Sunday, December 25, 2011

యూత్ ట్రెండ్స్ * కొలైవెరిని 'ఢీ' కొట్టిన 'ఫ్లాష్ మాబ్!

రెండ్రోజుల్లో ఏడు లక్షల డౌన్‌లోడ్స్‌తో 'కొలైవెరి డి'ని 'ఢీ' కొట్టిన మరో కొత్త ట్రెండ్ ఫ్లాష్ మాబ్.

నవంబర్ 27, ఆదివారం సాయంత్రం. ముంబయి ఛత్రపతి శివాజీ రైల్వేస్టేషన్.. రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంది. అనౌన్స్‌మెంట్లు.. చాయ్ బిస్కెట్ సమోసా అరుపులు.. ప్రయాణీకుల హడావుడితో స్టేషన్ జాతరను తలపిస్తోంది. రైలు శబ్దాల్ని, అరుపుల్ని చీల్చుకుంటూ బుల్లెట్ రైలులా దూసుకొచ్చింది ఓ పాట. అందరిచూపు ఆ పాట వైపు మళ్లింది. ఒక్కొక్కరే పాటను వెతుక్కుంటూ, మరికొందరు హమ్ చేస్తూ.. లగేజ్‌ను మోసుకుంటూ.. అటువైపు వెళ్లారు. ఒకరు, ఇద్దరు, వంద, రెండొందలు గుమిగూడారు. పాట జోరందుకుంది. అక్కడికి వెళ్లాక పాట ఒక్కటే కాదు. డ్యాన్స్ కూడా కనిపించింది. జనారణ్యంలోకి చెప్పాపెట్టకుండా పిడుగులా ఊడిపడ్డ డ్యాన్స్‌బృందం అది. ఎప్పుడు పడితే అప్పుడు- ఎక్కడపడితే అక్కడ ఇలా డ్యాన్స్ చేసే కొత్తట్రెండ్‌ను 'ఫ్లాష్ మాబ్' అంటున్నారు. జనమంతా విస్తుపోయి చూస్తుంటే.. 'రంగ్ దె బసంతి' పాటతో అందర్నీ ఊపేసింది ఆ బృందం.
http://im.rediff.com/movies/2011/aug/01sli1.jpg
ఈ ఏడాది యూట్యూబ్‌లో 'కొలైవెరి డి'ని ఢీ కొట్టి రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది ఈ ఫ్లాష్‌మాబ్ వీడియో. ఇంత సంచలనానికి కారణం సోనమ్ కొఠారీ. "నేను యూకేలో చదువుకుంటున్నప్పుడు తొలిసారి ఫ్లాష్‌మాబ్ చూశాను. ఓ గ్రోసరీ స్టోర్ దగ్గర ప్రజలందరూ ఎవరి పనుల్లో వాళ్లుండగా.. అకస్మాత్తుగా జనం మధ్యకు వచ్చి ఫ్లాష్‌మాబ్ (డ్యాన్సింగ్ బృందం) సందడి సందడి చేసేసింది. డ్యాన్సు అయిపోయాక అందరూ థ్రిల్‌గా ఫీలయ్యారు. నేను కూడా ఇండియా వెళ్లాక ఫ్లాష్‌మాబ్ పెడితే బావుంటుంది కదా! అన్న ఆలోచన వచ్చింది..'' చెప్పారు సోనమ్ కొఠారీ.http://www.deccanchronicle.com/sites/default/files/imagecache/article_horizontal/article-images/KOCHI-FLASH-MOB.jpg.crop_display.jpg
యువతకు కొత్త అస్త్రం.. 
ఫ్లాష్‌మాబ్ 2003లో మాన్‌హట్టన్‌లో పుట్టింది. హార్పర్స్ అనే పత్రిక సీనియర్ ఎడిటర్ 'బిల్ వాసిక్' ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలన్నిట్నీ ఆకర్షించింది. 'ఫ్లాష్‌మాబ్'కు విశేష ప్రాచుర్యం లభించడంతో ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు ఆ పదానికి తన 11వ ఎడిషన్‌లో 'అన్‌యూజువల్ అండ్ పాయింట్‌లెస్ యాక్ట్' అన్న అర్థాన్నిచ్చింది. వీధుల్లో అకస్మాత్తుగా డ్యాన్సులు చేసే ఫ్లాష్‌మాబ్‌కు ఓ లక్ష్యం అంటూ ఉండదు. కాని కొన్నిసార్లు మాత్రం ఏదో ఒక సామాజిక అంశానికి మద్దతు ఇస్తూనో, నిరసన తెలుపుతూనో ప్రజల్ని ఆకట్టుకుంటారు. మన దేశంలో అయితే ఏ సామాజిక ప్రయోజనం లేకుండా వీధుల్లో డ్యాన్సులేస్తే ప్రజలు స్పందించరు. http://images.travelpod.com/users/emilyhayes/1.1286674467.flash-mob-dance.jpg
అందుకే సోనమ్ కొఠారి భారత్ వచ్చాక ఫ్లాష్‌మాబ్‌ను ఓ చైతన్య అస్త్రంగా ఎంచుకుంది. ముంబయిలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి మూడేళ్లయిన సందర్భంగా పోయిన నెల నవంబరు 26న ఫ్లాష్‌మాబ్‌తో సంతాపాన్ని తెలపాలనుకుంది. "నగరాల్లోని రద్దీ కూడళ్లలో డ్యాన్సులు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే, నేను స్వయంగా వెళ్లి పోలీసులు, పాలకుల అనుమతి తీసుకున్నాను. బాలీవుడ్ శైలిలో పాటలకు నృత్యాన్ని సమకూర్చేందుకు కొరియోగ్రాఫర్‌ను సిద్ధం చేసుకున్నాను. డ్యాన్సు దృశ్యాలను ఏడు కోణాల్లో రికార్డు చేసేందుకు వీడియోగ్రాఫర్లను మాట్లాడుకున్నాను..'' అన్నారు కొఠారీ.http://www.welshicons.org.uk/news/wp-content/plugins/image-shadow/cache/4f6d11b58b40ca454a44af6bfe245f5d.jpg
7 లక్షల డౌన్‌లోడ్స్..
ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సిఎస్‌టి) రైల్వే స్టేషన్‌లో ఫ్లాష్‌మాబ్ బృందంతో డ్యాన్సులు వేసేందుకు స్నేహితులను ఆహ్వానించారు. ఎక్కడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా.. 20 మందికి ఈమెయిల్స్ చేశారు కొఠారీ. "నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం వేసింది. అంత రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. ఆధునిక తరం చెడుకు ఎంత వేగంగా స్పందిస్తున్నదో, మంచికి కూడా అంతే వేగంగా కదులుతోంది. ఈ మధ్య కాలంలో ఎక్కడో పుట్టి ప్రపంచమంతా అంటుకుంటున్న ఇంటర్‌నెట్ ఉద్యమాలే అందుకు నిదర్శనం..'' అంటూ చెప్పుకొచ్చింది ఈ యువతి. ఫ్లాష్‌మాబ్‌కు ఆసక్తి చూపిన సభ్యులతో దక్షిణ ముంబయిలోని ప్రియదర్శినీ పార్కులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. హిందీ సినిమా 'రంగ్ దె బసంతీ'లోని ఓ పాటకు నృత్యం నేర్చుకున్నారంతా. నవంబరు 26 ఆదివారం సాయంత్రం ఫ్లాష్‌మాబ్ బృందం సిఎస్‌టి చేరుకుంది.
http://www.nextecowarriors.com/wp-content/uploads/2011/03/213476-flash-mob-558x314.jpg
"ఉగ్రవాదుల కాల్పులకు ముంబయి ప్రజలు భీతిల్లి కుంగిపోయే రకం కాదు.. ఏ సంఘటన జరిగినా ధైర్యంతో జీవిస్తారు..'' అంటూ డ్యాన్సులు వేసింది ఫ్లాష్‌మాబ్. "ఆ రోజు ఫ్లాష్ మాబ్ వేసిన డ్యాన్సుల్ని వీడియోల్లో రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. రెండంటే రెండే రోజులు. ఏడు లక్షల మంది ఈ వీడియోను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది 'కొలైవరి డి' పాట తర్వాత ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న వీడియో మాదే...'' అని గర్వంగా చెప్పుకున్నారు కొఠారీ. ఇంటర్‌నెట్‌లో ఈ వీడియో యువతను కట్టిపడేయడంతో.. అన్ని ప్రధాన నగరాలకు ఈ ట్రెండు విస్తరించింది. ఢిల్లీ, హైదరాబాద్‌లలో సైతం కొందరు ఔత్సాహికులు ఫ్లాష్‌మాబ్‌తో అదరగొట్టారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు ఏ వీధిలో ఏ ప్లాష్‌మాబ్ మెరుస్తుందో మీరు కూడా ఎదురుచూడండి. లేదంటే మీరే ఒక బృందంగా ఏర్పడి పాటపాడండి. పాదం కదపండి. ఒక లక్ష్యం కోసం. ఒక ఆశయం కోసం.. ఫ్లాష్‌మాబ్‌ను అస్త్రం చేసుకోండి.

No comments: