ఇండియాలో మంచి చదువులే చదువుకున్నా అమెరికాకి రాగానే ఆ చదువుకు సంబంధం లేని మంచి జీతాలొచ్చే వేరే ఉద్యోగాలకి చాలామంది వెళ్లిపోతారు. కానీ కొంతమంది మాత్రం తమకు సంతృప్తినిచ్చే ఉద్యోగంలోనే కొనసాగి ఉన్నత స్థానాలకి ఎదుగుతారు. అలా ఎదిగిన వారిలో జయశ్రీ జానకీరాం కూడా ఒకరు. చాలామంది వేరే ఉద్యోగాలకి ప్రయత్నం చేయమని చెప్పినా వినలేదు నేను. నాకు నచ్చిన పనిలోనే కొనసాగుతున్నాను అంటున్న జయశ్రీ వాషింగ్టన్‌లో చ్రిల్డన్ నేషనల్ మెడికల్ సెంటర్లో విమెన్, ఇన్‌ఫాంట్, చ్రిల్డన్ సప్లిమెంటల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌కి లోకల్ ఏజెన్సీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆవిడే మన పరదేశీ....
"పెళ్లయ్యి అమెరికా వచ్చాక చదువుకున్న చదువుకి న్యాయం చేయాలని, అదే సమయంలో నలుగురికీ ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో రిజిస్టర్డ్ డైటీషియన్ ఇంటర్న్‌షిప్ చేసి డైటీషియన్ అయ్యాను'' అని అంటారు జయశ్రీ. "అమెరికాలో ఉద్యోగాలు చేసేవారు ఆ ఉద్యోగాలకి తగ్గట్టు అక్కడి వస్త్రధారణ చేసుకుంటారు కదా మరి మీరెప్పుడూ చీరలో, కుంకుమ బొట్టుతోనే కనిపిస్తారు'' అని అడిగితే... "మన భారతీయ సంస్కృతి, ఆచారాలు, పద్ధతులంటే అన్ని సంస్కృతుల వారికి ఎంత గౌరవమో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
ఇక్కడ పనిచేసేటప్పుడు పాశ్చాత్య దుస్తులే వేసుకోవాలి, లేకపోతే ఉద్యోగం చేయలేవు అని ఇక్కడికి రాకముందు చాలామంది నాతో చెప్పారు. కానీ నేను అమెరికాకు వచ్చినప్పటినుండి చీర తప్ప వేరే దుస్తులు వేసుకోలేదు. నా సహచరులు నేను మారకుండా ఉన్నందుకు నన్ను చాలా గౌరవిస్తారు. ఒక్కోసారి చిన్నపిల్లలు నా బొట్టు చూసి ప్రశ్నలేస్తుంటారు. అది మన సంస్కృతి గురించి పిల్లలకు చెప్పే అవకాశంగా తీసుకుని నేను వారికి అర్థమయ్యేలా బొట్టు గురించి చెప్తాను'' అని గర్వంగా చెప్పారు జయశ్రీ.
ప్రయోగ జీవితం...
చిన్నప్పటి నుంచే దేన్నయినా ప్రశ్నించేతత్వం, పరిశోధించేతత్వం జయశ్రీలో ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి హోమ్‌సైన్స్‌లో ఎమ్ఎస్‌సి చేశాను. చదువుకునే వయసులో ఉప్పుడు బియ్యం మామూలు బియ్యం కంటే ఎందుకు మెరుగైందనే ప్రశ్న వేసుకుని సమాధానం కోసం ప్రయోగం చేశారు కూడా. ఈ జిజ్ఞాస ఇప్పటికీ ఆమెలో అలానే ఉండిపోయింది. అందుకే ఇక్కడ ఉన్న హిస్‌పానిక్, స్పానిష్ పిల్లల్లో రెండేళ్ల వయసు నుంచే ఊబకాయం ఎందుకు వస్తుందనే దానిపై ఆమె రీసెర్చ్ చేశారు. టీవీల ముందు కూర్చొని తినడం వలన పిల్లల దృష్టి టీవీ ప్రోగ్రాంపై ఉండి వారు ఎంత తింటున్నారో తెలియడం లేదు.
కడుపు నిండినా తింటూనే ఉంటున్నా ఊరికే చూడొద్దు అంటే అంత చిన్న పిల్లలకు అర్థం కాదు. అందుకని టీవీ ప్రోగ్రాంలు చూసేపుడు మధ్య మధ్యలో ప్రకటనలు వస్తాయి కదా ఆ సమయంలో కొన్ని పుషప్స్ చేయడం, స్కిప్పింగ్ చేయడం, ఎక్సర్‌సైజ్ బైక్ ఉంటే అది తొక్కడం, అటు ఇటు పరిగెత్తడం లాంటివి చేయమని చెబుతాము. కనీసం ఇరవై నిమిషాలు ఇలా చేసినా ఆ రోజుకి వారి శరీరాలకు వ్యాయామం కలిగినట్టే. ఈ కార్యక్రమం వల్ల ఇరవై శాతం ఫలితం సాధించాము. పోగా పోగా ఈ శాతం మరింత పెరుగుతూ పోతుందనే నమ్మకం మాకుంది'' అని ఒబెసిటీని చిన్న పిల్లల్లో ఎలా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో జయశ్రీ తెలియజేశారు.
బిడ్డకు తల్లి పాలు ఎంత మంచివో కూడా జయశ్రీ ప్రచారం చేస్తుంటారు. కేవలం ప్రచారం చేయడమే కాదు కొత్తగా తల్లులయిన వారి నుంచి బిడ్డలకు డబ్బాపాలు తాగించబోమనే పత్రంపై సంతకం తీసుకుంటారు. వారికి తల్లి పాల వలన కలిగే మేలును బోధిస్తారు. ఆస్పత్రుల్లో, స్కూళ్ళలో, కమ్యూనిటీ క్లినిక్‌లలో ప్రతి నెలా వేలమందికి పైగా క్లయింట్లను ఈమె చూస్తారు. తమతో పదేళ్ళుగా కలిసి పని చేస్తున్న వివిధ ఏజెన్సీలకు అవసరమైన నిధులను కూడా జయశ్రీ సేకరిస్తుంటారు. ఆయా ఏజెన్సీలకు చేదోడు, వాదోడుగా ఉంటారు.
కలసిపోతే కలదు సుఖం...
"ఇక్కడి జీవితానికి ఎలా అలవాటుపడ్డారు?'' అని అడిగితే తన గతాన్ని జయశ్రీ తడుముకుంటూ..." నేను తొలిసారి అమెరికాలో అడుగుపెట్టినపుడు నా భర్త జానకీరామ్, మరో ఇద్దరు అమెరికన్ స్నేహితులు నాకు స్వాగతం పలికారు. ఇప్పటికీ ఆ ఇద్దరూ మాకు మంచి సన్నిహితులే. ఇక్కడ ఇతరులతో త్వరగా కలసిపోవచ్చు. నాకు పరిచయం ఉన్న వారిలో గ్రీక్, యూరోపియన్, ఆసియా, దక్షిణ అమెరికాల వాళ్ళు ఆఫ్రికన్ అమెరికన్‌లు ఉన్నారు.
వాషింగ్టన్ డి.సిలో మా అమ్మాయి పెళ్లి చేసినపుడు వచ్చిన అతిథుల్లో సగం మంది భారతీయులు ఉంటే, మిగతా సగం వివిధ దేశాల వారు ఉన్నారు. అలాగే మా అబ్బాయి వివాహం భారతదేశంలో జరిపినపుడు కూడా ఇక్కడి వారు చాలామంది మన దేశానికి వచ్చారు. అంతగా ఇక్కడి వారితో మమేకమయ్యాను'' అంటూ చెప్పుకొచ్చారు.
ఆనందాల కొలువు...
మన సంప్రదాయాలకు జయశ్రీ పెద్ద పీట వేస్తారు. అందుకే వారి ఆఫీసులో ఫ్యాషన్ షో నిర్వహించినపుడు స్త్రీలందరూ చీరలు కట్టుకుని వచ్చేట్టు చేశారు. జయశ్రీ ఇంట్లో జరిగే సంక్రాంతి పండగ ఒక అంతర్జాతీయ వేడుకలా కనిపిస్తుంది. ఆరోజు ఏర్పాటు చేసే బొమ్మల కొలువుకు వివిధ దేశాల వారు వస్తారు. ఆ సంబరంలో రకరకాల ఆహారం పలకరిస్తుంది. ఒక వైపు సమోసాలు, ఇంకోవైపు ఇటాలియన్, మెక్సికన్, గ్రీక్, యూరోపియన్ రుచులు కూడా నోరూరిస్తాయి. ఇలా అన్ని దేశాలకు చెందిన వ్యక్తుల నడుమ ఆమె సంక్రాంతిని జరుపుకుంటారు. మాతృదేశంలో జరిగే సంక్రాంతి వేడుకలకు దూరమైనా అలా అందరి సమక్షంలో చేసి ఆనందాన్ని తాము పొందడమే కాకుండా ఇతరులకూ మన సంస్కృతిని పరిచయం చేస్తున్నారు.
పిల్లల్లో రెండేళ్ల వయసు నుంచే ఊబకాయం ఎందుకు వస్తుందనే దానిపై ఆమె రీసెర్చ్ చేశారు. టీవీల ముందు కూర్చొని తినడం వలన పిల్లల దృష్టి టీవీ ప్రోగ్రాంపై ఉండి వారు ఎంత తింటున్నారో తెలియడం లేదు. కడుపు నిండినా తింటూనే ఉంటున్నా ఊరికే చూడొద్దు అంటే అంత చిన్న పిల్లలకు అర్థం కాదు. అందుకని టీవీ ప్రోగ్రాంలు చూసేపుడు మధ్య మధ్యలో ప్రకటనలు వస్తాయి కదా ఆ సమయంలో కొన్ని పుషప్స్ చేయడం, స్కిప్పింగ్ చేయడం, ఎక్సర్‌సైజ్ బైక్ ఉంటే అది తొక్కడం, అటు ఇటు పరిగెత్తడం లాంటివి చేయమని చెబుతాము. కనీసం ఇరవై నిమిషాలు ఇలా చేసినా ఆ రోజుకి వారి శరీరాలకు వ్యాయామం కలిగినట్టే.
- కనకదుర్గ (అమెరికా నుంచి)