Sunday, December 25, 2011

ఫోర్డ్ చక్రవర్తి

 http://motorsportshalloffame.com/halloffame/1993/Henry_Ford_400.jpg
ఉడ్రో విల్సన్ అమెరికా అధ్యక్షుడు.
హెన్రీ ఫోర్డ్... కార్ల కంపెనీ ఓనరు.
‘‘ఫోర్డ్.. ఒక చెయ్యి వెయ్యి. చక్రం తిప్పుదాం’’ అన్నాడు విల్సన్!
శాంతి స్థాపన కోసం,
నానాజాతి సమితి ఏర్పాటు కోసం
విల్సన్ ప్రయత్నం.
ఫోర్డ్ ఆల్రెడీ ‘చక్రం’ తిప్పుతున్నాడు.
అమెరికా రోడ్ల నిండా ఫోర్డ్ చక్రాలే!
ఫోర్డ్ ఒక మాట చెబితే చాలు సెనెట్‌లో
విల్సన్ వెయిట్ పెరుగుతుంది.
అందుకే అడిగాడు విల్సన్.
ఫోర్డ్‌కీ, ఫోర్డ్ కంపెనీకి
అంత వాల్యూ ఎలా వచ్చింది?
‘మొబిలిటీ’ అంటాడు ఫోర్డ్.
మనిషి మెషీన్‌లా తిరగాలంటాడు ఫోర్డ్.
ఈ చలనశీలి జీవిత చక్రమే ఈ బయోగ్రఫీ.


హ్యాపీ క్రిస్మస్... మిస్టర్ హెన్రీ ఫోర్డ్!
హ్యాపీ క్రిస్మస్... దేశభక్త నిర్యుద్ధ యోధుడా!
హ్యాపీ క్రిస్మస్... డియర్ కార్మిక ప్రియతమా!
*******

హెన్రీ ఫోర్డా! ఇంకా ఎక్కడున్నారు ఆయన? ఎలా అందుతాయి మన శుభాకాంక్షలు? అవి దివికేగుతాయా? ఆయనే భువికి దిగుతారా? ఏదైనా జరగొచ్చు.

హెన్రీకి క్రిస్మస్ అంటే ఇష్టం. పిల్లలంటే ప్రీతి. ధ్యాసగా చూడండి. ఏ క్రిస్మస్ చెట్టు నీడలోనో నక్షత్రమై ఆయన ఆత్మ వెలుగుతూ ఉంటుంది. లేదంటే - ఇంటి ముందు- పిల్లల నవ్వుల్లో, కేరింతల్లో!
శాంతాక్లాజ్ ఎదురుపడితే మాత్రం హెన్రీ ఫోర్డ్ గురించి ఆయన్ని వాకబు చెయ్యకండి. ఎందుకంటే - శాంతాక్లాజ్ పెద్దగా నవ్వొచ్చు. ఆ నవ్వుతున్నది మారువేషంలో ఉన్న హెన్రీ ఫోర్డ్ కావచ్చు!
హెన్రీ ఇలాగే చేసేవారు. శాంతాక్లాజ్ వేషం వేసుకుని, గుర్రపు బగ్గీలో కూర్చుని వీధుల వెంట తిరిగేవారు! చిన్నారులు కనిపిస్తే ఆగి, ఆ చిట్టిచేతుల నిండా బంగారు కానుకలు పెట్టి, బుగ్గపై చిటిక వేసి ముందుకు సాగిపోయేవారు.
ఇప్పుడైనా ఏం తక్కువ?
ఇక్కడో అక్కడో హెన్రీ ఉండే ఉంటారు? పిల్లలకోసం చూస్తూ ఉండి ఉంటారు. హెన్రీకొక నమ్మకం. తను మళ్లీ పుడతానని! అలా పుట్టి ఉంటే ఆయనకిప్పుడు అరవై ఐదేళ్లు ఉంటాయి. ఇవాళ క్రిస్మస్ కాబట్టి కచ్చితంగా ఆయన శాంతాక్లాజ్‌లా ఎదురవుతారు! మన శుభాకాంక్షలు వృథా కావు. హారమై వెళ్లి నమ్మకంగా ఆయన మెడలో పడతాయి.
నమ్మకాలు నిజమైపోతాయా?
హెన్రీకి చాలా నమ్మకాలు ఉండేవి. అవన్నీ చాలావ రకు నిజమయ్యాయి.
కష్టం చేసేవాళ్లకు కంటి నిండా జీతాలు ఇస్తే ఇష్టంగా పని చేస్తారని ఆయన నమ్మారు. ఆ నమ్మకం నిజం అయింది. కార్మికులు కృతజ్ఞతతో పని చేసి ఆయన ఫోర్డ్ కంపెనీని నెంబర్ వన్‌గా నిలబెట్టారు.
అందరూ ఒకే పని చెయ్యడం కాదు, ఒక్కొక్కరు ఒక్కో పనిలో ఎక్స్‌పర్ట్‌లైతే ప్రొడక్షన్ పెరుగుతుందని ఆయన నమ్మారు. ఆ నమ్మకం నిజమయింది. హెన్రీ కనిపెట్టిన ‘అసెంబ్లీ లైన్’ సిస్టమ్‌తో ఫోర్డ్ కంపెనీ తక్కువ టైమ్‌లో ఎక్కువ కార్లు ఉత్పత్తి చేయగలిగింది.
బస్తాల కొద్దీ జీతాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదనీ, కార్మికులకు భద్రం చెప్పాలనీ ఆయన నమ్మారు. ఆ నమ్మకం నిజమయింది. జీతాల పెంపునకు, తాగుడు మానడానికీ ముడిపెట్టడంతో... ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగం అంటే పిల్లవాడు శుభ్రంగా ఉంటాడనీ, పిల్లనిస్తే సుఖంగా ఉంటుందనీ పేరొచ్చింది!
యుద్ధం చేసి ఏ దేశమూ గొప్పదైపోదనీ, పరిశ్రమలే ఏనాటికైనా దేశాలకు తలకిరీటం పెడతాయని ఆయన నమ్మారు.
ఆ నమ్మకం నిజమయింది. హెన్రీ కార్ల కంపెనీ... కష్టకాలంలో అమెరికాను నిలబెట్టింది. చేతిలో నాలుగు డాలర్లు పెట్టింది!
హెన్రీకి ఉన్న మరో నమ్మకం -‘రీ ఇన్‌కార్నేషన్’!
‘‘నా ఇరవై ఆరవ యేట నాకు ఇలాంటి భావన కలిగింది. ఈ జన్మలో అమలు చేయలేని ఆలోచనలను మరుజన్మలో ఆచరణలో పెట్టేందుకు పునర్జన్మ అనేది ఒకటి ఉంటుందని నా నమ్మకం. కాలం పరిమితమైనది కాదు. ముగిసిపోయేదీ కాదు. జన్మజన్మలకు అదొక అనంతమైన వారధి. ఐక్యూ గురించి మాట్లాడుకునేటప్పడు... బై బర్త్ అంటుంటాం. కానీ మనం అనవలసిన మాట... బై మెనీ బర్త్స్ అని! జన్మజన్మల్లోని అనుభవం పోగుపడుతూ వచ్చి, మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది. ఎక్కువ జన్మలు అనుభవించి వచ్చిన వారు తర్వాత జన్మలకు సీనియర్ మోస్ట్‌లు అవుతారు. గ్రేట్ సోల్స్ అంటే అలాంటి వారే.’’
యు.ఎస్. దినపత్రిక ‘ది శాన్‌ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్’లో 1928 ఆగస్టు 26న యథాతథంగా అచ్చయిన హెన్రీ ఫీలింగ్స్ ఇవి.
*******

హెన్రీ ఫోర్డ్ అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్! ఫోర్డ్ మోటార్ కంపెనీ ఓనర్. మూకుమ్మడి ఉత్పత్తి (అసెంబ్లీ లైన్) అనే టెక్నిక్ ఆయన కనిపెట్టిందే. ప్రపంచాన్ని ఊరించిన మోడల్-టి కారు ఆయన కంపెనీ డిజైన్ చేసిందే. టైమ్ సేవింగ్ కోసం హెన్రీ చాలా చాలా కనిపెట్టారు. అందులో ఒకటి అసెంబ్లీ లైన్ టెక్నిక్. ఇంకొకటి కార్మికుల జీతాలను విపరీతంగా పెంచడం. ఈ రెండు కాన్సెప్టులు ‘ఫోర్డిజం’గా ప్రఖ్యాతి చెందాయి. హెన్రీ ఫోర్డ్‌ని ప్రపంచ సంపన్నుడినీ, సుప్రసిద్ధుడినీ చేశాయి.

ఏడు వందల పరికరాలను బిగిస్తే ఒక మోడల్-టి కారు తయారవుతుంది. అందరూ ఒక కారునే, అది పూర్తయ్యేవరకూ తయారుచేస్తూ కూర్చుంటే తలప్రాణం తోకకు వస్తుంది. ఐదో ఆరో కార్లు బయటికొస్తాయి. డిమాండ్ ఎక్కువ. సప్లయ్ తక్కువ. ఎలా? హెన్రీ ఆలోచించారు. ఉత్పత్తి సమయం ఎక్కడ కిల్ అవుతోందో గమనించారు. ఒక మనిషికి రెండుమూడు రకాల పనులున్నాయి. ఒక పని నుంచి ఇంకో పనికి షిఫ్ట్ అవడానికి వారికి కొంత టైమ్ పడుతోంది. దాన్ని సేవ్ చేయాలంటే వేరే పనికి షిఫ్ట్ అయ్యే అవసరం లేకుండా చెయ్యాలి. అలాగే చేశారు హెన్రీ. ఒక మనిషి రోజంతా ఒకే పని చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. కారు చక్రాలు తయారు చేసేవారు చక్రాలు, ఇంజిన్లు తయారు చేసేవారు ఇంజిన్లు. ఇలా! ఇంజిన్లలో మళ్లీ విడిపరికరాలు తయారు చేయవలసిన వారు ఇంకో గ్రూపు. ఇలా అన్ని వైపుల నుంచి విడిపరికరాలు కుప్పలు తెప్పలుగా తయారవుతుంటాయి. వాటిని అసెంబుల్ చేసే గ్రూపు చకచకా అసెంబుల్ చేసేస్తుంటుంది. కార్లు ఒకదాని వెంట ఒకటి తయారై వస్తుంటాయి. ఇదే అసెంబ్లీ లైన్ కాన్సెప్ట్.

http://www.reformation.org/en-henry-ford.jpg
టైమ్ అంటే హెన్రీకి గౌరవం. టైమ్‌ని సేవ్ చేయ్యడం కోసం అవసరమైతే టైమ్‌ని వేస్ట్ చేసుకుంటారు!
ఓసారి ఎవరో అడిగారు హెన్రీ ఫోర్డ్‌ని - ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ఎగ్జిక్యూటివ్‌ల దగ్గరికి మీరే ఎందుకు వెళతారు. వాళ్లనే మీ దగ్గరికి పిలిపించుకోవచ్చు కదా అని.
‘‘టైమ్ సేవ్ చెయ్యడానికి’’ అని చెప్పారు హెన్రీ.
వాళ్లు తన దగ్గరకు వచ్చే లోపే, తను వాళ్ల దగ్గరికి వెళ్లిపోగలరు హెన్రీ.
పన్నెండో యేట తొలిసారి ‘టైమ్ బౌండ్’ అయ్యాడు హెన్రీ! అప్పటి వరకు - నాన్న నిమిషాల ముల్లు, అమ్మ గంటల ముల్లు అతడి జీవితానికి.
‘‘ఇవాళ్టి నుంచి దీన్ని ఫాలో అవు’ అన్నారు విలియమ్ ఫోర్డ్, ఓ రోజు తన చేతి గడియారాన్ని తీసి కొడుక్కి ఇస్తూ.
హెన్రీ ఫోర్డ్ ఆ ఇంట్లో పెద్ద కొడుకు. హెన్రీ తర్వాత ఇద్దరు అమ్మాయిలు. మార్గరెట్, జేన్. వాళ్ల తర్వాత ఇద్దరబ్బాయిలు విలియమ్, రాబర్ట్.
తండ్రి ఇచ్చిన గడియారాన్ని ఇష్టంగా తడిమి చూసుకుంటున్నాడు హెన్రీ ఫోర్డ్.
‘‘పెద్దవాడివౌతున్నావ్. ఇక నీకెవరూ చెప్పరు. నువ్వే ఒకరికి చెప్పాలి’’ అంది అతడి తల్లి మేరీ లిటోగాట్.
హెన్రీకి, పెద్ద చెల్లికి మధ్య నాలుగేళ్లు తేడా. హెన్రీకి ఆఖరి తమ్ముడికీ మధ్య పదేళ్లు తేడా. తల్లిదండ్రుల తర్వాత హెన్రీనే ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద.
చేతిగడియారాన్ని కొన్నాళ్లు జాగ్రత్తగా ఫాలో అయ్యాడు హెన్రీ. తర్వాత అతడికో సందేహం వచ్చింది! మనుషుల్ని వాళ్ల ఇష్టానుసారం కూర్చోనివ్వకుండా, నిలబడనివ్వకుండా, నిద్రపోనివ్వకుండా... వెనక ఉండి తరుముతున్న ఈ గడియారంలో లోపల ఏం ఉండి ఉంటుంది? ఎలా ఉండి ఉంటుంది?
గడియారాన్ని విప్పదీశాడు. వీలైనన్ని విడిభాగాలుగా వేరుచేశాడు.
ముళ్లు ఆగిపోయాయి!
విప్పి, వేరు చేసిన క్రమంలోనే తిరిగి ఒక్కో భాగాన్నీ శ్రద్ధగా బిగించాడు.
ముళ్లు తిరుగుతున్నాయి!
ఆ రోజు నుంచి గడియారాల మెకానిక్ ఐపోయాడు హెన్రీ ఫోర్డ్. ఫ్రెండ్స్ ఇళ్ల నుంచి, ఇరుగు పొరుగు నుంచి పనిచేయని గడియారాలు అతడి దగ్గరికి వస్తున్నాయి. ఆరోగ్యం మెరుగయ్యాక పరుగులు తీస్తున్నాయి. మంచి గడియారాల డాక్టర్‌గా పేరొచ్చింది హెన్రీకి ఆ చుట్టుపక్కల. అయితే ఈ డాక్టరుగారికి ఆదివారం సెలవు. ఆదివారం అతడు చర్చికి వెళతాడు.

హెన్రీ కుటుంబం ఉంటున్న గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్ నుంచి చర్చికి నాలుగు మైళ్ల దూరం. అంతదూరం వారం వారం నడిచి వెళ్లొస్తుంటాడు హెన్రీ. గ్రీన్‌ఫీల్డ్‌లో హెన్రీ తండ్రికి కొద్దిగా పొలం ఉంది. తల్లి రోజంతా ఆ పొలంలో పనిచేస్తుంటుంది. స్కూల్ అయ్యాక, పొలంలో తల్లిని వెతుక్కుంటూ వెళతాడు హెన్రీ. ఆమెతో ఆ పూట కబుర్లు చెప్పి కడుపారా నవ్విస్తాడు. శ్రమను మర్చిపోయి తల్లి అలా నవ్వుతూ ఉంటే చూడ్డం హెన్రీకి ఇష్టం. పొలం గట్ల మీద తల్లి వెనక... అడుగులో అడుగు వేసుకుంటూ చీకటి పడే వేళకు ఆమెతో పాటు ఇంటికి చేరుకుంటాడు. ఒకరోజు తల్లి కోసం పొలానికి కాకుండా, స్కూల్ నుంచి నేరుగా ఇంటికి రావలసి వచ్చింది హెన్రీకి.

హెన్రీ జీవితంలో అంతకన్నా విషాదమైన రోజు లేదు. తల్లి చనిపోయిందన్న వార్త విన్న రోజు అది! అంత పెద్ద దుఃఖాన్ని పదమూడేళ్ల ఆ చిన్న శరీరం తట్టుకోలేకపోయింది. ఏడ్చి ఏడ్చి ఇక ఏడవలేక నీరసపడి... నిద్రపోతున్నట్లు ఉన్న అమ్మ మీద వాలిపోయాడు. చాలాకాలం పాటు అతడు పొలం మొహం చూడలేదు. తండ్రి కూడా అతడిని బలవంతం చెయ్యలేదు.
‘‘అమ్మే కనుక రోజూ నాకు పొలంలో కనిపించపోతే నేను మా పొలాన్నే ప్రేమించేవాడినే కాదు’’ అని హెన్రీ ఆ తర్వాత తన ఆత్మకథ ‘మై లైఫ్ అండ్ వర్క్’లో రాసుకున్నారు.
*******

తల్లి పోయాక హెన్రీ కాలం పూర్తిగా స్తంభించిపోయింది. గడియారాలను నడిపించిన బాలుడి జీవిత గడియారం సడెన్‌గా ‘స్ట్రక్’ అయింది. ఇల్లొదిలి డెట్రాయిట్ సిటీ చేరుకున్నాడు. అక్కడి జేమ్స్ ఫ్లవర్ అండ్ బ్రదర్స్ కంపెనీలో కొన్నాళ్లు వాచ్ రిపేరర్‌గా కొద్ది జీతంతో పని చేశాడు. తర్వాత డెట్రాయిట్ డ్రై డాక్ కంపెనీలో చేరాడు. అదీ వదిలి, తల్లి లేని గూటికే తిరిగి చేరుకున్నాడు. కొన్ని రోజులు తల్లి నడిచిన దారిలో పొలం గట్లపై వెల్లకిలా పడుకుని, తల్లికోసం ఆకాశంలోకి చూసేవాడు. ఆమె పాదాలు తాకి ఉంటాయని భ్రమించిన చోట... మట్టినేలకు చెంపలు ఆన్చి కన్నీళ్లు పెట్టుకునేవాడు. అదను చూసి కాలం అతడిని మెల్లిగా పొలం పనుల్లో పెట్టింది!

ఓరోజు పొలంలోని వెస్టింగ్‌హౌస్ కంపెనీ స్టీమ్ ఇంజిన్ పాడైపోతే తనకు తనే రిపేర్ చేశాడు హెన్రీ! తర్వాత అదే కంపెనీలో ఇంజిన్ల సర్వీసింగ్ సెక్షన్‌లో చేరాడు. కాలం అతడిని నడపవలసిన వైపే నడుపుతోంది! పని చేస్తూనే, డెట్రాయిట్‌లోని గోల్డ్‌స్మిత్, బ్రియాంట్ అండ్ స్ట్రాటన్ బిజినెస్ కాలేజ్‌లో పార్ట్ టైమ్‌గా బుక్‌కీపింగ్ నేర్చుకుంటున్నాడు.

హెన్రీకి పందొమ్మిదేళ్లు. ఇక్కడో కాలు అక్కడో కాలు వేస్తున్నాడు. ఎక్కడా కుదురుగా ఉండడం లేదు. కొన్నాళ్లు సొంతంగా రంపం మిల్లు నడిపాడు. రాలిందెంతో, తేలిందెంతో తెలీదు. పొలం నుంచి వస్తూ ఒక సాయంత్రం లెక్క చూసుకున్నాడు. మిగిలిందేమీ లేదు. పోయింది మాత్రం ఐదేళ్లు! ఐదేళ్లు బూడిద!
ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు హెన్రీ. అంతకన్నా ముందు - అతడి పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు తండ్రి!

హెన్రీ సంపాదిస్తున్నదేమీ లేదు. నాకు పెళ్లేమిటి? అన్నాడు. వచ్చే దాన్ని చూస్తూ, పోయేదాన్ని పట్టించుకోకపోతే ఎలా అన్నాడు తండ్రి. హెన్రీకి అర్థమైంది. వయసు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అప్పటికి హెన్రీకి పాతికేళ్లు. తండ్రి మాట విని క్లారా బ్రియాంట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఎడిసన్ ఇల్యుమినేటింగ్ కంపెనీలో ఇంజినీర్‌గా చేరాడు. రెండేళ్ల తర్వాత ఒకేసారి అతడికి రెండు ప్రమోషన్‌లు వచ్చాయి! 

ఒకటి: కంపెనీ చీఫ్ ఇంజినీర్‌గా. ఇంకొకటి: తండ్రిగా. *******

ఎడిసన్ కంపెనీలో చీఫ్ ఇంజినీర్ అంటే కావలసినంత డబ్బు. చేద్దామన్నా ఉండనంత పని! గ్యాసోలిన్‌తో సొంత ఎక్స్‌పెరిమెంట్స్ మొదలుపెట్టాడు హెన్రీ. పూర్వజన్మలలో తనొక ఇంజినీర్‌నని ఆయన నమ్మకం. ఆ అనుభవాన్నంతా ఉపయోగించుకుని ఏదైనా కనిపెట్టాలని ఆయన తపన. మూడేళ్లు కష్టపడి దానికదే శక్తికూడదీసుకుని నడిచే వాహనాన్ని (సెల్ఫ్ ప్రొపెల్డ్ వెహికల్) తయారు చేశాడు! దానికి ఫోర్డ్ క్వాడ్రిసైకిల్ అని పేరు పెట్టాడు. టెస్ట్ డ్రైవ్‌లో అది సక్సెస్ అయింది. థామస్ ఎడిసన్‌కు ఆ సైకిల్‌ని చూపించాడు. గో ఎహెడ్ అని థామస్ అతడి భుజం తట్టారు.


మరో రెండేళ్లకు ఇంకో కొత్త వాహనం తయారయింది! డెట్రాయిట్‌లో పేరున్న కలపవ్యాపారి విలియమ్ మర్ఫీ దానికి డబ్బు సహాయం చేశారు. కొన్నాళ్ల తర్వాత ఎడిసన్ కంపెనీలో ఉద్యోగం మాని డెట్రాయిట్ ఆటోమొబైల్స్ కంపెనీలో చేరాడు హెన్రీ. అక్కడా ఉద్యోగం ఉద్యోగమే. ప్రయోగాలు ప్రయోగాలే. తక్కువ ధరకు నాణ్యమైన ఆటోమొబైల్స్ అందించడానికి హెన్రీ ప్రయోగాలు చేస్తున్నాడు. ఈలోపు డెట్రాయిట్ ఆటోమొబైల్ కంపెనీ చేతులెత్తేసింది. హెన్రీ బయటికొచ్చి, హెరాల్డ్ విల్స్ సమకూర్చిన డబ్బుతో ట్వంటీసిక్స్ హార్స్‌పవర్ ఆటోమొబైల్‌ను తయారుచేసి విజయవంతంగా పరుగులు తీయించాడు.


ఫోర్డ్ కంపెనీ ఆవిర్భావానికి ఒక విధంగా అదే తొలి ముహూర్తం. విలియమ్ మర్ఫీ, మూతపడిన డెట్రాయిట్ ఆటోమొబైల్స్ కంపెనీలో కొందరు వాటాదారులు... హెన్రీ ఫోర్డుతో కలిశారు. 1901 నవంబర్ 30న కార్ల తయారీ కంపెనీకి రిబ్బన్ కట్ అయింది. అయితే కొన్నాళ్లకే ఆ కంపెనీతో హెన్రీ సంబంధాలు కట్ అయ్యాయి. కంపెనీ కన్సల్టెంట్‌గా విలియమ్ మర్ఫీ... హెన్రీ లెలాండ్ అనే మనిషిని తెచ్చుకోవడం హెన్రీకి నచ్చలేదు. ఏడాదికే తన పేరు తను తీసుకుని వేరుపడ్డాడు. హెన్రీ వెళ్లిపోయాక అది క్యాడిలాక్ ఆటోమొబైల్స్ కంపెనీ అయింది.


హెన్రీ నేరుగా తన పాత పరిచయస్తుడు అలెగ్జాండర్ మాల్కమ్‌సన్ దగ్గరికి వెళ్లాడు. మాల్కమ్‌సన్ డెట్రాయిట్ ఏరియా బొగ్గు డీలర్. అతడితో కలిసి ‘ఫోర్డ్ అండ్ మాల్కమ్‌సన్స్ లిమిటెడ్’ ప్రారంభించాడు. కార్లకు విడిభాగాలు తయారు చేసే కంపెనీని లీజుకు తీసుకుని వేల డాలర్ల విలువైన కాంట్రాక్టు ఇచ్చారు! అయితే కార్ల అమ్మకాలు ఆశించినంతగా లేక, తొలివిడత విడిభాగాల సరఫరాకు కూడా డబ్బు చెల్లించలేకపోయింది హెన్రీ అండ్ కంపెనీ. అలా చెల్లించలేని పరిస్థితే హెన్రీ జీవితాన్ని మలుపుతిప్పింది.

మాల్కమ్‌సన్‌కి హెన్రీ టాలెంట్ మీద తిరుగులేని నమ్మకం. ఏనాటికైనా అతడు సాధిస్తాడు. చవగ్గా అందరికీ అందుబాటులోకి వచ్చే నాణ్యమైన ఆటోమొబైల్‌ను డిజైన్ చేస్తాడు. అప్పుడు అమెరికాతో పాటు, ప్రపంచమంతా ఆర్డర్లు ఇవ్వడానికి తమ కంపెనీ ముందు బార్లు తీరుతాయని అతడి నమ్మకం. ఈ నమ్మకంతోనే మాల్కమ్‌సన్ కొంతమంది ఇన్వెస్టర్లకు గాలం వేశాడు. బాకీ తీర్చమని గొంతుమీద కత్తిపెట్టి కూర్చున్న విడిభాగాల కంపెనీ హోల్డర్లు డాడ్జ్ బ్రదర్స్ దగ్గరికెళ్లి, డబ్బుకు బదులుగా కొత్తగా పెట్టబోయే కంపెనీలో వాటా ఇస్తాం అని ఒప్పించాడు. వాళ్లు శాంతించారు.


1903 జూన్ 16న ‘ఫోర్డ్ మోటార్ కంపెనీ’ మొదలైంది! మూలధనం ఇరవై ఎనిమిది వేల డాలర్లు. హెన్రీ ఫోర్డ్, మాల్కమ్‌సన్‌తో పాటు, డాడ్జ్ బ్రదర్స్, మాల్కమ్‌సన్ బంధువు జాన్ గ్రే, జేమ్స్ కౌజెన్స్, ఇంకా, మాల్కమ్‌సన్ లాయర్లు ఇద్దరు జాన్ ఆండర్సన్, హొరేస రాఖమ్... వీళ్లంతా ప్రధాన వాటాదారులు.


తొలిసారి పూర్తిగా ఒక కొత్త డిజైన్‌తో కారును బయటికి తెచ్చాడు హెన్రీ. సెయింట్ క్లెయిర్ సరస్సులో మంచుపై దాన్ని నడిపి చూపాడు. మైలు ప్రయాణానికి 39.4 సెకన్ల సమయం తీసుకుంది ఆ కారు. అంటే గంటకు 147 కి.మీ. వేగం! ల్యాండ్ స్పీడ్‌లో అదొక రికార్డ్. రేస్ డ్రైవర్ బార్నీ ఓల్డ్‌ఫీల్డ్ దానికి 999 అని పేరు పెట్టాడు. ఆనాటి రైలింజన్ పేరు అది. దానికి గౌరవ సూచకంగానే త్రిబుల్ నైన్ అని పెట్టాడు. దాన్నేసుకుని అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ తిరిగి మంచి ప్రచారం ఇచ్చాడు.

తర్వాత ఐదేళ్లకు మోడల్-టి అనే కొత్త డిజైన్ కారు ఎడమవైపు స్టీరింగ్‌తో ఫోర్డ్ కంపెనీ నుంచి మార్కెట్‌లోకి వచ్చింది. మిగతా కంపెనీలన్నీ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ లెఫ్ట్‌సైడ్ స్టీరింగ్‌ను ఫాలో అయ్యాయి!

మోడల్-టి లో ఇంకా చాలా మార్పులు చేశాడు హెన్రీ. మొత్తం ఇంజిన్‌ని, గేర్లు మార్చే ట్రాన్స్‌మిషన్‌ను బయటికి కనిపించకుండా కవర్ చేశాడు. ఎగుడుదిగుడు రోడ్లపై సాఫీగా ప్రయాణించేందుకు సస్పెషన్‌కు రెండు సెమీ ఎల్లిప్టిక్ (పూర్తిగా అండాకారంలో లేనివి) స్ప్రింగులు అమర్చాడు. దీంతో కారుని నడపడం తేలికయింది. రిపేర్లకు అయ్యే ఖర్చుకూడా చాలా తక్కువ. మొత్తం కారు ఖరీదే అప్పట్లో (1908లో) కేవలం 825 డాలర్లు. ఇప్పుడది సుమారు 22 వేల డాలర్లకు సమానం. వ రసగా పదిహేనేళ్లపాటు మోడల్-టి అమెరికాలో ఒక ఊపు ఊపింది. లక్షలమంది అమెరికన్లు మోడల్-టి పైనే డ్రైవింగ్ నేర్చుకున్నారు. 1914 నాటికి మోడల్-టి కార్ల అమ్మకాలు రెండు లక్షల యాభై వేలకు చేరుకున్నాయి! మరో రెండేళ్లలో ఆ సంఖ్య నాలుగు లక్షల డెబ్బై వేలు అయింది. కారు ధర బాగా తగ్గి 360 డాలర్లకే అందుబాటులోకి వచ్చింది. హెన్రీ ప్రతిష్ట అమెరికన్ రోడ్లపై రయ్యిన దూసుకుపోతోంది. సరిగ్గా ఆ టైమ్‌లో రెండో మోడల్‌కి ప్లాన్ చేశారు ఫోర్డ్. 1927 డిసెంబర్ నాటికి ఫోర్డ్ మోడల్ - ఎ మార్కెట్‌లోకి వచ్చింది. అదీ సక్సెస్ అయింది.

*******

కార్ల తయారీ ఒక్కటే హెన్రీ ఫోర్డ్ జీవితచరిత్ర కాదు. కార్మికుల సంక్షేమం ఒక్కటే ఆయన ధ్యేయం కాదు. యుద్ధ జన్యువులు లేని దేశాలను ఆయన తయారు చేయాలనుకున్నాడు. ముందుగా తన మాతృభూమిని యుద్ధవ్యతిరేక దేశంగా మలచాలని అనుకున్నాడు. యుద్ధంలో గెలిచి సంపాదించుకున్న ఆధిక్యత తాత్కాలికమేనని, పారిశ్రామిక వృద్ధితో సాధించిన పట్టు శాశ్వతమని ప్రపంచ దేశాలకు చెప్పడానికి అమెరికాను ఒక నమూనాగా చేసుకున్నాడు!

హెన్రీ దృష్టిలో యుద్ధం... ఒక ‘టెరిబుల్ వేస్ట్’. యుద్ధానికి నిధులిచ్చేవాళ్ల కాళ్లు చేతులు విరగ్గొట్టాలని అంటాడు. అలా వీలుకాకపోతే కాళ్లు పట్టుకుని బ్రతిమాలైనా యుద్ధాన్ని ఆపాలని అంటాడు. 1915లో హెన్రీ, మరో శాంతి ప్రియుడు రొసికా స్క్విమ్మర్‌తో కలిసి దేశాల మధ్య మంటల్ని ఆర్పడం కోసం సముద్రంపై శాంతి యాత్ర చేపట్టారు. ఒక్కోదేశంలో దిగడం, యుద్ధం వద్దని వినతి పత్రం అందించడం. వీళ్లతో పాటు మరో 170 మంది ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు షిప్పులోకి ఎక్కారు. హెన్రీ వెంట ఆయన పాస్టర్ శామ్యూల్ మార్క్విస్ కూడా బయల్దేరారు. మార్క్విస్... ఫోర్డ్ కంపెనీ సోషియాలజీ విభాగానికి అధిపతి. రోజుకు ఐదు డాలర్ల వేతనం పొందుతున్న తన కార్మికులు... చేతినిండా డబ్బు ఉన్న కారణంగా విలాసాలకు,ప్రలోభాలకు లోను కాకుండా చూడ్డం కోసం హెన్రీ ఆయన్ని నైతిక ప్రబోధాంశాల ఉపాధ్యాయుడిగా నియమించుకున్నారు.


శాంతి యాత్ర ప్రారంభించే ముందు అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ని కలిశారు హెన్రీ ఫోర్డ్. ‘‘మీకివ్వడానికి ప్రభుత్వం దగ్గర సింగిల్ డాలర్ కూడా లేదు’’ అని తెగేశారు విల్సన్. ‘‘అవసరం లేదు. యుద్ధంలోకి దూరకండి చాలు’’ అన్నారు హెన్రీ. అన్నారే గానీ, 1917లో అమెరికా యుద్ధరంగంలోకి దూకినప్పుడు విమానాల ఇంజిన్లు, జలాంతర్గాములను నాశనం చేయగల నౌకల ఇంజిన్లను ఫోర్డ్ కంపెనీ సరఫరా చేయవలసి వచ్చింది. హెన్రీ దేశభక్తి ఆ పని చేయించింది! రెండో ప్రపంచ యుద్ధంలో కూడా నాజీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా, బ్రిటన్‌లకు ఫోర్డ్ కంపెనీ సహకారం అందించింది.


మరోవైపు అమెరికాతో మంచి సంబంధాలున్న ప్రతి పెద్ద దేశంలోనూ హెన్రీ ఫోర్డ్ తన కంపెనీ శాఖల్ని తెరిచారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, ఇండియా, ఆఫ్రికా, మెక్సికో, ఫిలిప్పీన్స్‌లో ఫోర్డ్ మోటార్ కంపెనీలు అమెరికా పంట పండించాయి. అమెరికా పౌరుడిగా హెన్రీ తీర్చుకున్న రుణం అది!


1930లలో హెన్రీ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కంపెనీలోని కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఆయన పేరు మీద నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆయన ఏకైక కుమారుడు ఎడ్సెల్ ఫోర్డ్ కంపెనీని కొన్నాళ్లు నడిపాడు. 1943లో ఎడ్సెల్ చనిపోవడంతో హెన్రీ ఫోర్డ్ శక్తులు మరింత సన్నగిల్లాయి. ఎనభై ఏళ్ల ఆ శరీరం పుత్రశోకాన్ని తట్టుకోలేకపోయింది. మనవడు రెండవ హెన్రీఫోర్డ్ కంపెనీ పగ్గాలు అందుకున్నాడు. ఎనభై మూడేళ్ల వయసులో డియర్‌బోర్న్ ఎస్టేట్‌లో హెన్రీ తన అంతిమశ్వాసను తీసుకున్నారు.

*******

హెన్రీ జీవితమంతా నడిచే యంత్రాల మధ్యే గడిచింది. అలాగని ఆయన ఏనాడూ మనసులేని జీవనం గడపలేదు. సంపాదించినంత సంపాదించారు. సహాయం చేయవలసినంత చేశారు. తను ఎదిగారు. తన దగ్గరున్నవాళ్లని ఎదిగేలా చేశారు. ఒక్క సెంట్ నైనా వృధాగా ఖర్చుపెట్టలేదు. ఒక్క డాలర్‌నైనా అనవసరంగా దాచిపెట్టలేదు. బిజనెస్ అనే మాటకు, బిజినెస్‌మేన్ అనే మాటకు ఎవరెన్ని అర్థాలు చెప్పినా, ఎన్ని అపార్థాలు చేసుకున్నా... హెన్రీ చెప్పేదొకటే. బిజినెస్ అంటే చలనశీలత. బిజినెస్‌మేన్ అంటే చలనశీలి.
చలనశీలికి విరామం ఉండదు. విసుగుండదు. అలుపుండదు. అంతరాయం ఉండదు. అతడొక కాలచక్రం. అతడిదొక ఆదర్శ భ్రమణం. అలాంటి ఒక గ్రేట్ సోల్... హెన్రీ ఫోర్డ్.
*******

ఇప్పుడు హెన్రీ లేరు. ఫోర్డ్ కంపెనీ ఉంది.

ఫోర్డ్‌తో పాటు ఇంకా - హెన్రీ ఫోర్డ్ నెలకొల్పిన సంప్రదాయాలు, విలువలు ఏదో ఒక రూపంలో ఉన్నాయి. వాటన్నిటి వెనుకా హెన్రీ ఆత్మ ఉంటుంది కనుక హెన్రీ ఉన్నట్లే! పునర్జన్మపై ఆయనకు ఉన్న నమ్మకమూ నిజమైనట్లే.
హ్యాపీ క్రిస్మస్... మిస్టర్ హెన్రీ ఫోర్డ్.
మీరు ఎక్కడున్నా! ఎంత దూరంలో ఉన్నా!
- సాక్షి ఫ్యామిలీ

హెన్రీ ఫోర్డ్, పారిశ్రామికవేత్త, ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకులు

(30 జూలై 1863 - 7 ఏప్రిల్ 1947)

జన్మస్థలం : గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్, మిచిగాన్, యు.ఎస్.


తల్లిదండ్రులు : విలియమ్ ఫోర్డ్, మేరీ ఫోర్డ్

తోబుట్టువులు: మార్గరెట్, జేన్, విలియమ్, రాబర్ట్

జీవితభాగస్వామి: క్లారా జేన్‌బ్రియాంట్

సంతానం : ఎడ్సెల్ ఫోర్డ్

ప్రఖ్యాతి : ఆటోమొబైల్స్, మాస్ ప్రొడక్షన్
గ్రేట్ మేన్!
మెటీరియల్ సైన్స్, ఇంజినీరింగ్... హెన్రీ ఫోర్డ్‌కి ఇష్టమైన అంశాలు.

హారన్‌లు, మ్యాట్‌ల వంటి ప్లాస్టిక్ పరికరాల తయారీకి హెన్రీ ప్రధానంగా సోయాబీన్స్‌ను ఉపయోగించేవారు!


కలపను కూడా చెట్టు నుంచి కాకుండా, కృత్రిమంగా వ్యవసాయ ఉప ఉత్పత్తులతో తయారు చేయించేవారు.


హెన్రీ ఫోర్డ్ 160కి పైగా వినూత్న ఆవిష్కరణలు చేశారు. వాటన్నిటికీ పేటెంట్లు పొందారు.


జార్జియాలోని రిచ్‌మండ్ హిల్స్‌లో ఆయనకొక ఉల్లాస మందిరం ఉంది. తీరిక దొరికితే అక్కడికి వెళ్లి సేదతీరేవారు.


ఫోర్డ్ 1914లో ‘ద కేస్ ఎగైన్స్ట్ ద లిటిల్ వైట్ స్లేవర్’ అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించి యువకులకు పంచిపెట్టారు.


పొగతాగడం వల్ల సంభవించే అనర్థాలను ఆ పుస్తకంలో పేర్కొన్నారు.


హెన్రీ ఫోర్డ్‌కి ఆయన మరణానంతరం 1999లో ‘కార్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ద సెంచరీ’ అవార్డు ప్రకటించారు.

 ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ అంటే ఫోర్డ్‌కి వల్లమాలిన అభిమానం. తన ఆఖరి శ్వాసను సీసాలో బంధించమని ఎడిసన్ కుమారుడిని ఫోర్డ్ కోరారు. హెన్రీ ఫోర్డ్ మ్యూజియంలో ఇప్పటికీ ఆ సీసా భద్రంగా ఉంది!

హెన్రీ ఫోర్డ్ జీవిత చరిత్ర ఆధారంగా వందలాది పుస్తకాలు వచ్చాయి. వాటిల్లో బ్రిటిష్ రచయిత డగ్లాస్ గాల్ బ్రెయిత్ రాసిన ‘కింగ్ హెన్రీ’ (2007) అనే పుస్తకానికి ఆధారం ఫోర్డ్ శాంతి నౌక.

 

ఇరవయ్యవ శతాబ్దపు 18 మంది మహనీయులలో ఒకరిగా అమెరికన్ ప్రజలు హెన్రీ ఫోర్డ్‌కి ఓటేశారు.

గ్రేట్ కోట్స్!

నాణ్యమైన సేవలను అందిస్తే వచ్చే ఇబ్బంది ఏమిటంటే... మోయలేనన్ని లాభాలు వచ్చి మీద పడతాయి!

డబ్బును మాత్రమే సంపాదించి పెట్టేది పెద్ద వ్యాపారమేం కాదు.


వృద్ధాప్యం అంటే వయసు మీద పడడం కాదు. నేర్చుకోవడం ఆగిపోవడం.


అసలంటూ మొదలు పెట్టడమే అసలైన విజయ రహస్యం.


ఏ వ్యాపారానికైనా ఉత్సాహం తొలి మూలధనం.


వైఫల్యం అనేది విజయం సాధించడానికి అందివచ్చే ఒక మహదవకాశం.


ఎప్పుడూ ముందుకు వెళ్లడానికే ప్రయత్నిస్తూ ఉంటే, విజయం గురించి పనిగట్టుకుని ఆలోచించనవసరం లేదు.


డబ్బున్నంత మాత్రాన స్వేచ్ఛ ఉన్నట్లు కాదు. జ్ఞానం, అనుభవం, సామర్థ్యం కూడా ఉండాలి.


ప్రతిదీ నీకు వ్యతిరేకంగా జరుగుతుంటే విమానం వైపు చూడు. అది గాలికి అభిముఖంగా పైకి లేస్తుంది.

No comments: