్ బ్రేకింగ్ రిసెర్చ్ / ఔట్‌స్టాండింగ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అవార్డు (2007)

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టెక్నికల్ పేపర్ ప్రెజెంటేషన్ ప్రైజ్ (2007)

నేషనల్ సైన్స్ డే - డి.ఆర్.డి.ఓ. సిలికాన్ మెడల్ అండ్ కమెండేషన్

సర్టిఫికెట్ (2008)

డాక్టర్ కల్పన చావ్లా మెమోరియల్ లెక్చర్ ఆనర్ (2009)

ఇండియా టుడే ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ (2009)

‘అగ్ని’హోత్రి

క్షిపణి (మిస్సైల్) అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భారత రక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నాలుగు రకాల ఏ (అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4) క్షిపణుల పరీక్ష జరిగింది. వచ్చే ఫిబ్రవరి-మార్చిలో అగ్ని-5ను మన రక్షణ శాఖ పరీక్షించబోతోంది. ఆరంభం నుంచీ ఈ క్షిపణుల అభివృద్ధి కార్యక్రమంలో కీలక భాగస్వామ్యం కలిగి ఉన్న టెస్సీ... అగ్ని-4కు ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా ఉన్నారు. అగ్ని-5కి కూడా ఆమె నేతృత్వం కొనసాగుతుంది. దేశ రక్షణ వ్యవస్థలోని సకల విభాగాలలో ఇప్పటికే సమర్థంగా సేవలు అందిస్తున్న భారతీయ మహిళల్లో... యుద్ధ సంబంధమైన విధులను సైతం నిర్వహించగల సత్తా ఉందని టెస్సీ అంటున్నారు.
ఉపరితలం నుంచి ఉపరితలానికి టార్గెట్ రీచ్ అయ్యే దూరాన్ని బట్టి అగ్ని శ్రేణులు ఉంటాయి. అగ్ని-వన్... 500 - 700 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించే విధంగా తయారైనది. అగ్ని-ఫైవ్ 5000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో తయారవుతోంది.


courtesy - సాక్షి ఫ్యామిలీ