కోస్టా కంకార్డియా మరో టైటానిక్ అవాల్సింది. అదృష్టవశాత్తూ కాలేదు. టైటానిక్‌లా సముద్రగర్భంలో మునిగిపోయినా ఎక్కువ ప్రాణనష్టం జరగలేదు. నాలుగు వేల మందికి పైగా బతికి బయటపడగా ఐదుగురు మాత్రమే మరణించారు. ఇటలీకి సమీపంలోని ఓ చిన్న దీవి దగ్గర ఈ నౌక మునిగిపోయినపుడు అందులో ఆరుగురు తెలుగు వాళ్లు చెఫ్‌లుగా పనిచేస్తున్నారు. వారిలో జొనాథన్ పాటూరి ఒకరు. ప్రస్తుతం రోమ్ నగరంలో సేదతీరుతున్న ఆయనను ఫోన్‌లో పలకరించినప్పుడు జరిగిన సంఘటన గురించి ఇలా చెప్పుకొచ్చారు..
రాత్రి 9.25 అవుతోంది. మధ్యధరా సముద్రం ఈదురుగాలులతో భయపెడుతోంది. ఆ చల్లటి నీళ్లలో కోస్టా కంకార్డియా అనే ఒక విలాస నౌక ఇటలీ సమీపంలో వెళుతోంది. అందులో 3,200 మంది ప్రయాణికులు, వెయ్యి మంది సిబ్బంది ఉన్నారు. సగం మంది రాత్రి డిన్నర్‌ను పూర్తి చేశారు. మిగిలిన వారంతా డైనింగ్ హాల్ వద్దకు చేరుకున్నారు. వేడి వేడి ఫ్రెంచ్, ఇటాలియన్ రుచులను సిద్ధం చేస్తున్నారు చెఫ్‌లు. టేబుళ్లను సర్దుతున్నారు వెయిటర్లు.
లయబద్ధంగా వెళుతున్న నౌక ఒక్కసారిగా గట్టి కుదుపుకు గురైంది. వైన్ బాటిళ్లు, వోడ్కా సీసాలు, ఫోర్క్‌లు, స్పూన్లు, పింగాణి ప్లేట్లు.. టపటపా జారి పడిపోయాయి. గాజు సీసాలన్నీ ఫెళ్లున పగిలిపోతున్నాయి. "నౌకలో ఏమైంది.. ఏమైంది..!!!!'' ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. "సముద్రంలో ఒక్కోసారి పెద్ద అలలు వస్తుంటాయిలే'' అన్నారు కొందరు. షిప్పుల్లో ఇదంతా మామూలే అన్నారు మరికొందరు.
వారి అంచనాల్ని కొట్టిపారేస్తూ.. మరో పెద్ద కుదుపుకు గురైంది నౌక. ఈసారి వస్తువులే కాదు, మనుషులూ చెల్లాచెదురయ్యారు. "అమ్మో! మనమంతా మునిగిపోతున్నాం..'' గట్టిగా కేకలు పెట్టారంతా. ఆహ్లాదంగా సాగిపోతున్న ప్రయాణం ఒక్కసారిగా మృత్యుభయంతో గంభీరంగా మారిపోయింది. అప్పుడు ఆ నౌకలో ఆరుగురు హైదరాబాద్ కుర్రాళ్లు, ఒక చీరాల వ్యక్తి ఉన్నారు. వీళ్లంతా నౌకలో పనిచేసే వంటవాళ్లు. పదిహేను రోజుల కిందటే ఈ నౌకలో చేరిన జొనాథన్ పాటూరి ఆ నాటి సంఘటనను కళ్లకు కట్టినట్లు వినిపించారు.
నౌక ఒక్కసారిగా గట్టి కుదుపుకు గురైంది. వైన్ బాటిళ్లు, వోడ్కా సీసాలు, ఫోర్క్‌లు, స్పూన్లు, పింగాణి ప్లేట్లు.. టపటపా జారి పడిపోయాయి. గాజు సీసాలన్నీ ఫెళ్లున పగిలిపోతున్నాయి. "నౌకలో ఏమైంది.. ఏమైంది..!!!!'' ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాయి.
- జొనాథన్ పాటూరి
ఉన్నట్లుండి చిమ్మ చీకటి..
"కోస్టా కంకార్డియా ప్రపంచంలోనే పేరున్న క్రూయిజ్ (విలాసనౌక). సముద్రంలో ఏడు రోజుల ట్రిప్‌లు వేస్తుంది. ఈ సారి ఇటలీలోని రోమ్ నుంచి సవోనా వెళుతోంది. నేను మొన్న క్రిస్‌మస్ రోజునే ఇందులో చెఫ్‌గా చేరాను. శుక్రవారం రాత్రి 9.20 అవుతోందనుకుంటా. డిన్నర్‌కు వస్తున్నారంతా. కిచెన్‌లో తొంభైమంది వంటవాళ్లు ఎవరి బిజీలో వారు ఉన్నారు. నౌకలో ఒక్కో రోజు ఒక్కో దేశపు ప్రత్యేక వంటను వండుతారు. నేను 'పాస్తా' అనే రకం వంట చేస్తున్నాను.
నౌకలో వచ్చిన కుదుపును చూసి అందరిలాగే మేము కూడా.. సముద్రంలో ఇలాంటివి మామూలే అనుకున్నాం. పది నిమిషాల తర్వాత కిచెన్‌లోని సామాన్లన్నీ గలగలమంటూ కిందికి పడిపోయాయి. నౌకలో నిల్చున్న వాళ్లంతా మెల్లగా ఒరిగిపోతున్నారు. నా కాళ్లు వాటంతటవే వాలిపోతున్నాయి. నౌక దేన్నో ఢీకొట్టింది అని అర్థమైంది మాకు. చెఫ్‌లందరూ ఒక చోటికి చేరారు. అప్పటికే ప్రయాణికుల అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. కెప్టెన్‌కు ఫోన్ చేద్దామనుకునే లోపే ఫట్ ఫట్‌మంటూ కరెంటు తీగలు మండిపోయినట్లు.. శబ్దం వచ్చి.. కరెంటు పోయింది. నౌక మొత్తం చిమ్మచీకటి కమ్ముకుంది. క్షణాల్లోనే ఎమర్జెన్సీ లైట్లు పడ్డాయి. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం.
అందరం డెక్‌ఫోర్‌లో..
మేమంతా కిచెన్‌లో నుంచి బయటికొచ్చి.. డెక్‌ఫోర్ (నౌకలో బాల్కనీ ప్రదేశం)లో నిలబడ్డాం. అప్పటికే ప్రయాణికులంతా గుమిగూడారక్కడ. నౌకల్లో ప్రమాదాలు జరిగినప్పుడు డెక్‌ఫోర్‌కి చేరుకుని, లైఫ్‌బోట్లలో ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో.. నౌక ఎక్కేటప్పుడే అందరికీ చిన్నపాటి శిక్షణ ఇస్తారు. నౌకలో పనిచేసే మాకైతే ప్రతి వారం ఈ ప్రాక్టీస్ ఉంటుంది. మా నౌకలో 26 లైఫ్‌బోట్లు ఉన్నాయి.
వాటిని నీళ్లలోకి పడేసి.. ప్రయాణికులను అందులో ఎక్కించాం. ఆ బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు సేఫ్టీ ట్రైనర్ ఒకడుంటాడు. ప్రతి లైఫ్‌బోటుకు ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. రాత్రి పూట ఆ సముద్రంలో మేమెక్కడున్నామో అర్థం కాలేదు. నౌకలో ఉన్నంతసేపూ తెలియలేదు కాని బయటికొచ్చాక చలి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకుని.. వణికిపోయాం. అప్పుడు ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలుంది.
నౌక ఓ పెద్ద రాయిని గుద్దుకోవడంతో.. ఇంజన్‌లోకి నీళ్లొచ్చాయని తెలిసింది. కొన్ని గంటల్లోనే షిప్పు పూర్తిగా మునిగిపోవడం ఖాయం అనుకున్నాం. నాకైతే భయం వేయలేదు. ఎందుకంటే మిత్రులంతా ఒకేచోట ఉన్నాం. కొద్దిమంది ప్రయాణికులనైనా రక్షించి తీరాలని.. రంగంలోకి దూకాం. 'మమ్మల్ని కాపాడండి.. మమ్మల్ని కాపాడండి' అంటూ నౌకలో ఉన్నవాళ్లంతా మా మీద పడిపోయారు. గందరగోళ వాతావరణం ఏర్పడింది.
రహస్య సంభాషణ..
నౌకలు ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు.. ప్రయాణికులు భయపడకుండా సిబ్బంది మాట్లాడుకునేందుకు కొన్ని రహస్య కోడ్స్ ఉంటాయి. నీళ్లు నౌకలోకి ప్రవేశిస్తుంటే 'డెల్టా ఎక్స్ రే' అంటాం. అగ్నిప్రమాదం జరిగితే 'ఇండియా విక్టర్' అనాలి. బాంబు బెదిరింపులొస్తే 'బ్రేవో సెరా' అని మాట్లాడుకోవాలి. మా సహోద్యోగి వచ్చి 'డెల్టా ఎక్స్‌రే' అని చెప్పగానే నౌకలోకి నీళ్లొచ్చాయని తొలి సమాచారం తెలిసింది. లైఫ్ బోట్లలో ప్రయాణికులందరినీ ఎక్కించాం.
అయితే ఆ బోట్లు మా నౌక కెప్టెన్ అనుమతి లేనిదే బయలుదేరకూడదు. కెప్టెన్ 'అబాండన్ షిప్' అని మూడుసార్లు గట్టిగా అరిచి చెప్పాకే వెళ్లాలి. అతని ఆదేశం కోసం టెన్షన్‌తో ఎదురుచూస్తున్నాం. ఎంతసేపటికీ ఆదేశాలు రాలేదు. మరోవైపు షిప్పు మునిగిపోతోంది. అందులో ఇంకా సగం మంది ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు. ఇక, చేసేది లేక లైఫ్ బోట్లను ఒడ్డుకు చేర్చాం. అదృష్టమేమిటంటే.. మా నౌకకు కేవలం యాభై మీటర్ల దూరంలోనే పోర్టు ఉంది.
ప్రయాణికులను ఒడ్డున వదిలేసి.. రెండు మూడు సార్లు నౌక వద్దకు తిరిగి వచ్చి మిగిలిన వాళ్లందర్నీ రక్షించాం. అప్పటికే నౌక చాలా భాగం మునిగిపోయింది. రాత్రి 12.30 గంటలకు ఒడ్డుకు చేరుకుని ప్రాణాలను రక్షించుకున్నాం కాని చలి పులికి దొరికిపోయాం. ఒడ్డునున్న ప్రాంతం ఒక చిన్న దీవి. కనుచూపు మేర ఎవ్వరూ కనిపించలేదు. తెల్లవారుజామున అలికిడి విని.. స్థానికులు మా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. చలికి వణికిపోతున్న మమ్మల్ని దగ్గర్లోని చర్చికి తీసుకెళ్లారు. అంత రాత్రి పూట ఫాదర్ వచ్చి అందరికీ బ్రెడ్డు పంచిపెట్టారు.
ఆ తర్వాత హెలికాప్టర్లు, తీరప్రాంత రక్షక దళం మా దగ్గరికి చేరుకున్నాయి. ప్రయాణికులందరూ కట్టుబట్టలతో ఉన్నారు. అయిదారుగురు చనిపోయినట్లు పత్రికల్లో వార్తలు చూశాక తెలిసింది. మావైతే పాస్‌పోర్టులు, లగేజి అన్నీ సముద్రంలో పోయాయి. హైదరాబాద్ మిత్రులైన శశిధర్, శరణ్, సురేషాచారి, శ్రీకాంత్, రవి (చీరాల) ఒక చోట ఉండిపోయాం. ప్రస్తుతం కోస్టా కంకార్డియా యాజమాన్యం మమ్మల్ని రోమ్ నగరానికి చేర్చింది. ఇండియాకు వెళ్లేందుకు విమాన టికెట్లను బుక్ చేసింది. ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్ చేరుకోనున్నాం.
- మల్లెంపూటి ఆదినారాయణ
No comments:
Post a Comment