Sunday, October 30, 2011

క్లిక్ సిన్హా....చారుసిన్హా... ఐపీఎస్.

అనంతపురం డీఐజీ  చారుసిన్హా... ఐపీఎస్. ఖాకీ దుస్తుల్లో కఠినంగా కనిపించే చారుసిన్హాలో సున్నితమైన మరో కోణం ఉంది. అది ఇటీవల జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. పోలీసు అధికారులకు సూచనలిస్తూ, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, భక్తులు కిటకిటలాడే వాహన సేవల్లో హడావుడిగా తిరుగుతూ కనిపించిన ఆమె చేతిలో పిస్టల్ బదులు ఎస్ఎల్ఆర్ కెమెరా ఉండడం విశేషం. గంటలకు గంటలు వాహనం ముందు నడుస్తూ ఆమె ఫోటోలు తీశారు. ఆమె కెమెరాను దేవుడి మీదగాక దేవుణ్ణి వీక్షించే భక్తుల మీదకు ఎక్కుపెట్టారు. వృద్ధుల ముఖంలో కనిపించే అలౌకిక దైవానుభూతినీ, పిల్లల అమాయకపు ఆనందాన్నీ ఆమె ఫోటోల్లో పదిలపరిచారు. అప్పుడు ఆమెను పలుకరిస్తే ఆసక్తికరమైన విశేషాలెన్నో చెప్పారు.

చారుసిన్హా. తల్లి, తండ్రి ఇద్దరికీ ఫోటోగ్రఫీ అంటే ప్రాణం.వారికి తొలి మోడల్ చారుసిన్హానే. రోజుల బిడ్డ నుంచీ ఇప్పటిదాకా వాళ్ళిద్దరూ ఆమెను ఫోటోలు తీస్తూనే ఉన్నారు. తల్లిదండ్రుల అభిరుచి వారసత్వంగా చారుసిన్హాకీ వచ్చింది. బుడిబుడి అడుగులనాడే ఆమె కెమెరాను చేతబట్టారు. తండ్రి స్నేహితుడి స్టూడియోలోని డార్క్ రూం చారుసిన్హాకు చిన్నప్పటి నుంచి సుపరిచితం. తండ్రితో పాటు అయిదవ ఏట నుంచి 15వ సంవత్సరం వరకు డార్క్ రూంకు వెళ్లి ఫోటోలను డెవలప్ చేసేవారు.

" మా అమ్మకి సూర్యోదయం,సూర్యాస్తమయం అంటే చాలా యిష్టం.ఆమె తీసిన ఫోటోల్లో ఎక్కువ అవే. ఫోటోలు తీసేపుడు నన్ను కూడా వెంట తీసుకుపోయేవారు. అప్పుడామెకి నేనే మోడల్. మా నాన్న ఫోటోలు తీసేపుడు నేను ఆసక్తిగా చూసేదాన్ని, కెమెరా హాండ్లింగ్ అలాగే నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నా ఫోటోలను మా ఫాదర్ చూసి తప్పొప్పులు చెపుతుంటారు. పిల్లలు, వృద్ధులు, ప్రకృతి..ఇవే ఫోటోగ్రఫీలో నా ఆసక్తులు.'' అంటారు చారుసిన్హా.

కొసావో నుంచి కేదార్‌నాథ్ వరకు....
చారు సిన్హా హైదరాబాద్ లోని సెంట్‌ఫ్రాన్సిస్ కాలేజీలో డిగ్రీ చదివారు. సెంట్రల్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. 1996లో ఐ.పి.ఎస్‌కి ఎంపికయ్యారు. 2005లో యు. ఎన్. పీస్ కీపింగ్ మిషన్ కు డిప్యుటేషన్ పైన కొసావో వెళ్లారు. సెలవు దొరికినపుడల్లా ఆ చుట్టుపక్కల దేశాలు తిరిగారు. తనకు నచ్చిన దృశ్యాలను కెమెరాలో బంధించారు. "కొసావోలో ఏడాది పాటు వున్నాను. ఆ దేశాల్లో శీతాకాలంలో మైనస్ 31 డిగ్రీలుంటుంది. ప్రకృతి చాలా అందంగా వుంటుంది. చాలా నిశ్శబ్దంగా వుంటుంది. మంచుపడే చప్పుడులోని సంగీతం విన్నాను. అక్కడ ఉండగానే రష్యా, రుమేనియా, హంగేరి, స్విట్జర్లాండ్,జర్మనీ, ప్యారిస్, బెల్జియం, హాలెండ్, గ్రీస్, ఈజిస్టు, నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఇలా 18 దేశాలు చూశాను.ఎందరినో కలిశాను.

ఆ అనుభూతులన్నీ కెమెరాలోకెక్కించాను.'' అని చెబుతూ ఆ ఫోటోలన్నీ చూపించారు. చారుసిన్హా. తనను దాసోహం చేసుకున్న ప్రకృతిని ఆమె ఫోటోలుగా పదిలపరచుకున్నారు." ఇండో ఛైనా బార్డర్ లో పాంగ్ గాంగ్ లేక్ వుంది. ఆ సరసు కొంత భాగం భారతదేశంలోనూ, మిగిలిన భాగం చైనాలోనూ వుంటుంది. బ్లూ కలర్‌లో ఎన్ని షేడ్స్ వున్నాయో అన్నీ ఆ సరస్సులో కనిపిస్తాయి. మంచు కొండలు ఆ సరస్సులో అందాలు దిద్దుకుంటూ వుంటాయి. సూర్య కాంతిలోని తీవ్రతను బట్టి సరస్సులోని నీరు రంగులు మారుతుంది. నీటితో పాటు మంచుకొండల రంగులు కూడా మారుతూ వుంటాయి. ఫోటోగ్రాఫర్లకు ఆ సరస్సు ఒక షడ్రసోపేత విందు. త్రీఇడియట్స్ సినిమా చివర్లో ఆ సరస్సు కనిపిస్తుంది. కులుమనాలి నుంచి లడక్ వరకు వెళ్లాను. ఈజిప్టు పిరమిడ్స్‌ను చూశాను.

రష్యాలో ప్రతి ఇల్లు కలపతో గాక ప్రేమతో నిర్మించారేమో అనిపిస్తుంది. అంత ముచ్చటగా ఉంటాయి అవి. మన దేశంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లలో రుషుల ఫోటోలు తీసాను. అంత చలిలోనూ వారు ఒంటిమీద నామమాత్రపు దుస్తులతో బూడిద పూసుకుని వుంటారు. కొందరు నిప్పులమీద నడుస్తారు. వారి ముఖంలో కనిపించే ఆధ్యాత్మికత, శాంతి, తపోశక్తి అద్భుతం.'' అంటూ ఆమె తన యాత్రానుభవాలు వివరించారు.

వెంకటేశుని ప్రేమలో..
2006లో కొసావోలో డిప్యుటేషన్ పూర్తవగానే చారుసిన్హాను చిత్తూరు ఎస్పీగా నియమించారు. ముక్కుసూటిదనం ఆమెకు చిక్కులు తెచ్చింది. అనేక పాతకేసులను తిరగదోడారు. మూడు నెలలు తిరక్కముందే ఆమెపై బదిలీ వేటు పడింది. ఆమె బదిలీని నిరసిస్తూ జిల్లాలో ఆటోలవాళ్ళు, కార్మికులు రోడ్లమీదకు వచ్చారు. అది ఆమెను తీవ్రంగా కలచివేసింది. అయితే ఆ కలత బదిలీ గురించి కాదంటారు ఆమె.." .నేను చిత్తూరు ఎస్పీగా వున్నపుడు ఎన్నో సార్లు తిరుమల వెళ్లాను. వీఐపీల వెంట డ్యూటీగా వెళ్ళేదాన్ని. దర్శనానికి కూడా వెళ్ళేదాన్ని. అయినా దేవుడి మీద ప్రత్యేక ఆసక్తి ఏదీ కలుగలేదు.

అయితే, బదిలీ అయిన రోజు ఎందుకో చాలా వెలితిగా అనిపించింది. నేను వెంకటేశ్వరస్వామిని మిస్ అవుతానని అనిపించింది. ఆత్మీయులకు దూరంగా వెళ్ళిపోతున్నాననే ఫీలింగ్ అది. తెలియని అనుబంధం ఏదో శ్రీవేంకటేశ్వరునితో ఏర్పడింది. ఇక అప్పటి నుంచి తిరుమలకు తరచూ వస్తూనే వున్నాను. గొప్ప శాంతి లభిస్తుంది ఇక్కడ నాకు. '' అంటూ తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని బయటపెట్టారు చారుసిన్హా.. చిన్నపిల్లలు, వృద్దులు, ప్రకృతి మాత్రమే అప్పటిదాకా ఆమె సబ్జెక్టులు. ఇప్పుడు తిరుమల వాసుడూ అందులో చేరాడు. 2010 శ్రీవారి బ్రహ్మోత్సవాలపుడు ఆమె మొదటిసారి వెంకటేశ్వరస్వామి ఫోటోలను తీయడం ప్రారంభించారు. అప్పుడు 15- 80 వైడ్ లెన్స్ ఉపయోగించారట. 2011లో 80- 200 జూమ్ లెన్స్‌తో ఉత్సవ మూర్తిని తిలకించే భక్తుల మూడ్స్‌ను క్లోజప్ ఫోటోలు తీశారు.

తన సబ్జక్టుల గురించి వివరిస్తూ, "వృద్ధుల కంటి కింది ముడతల్లో నాకు జీవితానుభవం కన్పిస్తుంది. పిల్లల్లో స్వచ్ఛత కనిపిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, ప్రకృతి.. ఈ మూడింటిలోనూ స్వామి వారే వున్నారనే సత్యం నాకు తెలిసింది. అందుకే ప్రకృతిని నాతో దాచుకోవటానికి యత్నించినట్టే.... వెంకటేశ్వరస్వామివారి ప్రతిమూడ్‌ను కూడా కేప్చర్ చేయాలనుకున్నాను. ప్రతి అలంకారంలోనూ ఆయన చాలా అందంగా వుంటాడు. ఒక్క సెకను కూడా స్వామి నుంచి దృష్టిని పక్కకు మరల్చకూడదని అనిపిస్తుంది. అంత అందం స్వామిది. స్వామివారిని చూడటం ఇక చాలు అని తృప్తి పడటం అసాధ్యం. అందుకే ఒక్కో వాహనాన్ని 400 ఫోటోలు తీశాను.'' అని చెప్పారు.

ఫోటోగ్రఫీతో ఒత్తిడి దూరం...
"వృత్తిలో, కుటుంబంలో ఉండే ఒత్తిళ్ల నుంచి బయటపడడానికి ఫోటోగ్రఫీ నాకు ఎంతో దోహదపడుతోంది. మనసు చికాగ్గా ఉన్నపుడు వెంటనే కెమెరా తగిలించుకుని బయటకు వెళ్ళిపోతాను.ప్రశాంతంగా తిరిగి ఇంటికి చేరుకుంటాను.'' అంటారామె. పెయింటింగ్,శిల్పకళ, సంగీతం,ఫోటోగ్రఫీ ఇలా ఏదో ఒక హాబీ ప్రతి ఒక్కరికీ అవసరం. అన్ని స్థాయిల్లోనూ విద్యాలయాల్లో వీటిని ప్రవేశపెడితే మంచిది అని ఆమె చెబుతున్నారు. 
- ఎ.ఎస్.దినేష్ కుమార్, తిరుపతి

Sunday, August 28, 2011

తమిళ అమ్మ జయహే.. జయ

సమకాలీన రాజకీయాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తనకంటూ ప్రత్యేక చరిత్రను కలిగి ఉన్నారు. ఒంటరి పోరాటం చేయడంలో, ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడంలోనూ ఆమెకెవరూ సాటి లేరని అంటారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడంలో, తెంచుకోవడంలో ఎప్పటికప్పుడు తనదైన వ్యూహాలను అనుసరిస్తుంటారు. ఆమె ధాటికి తట్టు కోవడం కాంగ్రెస్‌కు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను గవర్నర్‌గా నియమించడంతో జయలలిత మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కే
ఈ నియామకం వెనుక తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి పి.చిదంబరం హస్తం ఉందన్న వార్తలు వెలువడ్డారు. తమిళనాడులో జయలలిత వ్యూహాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఈ నియామకం జరిగిందన్న ఊహాగానాలు వచ్చారుు. తాజాగా తమిళనాడులో మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే భూఆక్రమణ కెసుల్లో అరెస్టయ్యారు. ఇప్పటికే
ఇద్దరు మాజీ మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు అరెస్టరున నేపథ్యంలో తాజా అరెస్టులు డీఎంకెలో కలవరం సృష్టిస్తున్నారు. ఎంతటివారినైనా వదిలేది లేదని జయలలిత ప్రకటించారు.

‘అమ్మ’ ఇంకెలాంటి ప్రతీకార చర్యలు తీసుకుంటుందోనని డీఎంకె వారు భయాందోళనలకు గురవుతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా జయలలిత మాత్రం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండానే తనపని తాను చేసుకుపోతున్నారు. ఆమె అనుసరించే వ్యూహాలపై, చేపట్టబోయే పనులపై ఎంతో ఉత్కంఠ నెలకొంటోంది.

jaya 
జయలలిత! ఆ పేరు చెప్పగానే ఆమె ప్రస్తుత రూపం కళ్ళ ముందు కదు లాడినప్పటికీ, పాత తరం వారికి మాత్రం మదిలో ఓ సౌందర్యరాశి రూపం మెదలుతుంది. ఒకనాడు వెండితెరపై రాణించిన జయలలిత నేడు రాజకీ యాల్లో తన సత్తా చాటుకుంటున్నారు. ఆమె ఎంజీఆర్‌ వారసత్వంతో రాజకీ యాల్లోకి అడుగు పెట్టారు. అనతికాలంలో ఎంతో పేరుప్రఖ్యాతులు సాధిం చిన ఆమెను అన్నాడీఎంకే లోని వారంతా ‘అమ్మా’ అని ప్రేమగా పిలుచు కుంటారు.

రాజకీయాల్లోకి అడుగిడక ముందు సినీ ప్రపంచంలో ఓ అందాల తార.. ఎదురులేని నాయకి... రాజకీయాల్లోనూ అంతే అడుగి డింది మొదలు ఎన్ని సమస్యలు.. అడ్డంకులు వచ్చినా ఎదురు నిలవడమే కానీ వెనక్కి వెళ్లడం అంటే ఏమిటో ఆమెకు తెలియదు.. ఆమె స్వభావాన్ని కొందరు అహం భా వం అంటే మరికొందరు ఆత్మవిశ్వాసం అంటారు... అదే పంథాను ఆమె నేటికీ కొనసాగిస్తున్నారు. ఇటీవల డీఎంకే నేతలు పలువురు వివిధ కేసుల్లో అరెస్టయ్యారు. ఈ అరెస్టుల వెనుక జయ పరోక్ష ప్రమేయం ఉన్నట్లు వార్తలొచ్చాయి.

బాల్యం...
తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించిన జయలలిత ప్రాథమిక విద్యాభ్యా సం బెంగళూరులో చేశారు. అనంతరం మద్రాసుకు వలసవెళ్లారు. 15 ఏళ్ల వయసులో తల్లి ప్రోత్సాహంతో జయలలిత నటనా రంగంలో ప్రవేశిం చారు. ఆమె అన్న విజయకుమార్‌ 1990లో చనిపోయారు.

సినీ జీవితం...

తమిళసినీ రంగంలో ఎదురులేని తారగా జయలలిత వెలిగారు. 1961లో మాజీ రాష్టప్రతి వి.వి.గిరి కొడుకు శంకర్‌ గిరి నిర్మించిన ఇంగ్లీష్‌ సినిమాలో నటించారు. మొదటి సినిమాను మాత్రం కన్నడలో చేశారు. అది చాలా పెద్ద హిట్టు కావడంతో ఆమెకు ఇక వెనుదిరిగి చూసే అవకాశం లేకపోయింది. అన్నిటా విజయమే. తెలుగునాట ఆమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. హిందీలోనూ ఆమె కొన్ని సినిమాలను చేశారు. కేవలం నటన మాత్రమే కాదు ఆమె స్వయంగా పదికి పైగా పాటలను కూడా పాడారు.

రాజకీయాల్లోకి...
1981లో ఎంజీఆర్‌ ప్రోత్సాహంతో అన్నాడీఎంకేలో చేరి 1988లో రాజ్య సభకు ఎన్నికయ్యారు. ఎంజీఆర్‌ మరణానంతరం ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలను జయలలిత తీసుకున్నారు. మొదటిసారి 1989 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి మొదటి మహిళా ప్రతిపక్షనాయకురాలిగా మారారు. అనంతరం చోటు చేసు కున్న పరిణామాలతో 1991లో ముఖ్య మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.

jayaprada
  • 1991 జూన్‌ 24-1996 మే 12 వరకు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు.
  • 1996లో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగారు.
  • ఎన్నో క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుని వివాదాస్పద వ్యక్తిగా ముద్ర పడ్డారు.
  • 2001 ఎన్నికలలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు.
  • అసెంబ్లీకి ఎన్నిక కాకుండానే ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి మరిన్ని వివాదాలలో చిక్కుకున్నారు.
  • 2001 సెప్టెంబర్‌ 21న సుప్రీం కోర్టు క్రిమినల్‌ కేసుల్లో చిక్కుకుని వున్న వ్యక్తి 163(1)కింద ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలులేదనే తీర్పు నిచ్చింది. ఆమెపై వారెంటును జారీ చేసింది.
  • దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ నాయకుల్లో ఒకరైన పన్నీర్‌ సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించాల్సి వచ్చింది.
  • 2003లో జయలలిత తిరిగి తనపై వచ్చిన ఆరోపణలు సవాలు చేస్తూ న్యాయ స్థానంలో పోరాడారు. ఎన్నికల ద్వారా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
  • 2006లో అసెంబ్లీకి ఎన్నికైన అనంతరం ఆమె తిరిగి అన్నాడీఎంకే పార్టీ నాయకురాలిగా, అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.


  • సాధించిన విజయాలు...
  • ప్రయివేటు సంస్థల్లో ఎక్కువ వడ్డీని వసూలు చేయడాన్ని నిషేధించారు
  • చెనై్నకి న్యూ వీరనం వాటర్‌ సప్లై పథకాన్ని పూర్తి చేశారు.
  • లాటరీ టికెట్ల అమ్మకాలపై నియంత్రణ విధించారు.
  • జైళ్లలో, కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.
  • వర్షపు నీటి నిల్వ పథకాన్ని ప్రారంభించి విజయ వంతం చేశారు.
  • గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.
  • ఇటీవల ఎన్నిక సందర్భంగా ప్రకటించిన ఉచిత వరాలను నెరవేర్చే ప్రక్రియ ప్రారంభించారు.

    jaya1పొందిన అవార్డులు...
  • 1972లో తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామని
  • 1991లో మద్రాసు యూనివర్శిటీ నుండి డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌
  • 1992లో డాక్టర్‌ ఎంజీఆర్‌ మెడికల్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌
  • 1993లో మధురై కామరాజు యూనివర్శిటీ నుండి గౌరవ డిగ్రీ పట్టా
  • 2005లో తమిళనాడు డాక్టర్‌ అంబేద్కర్‌ న్యాయ విద్యాలయం నుండి గౌరవ న్యాయవాద డిగ్రీ
  • సంఖ్యాశాస్త్రంపై నమ్మకం... జయలలితకు సంఖ్యాశాస్త్రంపై నమ్మకం ఎక్కువే. అందుకు తగ్గట్టుగా, ఆంగ్లంలో తన పేరుకు చివర మరో ‘ఎ’ను జోడించుకున్నారు. టైగర్లపై ఉక్కుపాదం... శ్రీలంకలో తమిళ ఈళం కోసం పోరాడుతున్న టైగర్లపై ఆమె మొదటి నుంచి కూడా ఉక్కుపాదం మోపారు. అందుకే టైగర్ల సానుభూతిపరులు జయలలితను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ప్రొఫైల్
    పేరు		: జె.జయలలిత
    అసలు పేరు	: కోమలవల్లి
    మారుపేరు	: అమ్మ, పురుచ్చితలైవి 
    పుట్టిన తేది	: 24 ఫిబ్రవరి 1948
    తల్లిదండ్రులు	: సంధ్య, జయరామ్‌
    పుట్టిన స్థలం	: మైసూరు  
    సామాజిక నేపథ్యం: తమిళ అయ్యంగార్‌
    చదువు		: మెట్రిక్యులేషన్‌ (బిషప్‌ కాటన్‌ గర్ల్స్‌ 
    		  హైస్కూల్‌, బెంగళూరు)
    నేర్చుకున్న నృత్యరీతులు: భరతనాట్యం, మోహిని అట్టం, 
    		  కథక్‌, మణిపురి
    చేపట్టదల్చిన వృత్తి: న్యాయవాది
    రాజకీయ పార్టీ : అన్నాడీఎంకే
    చేదు అనుభవం: అసెంబ్లీలో డీఎంకే సభ్యుల 
    		  దాడికి గురి కావడం
    పదవులు	: 24-06-91 నుంచి 12-05-96 వరకు, 
    		  14-05-2001 నుంచి 21-09-2001 
    		  వరకు,  2-3-2002 నుంచి 
    		  12-05-2006 వరకు ముఖ్యమంత్రిగా, 
    		  తిరిగి ప్రస్తుత ముఖ్యమంత్రి

Tuesday, July 19, 2011

వెలుగులోంచి చీకట్లోకి ......

జర్నలిజం పట్ల ఆమెకున్న మక్కువ అతి చిన్న వయస్సులోనే ఆమెను అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది. ఆ శిఖరాన తాను నిలబడి, తన పత్రికను నిలబెట్టడానికి ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పురుషాధిక్య ప్రపంచమైన జర్నలిజంలో ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా పరిస్థితులు చివరకు ఆమెను కూలబడేలా చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యూస్‌ ఇంటర్నేషనల్‌ ఫోన్‌ టాపింగ్‌ కేసులో అరెస్టు అయ్యి బెయిల్‌పై విడుదలైన రెబెకా మేరీ బ్రూక్స్‌ కథ ఇది...
Rebekah-Brooks 
మీడియా మొగల్‌ రూపర్ట్‌ మర్డాక్‌కు నలుగురు కుమార్తెలే అయినప్పటికీ బ్రూక్స్‌ అయిదవ కుమార్తెలా వ్యవహరించేది. ఆయనకు అత్యంత సన్నిహితురాలైన బ్రూక్స్‌ను ఆయన ఈ అప్రతిష్ట నుంచి కాపాడలేకపోయారు. మర్డాక్‌ సామ్రాజ్యంలో ఎదిగిన బ్రూక్స్‌ ను ఆయన నుంచి ఎవరూ విడదీయలేరని లండన్‌ పత్రికలు పేర్కొంటూ ఉంటాయి.

బ్రూక్స్‌ అసలు పేరు రెబెకా మేరీ వేడ్‌. లాంక్‌షైర్‌లోని వారింగ్టన్‌లో 1968, మే 27న జన్మించిన బ్రూక్స్‌ డేర్స్‌బరీలో పెరిగింది. పద్నాలుగేళ్ళ వయసులోనే తాను జర్నలిస్టు కావాలని నిర్ణయించుకున్న రెబెకా వారింగ్టన్‌లోని ఆపిల్‌టన్‌ హాల్‌ కౌంటీ గ్రామర్‌ స్కూల్లో చదువుకుంది. లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌లో చదువుకున్న బ్రూక్స్‌ తన ఇరవయ్యవ ఏట నుం చే న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌లో పని చేయడం ప్రారంభించింది. ఆమె జర్నలిజానికి చేసిన సేవలకు 2010వ సంవత్సరంలో బ్రూక్స్‌ లండన్‌లోని యూ నివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఆనరరీ ఫెలోషిప్‌ను ప్రకటించింది.

హైస్కూల్‌ చదువు పూర్తి చేసిన వెంటనే పారిస్‌లో ఆమె లా ఆర్కిటెక్చర్‌ డీ అజైర్డ్‌ అనే ఫ్రెంచ్‌ పత్రికలో పని చేసింది. అనంత రం ఎడ్డీ షాకు చెందిన మెస్సెంజర్‌ గ్రూప్‌లో పని చేసింది. తర్వాత న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ సండే పత్రికలో సెక్రెటరీగా 1989లో చేరి అనంతరం ఫీచర్‌ రైటర్‌గా ఎదిగింది. టివి సీరియళ్ళ నిపుణుడు క్రిస్‌ స్టేసీతో కలిసి ‘ఎ టు జెడ్‌ ఆఫ్‌ సోప్స్‌’ అనే శీర్షి కను సండేకు పత్రికకు అందించి, అంతిమంగా పేపర్‌కు డెప్యూటీ ఎడిటర్‌గా ఎదిగింది. దాదాపు పదేళ్ళ అనంతరం ఆమె సన్‌ పత్రికకు డి ప్యూటీ ఎడిటర్‌గా బదిలీ అయింది. ఈ సమయంలోనే ఆమె పేజ్‌ త్రీ గర్ల్స్‌ శీర్షికను ఆపించేందుకు ప్రయత్నించిందని ఆరోపణలున్నాయి. రెండేళ్ళ తర్వాత అంటే 2000వ సంవత్సరంలో ఆమె న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌కు ఎడిటర్‌గా నియమితురాలైంది. ఒక బ్రిటిష్‌ జాతీయ పత్రికకు అతిపిన్న వయస్సులోనే ఎడిటర్‌ అయిన గౌరవం ఆమెకు దక్కింది.

సారా పేన్‌ అనే ఎనిమిదేళ్ళ బాలిక హత్యానంతరం ‘నేమింగ్‌ అండ్‌ షేమిం గ్‌’ పేరుతో వివాదాస్పద ప్రచారానికి శ్రీకారం చు ట్టింది. ముఖ్యంగా పిల్లలపై అత్యాచారాలు చేసి శిక్షించబడ్డ వారిపై ఈ ప్రచారం నడిచింది. పత్రిక తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆగ్రహించిన ప్రజలు అనుమానించిన ప్రతివారిని తన్నేదాకా వెళ్ళడంతో దానిని ప్రారంభించినందుకు ఆమె ఎన్నో విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చిం ది. అయినప్పటికీ పత్రిక అమ్మకాలు ఆమె నేతృత్వంలో స్థిరంగా నిలబడ్డాయి. అయితే ప్రత్యర్ధి పేపర్లు ది పీపుల్‌, ది సండే మిర్రర్‌ అమ్మకాలు మాత్రం బాగా పడిపోయాయి.

rebekah 
అనంతరం 2003లో ఆమె సన్‌ పత్రిక తొలి మహిళా ఎడిటర్‌గా బాధ్యత లు స్వీకరించింది. ఈ సమయంలో ఆమె ప్రచురిం చిన కథనాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అదే సంవత్సరం హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సెలెక్ట్‌ కమిటీ వ్యక్తిగత విషయాలు, ప్రైవసీకి సంబంధించి చేసిన దర్యాప్తులో తన పత్రిక సమాచారం కోసం పోలీసు అధికారులకు లంచాలు ఇచ్చినట్టు బ్రూక్స్‌ పే ర్కొంది. ఇవే ప్రస్తుత ఆరోపణలకు ఊతమయ్యాయి.
ఆమె ఆర్గనైజేషన్‌ వుమెన్‌ ఇన్‌ జర్నలిజంకు చైర్‌ పర్సన్‌గా, గార్డియన్‌ స్టూడెంట్‌ మీడియా అవార్డులకు జడ్జిగా వ్యవహరించింది. 2009లో ఆమె న్యూస్‌ ఇంటర్నేషనల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమితురాలైంది.
2002వ సంవత్సరంలో నటుడు రాస్‌ కెంప్‌ను వివాహం చేసుకున్న బ్రూక్స్‌ 2009లో అతడి నుంచి విడాకులు పొంది రేస్‌ హార్స్‌ ట్రైనర్‌, రచయిత అయిన ఛార్లీ బ్రూక్స్‌ను వివాహం చేసుకున్నది.

ఫోన్‌ హాకింగ్‌ స్కాండల్‌:

న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికకు సెలబ్రిటీల మొబైల్‌ ఫోన్లకు వచ్చే మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ను వినే అలవాటు ఉన్నట్టు పోలీసు దర్యాప్తులో తేలడంతో వివాదం మొదలైంది. పత్రిక రిపోర్టర్‌ క్లైవ్‌ గుడ్‌మన్‌తో పాటు మరొకరిని 2006లో రాచకుటుంబ సభ్యులకు వచ్చిన ఫోన్‌ మెసేజ్‌లను ఇంటర్సెప్ట్‌ చేసినందుకు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పటి నుంచీ వివాదం నలుగుతున్నప్పటికీ 2011లో అది బద్దలైంది. గార్డియన్‌ పత్రిక ఫోన్‌ హ్యాకింగ్‌ ఉదంతాలపై ప్రత్యేక కథనాలు ప్రచురించింది.

ముఖ్యంగా 2002లో బ్రూక్స్‌ పత్రిక ఎడిటర్‌గా ఉండగా కనిపించకుండా పోయి, హత్యకు గురైన మిల్లీ డౌలర్‌ అనే విద్యార్ధిని కి ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన మెసేజ్‌లను యాక్సెస్‌ చేసినట్టు గార్డియన్‌ తన కథనంలో ఆరోపణలు చేసింది. వస్తున్న మెసేజ్‌లతో ఫోన్‌ ఇన్‌బాక్స్‌ నిండిపోవడంతో కొన్నింటిని డిలీట్‌ చేసి కొత్తవాటిని విన్నారని, మెసేజ్‌లు డిలీట్‌ కావడంతో మిల్లీ తల్లిదండ్రులు ఆమె సజీవంగా ఉందని భావించారని తన కథనంలో పత్రిక పే ర్కొంది. ఈ ఉదంతంపై బ్రూక్స్‌ తాజాగా మిల్లీ తల్లిదండ్రులకు క్షమాపణ లు చెప్పుకుంది. అయినప్పటికీ ఇవేవీ ఆమెను కాపాడలేకపోయాయి.

బ్రూక్స్‌కు ఉన్న స్నేహాలు సాధారణమైనవి కావు. ఆమె టోనీ, షెరీ బ్లెయిర్‌లకే కాదు ప్రస్తుత గార్డన్‌ బ్రౌన్‌కు, డేవిడ్‌ కామరూన్‌కు స్నేహితురాలు. ఆమె నివాసం ప్రస్తుత ప్రధాని కామరూన్‌ ఇంటికి సమీపంలోనే కావడంతో ఆమె ఆయన కుటుంబంతో మరింత స్నేహంగా ఉంటుంది. రాజకీయ నాయకులతో ఆమె సాన్నిహిత్యం అనేక విమర్శలకు తావిచ్చింది. న్యూస్‌ ఇంటర్నేషనల్‌ ఫోన్‌ హ్యాకింగ్‌ వివాదం చిలికి చిలికి గాలి వాన కావడంతో ఆమె జులై 15వ తేదీన తన పదవికి రాజీనామా చేసింది. న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికకు ఆమె ఎడిటర్‌గా ఉన్న సందర్భంలోనే ఈ హ్యాకింగ్‌ జరిగినట్టు వార్తలు రావడం, అందులో ఆమె పాత్రపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె ఆ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. బ్రూక్స్‌ ఉదంతం పాశ్చా త్య ప్రెస్‌లో సంచలనాన్ని రేపటమే కాదు జర్నలిజంలో నైతిక విలువల గు రించిన బ్లాగుల్లో చర్చలకు శ్రీకారం చుట్టింది. సమాజానికి నాలుగవ స్తం భమైన ప్రెస్‌ బాధ్యతలేమిటో గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.

Monday, July 18, 2011

Eagle Story - Why is Change Required

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World InformativesEagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Eagle Story - Why is Change Required - Phani Kiran: World Informatives

Thank You !
 
Received this from Mr.Subrahmanyam, Hyderabad

Sunday, July 10, 2011

నిత్య 'అనుమాన్'

ఆయన పేరు బ్రహ్మానందం. యాభయ్యారేళ్లు. రెవెన్యూలో మంచి ఉద్యోగం. రిటైరయ్యే టైము కూడా దగ్గర పడుతోంది. ఉన్నట్టుండి ఒక రోజున గప్‌చుప్‌గా హైదరాబాదొచ్చి 'హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్' చేయించుకున్నాడు. కుర్రాడిలా తయారయ్యాడు. అంతే!
వాళ్ళావిడ బిత్తరపోయింది. 'ఈ వయస్సులో నీకు ఇదేం పోయే కాలం' అంటూ విరుచుకుపడిపోయింది. అనుమానంతో ఎగాదిగా చూడడం మొదలెట్టింది. ఏదో దుర్బుద్ధి లేకపోతే, ఇప్పుడు నెత్తిమీద జుట్టుతో నీకు పనేంటంటూ సాధింపు మొదలెట్టింది.
'లేదే బాబూ! మరీ రోశయ్యగారి లాగా ఉంటే, ఆఫీసులో బాగుండడం లేదం'టూ నెత్తీనోరూ కొట్టుకున్నా, వాళ్ళావిడ ఒక పట్టాన నమ్మలేదు. ఆరు నెలలు బ్రహ్మానందం మీద నిఘా పెట్టింది. అందులోంచి బయటపడడానికి చచ్చేంత పనయింది ఆయనకు. అనుమానానికి అంత పవరుంది.


మనం నిద్ర లేచింది మొదలు, తిరిగి మంచం మీదకు చేరే దాకా బతుకంతా అనుమానాలే. మనతో పాటే అనుమానం కూడా నిద్రలేస్తుంది కాబోలు. అది ఎలా...ఎందుకు పుడుతుందో కనిపెట్టిన వాడు ఇంతవరకు లేడు. కొన్ని అనుమానాలకు మన 'ఇగో' కారణమైతే కొన్ని మన జీవితానుభవంలో నుంచి పుట్టుకు వస్తాయి. మరి కొన్నిటికి మనం జీవించే పరిస్థితులు, పరిసరాలు కారణమవుతాయి. 'ప్రేమ'లాగే అనుమానానికి కూడా కారణం-నివారణ ఉండవు. పాలప్యాకెట్లు వేసేవాడు రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే మనకు డౌటు వచ్చేస్తుంది. 'వస్తాడో... రాడో? ఏ యాక్సిడెంటన్నా అయిందేమో... పాల ప్యాకెట్లలో నుంచి ఇంజెక్షన్‌తో పాలు లాగేసి నీళ్లెక్కిస్తున్నారని మొన్న పేపర్లో రాశారు. మన వెధవాయి కూడా ఆ పని చేస్తున్నాడేమో... అందుకే లేటయిందేమో..' ఇలాంటి ఆలోచనలెన్నో వచ్చేస్తాయి. పేపర్‌బాయ్ రావడం ఆలస్యమైనా అంతే. 'వాడు పేపర్ వేసి వెళ్లాక ఎదురు ఫ్లాట్‌లో వాళ్లు తీసుకున్నారో యేమో' లాంటి అనుమానాలన్నీ మన మనసుల్లో అప్పటికప్పుడే పుడతాయి.

స్కూలుకని వెళ్లిన పిల్లాడు స్కూలుకు వెళ్లాడోలేదో అని తల్లికి అనుమానం. సరుకుల కోసం బజారుకెడితే తూకంలో టోపీ వేస్తాడేమోనన్న అనుమానం. స్నానానికి వెళితే ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొడతారేమోనన్న అనుమానం. పక్కింటి పాపాయమ్మ వచ్చి మంచిగా మాట్లాడుతుంటే అప్పు అడుగుతుందేమోనన్న అనుమానం.

కూతురైనా..కొడుకైనా

కాలేజీకెళ్లే కూతురి సెల్‌ఫోన్ మోగిందంటే చాలుఅమ్మకి, నాన్నకి, అన్నకి, తమ్ముడికి.. అందరికీ అనుమానమే. ఆ అమ్మాయి కాని ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుకుంటూ వరండాలోకి అలా నడిచి వెళ్తేనో.. లేదా కొత్త నెంబర్‌నుంచి ఫోన్ వస్తేనో.. మరీ అనుమానం. 'వీడేంటి.. ఇంకా లేవలేదు. ఆఫీసు ఐదింటికే అయిపోతుందిగదా! రాత్రి ఒంటిగంటదాకా ఏం చేస్తున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు..' అని ప్రతి కొడుకు మీద తండ్రులకుచచ్చేంత అనుమానం. కరెక్టో కాదో తేల్చుకోవడం ఎలా... పాపం అనవసరంగా అనుమానపడుతున్నామేమో... మళ్లీ ఇదో అనుమానం.

అక్కడికీ తోడొస్తుంది

ఆఫీసుకి బయలుదేరితే... మనతో పాటే అనుమానమూ బయలుదేరుతుంది. 'ఆఫీసరు ఏం వేధిస్తాడో... ఏం పాడో... మాటమాటకూ బెల్లుకొట్టి పిలుస్తుంటాడు. ఆ ఫైలు అలా ఉందేమిటి? నీ ఇంగ్లీషు ఇలా ఉందేమిటి అంటుంటాడు. పిలిచినప్పుడల్లా మొహం అదోలా పెట్టి మాట్లాడుతుంటాడు. అసలు కారణం వేరే ఏదైనా ఉందా..' అని దిగువ ఉద్యోగుల అనుమానం. స్టాఫ్ సరిగ్గా పని చేస్తున్నారో లేదో, కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారేమోనని బాస్‌కి అనుమానం.

సిటీబస్సెక్కిన దగ్గర్నించి కిచెన్‌లో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశామో లేదో, ఇంటి తాళం సరిగ్గా వేశామో లేదో... అని ఇల్లాళ్లకు అనుమానం. బస్కెక్కి టిక్కెట్ తీసుకోవడానికి వంద కాయితమో... యాభై కాయితమో ఇస్తాం. కండక్టరు వెంటనే చిల్లరివ్వడు. టిక్కెట్టుకు వెనక పక్క కెలుకుతాడు. దిగేటప్పుడు మర్చిపోతామేమోనన్న అనుమానం. వెంటనే చిల్లరివ్వకుండా వెనక రాయడంలో కండక్టరుద్దేశం కూడా అదేనేమోనన్నది మరో డౌటు.
ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు డబ్బులు అవసరమై ఏటీఎంకి వెళ్లి డ్రా చేస్తుంటే.. వెనక నిల్చున్నాయన పిన్ నెంబర్ చూస్తున్నాడేమోనన్న అనుమానం. డబ్బులు డ్రా చేసి లెక్కపెట్టుకునేటప్పుడు ఎవరైన్నా వచ్చి లాక్కెళ్తారేమోనని మరో అనుమానం. జేబులో డబ్బుంటే చుట్టూ ఉన్నవాళ్లందరి మీద ప్రతిక్షణం అనుమానమే.

అనుమానపు ఉద్యోగాలు


కొన్ని ఉద్యోగాలైతే అసలు అనుమానం మీదే నడుస్తాయి. ఈ ఉద్యోగులకు అనుమానాలు రాకపోతే వాళ్లకు ఉద్యోగం చేయడం రానట్టే. మాట వరుసకు పోలీసున్నాడు. ఎవరు చెప్పేదాన్నయినా ఒక పట్టాన నమ్మడు. అనుమానంతో పై నుంచి కింది దాకా చూస్తాడు. ఎక్కడలేని ప్రశ్నలూ వేస్తాడు. వాటికి సమాధానాలు చెప్పేసరికి తల ప్రాణం తోకలోకి వస్తుంది. ఈలోగా మనం చెప్పేది ఆ పోలీసు నమ్ముతున్నాడో లేదోనన్న అనుమానంతో మనం చస్తుంటాం.

షాపింగ్‌మాల్లో అయినా, సినిమాహాల్ వద్దయినా.. ఎక్కడకెళ్లినా సెక్యూరిటీ అనుమానపు కళ్లు మన మీద పడకుండా ఉండవు. చివరికి మనం పనిచేసే ఆఫీసు మెట్లవద్ద మనకి సుపరిచితులైన సెక్యూరిటీ వాళ్లు కూడా మనల్ని అనుమానంగానే చూస్తారు. అవసరమనుకుంటే తనిఖీలు కూడా చేసేస్తారు. ఇకనల్ల కోటేసుకుని తీర్పులు చెప్పేవారి పరిస్థితి మరీ అన్యాయం. ఎవరు ఏది చెప్పినా వినాలి. కాని చెప్పిందంతా గుడ్డిగా నమ్మేయడానికి లేదు. నిజం తెలుసుకోవడం వారికి పాలల్లోంచి నీటిని విడదీసినంత కష్టం. ఇలాంటి 'అనుమానపు ఉద్యోగాలు' చేసే వాళ్లెందరో.

మొగుడు పెళ్లాల మధ్య అనుమానాల గురించి చెప్పాల్సి వస్తే రామాయణం కంటే పెద్ద గ్రంథమవుతుంది. రామాయణం అంటే గూర్తొచ్చింది అందులోని మెయిన్ పాయింటు అదే కదా. లేకపోతే సీత ఎందుకు అగ్ని ప్రవేశం చేయాల్సి వస్తుంది?
ఏ ఇంట్లోనూ మొగుడు పెళ్ళాన్ని నమ్మడు. తనాఫీసుకు వెళ్లిపోయాక ఆవిడ సినిమాకు చెక్కేస్తుందేమోనని డౌటు. బజారుకు వెళ్లి అక్కరలేనివన్నీ కొనేస్తుందని మరో డౌటు. అమ్మగారింటికి వెళ్లి తన మీద అయినవీ కానివీ చెప్పేస్తుందని ఇంకో డౌటు. అలాగే పెళ్ళామూ మొగుడ్ని నమ్మదు. ఆయన ఆఫీసునుంచి ఇంటికి రావడం కాస్త లేటయితే చాలు.. ఏ అమ్మడితో ఎక్కడ కాలక్షేపం చేస్తున్నాడో.. ఏ బారులో కూర్చుని మందులో మునిగిపోతున్నాడో లాంటి సవాలక్ష అనుమానాలు భార్యను నిత్యం కాలుస్తూనే ఉంటాయి.

అనుమానపు బతుకులు

ప్రతిరోజూ రోడ్డుమీద రకరకాల మనుషులు తారసపడుతుంటారు. ఎవరిలో ఏ దొంగ దాగున్నాడో, ఎక్కడొచ్చి బ్యాగో, సెల్‌ఫోనో లాక్కొని చెక్కేస్తాడో అని అనుమానం. ఎదుటి వ్యక్తి మనవైపు నవ్వుతూ చూసినా 'అదోలా చూస్తున్నాడేంటి?' అని అనుమానం. ఎలాగో పనులు ముగించుకుని కొంపకు చేరితే, 'హమ్మయ్య! ఇవాల్టికి బతికాం...' అంటూ ఓ నిట్టూర్పు విడిచి రాత్రికి కరెంటు ఉంటుందో... పోతుందోనన్న అనుమానంతో నిద్రలోకి జారుకుంటాం.

యజమానులు పనివాళ్ళను నమ్మరు.. ఎంత నమ్మకంగా పనిచేసినా సరే ఎప్పుడేది పట్టుకుపోతారేమోననుకుంటూ డౌటు పడుతూనే ఉంటారు. ఇంట్లో ఏ వస్తువు కనిపించకపోయినా యజమానుల కళ్లు ఆనుమానంగా పనమ్మాయి వైపే చూస్తాయి. నేను దొంగతనం చేయలేదు దేవుడో అని ఎంత వేడుకున్నా వారిమీద అనుమానం పోదు. అదేదో అనుమానించడం యజమానుల హక్కు అయినట్టు, వాటిని తట్టుకోవడం పనోళ్ల వృత్తిధర్మమైనట్టు ఉంటుంది.

విదేశీసంబంధాలు.. వింత అనుమానాలు

ఇక పెళ్లి సంబంధాల విషయంలో అయితే ఈ అనుమానాల పాత్ర అంతా ఇంతా కాదు. పెళ్ళిళ్ళ పేరయ్యలు చెప్పే వాటిని అటువారు గాని, ఇటువారు గాని ఒక పట్టాన నమ్మరు. అబ్బాయో... అమ్మాయో... అమెరికాలోనో, ఇంగ్లాండ్‌లోనో సలక్షణంగా ఉద్యోగం చేసుకుంటున్నారు అని చెపితే నమ్మరే! 'అమెరాకా వెళ్లినవారు ఖాళీగా ఎందుకుంటారు? ఈ పాటికి దుకాణం తెరిచే ఉంటారు. చూస్తూ చూస్తూ వాళ్లతో ఎక్కడ వేగుతాం..?' ఈ అనుమానాలు ఒక్కొక్కసారి నిజమూ కావచ్చు. ఒక్కొక్కసారి ఉత్తివే కావచ్చు. 'అనవసరంగా అనుమానపడి మంచి సంబంధం వదులుకున్నాం' అంటూ నాలుక్కొరుక్కున్న వారు బోలెడంతమంది, 'మన అనుమానం నిజమైందిరా బాబూ బతికిపోయాం' అంటూ ఊపిరి పీల్చుకున్న వారు కూడా బోలెడంత మంది.

డాక్టర్ మీదా డౌటే

ఇలా చిన్న చిన్న విషయాలకే కాదు. ప్రాణం మీదకు వచ్చే సందర్భాలలో కూడా 'అనుమానాల'దే ప్రధానపాత్ర. ఒంట్లో బావుండకపోతే, ఆస్పత్రికి వెడదామనుకుంటే డాక్టరు 'మనోడే'నా అని అనుమానం. 'మనోడు' కాకపోతే సరిగ్గా చూడడేమోనని డౌటు. డబ్బులు గుంజడానికి అనవసరమైన పరీక్షలన్నీ రాస్తాడేమోనన్న అనుమానం. రోగం నయం కాకపోతే ఆ డాక్టరు అసలు డాక్టరు చదువు చదివాడో లేడోనని మరోసారి అనుమానం.

అనుమానం నిజమైనపుడు.. దొరికిపోయిన దొంగ ప్రవర్తన కూడా హాస్యాస్పదమవుతుంది. ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన అప్పారావు కూడా, ప్రతి పైసాకు లెక్కలున్నాయని, వాళ్ళావిడకు పుట్టింటోళ్ళు ఇచ్చినదే ఆ సొమ్మంతా అని బుకాయించడం చూస్తే నవ్వొస్తుంది. రాజకీయాల్లో అయితే ఈ అనుమానపు హాస్యానికి అంతూ పొంతూ ఉండదు. ఏ ఒక్క నాయకుడు చెప్పేదానినీ మరో నాయకుడు చచ్చినా నమ్మడు. స్వంత పార్టీ నాయకులు అసలు నమ్మరు. దాంతో, ఒకరిపై ఒకరు ప్రకటనలు. ఫలితంగా చదవడానికే చిరాకేసేంత మీడియా కాలుష్యం. చివరికి అందరూ ఒకటేనన్న తత్వం బోధపడుతుంది.

అనుమానపు రాజకీయాలు

రాజకీయాల్లో అనుమానానికి ఉన్నంత ప్రాధాన్యత మరి దేనికీ లేదేమోననిపిస్తుంది. మాటవరసకు, కె.వి.పి.రామచంద్రరావు ఇప్పటికీ వెనకనుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారేమోనని గాలి ముద్దుకృష్ణమనాయుడికి చచ్చేంత అనుమానం. బొత్స సత్యనారాయణ ఎటునుంచి నరుక్కొస్తునారోనని సి.ఎం. గారికి వీరడౌటు. ఇప్పుడే ఫ్రిజ్‌లోనుంచి తీసిన ఐస్‌క్రీమ్ లాగా నిగనిగలాడిపోతున్న జగన్ వెంట కమ్యూనిస్టులు వెళ్లిపోతారేమోనని తెలుగుదేశం వారికి డౌటు. కుర్రాడు కత్తి, చాకు, సెవన్-ఒ-క్లాక్ బ్లేడులాగున్నాడని సురవరం సుధాకరరెడ్డి, రాఘవులు స్టేట్‌మెంట్లివ్వడం ఇందుకు కారణమట. ఇక మిగిలినవన్నీ మన అనుమానాలే.
***
ఇలా బతుకంతా అనుమానాల పుట్టే. మరి అనుమానాలు లేకుండా బతకలేమా? తెలియదు. అదీ డౌటే. అనుమానాలతో బతికేదెట్టా? తెలియదు. అదీ డౌటే. ఒక్క విషయంలో మాత్రం డౌటక్కర లేదు. అనుమానం అన్నదానికి వాస్తవంతో పని లేదు. మనకు తారసపడ్డ ప్రతి మనిషినీ, ఎదుటివారు చెప్పే ప్రతి విషయాన్నీ, ప్రతి సంఘటననూ అనుమానించకపోవచ్చు కాని రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎక్కువే. చాలా సందర్భాలలో మనవి ఉత్త అనుమానాలేనని తేలిపోతుంది. పాలవాడు పాలల్లో నీళ్ళు కలపకపోవచ్చు. కూరగాయలు అమ్మేవాడి తూకం నిఖార్సుగా ఉండవచ్చు. బస్సులో కండక్టరు మనం దిగేలోపే, మనకు రావలసిన చిల్లర డబ్బులు ఇచ్చేయవచ్చు. ఇంట్లో పనిమనిషి ఏ దొంగతనమూ చేయకపోవచ్చు. డాక్టరు సరైన ట్రీట్‌మెంటే ఇచ్చి ఉండవచ్చు. ఆఫీసుల్లో బాసులు మన మేలు కోరే తిడుతుండవచ్చు. కాని అనుమానం అనుమానమే. మనల్ని స్థిమితంగా ఉండనివ్వదు. లోలోపల పీకేస్తుంటుంది. లోపల దాచుకోలేం. బయటపడి అడగలేం. అడిగితే ఏమనుకుంటారోనన్న డౌటు. 'మర్యాద'లు అడ్డొస్తాయి. అడక్కపోతే దెబ్బయి పోతాయేమోనన్న బెంగ.

ఏ విషయంలోనైనా అనుమానం మొదలైతే చాలు, మన చూపులో తేడా వస్తుంది. మాటతీరులో తేడా వస్తుంది. వ్యవహారశైలి మారిపోతుంది. ఇదంతా మొహంలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. అది చూసి మనం ఎందుకు ఇంతగా ఇదైపోతున్నామోనని ఎదుటివారు అనుమాన పడుతుంటారు. ఈ విషయాన్ని మనమూ ప్రస్తావించం. ఎదుటివారూ ప్రస్తావించరు. అంతా సైలెంట్‌గానే జరిగిపోతుంటుంది.

ఎందుకింత అనుమానం...?
నిత్య జీవనంలో 'అనుమానం' అనేది ఇంతగా తొంగి చూడడానికి బోలెడన్ని కారణాలు. జనాభా పెరిగిపోయింది. జీవనంలో వేగం పెరిగిపోయింది. ఎలాగోలా బతకాలి. బతుకే ఒక పోరాటమైపోయింది. ఆస్తులు, హోదాలతో సంబంధం లేకుండా అందరిదీ బతుకు పోరాటమే. మరో మార్గం లేదు. పైగా పుట్టిన చోట బతకడం లేదు మనమెవ్వరమూ. అంటే చిన్నప్పటినుంచి తెలిసినవాళ్ల మధ్య బతకడం లేదు. జీవితం ఎక్కడికి తీసికెళితే అక్కడికి వెళుతుంటాం. అంటే మనవాళ్లు, మన సంస్కృతి, మన భాష కనబడని, వినబడని చోట బతకాల్సొస్తుంటుంది చాలాసార్లు. ఈ పరాయితనం వల్ల కూడా అనుమానం పెనుభూతంలా మనను వెంటాడుతుంటుంది. సమాజంలో నిజాయితీ తగ్గడంతో వాతావరణ కాలుష్యం లాగానే మానసిక కాలుష్యం ఎక్కువైపోయింది. అందువల్లనే కావచ్చు, ఎదుటివారి చూపులో... మాటలో... ఆలోచనలో... నడకలో ప్రతిదీ అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. ఎవరి మీదా మనకి ఒక పట్టాన నమ్మకం కుదరదు. వారు చెప్పే మాటల్ని నమ్మబుద్ధి కాదు.

రాజుగారి పాల బిందెలో ఎవరికి వారు చెంబుడు నీళ్ళు పోసినట్టయిపోయింది జీవితం. పేపర్లు తిరగేస్తుంటే, సగం వార్తలు ఈ అనుమానం మీద జరిగిన సంఘటనలే తారసపడుతుంటాయి. అనుమానంతో పెళ్ళాన్ని చంపేసిన ప్రబుద్ధుడో... ప్రియురాలి మీద దాడి చేసిన ప్రేమికుడో... పిల్లల్ని చంపేసిన తండ్రో... పౌరుడ్ని చంపేసిన పోలీసో మనకు దర్శనం ఇస్తుంటారు.
మనిషికీ... మనిషికీ మధ్య సంబంధాలు ఇంతగా క్షీణించడానికి ఈ అపనమ్మకమే ప్రధాన కారణం అని కూడా అంటుంటారు. అభద్రతా భావం కూడా ఒక కారణమే.

అంత అనుమానం అవసరమా..?

'అనుమానం' తెచ్చే చిరాకులెన్ని ఉన్నా, దాన్ని అంత సీరియస్‌గా తీసుకోకుండా ఉంటేనే మేలు అంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఎందుకంటే, అనుమానంతో పొద్దున్నే పాలవాడితో తగాదాపడితే నష్టం ఎవరికి? కూరగాయల కొట్టోడితో యుద్ధం చేస్తే ఇబ్బంది పడేది ఎవరు? బస్సులో కండక్టరును అనుమానిస్తే రెండు కాళ్ల నడకే. అనుమానాలతో మనుషుల్ని దూరం చేసుకోవడం తగదు. కాబట్టి షుగర్ వ్యాధిలాగా అనుమానాల్ని కూడా అదుపులో... పరిమితుల్లో ఉంచుకోవడం మనకీ, ఎదుటివారికి కూడా క్షేమం. ప్రతిదానినీ, ప్రతివారినీ అనుమానిస్తూ క్షణక్షణానికీ జుట్టు పీక్కుంటూ బతికే కంటే, చిన్న చిన్న విషయాలలో మోసాలకు గురైనా నష్టముండదు అనుకుని బతికేయండి. 

* ఇంతకీ వీడు ఇదంతా ఎందుకు రాశాడే అనుమానం రాకపోతే మీరు మనిషి కానట్టే. 
*  మీకేమైనా డౌటా?!

- భోగాది వెంకటరాయుడు
99495 47374

Wednesday, July 6, 2011

ప్రముఖ వ్యక్తుల గొప్ప పోలికలు

ప్రపంచంలో భౌతికంగా ఒకే రకంగా ఉండే వ్యక్తులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఆ విషయం ఏమో కానీ తాము ఎంచుకున్న రంగంలో ఒకే విధంగా పాపులారిటీ సంపాదించిన వ్యక్తులు ప్రపంచంలో అనేకమంది కనిపిస్తుంటారు. ఈ ప్రముఖ వ్యక్తులు సముద్రాలు దాటి వేర్వేరు దేశాల్లో జన్మించినా తమ, తమ రంగాలలో ఒకే విధంగా రాణిస్తూ ప్రజలను ప్రభావితులను చేశారు, చేస్తున్నారు. వారు రాణించిన తీరు, జీవనశైలి, ఆలోచనలు కూడా ఒకే రకంగా ఉండడం విశేషం. ఇటువంటి కొందరు ప్రముఖులు, సెలబ్రిటీల గురించి ...

డాన్‌ బ్రాడ్‌మన్‌ - సచిన్‌ టెండూల్కర్‌
sachinఆసీస్‌ క్రికెట్‌ లెజెండ్‌గా పేరుగాంచిన డాన్‌ బ్రాడ్‌మన్‌ను, నేటి కాలంలో మాస్టర్‌ బ్లాస్టర్‌గా పేరుతెచ్చుకున్న సచిన్‌ టెం డూల్కర్‌ను క్రికెట్‌ చరిత్రలోనే బ్యాటింగ్‌ దిగ్గజాలుగా పేర్కొంటారు. సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ తన కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌గా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు. ఆయన 1920 దశకం చివరి కాలం నుంచి 1940 చివరి కాలం వరకు క్రికెట్‌లో బ్యాటింగ్‌ దిగ్గజంగా ప్రఖ్యాతిగాంచారు. ఆ కాలంలో ఆయన బాడీలైన్‌ బౌలింగ్‌ను గట్టిగా ఎదుర్కొన్న బ్యాటింగ్‌ లెజెండ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఆయన టెస్ట్‌ క్రికెట్‌ కెరీర్‌ను 99.94 సగటుతో పూర్తిచేయడం ఆయన ఎంత గొప్ప బ్యాట్స్‌మనో తెలియజేస్తుంది. ఇక మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ 16 సంవత్సరాల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన ఇక వెనక్కి చూసుకోకుండా బ్యాటింగ్‌ దిగ్గజంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. డాన్‌ బ్రాడ్‌మన్‌ తన 90వ జన్మదిన వేడుకలకు ఆహ్వానించిన ఇద్దరు క్రికెటర్లలో సచిన్‌ టెండూల్కర్‌ ఒకరు కావడం విశేషం. సచిన్‌ సైతం తనలాగే బ్యాటింగ్‌ చేస్తాడని డాన్‌ బ్రాడ్‌మన్‌ కొనియాడారు. ఓ రోజు బ్రాడ్‌మన్‌ టివిలో సచిన్‌ బ్యాటింగ్‌ను చూస్తూ తన భార్యని పిలిచి ‘సచిన్‌ను చూడు...అతను బ్యాటింగ్‌ చేసే విధానం, స్ట్రోక్‌ ప్లే, టెక్నిక్‌, డిఫెన్స్‌ ఇవన్నీ నేను ఆడినట్లే ఉన్నాయి. ఈ వయసులో నేను ఆడలేను కానీ...నా శైలిలో ఆడే సచిన్‌ బ్యాటింగ్‌ను చూస్తే నేను ఆడినట్లే అని పిస్తోంది’ అని సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపించారుట.

షేక్స్‌పియర్‌ - కాళిదాసు
kalidasuప్రపంచప్రఖ్యాతిగాంచిన ఇంగ్లీష్‌ కవిగా షేక్స్‌పియర్‌ పేరుగాంచితే కవిరత్న కాళిదాసు సంస్కృత కవిగా ప్రఖ్యాతిగాంచారు. కాళిదాసు చక్రవర్తి విక్రమాదిత్యుని కొలువులోని తొమ్మిదిమంది రత్నాల్లాంటి కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వసీయమ్‌ వంటి నాటకాలు, రఘువం శం, కుమార సంభవం, మేఘదూత వంటి కవితలతో సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. షేక్స్‌పియర్‌ హామ్లెట్‌, ద మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌, రోమియో అండ్‌ జూలియట్‌, ఒథెల్లొ, కింగ్‌ లియర్‌ వంటి నాటకాలు వీనస్‌ అండ్‌ అడోనిస్‌, ద రేప్‌ ఆఫ్‌ ల్యుక్రీస్‌ వంటి కవితలతో గొప్ప కవిగా పేరుతెచ్చుకున్నారు.

మైకేల్‌ జాక్సన్‌ - ప్రభుదేవా
prabhudevaదక్షిణాది సినిమాల డ్యాన్సింగ్‌ స్టార్‌ ప్రభుదేవాకు పాప్‌కింగ్‌ మైకేల్‌ జాక్సన్‌కు మధ్య ఓ పోలిక ఉంది. ఈ ఇద్దరు డ్యాన్స్‌ చేసే స్టైల్‌ ఒకే విధంగా ఉండడం విశేషం. ప్రభుదేవాని ఇండియన్‌ మైకెల్‌ జాక్సన్‌ అంటారు అభిమానులు.

మార్లిన్‌ మన్రో-మధుబాల

madubalaఒకప్పుడు హాలీవుడ్‌ను ఏలిన మహారాణిగా, అందాలతారగా మార్లిన్‌ మన్రో ఎంతో ప్రఖ్యాతిగాంచారు. ఆమె తన అందచందాలు, గ్లామర్‌, నటనతో పలు హిట్‌ సినిమాల్లో ప్రేక్షకులను మైమరపించారు. ఇక మన దేశానికి చెందిన అందాలరాశి, సినీతార మధుబాల సైతం నాడు పలు సక్సెస్‌ సినిమాలో చక్కగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. వీరిద్దరూ నాడు సినీ రంగాల్లో అగ్రతారలుగా రాణించి అపురూప సౌందర్యరాశులుగా పేరు తెచ్చుకున్నారు. మార్లిన్‌ మన్రో వీనస్‌ ఆఫ్‌ హాలీవుడ్‌గా పేరు గాంచితే మధుబాల వీనస్‌ ఆఫ్‌ బాలీవుడ్‌గా ప్రఖ్యాతిగాంచారు. మార్లిన్‌ మృతి నేటికీ మిస్టరీగా మిగిలిపోతే మధుబాల గుండెకు సంబంధించిన వ్యాధితో మరణించారు. వీరు చనిపోయి దశాబ్దాలు గడిచినా నేటికీ ఈ అందాలతారలను ప్రేక్షకులు గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

ఓర్సన్‌ వెల్స్‌ - గురుదత్‌
gurudathఅమెరికాకు చెందిన లెజండరీ సినిమా డైరెక్టర్‌, స్క్రిప్ట్‌ రైటర్‌, యాక్టర్‌, ప్రొడ్యూసర్‌ ఓర్సన్‌ వెల్స్‌. ఆయన రూపొందించిన పోర్ట్రయల్‌ ఆఫ్‌ సిటిజన్‌ కేన్‌ అంతర్జాతీయంగా ఎంతో పేరుతెచ్చుకుంది. ఆయన సినిమాలు ఒక్కోటి ఓ దృశ్య కావ్యంగా పేరుగాంచాయి. వెల్స్‌ మాదిరిగా గురుదత్‌ కూడా గొప్ప డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌, యాక్టర్‌గా పాపులారిటీ సంపాదించారు. ఆయన తీసిన ప్యాసా, కాగజ్‌ కే ఫూల్‌ వంటి సినిమాలు ఇప్పటి వరకు రూపొందించిన 100 బెస్ట్‌ ఫిల్మ్‌‌సలో ఒకటిగా పేరుతెచ్చుకున్నాయి. వీరిద్దరి జీవితాలు విషాదాంతంగా ముగిసాయి.

జాకీ కాలిన్స్‌ - శోభా డే
shobaసాహితీ ప్రపంచంలో తిరుగులేని రచయిత్రులుగా వెలుగొందుతున్నవారు జాకీ కొలిన్స్‌, శోభా డే. వారి నవలలు పాఠకుల విశేష ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. కేవలం రచయిత్రిగానే కాకుండా కాలమిస్ట్‌గా, సోషలైట్‌గా, డిజైనర్‌గా సైతం శోభాడే పేరుతెచ్చుకున్నారు. ఈ ప్రఖ్యాత రచయిత్రిని టైమ్‌ మ్యాగజైన్‌ ‘జాకీ కాలిన్స్‌ ఆఫ్‌ ఇండియా’కు కీర్తించింది.

పాబ్లొ పికాసో - ఎం.ఎఫ్‌.హుస్సేన్‌
m.s-hussenమన దేశానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ను ఫోర్బ్‌‌స మ్యాగజైన్‌ నాటి పాపులర్‌ ఆర్టిస్ట్‌ పబ్లొ పికాసోతో సరిపోల్చింది. వీరి పెయింటింగ్స్‌లో కొన్ని ఒకే శైలిలో రూపుదిద్దుకున్నాయి.ఎం.ఎఫ్‌.హు స్సేన్‌ మహాభారత సీరిస్‌లో భాగంగా గీసిన ‘దుర్యోధ న-అర్జున స్ల్పిట్‌’ పెయింటింగ్‌ పికాసో ‘గ్యుర్నికా’ పెయింటింగ్‌ ఒకే శైలిలో రూపుదిద్దుకున్నాయని ఆర్ట్‌ లవర్స్‌ పేర్కొంటారు.

షేక్‌ సౌద్‌ బిన్‌ అల్‌ థాని - మహరాజా యశ్వంత్‌ రావు హోల్కర్‌ 2
Sheikh-Saoud-binషేక్‌ సౌదా బిన్‌ అల్‌ థాని ఓ అరబ్‌ షేక్‌. మహరాజా యశ్వంత్‌ రావు హోల్కర్‌ 2 మన దేశంలోని ఓ రాజ్యా న్ని పరిపాలించి చాలా సంవత్సరాల క్రితం మరణించిన రాజు. కానీ వీరిద్దరి మధ్య ముఖ కవళికలు, పోలి కలు ఒకే విధంగా ఉంటాయి. ప్రస్తుతం జీవించి ఉన్న షేక్‌ తాను గత జన్మలో మహరాజునని నమ్ముతారు. ఖతర్‌ దేశానికి చెందిన ఓ రాజు భావమరది అయిన షేక్‌ ఓ రోజు అమెరికన్‌ ఆర్టిస్ట్‌ మ్యాన్‌ రే గీసిన మహ రాజా యశ్వంత్‌ రావు హోల్కర్‌ 2 చిత్రపటాన్ని చూశారు. ఆ రాజుకు తనకు మధ్య పోలికలు ఉండడాన్ని గమనించిన ఆయన తానే గత జన్మలో ఆ రాజునని చెబుతారు. ఇద్దరూ సన్నగా ఉండడంతో పాటు ముఖం లోని వివిధ అవయవాలు సరిపోలినట్లు ఉంటాయి. ఐశ్వర్యవంతుడైన షేక్‌ దివంగత మహరాజా పెయింటింగ్‌లో పోజుతో ఫొటోలను కూడా తీయించుకున్నారు. ఇక మహరాజా 1961 సంవత్సరంలో మృతిచెందగా షేక్‌ జన్మించింది మాత్రం 1966లో.

టామ్‌ హ్యాంక్స్‌ - అమీర్‌ ఖాన్‌
ameerkhanపలు చిత్రాల్లో వెరైటీ క్యాప్స్‌తో అలరించిన టామ్‌ హ్యాంక్స్‌, అమీర్‌ ఖాన్‌లు ముఖ కవళికలు కూడా ఒకే విధంగా ఉంటాయంటారు వారి అభిమానులు. వారి నటన కూడా ఒకేవిధంగా ఉంటుందని చెబుతారు. ఇక ఆసియా సొసైటీ ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ హ్యాంక్స్‌కు తనకు మధ్య పెద్దగా పోలికలు లేవని కొట్టిపారేశారు.

సుసాన్‌ సరండన్‌ - షబనా ఆజ్మీ
చక్కటి నటనతో ఎన్నో అవార్డు లను గెల్చుకున్న నటీమణులు సుసాన్‌ సరండన్‌, షబనా ఆజ్మీలు. హాలీవుడ్‌లో ఒకరు, బాలీవుడ్‌లో ఒకరు పాపులారిటీ సంపాదించుకున్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలో వీరిద్దరూ ఎల్లప్పుడూ ముందుండడం వీరిద్దరికీ ఉన్న ఓ మంచి లక్షణం.

రాబర్డ్‌ డి నీరో - అమితాబ్‌ బచ్చన్‌
bigbనాటి నుంచి నేటి వరకు దశాబ్దాలుగా సినీ రంగంలో పాపులర్‌ హీరోలుగా పేరుతెచ్చుకున్న వ్యక్తులు రాబర్డ్‌ డి నీరో, అమితాబ్‌ బచ్చన్‌లు. హాలీవుడ్‌లో రాబర్డ్‌ డి నీరో పలు హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తే బాలీవుడ్‌లో బిగ్‌ బి యాంగ్రీ యంగ్‌మన్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఫ్లో జో - ఆశ్విని నాచప్ప
shwiniప్రపంచంలోని గొప్ప లేడీ అథ్లీట్స్‌లో ఒకరైన ఫ్లోరెన్స్‌ గ్రిఫిత్‌ జాయ్‌నర్‌ 1988 సియోల్‌ ఒలిపింక్స్‌లో స్ప్రింట్‌ డబుల్‌తో పాటు రిలేలో గోల్డ్‌ మెడల్స్‌ను సాధించి అం దరి దృష్టిని ఆకర్షించారు. కేవలం అథ్లెటిక్‌గానే కాకుండా ఆమె ఫ్యాషనబుల్‌ వస్త్రాలు ధరించడం, ఆరు అంగుల పొడవైన రంగు, రంగుల చేతి గోర్లతో ఆ కాలంలో ఫ్యాషన్‌ సింబల్‌గా నిలిచారు. ఇక ఇదే తరహాలో మన దేశానికి అథ్లెట్‌ అశ్వినీ నాచప్ప కూడా పేరు తెచ్చుకున్నారు. 1980 చివరి దశకం నుంచి 1990 దశకం ప్రారంభం వరకు అశ్విని నాచప్ప గొప్ప అథ్లెట్‌గా పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా ట్రెండీగా హెయిర్‌ స్టైల్‌, ఉపయోగించే ఫ్యాషన్‌ యాక్ససరీస్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

బిల్‌ గేట్స్‌ -అజీమ్‌ ప్రేమ్‌జీ
bilgets2010 సంవత్సరం ప్రారంభంలో ఫోర్బ్‌‌స మ్యాగజైన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీని సాఫ్ట్‌వేర్‌ మొగల్‌ బిల్‌ గేట్స్‌తో సరి పోల్చింది. గేట్స్‌ మాదిరిగానే విప్రో చైర్మన్‌ అజీమ్‌ సైతం తన ఆదాయంలో పెద్ద మొత్తాన్ని ఛారిటీ కార్యక్రమాలకు వెచ్చిస్తూ వస్తున్నారు. ఆయన తన అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ద్వారా 2010 డిసెంబర్‌లో 88,460,000,000రూ.లను సేవా కార్యక్రమాలకు కేటాయించడం విశేషం. 2011 జూన్‌లో ఆసియన్‌ హీరోస్‌ ఆఫ్‌ ఫిలాంత్రపీగా కీర్తించిన దేశంలోని నలుగురు ప్రముఖులలో ప్రేమ్‌జీ ఒకరిగా నిలిచారు.


-ఎస్‌.అనిల్‌ కుమార్‌

Sunday, June 19, 2011

మా నాన్న.. నేను

"నేను చేసిన తప్పులకు నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ క్షణంలో ఏం చేయాలో తెలియలేదు. కానీ జీవితాంతం ఏం చేయకూడదో తెలుసుకున్నాను. అదే నాన్న గొప్పతనం''
- మహాత్మా గాంధీ

వేలు పట్టుకుని ప్రపంచాన్ని పరిచయం చేసినా, అడుగులు తడబడుతున్నప్పుడు 'భద్రం' అంటూ చేయి అందించినా, తప్పటడుగులు వేసినప్పుడు రెండు దెబ్బలు వేసి మందలించినా... అది నాన్నకే చెల్లు. ఏ బిడ్డలైనా నాన్న వేసిన బాటలోనే ప్రయాణిస్తారు. ఎంత లేదనుకున్నా ఆయన ప్రభావంతోనే పెరుగుతారు. ఇవాళ తండ్రులందరికీ సెల్యూట్ చేయాల్సిన రోజు. ఎందుకంటే ఈ రోజు 'ఫాదర్స్ డే'. ఈ సందర్భంగా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. తండ్రుల జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు పలువురు ప్రముఖులు.. వాటి సమాహారమే ఈ ప్రత్యేక కథనం...

ఆయన ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు..
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి

ఫలానా పని చేయాలని, ఫలానా చదువే చదవాలని మా నాన్న ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. నాకు ఇష్టమైన రంగాలలో ముందుకు సాగేందుకు ప్రోత్సహించారు. నేను చిన్నప్పట్నుంచి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నప్పటికీ ఇంటికి దూరంగా ఉన్నాననే భావం కలగనీయకుండా చూసుకునేవారు. నాన్న రాజకీయ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సమయంలో నేను క్రికెట్‌లో బిజీగా ఉండేవాడిని. ఆయన మరణానంతరమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.

అప్పట్లో నా తమ్ముళ్ళకు ఎన్నికల్లో పోటీ చేసే వయస్సు లేని కారణంగా నేను పోటీ చేయక తప్పలేదు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సేవలను ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటున్నారు. నేను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో ఆ సంగతులను చెబుతుంటే సంతోషం కలుగుతుంటుంది. ఇటీవల శ్రీకాకుళం, కడప జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఆ జిల్లాల ఇన్‌చార్జి మంత్రిగా మా తండ్రి అందించిన సేవలను పలువురు కొనియాడడం నాకెంతో గర్వంగా అనిపించింది.

నాన్నే అమ్మయ్యాడు...
గనులశాఖా మంత్రి గల్లా అరుణకుమారి

మా అమ్మను నేను ఎరుగను. నాకు రెండు సంవత్సరాల వయస్సులోనే ఆమె చనిపోయింది. ఊహ తెలిసిన దగ్గర నుంచీ అన్నీ నాన్నే నాకు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఎప్పుడూ ప్రజల్లోనే తిరిగేవారు. పొద్దుపోయి ఏ రాత్రికో యింటికి వచ్చేవాడు. ఎంత రాత్రి అయినా నన్ను వెతుక్కుని తన దగ్గర పడుకోబెట్టుకుని నిద్రపోయేవాడు. నాన్నమ్మ వంటనేర్చుకోమని తిడుతుంటే... మా నాన్న నన్ను దగ్గరకు తీసుకుని "యేం .. ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన వంట చేసుకే బతకాలా? మా చిన్నమ్మ చేయాల్సిన పనులెన్నో వున్నాయి'' అనేవాడు.

ఒకరోజు మా మామ ఒకరు మా నాన్నతో మాట్లాడుతూ..."రాజా.. నా కొడుకుల్లో వొకరికి నీ కూతుర్ని యివ్వు'' అన్నారు. వెంటనే మా నాన్న నవ్వుతూ "మా అమ్మాయి చేత నీ కొడుకు తాళి కట్టించుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు'' అన్నాడు. ఆడపిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. గౌరవం కూడా. రాజకీయాల్లోకి కూడా నాన్న నా చేయి పట్టుకుని నడిపించుకువెళ్ళారు. అయితే ఆ వాతావరణంలో యిమడలేక నేను నిరుత్సాహపడుతూ వుంటే, నవ్వి, రాజకీయం అంటే ఇలాగే వుంటుంది రా అనేవాడు. ఇక్కడ చావులేదు, బతుకూలేదు. చచ్చినవాడు చచ్చినట్టూ వుండడు, బతికినవాడు బతికినట్టూ వుండడు. ఎప్పుడు చస్తాడో, ఎప్పుడు బతికి లేచి కూర్చుంటాడో తెలియదు. దిగులు పడకూడదు. భయపడకూడదు. అవే అన్నీ సర్దుకుంటాయి. అని ధైర్యం చెప్పేవాడు. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తోంది.

రెండు పడవల ప్రయాణం వద్దన్నారు.... శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్
నేను రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు నాన్న చెప్పిన మాటే ఈ రోజు నాకు మార్గదర్శకమయింది. " నువ్వు రాజకీయాల్లోకి రావాలంటే వ్యాపారాలకు దూరంగా ఉండు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో, పూర్తిస్థాయిలో పనిచేయడానికి ప్రయత్నించు. రెండు పడవలపై ప్రయాణం ప్రమాదం'' అని చెప్పారు. మా నాన్న పుట్టిన గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తుచేసుకుంటారు. నన్ను అక్కున చేర్చుకుంటారు.

ప్రజల్లో ఇంతటి అభిమానం సంపాదించుకోవాలంటే నేను కూడా 'ఫుల్‌టైం జాబ్' చేయాల్సిందే అనుకున్నాను. అప్పటికి నాకు ఒక రెస్టారెంటు ఉంది. మరో కంపెనీకి డీలర్‌గా కూడా పనిచేస్తున్నాను. లాభాల్లో నడుస్తున్న నా వ్యాపారానికి బై చెప్పి వచ్చేశాను. నాన్నతో చాలా చనువుగా ఉండేవాడ్ని. కారణం ఆయన రాజకీయాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో...కుటుంబానికి అంతే ప్రాముఖ్యం ఇచ్చారు. రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇంటికి వచ్చాక మాతోనే ఉండేవారు. ఆ విషయంలో నేను నాన్నంత గొప్పవాణ్ని కాలేను. ఎందుకంటే...ఆ కాలంలో సెల్‌ఫోన్లు లేవు (నవ్వుతూ...) ఇప్పుడలా కాదు...ఇలా ఇంటికి రాగానే జేబులో ఫోన్ మోగుతుంది. అంతే ఇల్లూ లేదు పిల్లలూ లేరు.

జేమ్స్‌బాండ్ అనేవారు...
జూబ్లీహిల్స్ ఎమ్ఎల్ఎ విష్ణువర్ధన్‌రెడ్డి

నాన్న కారు నెంబరు 4007 అంటే నలుగురు కూతుళ్లు, ఒక జేమ్స్‌బాండ్ అని చెప్పేవారు. ఆయన ఉన్నప్పుడు నా బలం తెలిసేది కాదు. ఇప్పుడు నేను ఒక్కడ్నే. నాన్నకు పడుకునే ముందు నాతో కాళ్లు నొక్కించుకోవడం అలవాటు. ఆ సమయంలో నాకు బోలెడు కబుర్లు చెప్పేవారు. ఇంట్లో ఉన్నప్పుడు తల్లి అవసరం, బయటికి వెళ్లినపుడు తండ్రి అవసరం ఏంటో తెలుస్తుంది. మా నాన్న గొప్పతనం ఏంటంటే...తనకి అన్ని విషయాలూ తెలుసు, అయినా నేను చెప్పే చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో శ్రద్ధగా వినేవారు. ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయంలో నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన విగ్రహం ఎదుట ఏకలవ్యునిగా మిగిలిపోయాను.

ఆయన వేలు విడవలేదు...
రామగుండం ఎంపీ వివేక్

నా డాక్టరేట్ అయిన తర్వాత విదేశాలకు వెళదామనుకున్నా. అప్పుడే - 1990లో - చార్మినార్ ఇండస్ట్రీస్‌కు నాన్న యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కార్మికులకు వేతనాలు పెంచాలని పోరాడుతున్నారు. కాని యాజమాన్యం ఒప్పుకోలేదు. మనమే పరిశ్రమలు పెడదాం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆపారు. ఆ కారణంగానే ఇప్పుడు నేను పారిశ్రామికవేత్తగా ఎదిగాను. నాన్న జ్ఞాపకం అనగానే గుర్తొచ్చేది...రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఒకసారి మమ్మల్ని నార్త్ ఇండియా టూర్‌కు తీసుకెళ్లారు. బద్రినాధ్, హరిద్వార్...వంటి ప్రాంతాలు చూపించారు.

మరో విషయం కూడా గుర్తుకొస్తుంది. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో భాగంగా పోలీసు ఫైరింగ్ జరిగింది. అప్పుడు నాన్నకు కూడా గాయాలయ్యాయి. ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. నాన్నను చూడ్డానికి అమ్మతో ఆసుపత్రికి వెళ్లిన జ్ఞాపకం కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఇంటా...బయటా అన్ని విషయాల్లో నాన్నను అనుసరించడానికి ప్రయత్నిస్తుంటాను. ఆయనలా ఉండాలంటే చాలా కష్టం. నా వ్యక్తిగత ప్రగతిలో, రాజకీయ అభివృద్ధిలో నాన్న పాత్ర చాలా ఉంది. ఇప్పటికీ ప్రతి విషయంలో ఆయన నన్ను వేలు పట్టి నడిపిస్తున్నట్లే ఉంటుంది.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోమన్నారు..
జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి

నేను పన్నెండో తరగతి చదువుకుంటున్నప్పుడు నాన్న ఒక మాట చెప్పారు. " నువ్వు డాక్టర్ చదవాలనుకుంటే ఇప్పటినుంచే కష్టపడి చదువు. రికమండేషన్ల కోసం నా దగ్గరికి రావొద్దు''. అప్పుడు నాన్న రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికాశాఖ మంత్రి. తన పలుకుబడి మా ఎదుగుదలకు ఏ విధంగానూ ఉపయోగపడకూడదనుకునేవారు. స్వయంకృషే శాశ్వతం అనేవారు. ఆయన మాటలు నాలో పౌరుషాన్ని నింపేవి. అలాగే అప్పుడప్పుడు మాపై మాకున్న నమ్మకాన్ని పరీక్షించేవారు. పరీక్షల సమయంలో సినిమాకి రమ్మనేవారు. అమ్మ చాలా పోట్లాడేది. "నిజంగా చదువుని ఒంట బట్టించుకుంటే...సినిమా చూసినా చక్కగా రాయొచ్చు'' అనేవారు. నేను బాగా చదువుతానని ఆయనకు తెలుసు. అయితే ఆ మాట ఎవరి దగ్గరా అనేవారు కాదు. అమెరికాలో ఎమ్ఎస్ చేసినపుడు నాకు 97 శాతం మార్కులు వచ్చాయి.

ఆ కాపీని ఇక్కడికి పోస్టు చేశాను. ఆ మార్కుల లిస్టుని ఇక్కడ అందరికీ చూపించుకుని మురిసిపోయారట. ఒక కొడుకుగా ఎప్పటికీ మరిచిపోలేని తీపి జ్ఞాపకం ఒకటుంది. నేను రాజేంద్రనగర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాన్న కేంద్రమంత్రి. కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన వచ్చినపుడు కాలేజీ స్టూడెంట్ లీడర్‌గా ఆయనకు నేను ఆహ్వానం పలికాను. అది నాకు చాలా గర్వంగా ఉండేది. ప్రజలు మనల్ని నమ్మినంతకాలమే మనం రాజకీయాల్లో ఉండగలం. ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోతే మనకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదనేవారు.

ప్రేమంతా మనసులోనే... కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
మా కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య చనువు చాలా తక్కువగా ఉండేది. భయభక్తులు ఎక్కువ. నాన్న నాతో ఎక్కువ మాట్లాడేవారు కాదు. మా నాన్నతో మా తాత కూడా అలాగే ఉండేవారు. బాగా అవసరమైన విషయాలు తప్పితే...అన్ని విషయాలు నాన్నతో పంచుకునే పరిస్థితి ఉండేది కాదు. అలాగని అభిమానం లేదని కాదు. ఎంత ప్రేమ ఉన్నా...మనసులోనే ఉంచుకోవాలి. ఆయన ముందర నిలబడి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. నేను చెప్పేది నా చిన్నప్పటి విషయాలు కాదు...నా పెళ్లయిన తర్వాత కూడా అంతే. అన్ని విషయాల్లో నేను ఆయన్నే అనుసరించేవాడ్ని. ఆయనొక మొండిఘటం. అనుకున్న పని అయ్యేవరకూ వదలరు. అదే ఆయన్నించి నేను నేర్చుకున్న అంశం. మనల్ని నమ్మినవారితో ఎలాంటి పరిస్థితుల్లో కూడా బంధాన్ని తెంచుకోకూడదు అనేవారు. ఇందిరాగాంధి నుంచి రాహుల్ వరకూ ఆ కుటుంబంతో మా కుటుంబానికి ఉన్న సంబంధాల్ని నేనూ కొనసాగిస్తున్నాను.

హుందాగా ఉండాలనేవారు... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

నేను మూడేళ్ల వయసున్నప్పుడే నాన్న ఎమ్మెల్యే. మాతోబుట్టువులలోనేనే చిన్నదాన్ని కావడంతో అందరికంటే నన్నే ఎక్కువ గారంగా చూసుకునేవారు. ఇప్పటివరకూ చిన్నమాట కూడా అనలేదు. పెళ్లయేదాకా నాకు ఏం కావాలన్నా నాన్నే హైదరాబాదు నుంచి తెచ్చేవారు. ఆళ్లగడ్డలో నేను నాన్నతో కలిసి నడుచుకుంటూ సినిమాకు వెళ్లేదాన్ని. నా పెళ్లయేదాకా ప్రతి పుట్టిన రోజుకూ నాన్న ఎక్కడున్నా వచ్చేవారు.

మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు నాన్న, నా భర్త అప్పటి నంద్యాల ఎంపీ భూమా నాగిరెడ్డితో కలిసి అసెంబ్లీకి వెళ్లాను. ఇద్దరం శాసనసభలో ఉన్నపుడు తెదేపా ఎమ్మెల్యేలతోపాటు నేనూ పోడియం వద్దకు వెళ్లడం లాంటివి చేస్తే అలా చేయొద్దని సైగ చేసేవారు.హుందాగా ఉండాలని కోరుకునేవారు. నెలకొకసారైనా ఆయన వద్దకు వెళ్లి కలిసి భోంచేసి వస్తుంటాను. మంచైనా చెడైనా నాన్నకు నేను తప్ప మా కుటుంబంలో ఎవరూ చెప్పలేరు. అంత చనువుంది ఆయనతో నాకు.

మానవత్వం నేర్పారు
పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

ఈరోజు ఆయన వారసునిగా మీముందు ఉన్నాను కాని చిన్నప్పుడు మా నోట రాజకీయం అనే మాట వినిపించేది కాదు. పెద్ద చదువులు చదువుకుని ఉన్నతమైన వ్యక్తిత్వంతో రాణించాలని కోరుకునేవారు. దానికోసం మాకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేవారు. చదువు పూర్తి అయ్యాక మాకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకోమని చెప్పేవారు. కాని అనుకోకుండా రాజకీయాల్లోకి రావలసినవచ్చింది. ఎప్పుడూ పేదల గురించి ఆలోచించే నాన్నే నాకు స్పూర్తి. ఆయన మాకు మంచి, మానవత్వం నేర్పారు. ప్రతీ సమస్యను మానవీయ కోణంలో ఆలోచించాలని, ప్రతీ వ్యక్తిని మానవత్వంతో అక్కున చేర్చుకోవాలని చెప్పేవారు. నా నియోజకవర్గంలో ప్రజల ప్రేమాభిమానాలు పొందుతున్నానంటే ఆయన మంచితనమే కారణం.

పోలియో వచ్చినపుడు... నెల్లూరు ఎమ్ఎల్ఎ ఆనం వివేకానందరెడ్డి

నాకు పన్నెండేళ్ల వయసులో పోలియో వల్ల కాలికి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. రాయవేలూరులో ఉన్న ఆస్పత్రిలో వైద్యం చేయించారు. నెల్లూరి నుంచి రాయవేలూరికి వెళ్లాలంటే మూడు బస్సులు మారాలి. నాన్నే నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేవారు. రెండుసార్లు ఆపరేషన్ చేయించారు. చంక దింపకుండా చంటిపిల్లవాడ్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే...నాన్నే కారణం. రాజకీయాల్లో మునిగిపోయి భార్యాపిల్లల్ని పట్టించుకోలేనివారు బోలెడుమంది ఉన్నారు. కాని నాన్న అలా కాదు...'నేను ఏం చేసినా మీకోసమే కదా' అని ప్రతీ తండ్రి అనే మాటను ఆయన నిజం చేశారు.

ఆ ప్రశ్నని మరచిపోలేను....
మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి

నాన్న ఎమ్ఎల్ఎగా ఎన్నికైన సమయంలో నేను ఇంటర్ చదువుతున్నాను. మనం చదువులో కొంచెం వీక్(నవ్వుతూ...) ఇంటర్‌లో 49 శాతం మార్కులే వచ్చాయి. అగ్రికల్చర్ బిఎస్‌సి సీట్ కోసం ప్రయత్నిస్తున్నాను. నాన్న మార్కులు చూశారు. "ఈ మార్కులు చూపించి ఎవడి కాళ్లు పట్టుకోమంటావు'' అని అరిచారు. నా నోట మాట లేదు. చప్పుడు చేయకుండా వెళ్లి బీకామ్‌లో చేరాను. తరువాత లా చేశాను. వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ ఆయన మాకు చెప్పింది, నేర్పింది, ఆచరించి చూపింది ఒకటే. నిజాయితీ. అదే నిలబెడుతుంది. నిజాయితీ లేకుండా ఎంత కష్టపడ్డా బూడిదపాలే అని చెప్పేవారు.

మంచి స్నేహితుడు...రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి
ఏరాసు ప్రతాపరెడ్డి

మా నాన్న ఏరాసు అయ్యపురెడ్డి మంచి న్యాయవాది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేసులను డీల్ చేసేవారు. నన్ను చిన్నప్పుడు బూసెమ్మ మడుక్కు ఈత కొట్టడానికి తీసికెళ్లేవాడు. ఎల్‌కేజీ, యూకేజీలో నాన్న నన్ను హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. అది జాగీర్దారులు, జమీందారులు తమ పిల్లలను చదివించుకునే స్కూలు. ఒకరోజు నాన్న స్కూలుకు వచ్చి అక్కడ సరిగా ఇమడలేకపోతున్నానని తెలుసుకుని..ఈ బడీవద్దు..

గిడీ వద్దని మా ఊరు గడివేముల మండలం గడిగరేవులకు తీసుకొచ్చేశారు. కర్నూలు స్కూల్లో చేర్పిద్దామనుకున్నారు. కానీ నేను చదివిన బడికి ఇక్కడి బడులకు తేడా ఉందని కర్నూలులో చదవనని మారాం చేశాను. ఇంట్లోనే ప్రైవేటుగా చెప్పించారు. ఒకసారి కాలేజిలో కాలికి దెబ్బ తగిలింది. నాన్న వెంటనే రూ. 3500 పెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొనిచ్చారు. ఆయనలా లాయరునయ్యాను. ఆయన మాదిరే ఆ శాఖకు మంత్రినయ్యాను.

నాన్నకు సెక్యూరిటీగా...
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

ముప్పైఏళ్ల క్రితం హైదరాబాదులో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నాన్నపై మా శత్రువర్గం వారు హత్యాయత్నం చేశారు. 20కి పైగా కత్తిపోట్లు పడ్డాయి. ఆయన కేకలకు ఇంట్లో ఉన్న అమ్మ, నేను పరుగెత్తుకుంటూ వెళ్లాం. రక్తంమడుగులో ఉన్న నాన్నను చూసి చాలా భయపడ్డాను. భుజానికెత్తుకు ందామని ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. మాకు దక్కుతాడని అనుకోలేదు. ఐఎఎస్ అవ్వాలన్న నా ఆశ...అక్కడే చచ్చిపోయింది. చదువు మానేసి ఆయనకు సెక్యూరిటీ గార్డుగా మారిపోయాను.

ఇప్పటికీ నాన్న గురించి ఆలోచిస్తే...నాకు మొదట గుర్తుకు వచ్చే విషయం ఇదే. అదే నా బలహీనత, అదే బలం కూడా. కాంగ్రెస్‌లో నాన్నపై కక్షసాధింపు చర్యలు భరించలేక 1994లో తెలుగుదేశం పార్టీలో చేరాను. అమ్మానాన్నలను చూడాలనుకున్నప్పుడల్లా కర్నూలు వెళ్లిపోతాను. నాన్నతో కూర్చుని రాజకీయాలు మాట్లాడుతుంటే సమయమే తెలియదు.