Showing posts with label friends. Show all posts
Showing posts with label friends. Show all posts

Sunday, December 25, 2011

ఫోర్డ్ చక్రవర్తి

 http://motorsportshalloffame.com/halloffame/1993/Henry_Ford_400.jpg
ఉడ్రో విల్సన్ అమెరికా అధ్యక్షుడు.
హెన్రీ ఫోర్డ్... కార్ల కంపెనీ ఓనరు.
‘‘ఫోర్డ్.. ఒక చెయ్యి వెయ్యి. చక్రం తిప్పుదాం’’ అన్నాడు విల్సన్!
శాంతి స్థాపన కోసం,
నానాజాతి సమితి ఏర్పాటు కోసం
విల్సన్ ప్రయత్నం.
ఫోర్డ్ ఆల్రెడీ ‘చక్రం’ తిప్పుతున్నాడు.
అమెరికా రోడ్ల నిండా ఫోర్డ్ చక్రాలే!
ఫోర్డ్ ఒక మాట చెబితే చాలు సెనెట్‌లో
విల్సన్ వెయిట్ పెరుగుతుంది.
అందుకే అడిగాడు విల్సన్.
ఫోర్డ్‌కీ, ఫోర్డ్ కంపెనీకి
అంత వాల్యూ ఎలా వచ్చింది?
‘మొబిలిటీ’ అంటాడు ఫోర్డ్.
మనిషి మెషీన్‌లా తిరగాలంటాడు ఫోర్డ్.
ఈ చలనశీలి జీవిత చక్రమే ఈ బయోగ్రఫీ.


హ్యాపీ క్రిస్మస్... మిస్టర్ హెన్రీ ఫోర్డ్!
హ్యాపీ క్రిస్మస్... దేశభక్త నిర్యుద్ధ యోధుడా!
హ్యాపీ క్రిస్మస్... డియర్ కార్మిక ప్రియతమా!
*******

హెన్రీ ఫోర్డా! ఇంకా ఎక్కడున్నారు ఆయన? ఎలా అందుతాయి మన శుభాకాంక్షలు? అవి దివికేగుతాయా? ఆయనే భువికి దిగుతారా? ఏదైనా జరగొచ్చు.

హెన్రీకి క్రిస్మస్ అంటే ఇష్టం. పిల్లలంటే ప్రీతి. ధ్యాసగా చూడండి. ఏ క్రిస్మస్ చెట్టు నీడలోనో నక్షత్రమై ఆయన ఆత్మ వెలుగుతూ ఉంటుంది. లేదంటే - ఇంటి ముందు- పిల్లల నవ్వుల్లో, కేరింతల్లో!
శాంతాక్లాజ్ ఎదురుపడితే మాత్రం హెన్రీ ఫోర్డ్ గురించి ఆయన్ని వాకబు చెయ్యకండి. ఎందుకంటే - శాంతాక్లాజ్ పెద్దగా నవ్వొచ్చు. ఆ నవ్వుతున్నది మారువేషంలో ఉన్న హెన్రీ ఫోర్డ్ కావచ్చు!
హెన్రీ ఇలాగే చేసేవారు. శాంతాక్లాజ్ వేషం వేసుకుని, గుర్రపు బగ్గీలో కూర్చుని వీధుల వెంట తిరిగేవారు! చిన్నారులు కనిపిస్తే ఆగి, ఆ చిట్టిచేతుల నిండా బంగారు కానుకలు పెట్టి, బుగ్గపై చిటిక వేసి ముందుకు సాగిపోయేవారు.
ఇప్పుడైనా ఏం తక్కువ?
ఇక్కడో అక్కడో హెన్రీ ఉండే ఉంటారు? పిల్లలకోసం చూస్తూ ఉండి ఉంటారు. హెన్రీకొక నమ్మకం. తను మళ్లీ పుడతానని! అలా పుట్టి ఉంటే ఆయనకిప్పుడు అరవై ఐదేళ్లు ఉంటాయి. ఇవాళ క్రిస్మస్ కాబట్టి కచ్చితంగా ఆయన శాంతాక్లాజ్‌లా ఎదురవుతారు! మన శుభాకాంక్షలు వృథా కావు. హారమై వెళ్లి నమ్మకంగా ఆయన మెడలో పడతాయి.
నమ్మకాలు నిజమైపోతాయా?
హెన్రీకి చాలా నమ్మకాలు ఉండేవి. అవన్నీ చాలావ రకు నిజమయ్యాయి.
కష్టం చేసేవాళ్లకు కంటి నిండా జీతాలు ఇస్తే ఇష్టంగా పని చేస్తారని ఆయన నమ్మారు. ఆ నమ్మకం నిజం అయింది. కార్మికులు కృతజ్ఞతతో పని చేసి ఆయన ఫోర్డ్ కంపెనీని నెంబర్ వన్‌గా నిలబెట్టారు.
అందరూ ఒకే పని చెయ్యడం కాదు, ఒక్కొక్కరు ఒక్కో పనిలో ఎక్స్‌పర్ట్‌లైతే ప్రొడక్షన్ పెరుగుతుందని ఆయన నమ్మారు. ఆ నమ్మకం నిజమయింది. హెన్రీ కనిపెట్టిన ‘అసెంబ్లీ లైన్’ సిస్టమ్‌తో ఫోర్డ్ కంపెనీ తక్కువ టైమ్‌లో ఎక్కువ కార్లు ఉత్పత్తి చేయగలిగింది.
బస్తాల కొద్దీ జీతాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదనీ, కార్మికులకు భద్రం చెప్పాలనీ ఆయన నమ్మారు. ఆ నమ్మకం నిజమయింది. జీతాల పెంపునకు, తాగుడు మానడానికీ ముడిపెట్టడంతో... ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగం అంటే పిల్లవాడు శుభ్రంగా ఉంటాడనీ, పిల్లనిస్తే సుఖంగా ఉంటుందనీ పేరొచ్చింది!
యుద్ధం చేసి ఏ దేశమూ గొప్పదైపోదనీ, పరిశ్రమలే ఏనాటికైనా దేశాలకు తలకిరీటం పెడతాయని ఆయన నమ్మారు.
ఆ నమ్మకం నిజమయింది. హెన్రీ కార్ల కంపెనీ... కష్టకాలంలో అమెరికాను నిలబెట్టింది. చేతిలో నాలుగు డాలర్లు పెట్టింది!
హెన్రీకి ఉన్న మరో నమ్మకం -‘రీ ఇన్‌కార్నేషన్’!
‘‘నా ఇరవై ఆరవ యేట నాకు ఇలాంటి భావన కలిగింది. ఈ జన్మలో అమలు చేయలేని ఆలోచనలను మరుజన్మలో ఆచరణలో పెట్టేందుకు పునర్జన్మ అనేది ఒకటి ఉంటుందని నా నమ్మకం. కాలం పరిమితమైనది కాదు. ముగిసిపోయేదీ కాదు. జన్మజన్మలకు అదొక అనంతమైన వారధి. ఐక్యూ గురించి మాట్లాడుకునేటప్పడు... బై బర్త్ అంటుంటాం. కానీ మనం అనవలసిన మాట... బై మెనీ బర్త్స్ అని! జన్మజన్మల్లోని అనుభవం పోగుపడుతూ వచ్చి, మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది. ఎక్కువ జన్మలు అనుభవించి వచ్చిన వారు తర్వాత జన్మలకు సీనియర్ మోస్ట్‌లు అవుతారు. గ్రేట్ సోల్స్ అంటే అలాంటి వారే.’’
యు.ఎస్. దినపత్రిక ‘ది శాన్‌ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్’లో 1928 ఆగస్టు 26న యథాతథంగా అచ్చయిన హెన్రీ ఫీలింగ్స్ ఇవి.
*******

హెన్రీ ఫోర్డ్ అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్! ఫోర్డ్ మోటార్ కంపెనీ ఓనర్. మూకుమ్మడి ఉత్పత్తి (అసెంబ్లీ లైన్) అనే టెక్నిక్ ఆయన కనిపెట్టిందే. ప్రపంచాన్ని ఊరించిన మోడల్-టి కారు ఆయన కంపెనీ డిజైన్ చేసిందే. టైమ్ సేవింగ్ కోసం హెన్రీ చాలా చాలా కనిపెట్టారు. అందులో ఒకటి అసెంబ్లీ లైన్ టెక్నిక్. ఇంకొకటి కార్మికుల జీతాలను విపరీతంగా పెంచడం. ఈ రెండు కాన్సెప్టులు ‘ఫోర్డిజం’గా ప్రఖ్యాతి చెందాయి. హెన్రీ ఫోర్డ్‌ని ప్రపంచ సంపన్నుడినీ, సుప్రసిద్ధుడినీ చేశాయి.

ఏడు వందల పరికరాలను బిగిస్తే ఒక మోడల్-టి కారు తయారవుతుంది. అందరూ ఒక కారునే, అది పూర్తయ్యేవరకూ తయారుచేస్తూ కూర్చుంటే తలప్రాణం తోకకు వస్తుంది. ఐదో ఆరో కార్లు బయటికొస్తాయి. డిమాండ్ ఎక్కువ. సప్లయ్ తక్కువ. ఎలా? హెన్రీ ఆలోచించారు. ఉత్పత్తి సమయం ఎక్కడ కిల్ అవుతోందో గమనించారు. ఒక మనిషికి రెండుమూడు రకాల పనులున్నాయి. ఒక పని నుంచి ఇంకో పనికి షిఫ్ట్ అవడానికి వారికి కొంత టైమ్ పడుతోంది. దాన్ని సేవ్ చేయాలంటే వేరే పనికి షిఫ్ట్ అయ్యే అవసరం లేకుండా చెయ్యాలి. అలాగే చేశారు హెన్రీ. ఒక మనిషి రోజంతా ఒకే పని చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. కారు చక్రాలు తయారు చేసేవారు చక్రాలు, ఇంజిన్లు తయారు చేసేవారు ఇంజిన్లు. ఇలా! ఇంజిన్లలో మళ్లీ విడిపరికరాలు తయారు చేయవలసిన వారు ఇంకో గ్రూపు. ఇలా అన్ని వైపుల నుంచి విడిపరికరాలు కుప్పలు తెప్పలుగా తయారవుతుంటాయి. వాటిని అసెంబుల్ చేసే గ్రూపు చకచకా అసెంబుల్ చేసేస్తుంటుంది. కార్లు ఒకదాని వెంట ఒకటి తయారై వస్తుంటాయి. ఇదే అసెంబ్లీ లైన్ కాన్సెప్ట్.

http://www.reformation.org/en-henry-ford.jpg
టైమ్ అంటే హెన్రీకి గౌరవం. టైమ్‌ని సేవ్ చేయ్యడం కోసం అవసరమైతే టైమ్‌ని వేస్ట్ చేసుకుంటారు!
ఓసారి ఎవరో అడిగారు హెన్రీ ఫోర్డ్‌ని - ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ఎగ్జిక్యూటివ్‌ల దగ్గరికి మీరే ఎందుకు వెళతారు. వాళ్లనే మీ దగ్గరికి పిలిపించుకోవచ్చు కదా అని.
‘‘టైమ్ సేవ్ చెయ్యడానికి’’ అని చెప్పారు హెన్రీ.
వాళ్లు తన దగ్గరకు వచ్చే లోపే, తను వాళ్ల దగ్గరికి వెళ్లిపోగలరు హెన్రీ.
పన్నెండో యేట తొలిసారి ‘టైమ్ బౌండ్’ అయ్యాడు హెన్రీ! అప్పటి వరకు - నాన్న నిమిషాల ముల్లు, అమ్మ గంటల ముల్లు అతడి జీవితానికి.
‘‘ఇవాళ్టి నుంచి దీన్ని ఫాలో అవు’ అన్నారు విలియమ్ ఫోర్డ్, ఓ రోజు తన చేతి గడియారాన్ని తీసి కొడుక్కి ఇస్తూ.
హెన్రీ ఫోర్డ్ ఆ ఇంట్లో పెద్ద కొడుకు. హెన్రీ తర్వాత ఇద్దరు అమ్మాయిలు. మార్గరెట్, జేన్. వాళ్ల తర్వాత ఇద్దరబ్బాయిలు విలియమ్, రాబర్ట్.
తండ్రి ఇచ్చిన గడియారాన్ని ఇష్టంగా తడిమి చూసుకుంటున్నాడు హెన్రీ ఫోర్డ్.
‘‘పెద్దవాడివౌతున్నావ్. ఇక నీకెవరూ చెప్పరు. నువ్వే ఒకరికి చెప్పాలి’’ అంది అతడి తల్లి మేరీ లిటోగాట్.
హెన్రీకి, పెద్ద చెల్లికి మధ్య నాలుగేళ్లు తేడా. హెన్రీకి ఆఖరి తమ్ముడికీ మధ్య పదేళ్లు తేడా. తల్లిదండ్రుల తర్వాత హెన్రీనే ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద.
చేతిగడియారాన్ని కొన్నాళ్లు జాగ్రత్తగా ఫాలో అయ్యాడు హెన్రీ. తర్వాత అతడికో సందేహం వచ్చింది! మనుషుల్ని వాళ్ల ఇష్టానుసారం కూర్చోనివ్వకుండా, నిలబడనివ్వకుండా, నిద్రపోనివ్వకుండా... వెనక ఉండి తరుముతున్న ఈ గడియారంలో లోపల ఏం ఉండి ఉంటుంది? ఎలా ఉండి ఉంటుంది?
గడియారాన్ని విప్పదీశాడు. వీలైనన్ని విడిభాగాలుగా వేరుచేశాడు.
ముళ్లు ఆగిపోయాయి!
విప్పి, వేరు చేసిన క్రమంలోనే తిరిగి ఒక్కో భాగాన్నీ శ్రద్ధగా బిగించాడు.
ముళ్లు తిరుగుతున్నాయి!
ఆ రోజు నుంచి గడియారాల మెకానిక్ ఐపోయాడు హెన్రీ ఫోర్డ్. ఫ్రెండ్స్ ఇళ్ల నుంచి, ఇరుగు పొరుగు నుంచి పనిచేయని గడియారాలు అతడి దగ్గరికి వస్తున్నాయి. ఆరోగ్యం మెరుగయ్యాక పరుగులు తీస్తున్నాయి. మంచి గడియారాల డాక్టర్‌గా పేరొచ్చింది హెన్రీకి ఆ చుట్టుపక్కల. అయితే ఈ డాక్టరుగారికి ఆదివారం సెలవు. ఆదివారం అతడు చర్చికి వెళతాడు.

హెన్రీ కుటుంబం ఉంటున్న గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్ నుంచి చర్చికి నాలుగు మైళ్ల దూరం. అంతదూరం వారం వారం నడిచి వెళ్లొస్తుంటాడు హెన్రీ. గ్రీన్‌ఫీల్డ్‌లో హెన్రీ తండ్రికి కొద్దిగా పొలం ఉంది. తల్లి రోజంతా ఆ పొలంలో పనిచేస్తుంటుంది. స్కూల్ అయ్యాక, పొలంలో తల్లిని వెతుక్కుంటూ వెళతాడు హెన్రీ. ఆమెతో ఆ పూట కబుర్లు చెప్పి కడుపారా నవ్విస్తాడు. శ్రమను మర్చిపోయి తల్లి అలా నవ్వుతూ ఉంటే చూడ్డం హెన్రీకి ఇష్టం. పొలం గట్ల మీద తల్లి వెనక... అడుగులో అడుగు వేసుకుంటూ చీకటి పడే వేళకు ఆమెతో పాటు ఇంటికి చేరుకుంటాడు. ఒకరోజు తల్లి కోసం పొలానికి కాకుండా, స్కూల్ నుంచి నేరుగా ఇంటికి రావలసి వచ్చింది హెన్రీకి.

హెన్రీ జీవితంలో అంతకన్నా విషాదమైన రోజు లేదు. తల్లి చనిపోయిందన్న వార్త విన్న రోజు అది! అంత పెద్ద దుఃఖాన్ని పదమూడేళ్ల ఆ చిన్న శరీరం తట్టుకోలేకపోయింది. ఏడ్చి ఏడ్చి ఇక ఏడవలేక నీరసపడి... నిద్రపోతున్నట్లు ఉన్న అమ్మ మీద వాలిపోయాడు. చాలాకాలం పాటు అతడు పొలం మొహం చూడలేదు. తండ్రి కూడా అతడిని బలవంతం చెయ్యలేదు.
‘‘అమ్మే కనుక రోజూ నాకు పొలంలో కనిపించపోతే నేను మా పొలాన్నే ప్రేమించేవాడినే కాదు’’ అని హెన్రీ ఆ తర్వాత తన ఆత్మకథ ‘మై లైఫ్ అండ్ వర్క్’లో రాసుకున్నారు.
*******

తల్లి పోయాక హెన్రీ కాలం పూర్తిగా స్తంభించిపోయింది. గడియారాలను నడిపించిన బాలుడి జీవిత గడియారం సడెన్‌గా ‘స్ట్రక్’ అయింది. ఇల్లొదిలి డెట్రాయిట్ సిటీ చేరుకున్నాడు. అక్కడి జేమ్స్ ఫ్లవర్ అండ్ బ్రదర్స్ కంపెనీలో కొన్నాళ్లు వాచ్ రిపేరర్‌గా కొద్ది జీతంతో పని చేశాడు. తర్వాత డెట్రాయిట్ డ్రై డాక్ కంపెనీలో చేరాడు. అదీ వదిలి, తల్లి లేని గూటికే తిరిగి చేరుకున్నాడు. కొన్ని రోజులు తల్లి నడిచిన దారిలో పొలం గట్లపై వెల్లకిలా పడుకుని, తల్లికోసం ఆకాశంలోకి చూసేవాడు. ఆమె పాదాలు తాకి ఉంటాయని భ్రమించిన చోట... మట్టినేలకు చెంపలు ఆన్చి కన్నీళ్లు పెట్టుకునేవాడు. అదను చూసి కాలం అతడిని మెల్లిగా పొలం పనుల్లో పెట్టింది!

ఓరోజు పొలంలోని వెస్టింగ్‌హౌస్ కంపెనీ స్టీమ్ ఇంజిన్ పాడైపోతే తనకు తనే రిపేర్ చేశాడు హెన్రీ! తర్వాత అదే కంపెనీలో ఇంజిన్ల సర్వీసింగ్ సెక్షన్‌లో చేరాడు. కాలం అతడిని నడపవలసిన వైపే నడుపుతోంది! పని చేస్తూనే, డెట్రాయిట్‌లోని గోల్డ్‌స్మిత్, బ్రియాంట్ అండ్ స్ట్రాటన్ బిజినెస్ కాలేజ్‌లో పార్ట్ టైమ్‌గా బుక్‌కీపింగ్ నేర్చుకుంటున్నాడు.

హెన్రీకి పందొమ్మిదేళ్లు. ఇక్కడో కాలు అక్కడో కాలు వేస్తున్నాడు. ఎక్కడా కుదురుగా ఉండడం లేదు. కొన్నాళ్లు సొంతంగా రంపం మిల్లు నడిపాడు. రాలిందెంతో, తేలిందెంతో తెలీదు. పొలం నుంచి వస్తూ ఒక సాయంత్రం లెక్క చూసుకున్నాడు. మిగిలిందేమీ లేదు. పోయింది మాత్రం ఐదేళ్లు! ఐదేళ్లు బూడిద!
ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు హెన్రీ. అంతకన్నా ముందు - అతడి పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు తండ్రి!

హెన్రీ సంపాదిస్తున్నదేమీ లేదు. నాకు పెళ్లేమిటి? అన్నాడు. వచ్చే దాన్ని చూస్తూ, పోయేదాన్ని పట్టించుకోకపోతే ఎలా అన్నాడు తండ్రి. హెన్రీకి అర్థమైంది. వయసు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అప్పటికి హెన్రీకి పాతికేళ్లు. తండ్రి మాట విని క్లారా బ్రియాంట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఎడిసన్ ఇల్యుమినేటింగ్ కంపెనీలో ఇంజినీర్‌గా చేరాడు. రెండేళ్ల తర్వాత ఒకేసారి అతడికి రెండు ప్రమోషన్‌లు వచ్చాయి! 

ఒకటి: కంపెనీ చీఫ్ ఇంజినీర్‌గా. ఇంకొకటి: తండ్రిగా. *******

ఎడిసన్ కంపెనీలో చీఫ్ ఇంజినీర్ అంటే కావలసినంత డబ్బు. చేద్దామన్నా ఉండనంత పని! గ్యాసోలిన్‌తో సొంత ఎక్స్‌పెరిమెంట్స్ మొదలుపెట్టాడు హెన్రీ. పూర్వజన్మలలో తనొక ఇంజినీర్‌నని ఆయన నమ్మకం. ఆ అనుభవాన్నంతా ఉపయోగించుకుని ఏదైనా కనిపెట్టాలని ఆయన తపన. మూడేళ్లు కష్టపడి దానికదే శక్తికూడదీసుకుని నడిచే వాహనాన్ని (సెల్ఫ్ ప్రొపెల్డ్ వెహికల్) తయారు చేశాడు! దానికి ఫోర్డ్ క్వాడ్రిసైకిల్ అని పేరు పెట్టాడు. టెస్ట్ డ్రైవ్‌లో అది సక్సెస్ అయింది. థామస్ ఎడిసన్‌కు ఆ సైకిల్‌ని చూపించాడు. గో ఎహెడ్ అని థామస్ అతడి భుజం తట్టారు.


మరో రెండేళ్లకు ఇంకో కొత్త వాహనం తయారయింది! డెట్రాయిట్‌లో పేరున్న కలపవ్యాపారి విలియమ్ మర్ఫీ దానికి డబ్బు సహాయం చేశారు. కొన్నాళ్ల తర్వాత ఎడిసన్ కంపెనీలో ఉద్యోగం మాని డెట్రాయిట్ ఆటోమొబైల్స్ కంపెనీలో చేరాడు హెన్రీ. అక్కడా ఉద్యోగం ఉద్యోగమే. ప్రయోగాలు ప్రయోగాలే. తక్కువ ధరకు నాణ్యమైన ఆటోమొబైల్స్ అందించడానికి హెన్రీ ప్రయోగాలు చేస్తున్నాడు. ఈలోపు డెట్రాయిట్ ఆటోమొబైల్ కంపెనీ చేతులెత్తేసింది. హెన్రీ బయటికొచ్చి, హెరాల్డ్ విల్స్ సమకూర్చిన డబ్బుతో ట్వంటీసిక్స్ హార్స్‌పవర్ ఆటోమొబైల్‌ను తయారుచేసి విజయవంతంగా పరుగులు తీయించాడు.


ఫోర్డ్ కంపెనీ ఆవిర్భావానికి ఒక విధంగా అదే తొలి ముహూర్తం. విలియమ్ మర్ఫీ, మూతపడిన డెట్రాయిట్ ఆటోమొబైల్స్ కంపెనీలో కొందరు వాటాదారులు... హెన్రీ ఫోర్డుతో కలిశారు. 1901 నవంబర్ 30న కార్ల తయారీ కంపెనీకి రిబ్బన్ కట్ అయింది. అయితే కొన్నాళ్లకే ఆ కంపెనీతో హెన్రీ సంబంధాలు కట్ అయ్యాయి. కంపెనీ కన్సల్టెంట్‌గా విలియమ్ మర్ఫీ... హెన్రీ లెలాండ్ అనే మనిషిని తెచ్చుకోవడం హెన్రీకి నచ్చలేదు. ఏడాదికే తన పేరు తను తీసుకుని వేరుపడ్డాడు. హెన్రీ వెళ్లిపోయాక అది క్యాడిలాక్ ఆటోమొబైల్స్ కంపెనీ అయింది.


హెన్రీ నేరుగా తన పాత పరిచయస్తుడు అలెగ్జాండర్ మాల్కమ్‌సన్ దగ్గరికి వెళ్లాడు. మాల్కమ్‌సన్ డెట్రాయిట్ ఏరియా బొగ్గు డీలర్. అతడితో కలిసి ‘ఫోర్డ్ అండ్ మాల్కమ్‌సన్స్ లిమిటెడ్’ ప్రారంభించాడు. కార్లకు విడిభాగాలు తయారు చేసే కంపెనీని లీజుకు తీసుకుని వేల డాలర్ల విలువైన కాంట్రాక్టు ఇచ్చారు! అయితే కార్ల అమ్మకాలు ఆశించినంతగా లేక, తొలివిడత విడిభాగాల సరఫరాకు కూడా డబ్బు చెల్లించలేకపోయింది హెన్రీ అండ్ కంపెనీ. అలా చెల్లించలేని పరిస్థితే హెన్రీ జీవితాన్ని మలుపుతిప్పింది.

మాల్కమ్‌సన్‌కి హెన్రీ టాలెంట్ మీద తిరుగులేని నమ్మకం. ఏనాటికైనా అతడు సాధిస్తాడు. చవగ్గా అందరికీ అందుబాటులోకి వచ్చే నాణ్యమైన ఆటోమొబైల్‌ను డిజైన్ చేస్తాడు. అప్పుడు అమెరికాతో పాటు, ప్రపంచమంతా ఆర్డర్లు ఇవ్వడానికి తమ కంపెనీ ముందు బార్లు తీరుతాయని అతడి నమ్మకం. ఈ నమ్మకంతోనే మాల్కమ్‌సన్ కొంతమంది ఇన్వెస్టర్లకు గాలం వేశాడు. బాకీ తీర్చమని గొంతుమీద కత్తిపెట్టి కూర్చున్న విడిభాగాల కంపెనీ హోల్డర్లు డాడ్జ్ బ్రదర్స్ దగ్గరికెళ్లి, డబ్బుకు బదులుగా కొత్తగా పెట్టబోయే కంపెనీలో వాటా ఇస్తాం అని ఒప్పించాడు. వాళ్లు శాంతించారు.


1903 జూన్ 16న ‘ఫోర్డ్ మోటార్ కంపెనీ’ మొదలైంది! మూలధనం ఇరవై ఎనిమిది వేల డాలర్లు. హెన్రీ ఫోర్డ్, మాల్కమ్‌సన్‌తో పాటు, డాడ్జ్ బ్రదర్స్, మాల్కమ్‌సన్ బంధువు జాన్ గ్రే, జేమ్స్ కౌజెన్స్, ఇంకా, మాల్కమ్‌సన్ లాయర్లు ఇద్దరు జాన్ ఆండర్సన్, హొరేస రాఖమ్... వీళ్లంతా ప్రధాన వాటాదారులు.


తొలిసారి పూర్తిగా ఒక కొత్త డిజైన్‌తో కారును బయటికి తెచ్చాడు హెన్రీ. సెయింట్ క్లెయిర్ సరస్సులో మంచుపై దాన్ని నడిపి చూపాడు. మైలు ప్రయాణానికి 39.4 సెకన్ల సమయం తీసుకుంది ఆ కారు. అంటే గంటకు 147 కి.మీ. వేగం! ల్యాండ్ స్పీడ్‌లో అదొక రికార్డ్. రేస్ డ్రైవర్ బార్నీ ఓల్డ్‌ఫీల్డ్ దానికి 999 అని పేరు పెట్టాడు. ఆనాటి రైలింజన్ పేరు అది. దానికి గౌరవ సూచకంగానే త్రిబుల్ నైన్ అని పెట్టాడు. దాన్నేసుకుని అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ తిరిగి మంచి ప్రచారం ఇచ్చాడు.

తర్వాత ఐదేళ్లకు మోడల్-టి అనే కొత్త డిజైన్ కారు ఎడమవైపు స్టీరింగ్‌తో ఫోర్డ్ కంపెనీ నుంచి మార్కెట్‌లోకి వచ్చింది. మిగతా కంపెనీలన్నీ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ లెఫ్ట్‌సైడ్ స్టీరింగ్‌ను ఫాలో అయ్యాయి!

మోడల్-టి లో ఇంకా చాలా మార్పులు చేశాడు హెన్రీ. మొత్తం ఇంజిన్‌ని, గేర్లు మార్చే ట్రాన్స్‌మిషన్‌ను బయటికి కనిపించకుండా కవర్ చేశాడు. ఎగుడుదిగుడు రోడ్లపై సాఫీగా ప్రయాణించేందుకు సస్పెషన్‌కు రెండు సెమీ ఎల్లిప్టిక్ (పూర్తిగా అండాకారంలో లేనివి) స్ప్రింగులు అమర్చాడు. దీంతో కారుని నడపడం తేలికయింది. రిపేర్లకు అయ్యే ఖర్చుకూడా చాలా తక్కువ. మొత్తం కారు ఖరీదే అప్పట్లో (1908లో) కేవలం 825 డాలర్లు. ఇప్పుడది సుమారు 22 వేల డాలర్లకు సమానం. వ రసగా పదిహేనేళ్లపాటు మోడల్-టి అమెరికాలో ఒక ఊపు ఊపింది. లక్షలమంది అమెరికన్లు మోడల్-టి పైనే డ్రైవింగ్ నేర్చుకున్నారు. 1914 నాటికి మోడల్-టి కార్ల అమ్మకాలు రెండు లక్షల యాభై వేలకు చేరుకున్నాయి! మరో రెండేళ్లలో ఆ సంఖ్య నాలుగు లక్షల డెబ్బై వేలు అయింది. కారు ధర బాగా తగ్గి 360 డాలర్లకే అందుబాటులోకి వచ్చింది. హెన్రీ ప్రతిష్ట అమెరికన్ రోడ్లపై రయ్యిన దూసుకుపోతోంది. సరిగ్గా ఆ టైమ్‌లో రెండో మోడల్‌కి ప్లాన్ చేశారు ఫోర్డ్. 1927 డిసెంబర్ నాటికి ఫోర్డ్ మోడల్ - ఎ మార్కెట్‌లోకి వచ్చింది. అదీ సక్సెస్ అయింది.

*******

కార్ల తయారీ ఒక్కటే హెన్రీ ఫోర్డ్ జీవితచరిత్ర కాదు. కార్మికుల సంక్షేమం ఒక్కటే ఆయన ధ్యేయం కాదు. యుద్ధ జన్యువులు లేని దేశాలను ఆయన తయారు చేయాలనుకున్నాడు. ముందుగా తన మాతృభూమిని యుద్ధవ్యతిరేక దేశంగా మలచాలని అనుకున్నాడు. యుద్ధంలో గెలిచి సంపాదించుకున్న ఆధిక్యత తాత్కాలికమేనని, పారిశ్రామిక వృద్ధితో సాధించిన పట్టు శాశ్వతమని ప్రపంచ దేశాలకు చెప్పడానికి అమెరికాను ఒక నమూనాగా చేసుకున్నాడు!

హెన్రీ దృష్టిలో యుద్ధం... ఒక ‘టెరిబుల్ వేస్ట్’. యుద్ధానికి నిధులిచ్చేవాళ్ల కాళ్లు చేతులు విరగ్గొట్టాలని అంటాడు. అలా వీలుకాకపోతే కాళ్లు పట్టుకుని బ్రతిమాలైనా యుద్ధాన్ని ఆపాలని అంటాడు. 1915లో హెన్రీ, మరో శాంతి ప్రియుడు రొసికా స్క్విమ్మర్‌తో కలిసి దేశాల మధ్య మంటల్ని ఆర్పడం కోసం సముద్రంపై శాంతి యాత్ర చేపట్టారు. ఒక్కోదేశంలో దిగడం, యుద్ధం వద్దని వినతి పత్రం అందించడం. వీళ్లతో పాటు మరో 170 మంది ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు షిప్పులోకి ఎక్కారు. హెన్రీ వెంట ఆయన పాస్టర్ శామ్యూల్ మార్క్విస్ కూడా బయల్దేరారు. మార్క్విస్... ఫోర్డ్ కంపెనీ సోషియాలజీ విభాగానికి అధిపతి. రోజుకు ఐదు డాలర్ల వేతనం పొందుతున్న తన కార్మికులు... చేతినిండా డబ్బు ఉన్న కారణంగా విలాసాలకు,ప్రలోభాలకు లోను కాకుండా చూడ్డం కోసం హెన్రీ ఆయన్ని నైతిక ప్రబోధాంశాల ఉపాధ్యాయుడిగా నియమించుకున్నారు.


శాంతి యాత్ర ప్రారంభించే ముందు అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ని కలిశారు హెన్రీ ఫోర్డ్. ‘‘మీకివ్వడానికి ప్రభుత్వం దగ్గర సింగిల్ డాలర్ కూడా లేదు’’ అని తెగేశారు విల్సన్. ‘‘అవసరం లేదు. యుద్ధంలోకి దూరకండి చాలు’’ అన్నారు హెన్రీ. అన్నారే గానీ, 1917లో అమెరికా యుద్ధరంగంలోకి దూకినప్పుడు విమానాల ఇంజిన్లు, జలాంతర్గాములను నాశనం చేయగల నౌకల ఇంజిన్లను ఫోర్డ్ కంపెనీ సరఫరా చేయవలసి వచ్చింది. హెన్రీ దేశభక్తి ఆ పని చేయించింది! రెండో ప్రపంచ యుద్ధంలో కూడా నాజీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా, బ్రిటన్‌లకు ఫోర్డ్ కంపెనీ సహకారం అందించింది.


మరోవైపు అమెరికాతో మంచి సంబంధాలున్న ప్రతి పెద్ద దేశంలోనూ హెన్రీ ఫోర్డ్ తన కంపెనీ శాఖల్ని తెరిచారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, ఇండియా, ఆఫ్రికా, మెక్సికో, ఫిలిప్పీన్స్‌లో ఫోర్డ్ మోటార్ కంపెనీలు అమెరికా పంట పండించాయి. అమెరికా పౌరుడిగా హెన్రీ తీర్చుకున్న రుణం అది!


1930లలో హెన్రీ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కంపెనీలోని కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఆయన పేరు మీద నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆయన ఏకైక కుమారుడు ఎడ్సెల్ ఫోర్డ్ కంపెనీని కొన్నాళ్లు నడిపాడు. 1943లో ఎడ్సెల్ చనిపోవడంతో హెన్రీ ఫోర్డ్ శక్తులు మరింత సన్నగిల్లాయి. ఎనభై ఏళ్ల ఆ శరీరం పుత్రశోకాన్ని తట్టుకోలేకపోయింది. మనవడు రెండవ హెన్రీఫోర్డ్ కంపెనీ పగ్గాలు అందుకున్నాడు. ఎనభై మూడేళ్ల వయసులో డియర్‌బోర్న్ ఎస్టేట్‌లో హెన్రీ తన అంతిమశ్వాసను తీసుకున్నారు.

*******

హెన్రీ జీవితమంతా నడిచే యంత్రాల మధ్యే గడిచింది. అలాగని ఆయన ఏనాడూ మనసులేని జీవనం గడపలేదు. సంపాదించినంత సంపాదించారు. సహాయం చేయవలసినంత చేశారు. తను ఎదిగారు. తన దగ్గరున్నవాళ్లని ఎదిగేలా చేశారు. ఒక్క సెంట్ నైనా వృధాగా ఖర్చుపెట్టలేదు. ఒక్క డాలర్‌నైనా అనవసరంగా దాచిపెట్టలేదు. బిజనెస్ అనే మాటకు, బిజినెస్‌మేన్ అనే మాటకు ఎవరెన్ని అర్థాలు చెప్పినా, ఎన్ని అపార్థాలు చేసుకున్నా... హెన్రీ చెప్పేదొకటే. బిజినెస్ అంటే చలనశీలత. బిజినెస్‌మేన్ అంటే చలనశీలి.
చలనశీలికి విరామం ఉండదు. విసుగుండదు. అలుపుండదు. అంతరాయం ఉండదు. అతడొక కాలచక్రం. అతడిదొక ఆదర్శ భ్రమణం. అలాంటి ఒక గ్రేట్ సోల్... హెన్రీ ఫోర్డ్.
*******

ఇప్పుడు హెన్రీ లేరు. ఫోర్డ్ కంపెనీ ఉంది.

ఫోర్డ్‌తో పాటు ఇంకా - హెన్రీ ఫోర్డ్ నెలకొల్పిన సంప్రదాయాలు, విలువలు ఏదో ఒక రూపంలో ఉన్నాయి. వాటన్నిటి వెనుకా హెన్రీ ఆత్మ ఉంటుంది కనుక హెన్రీ ఉన్నట్లే! పునర్జన్మపై ఆయనకు ఉన్న నమ్మకమూ నిజమైనట్లే.
హ్యాపీ క్రిస్మస్... మిస్టర్ హెన్రీ ఫోర్డ్.
మీరు ఎక్కడున్నా! ఎంత దూరంలో ఉన్నా!
- సాక్షి ఫ్యామిలీ

హెన్రీ ఫోర్డ్, పారిశ్రామికవేత్త, ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకులు

(30 జూలై 1863 - 7 ఏప్రిల్ 1947)

జన్మస్థలం : గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్, మిచిగాన్, యు.ఎస్.


తల్లిదండ్రులు : విలియమ్ ఫోర్డ్, మేరీ ఫోర్డ్

తోబుట్టువులు: మార్గరెట్, జేన్, విలియమ్, రాబర్ట్

జీవితభాగస్వామి: క్లారా జేన్‌బ్రియాంట్

సంతానం : ఎడ్సెల్ ఫోర్డ్

ప్రఖ్యాతి : ఆటోమొబైల్స్, మాస్ ప్రొడక్షన్
గ్రేట్ మేన్!
మెటీరియల్ సైన్స్, ఇంజినీరింగ్... హెన్రీ ఫోర్డ్‌కి ఇష్టమైన అంశాలు.

హారన్‌లు, మ్యాట్‌ల వంటి ప్లాస్టిక్ పరికరాల తయారీకి హెన్రీ ప్రధానంగా సోయాబీన్స్‌ను ఉపయోగించేవారు!


కలపను కూడా చెట్టు నుంచి కాకుండా, కృత్రిమంగా వ్యవసాయ ఉప ఉత్పత్తులతో తయారు చేయించేవారు.


హెన్రీ ఫోర్డ్ 160కి పైగా వినూత్న ఆవిష్కరణలు చేశారు. వాటన్నిటికీ పేటెంట్లు పొందారు.


జార్జియాలోని రిచ్‌మండ్ హిల్స్‌లో ఆయనకొక ఉల్లాస మందిరం ఉంది. తీరిక దొరికితే అక్కడికి వెళ్లి సేదతీరేవారు.


ఫోర్డ్ 1914లో ‘ద కేస్ ఎగైన్స్ట్ ద లిటిల్ వైట్ స్లేవర్’ అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించి యువకులకు పంచిపెట్టారు.


పొగతాగడం వల్ల సంభవించే అనర్థాలను ఆ పుస్తకంలో పేర్కొన్నారు.


హెన్రీ ఫోర్డ్‌కి ఆయన మరణానంతరం 1999లో ‘కార్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ద సెంచరీ’ అవార్డు ప్రకటించారు.

 ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ అంటే ఫోర్డ్‌కి వల్లమాలిన అభిమానం. తన ఆఖరి శ్వాసను సీసాలో బంధించమని ఎడిసన్ కుమారుడిని ఫోర్డ్ కోరారు. హెన్రీ ఫోర్డ్ మ్యూజియంలో ఇప్పటికీ ఆ సీసా భద్రంగా ఉంది!

హెన్రీ ఫోర్డ్ జీవిత చరిత్ర ఆధారంగా వందలాది పుస్తకాలు వచ్చాయి. వాటిల్లో బ్రిటిష్ రచయిత డగ్లాస్ గాల్ బ్రెయిత్ రాసిన ‘కింగ్ హెన్రీ’ (2007) అనే పుస్తకానికి ఆధారం ఫోర్డ్ శాంతి నౌక.

 

ఇరవయ్యవ శతాబ్దపు 18 మంది మహనీయులలో ఒకరిగా అమెరికన్ ప్రజలు హెన్రీ ఫోర్డ్‌కి ఓటేశారు.

గ్రేట్ కోట్స్!

నాణ్యమైన సేవలను అందిస్తే వచ్చే ఇబ్బంది ఏమిటంటే... మోయలేనన్ని లాభాలు వచ్చి మీద పడతాయి!

డబ్బును మాత్రమే సంపాదించి పెట్టేది పెద్ద వ్యాపారమేం కాదు.


వృద్ధాప్యం అంటే వయసు మీద పడడం కాదు. నేర్చుకోవడం ఆగిపోవడం.


అసలంటూ మొదలు పెట్టడమే అసలైన విజయ రహస్యం.


ఏ వ్యాపారానికైనా ఉత్సాహం తొలి మూలధనం.


వైఫల్యం అనేది విజయం సాధించడానికి అందివచ్చే ఒక మహదవకాశం.


ఎప్పుడూ ముందుకు వెళ్లడానికే ప్రయత్నిస్తూ ఉంటే, విజయం గురించి పనిగట్టుకుని ఆలోచించనవసరం లేదు.


డబ్బున్నంత మాత్రాన స్వేచ్ఛ ఉన్నట్లు కాదు. జ్ఞానం, అనుభవం, సామర్థ్యం కూడా ఉండాలి.


ప్రతిదీ నీకు వ్యతిరేకంగా జరుగుతుంటే విమానం వైపు చూడు. అది గాలికి అభిముఖంగా పైకి లేస్తుంది.

Sunday, June 19, 2011

మా నాన్న.. నేను

"నేను చేసిన తప్పులకు నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ క్షణంలో ఏం చేయాలో తెలియలేదు. కానీ జీవితాంతం ఏం చేయకూడదో తెలుసుకున్నాను. అదే నాన్న గొప్పతనం''
- మహాత్మా గాంధీ

వేలు పట్టుకుని ప్రపంచాన్ని పరిచయం చేసినా, అడుగులు తడబడుతున్నప్పుడు 'భద్రం' అంటూ చేయి అందించినా, తప్పటడుగులు వేసినప్పుడు రెండు దెబ్బలు వేసి మందలించినా... అది నాన్నకే చెల్లు. ఏ బిడ్డలైనా నాన్న వేసిన బాటలోనే ప్రయాణిస్తారు. ఎంత లేదనుకున్నా ఆయన ప్రభావంతోనే పెరుగుతారు. ఇవాళ తండ్రులందరికీ సెల్యూట్ చేయాల్సిన రోజు. ఎందుకంటే ఈ రోజు 'ఫాదర్స్ డే'. ఈ సందర్భంగా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. తండ్రుల జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు పలువురు ప్రముఖులు.. వాటి సమాహారమే ఈ ప్రత్యేక కథనం...

ఆయన ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు..
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి

ఫలానా పని చేయాలని, ఫలానా చదువే చదవాలని మా నాన్న ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. నాకు ఇష్టమైన రంగాలలో ముందుకు సాగేందుకు ప్రోత్సహించారు. నేను చిన్నప్పట్నుంచి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నప్పటికీ ఇంటికి దూరంగా ఉన్నాననే భావం కలగనీయకుండా చూసుకునేవారు. నాన్న రాజకీయ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సమయంలో నేను క్రికెట్‌లో బిజీగా ఉండేవాడిని. ఆయన మరణానంతరమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.

అప్పట్లో నా తమ్ముళ్ళకు ఎన్నికల్లో పోటీ చేసే వయస్సు లేని కారణంగా నేను పోటీ చేయక తప్పలేదు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సేవలను ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటున్నారు. నేను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో ఆ సంగతులను చెబుతుంటే సంతోషం కలుగుతుంటుంది. ఇటీవల శ్రీకాకుళం, కడప జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఆ జిల్లాల ఇన్‌చార్జి మంత్రిగా మా తండ్రి అందించిన సేవలను పలువురు కొనియాడడం నాకెంతో గర్వంగా అనిపించింది.

నాన్నే అమ్మయ్యాడు...
గనులశాఖా మంత్రి గల్లా అరుణకుమారి

మా అమ్మను నేను ఎరుగను. నాకు రెండు సంవత్సరాల వయస్సులోనే ఆమె చనిపోయింది. ఊహ తెలిసిన దగ్గర నుంచీ అన్నీ నాన్నే నాకు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఎప్పుడూ ప్రజల్లోనే తిరిగేవారు. పొద్దుపోయి ఏ రాత్రికో యింటికి వచ్చేవాడు. ఎంత రాత్రి అయినా నన్ను వెతుక్కుని తన దగ్గర పడుకోబెట్టుకుని నిద్రపోయేవాడు. నాన్నమ్మ వంటనేర్చుకోమని తిడుతుంటే... మా నాన్న నన్ను దగ్గరకు తీసుకుని "యేం .. ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన వంట చేసుకే బతకాలా? మా చిన్నమ్మ చేయాల్సిన పనులెన్నో వున్నాయి'' అనేవాడు.

ఒకరోజు మా మామ ఒకరు మా నాన్నతో మాట్లాడుతూ..."రాజా.. నా కొడుకుల్లో వొకరికి నీ కూతుర్ని యివ్వు'' అన్నారు. వెంటనే మా నాన్న నవ్వుతూ "మా అమ్మాయి చేత నీ కొడుకు తాళి కట్టించుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు'' అన్నాడు. ఆడపిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. గౌరవం కూడా. రాజకీయాల్లోకి కూడా నాన్న నా చేయి పట్టుకుని నడిపించుకువెళ్ళారు. అయితే ఆ వాతావరణంలో యిమడలేక నేను నిరుత్సాహపడుతూ వుంటే, నవ్వి, రాజకీయం అంటే ఇలాగే వుంటుంది రా అనేవాడు. ఇక్కడ చావులేదు, బతుకూలేదు. చచ్చినవాడు చచ్చినట్టూ వుండడు, బతికినవాడు బతికినట్టూ వుండడు. ఎప్పుడు చస్తాడో, ఎప్పుడు బతికి లేచి కూర్చుంటాడో తెలియదు. దిగులు పడకూడదు. భయపడకూడదు. అవే అన్నీ సర్దుకుంటాయి. అని ధైర్యం చెప్పేవాడు. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తోంది.

రెండు పడవల ప్రయాణం వద్దన్నారు.... శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్
నేను రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు నాన్న చెప్పిన మాటే ఈ రోజు నాకు మార్గదర్శకమయింది. " నువ్వు రాజకీయాల్లోకి రావాలంటే వ్యాపారాలకు దూరంగా ఉండు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో, పూర్తిస్థాయిలో పనిచేయడానికి ప్రయత్నించు. రెండు పడవలపై ప్రయాణం ప్రమాదం'' అని చెప్పారు. మా నాన్న పుట్టిన గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తుచేసుకుంటారు. నన్ను అక్కున చేర్చుకుంటారు.

ప్రజల్లో ఇంతటి అభిమానం సంపాదించుకోవాలంటే నేను కూడా 'ఫుల్‌టైం జాబ్' చేయాల్సిందే అనుకున్నాను. అప్పటికి నాకు ఒక రెస్టారెంటు ఉంది. మరో కంపెనీకి డీలర్‌గా కూడా పనిచేస్తున్నాను. లాభాల్లో నడుస్తున్న నా వ్యాపారానికి బై చెప్పి వచ్చేశాను. నాన్నతో చాలా చనువుగా ఉండేవాడ్ని. కారణం ఆయన రాజకీయాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో...కుటుంబానికి అంతే ప్రాముఖ్యం ఇచ్చారు. రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇంటికి వచ్చాక మాతోనే ఉండేవారు. ఆ విషయంలో నేను నాన్నంత గొప్పవాణ్ని కాలేను. ఎందుకంటే...ఆ కాలంలో సెల్‌ఫోన్లు లేవు (నవ్వుతూ...) ఇప్పుడలా కాదు...ఇలా ఇంటికి రాగానే జేబులో ఫోన్ మోగుతుంది. అంతే ఇల్లూ లేదు పిల్లలూ లేరు.

జేమ్స్‌బాండ్ అనేవారు...
జూబ్లీహిల్స్ ఎమ్ఎల్ఎ విష్ణువర్ధన్‌రెడ్డి

నాన్న కారు నెంబరు 4007 అంటే నలుగురు కూతుళ్లు, ఒక జేమ్స్‌బాండ్ అని చెప్పేవారు. ఆయన ఉన్నప్పుడు నా బలం తెలిసేది కాదు. ఇప్పుడు నేను ఒక్కడ్నే. నాన్నకు పడుకునే ముందు నాతో కాళ్లు నొక్కించుకోవడం అలవాటు. ఆ సమయంలో నాకు బోలెడు కబుర్లు చెప్పేవారు. ఇంట్లో ఉన్నప్పుడు తల్లి అవసరం, బయటికి వెళ్లినపుడు తండ్రి అవసరం ఏంటో తెలుస్తుంది. మా నాన్న గొప్పతనం ఏంటంటే...తనకి అన్ని విషయాలూ తెలుసు, అయినా నేను చెప్పే చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో శ్రద్ధగా వినేవారు. ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయంలో నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన విగ్రహం ఎదుట ఏకలవ్యునిగా మిగిలిపోయాను.

ఆయన వేలు విడవలేదు...
రామగుండం ఎంపీ వివేక్

నా డాక్టరేట్ అయిన తర్వాత విదేశాలకు వెళదామనుకున్నా. అప్పుడే - 1990లో - చార్మినార్ ఇండస్ట్రీస్‌కు నాన్న యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కార్మికులకు వేతనాలు పెంచాలని పోరాడుతున్నారు. కాని యాజమాన్యం ఒప్పుకోలేదు. మనమే పరిశ్రమలు పెడదాం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆపారు. ఆ కారణంగానే ఇప్పుడు నేను పారిశ్రామికవేత్తగా ఎదిగాను. నాన్న జ్ఞాపకం అనగానే గుర్తొచ్చేది...రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఒకసారి మమ్మల్ని నార్త్ ఇండియా టూర్‌కు తీసుకెళ్లారు. బద్రినాధ్, హరిద్వార్...వంటి ప్రాంతాలు చూపించారు.

మరో విషయం కూడా గుర్తుకొస్తుంది. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో భాగంగా పోలీసు ఫైరింగ్ జరిగింది. అప్పుడు నాన్నకు కూడా గాయాలయ్యాయి. ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. నాన్నను చూడ్డానికి అమ్మతో ఆసుపత్రికి వెళ్లిన జ్ఞాపకం కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఇంటా...బయటా అన్ని విషయాల్లో నాన్నను అనుసరించడానికి ప్రయత్నిస్తుంటాను. ఆయనలా ఉండాలంటే చాలా కష్టం. నా వ్యక్తిగత ప్రగతిలో, రాజకీయ అభివృద్ధిలో నాన్న పాత్ర చాలా ఉంది. ఇప్పటికీ ప్రతి విషయంలో ఆయన నన్ను వేలు పట్టి నడిపిస్తున్నట్లే ఉంటుంది.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోమన్నారు..
జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి

నేను పన్నెండో తరగతి చదువుకుంటున్నప్పుడు నాన్న ఒక మాట చెప్పారు. " నువ్వు డాక్టర్ చదవాలనుకుంటే ఇప్పటినుంచే కష్టపడి చదువు. రికమండేషన్ల కోసం నా దగ్గరికి రావొద్దు''. అప్పుడు నాన్న రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికాశాఖ మంత్రి. తన పలుకుబడి మా ఎదుగుదలకు ఏ విధంగానూ ఉపయోగపడకూడదనుకునేవారు. స్వయంకృషే శాశ్వతం అనేవారు. ఆయన మాటలు నాలో పౌరుషాన్ని నింపేవి. అలాగే అప్పుడప్పుడు మాపై మాకున్న నమ్మకాన్ని పరీక్షించేవారు. పరీక్షల సమయంలో సినిమాకి రమ్మనేవారు. అమ్మ చాలా పోట్లాడేది. "నిజంగా చదువుని ఒంట బట్టించుకుంటే...సినిమా చూసినా చక్కగా రాయొచ్చు'' అనేవారు. నేను బాగా చదువుతానని ఆయనకు తెలుసు. అయితే ఆ మాట ఎవరి దగ్గరా అనేవారు కాదు. అమెరికాలో ఎమ్ఎస్ చేసినపుడు నాకు 97 శాతం మార్కులు వచ్చాయి.

ఆ కాపీని ఇక్కడికి పోస్టు చేశాను. ఆ మార్కుల లిస్టుని ఇక్కడ అందరికీ చూపించుకుని మురిసిపోయారట. ఒక కొడుకుగా ఎప్పటికీ మరిచిపోలేని తీపి జ్ఞాపకం ఒకటుంది. నేను రాజేంద్రనగర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాన్న కేంద్రమంత్రి. కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన వచ్చినపుడు కాలేజీ స్టూడెంట్ లీడర్‌గా ఆయనకు నేను ఆహ్వానం పలికాను. అది నాకు చాలా గర్వంగా ఉండేది. ప్రజలు మనల్ని నమ్మినంతకాలమే మనం రాజకీయాల్లో ఉండగలం. ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోతే మనకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదనేవారు.

ప్రేమంతా మనసులోనే... కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
మా కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య చనువు చాలా తక్కువగా ఉండేది. భయభక్తులు ఎక్కువ. నాన్న నాతో ఎక్కువ మాట్లాడేవారు కాదు. మా నాన్నతో మా తాత కూడా అలాగే ఉండేవారు. బాగా అవసరమైన విషయాలు తప్పితే...అన్ని విషయాలు నాన్నతో పంచుకునే పరిస్థితి ఉండేది కాదు. అలాగని అభిమానం లేదని కాదు. ఎంత ప్రేమ ఉన్నా...మనసులోనే ఉంచుకోవాలి. ఆయన ముందర నిలబడి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. నేను చెప్పేది నా చిన్నప్పటి విషయాలు కాదు...నా పెళ్లయిన తర్వాత కూడా అంతే. అన్ని విషయాల్లో నేను ఆయన్నే అనుసరించేవాడ్ని. ఆయనొక మొండిఘటం. అనుకున్న పని అయ్యేవరకూ వదలరు. అదే ఆయన్నించి నేను నేర్చుకున్న అంశం. మనల్ని నమ్మినవారితో ఎలాంటి పరిస్థితుల్లో కూడా బంధాన్ని తెంచుకోకూడదు అనేవారు. ఇందిరాగాంధి నుంచి రాహుల్ వరకూ ఆ కుటుంబంతో మా కుటుంబానికి ఉన్న సంబంధాల్ని నేనూ కొనసాగిస్తున్నాను.

హుందాగా ఉండాలనేవారు... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

నేను మూడేళ్ల వయసున్నప్పుడే నాన్న ఎమ్మెల్యే. మాతోబుట్టువులలోనేనే చిన్నదాన్ని కావడంతో అందరికంటే నన్నే ఎక్కువ గారంగా చూసుకునేవారు. ఇప్పటివరకూ చిన్నమాట కూడా అనలేదు. పెళ్లయేదాకా నాకు ఏం కావాలన్నా నాన్నే హైదరాబాదు నుంచి తెచ్చేవారు. ఆళ్లగడ్డలో నేను నాన్నతో కలిసి నడుచుకుంటూ సినిమాకు వెళ్లేదాన్ని. నా పెళ్లయేదాకా ప్రతి పుట్టిన రోజుకూ నాన్న ఎక్కడున్నా వచ్చేవారు.

మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు నాన్న, నా భర్త అప్పటి నంద్యాల ఎంపీ భూమా నాగిరెడ్డితో కలిసి అసెంబ్లీకి వెళ్లాను. ఇద్దరం శాసనసభలో ఉన్నపుడు తెదేపా ఎమ్మెల్యేలతోపాటు నేనూ పోడియం వద్దకు వెళ్లడం లాంటివి చేస్తే అలా చేయొద్దని సైగ చేసేవారు.హుందాగా ఉండాలని కోరుకునేవారు. నెలకొకసారైనా ఆయన వద్దకు వెళ్లి కలిసి భోంచేసి వస్తుంటాను. మంచైనా చెడైనా నాన్నకు నేను తప్ప మా కుటుంబంలో ఎవరూ చెప్పలేరు. అంత చనువుంది ఆయనతో నాకు.

మానవత్వం నేర్పారు
పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

ఈరోజు ఆయన వారసునిగా మీముందు ఉన్నాను కాని చిన్నప్పుడు మా నోట రాజకీయం అనే మాట వినిపించేది కాదు. పెద్ద చదువులు చదువుకుని ఉన్నతమైన వ్యక్తిత్వంతో రాణించాలని కోరుకునేవారు. దానికోసం మాకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేవారు. చదువు పూర్తి అయ్యాక మాకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకోమని చెప్పేవారు. కాని అనుకోకుండా రాజకీయాల్లోకి రావలసినవచ్చింది. ఎప్పుడూ పేదల గురించి ఆలోచించే నాన్నే నాకు స్పూర్తి. ఆయన మాకు మంచి, మానవత్వం నేర్పారు. ప్రతీ సమస్యను మానవీయ కోణంలో ఆలోచించాలని, ప్రతీ వ్యక్తిని మానవత్వంతో అక్కున చేర్చుకోవాలని చెప్పేవారు. నా నియోజకవర్గంలో ప్రజల ప్రేమాభిమానాలు పొందుతున్నానంటే ఆయన మంచితనమే కారణం.

పోలియో వచ్చినపుడు... నెల్లూరు ఎమ్ఎల్ఎ ఆనం వివేకానందరెడ్డి

నాకు పన్నెండేళ్ల వయసులో పోలియో వల్ల కాలికి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. రాయవేలూరులో ఉన్న ఆస్పత్రిలో వైద్యం చేయించారు. నెల్లూరి నుంచి రాయవేలూరికి వెళ్లాలంటే మూడు బస్సులు మారాలి. నాన్నే నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేవారు. రెండుసార్లు ఆపరేషన్ చేయించారు. చంక దింపకుండా చంటిపిల్లవాడ్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే...నాన్నే కారణం. రాజకీయాల్లో మునిగిపోయి భార్యాపిల్లల్ని పట్టించుకోలేనివారు బోలెడుమంది ఉన్నారు. కాని నాన్న అలా కాదు...'నేను ఏం చేసినా మీకోసమే కదా' అని ప్రతీ తండ్రి అనే మాటను ఆయన నిజం చేశారు.

ఆ ప్రశ్నని మరచిపోలేను....
మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి

నాన్న ఎమ్ఎల్ఎగా ఎన్నికైన సమయంలో నేను ఇంటర్ చదువుతున్నాను. మనం చదువులో కొంచెం వీక్(నవ్వుతూ...) ఇంటర్‌లో 49 శాతం మార్కులే వచ్చాయి. అగ్రికల్చర్ బిఎస్‌సి సీట్ కోసం ప్రయత్నిస్తున్నాను. నాన్న మార్కులు చూశారు. "ఈ మార్కులు చూపించి ఎవడి కాళ్లు పట్టుకోమంటావు'' అని అరిచారు. నా నోట మాట లేదు. చప్పుడు చేయకుండా వెళ్లి బీకామ్‌లో చేరాను. తరువాత లా చేశాను. వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ ఆయన మాకు చెప్పింది, నేర్పింది, ఆచరించి చూపింది ఒకటే. నిజాయితీ. అదే నిలబెడుతుంది. నిజాయితీ లేకుండా ఎంత కష్టపడ్డా బూడిదపాలే అని చెప్పేవారు.

మంచి స్నేహితుడు...రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి
ఏరాసు ప్రతాపరెడ్డి

మా నాన్న ఏరాసు అయ్యపురెడ్డి మంచి న్యాయవాది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేసులను డీల్ చేసేవారు. నన్ను చిన్నప్పుడు బూసెమ్మ మడుక్కు ఈత కొట్టడానికి తీసికెళ్లేవాడు. ఎల్‌కేజీ, యూకేజీలో నాన్న నన్ను హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. అది జాగీర్దారులు, జమీందారులు తమ పిల్లలను చదివించుకునే స్కూలు. ఒకరోజు నాన్న స్కూలుకు వచ్చి అక్కడ సరిగా ఇమడలేకపోతున్నానని తెలుసుకుని..ఈ బడీవద్దు..

గిడీ వద్దని మా ఊరు గడివేముల మండలం గడిగరేవులకు తీసుకొచ్చేశారు. కర్నూలు స్కూల్లో చేర్పిద్దామనుకున్నారు. కానీ నేను చదివిన బడికి ఇక్కడి బడులకు తేడా ఉందని కర్నూలులో చదవనని మారాం చేశాను. ఇంట్లోనే ప్రైవేటుగా చెప్పించారు. ఒకసారి కాలేజిలో కాలికి దెబ్బ తగిలింది. నాన్న వెంటనే రూ. 3500 పెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొనిచ్చారు. ఆయనలా లాయరునయ్యాను. ఆయన మాదిరే ఆ శాఖకు మంత్రినయ్యాను.

నాన్నకు సెక్యూరిటీగా...
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

ముప్పైఏళ్ల క్రితం హైదరాబాదులో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నాన్నపై మా శత్రువర్గం వారు హత్యాయత్నం చేశారు. 20కి పైగా కత్తిపోట్లు పడ్డాయి. ఆయన కేకలకు ఇంట్లో ఉన్న అమ్మ, నేను పరుగెత్తుకుంటూ వెళ్లాం. రక్తంమడుగులో ఉన్న నాన్నను చూసి చాలా భయపడ్డాను. భుజానికెత్తుకు ందామని ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. మాకు దక్కుతాడని అనుకోలేదు. ఐఎఎస్ అవ్వాలన్న నా ఆశ...అక్కడే చచ్చిపోయింది. చదువు మానేసి ఆయనకు సెక్యూరిటీ గార్డుగా మారిపోయాను.

ఇప్పటికీ నాన్న గురించి ఆలోచిస్తే...నాకు మొదట గుర్తుకు వచ్చే విషయం ఇదే. అదే నా బలహీనత, అదే బలం కూడా. కాంగ్రెస్‌లో నాన్నపై కక్షసాధింపు చర్యలు భరించలేక 1994లో తెలుగుదేశం పార్టీలో చేరాను. అమ్మానాన్నలను చూడాలనుకున్నప్పుడల్లా కర్నూలు వెళ్లిపోతాను. నాన్నతో కూర్చుని రాజకీయాలు మాట్లాడుతుంటే సమయమే తెలియదు.

Tuesday, May 17, 2011

ఐడియాలతో అద్భుతాలు

'' పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బు ''  ఆ పద్ధతి రాచమార్గం కాగా కుయుక్తులతో, అన్యాయంతో, అక్రమాలతో దేశాన్ని కొల్లగొట్టడం, అక్రమార్జన చేయటం అడ్డదారులుగాను. నాలుగు కాలాలపాటు నిలిచేదిగాను కాదని  తెలుసుకున్నాం. పదండి ముందుకి.. మిగతా అందిరి లాగే మనం కూడా మొబైల్ సంగీతం ఆస్వాదిద్దాం. మొబైల్ సంగీతం... జేబులో మొబైల్, చెవిలో స్పీకర్ లేని వ్యక్తి నేడు మనకెక్కెడా తారసపడరు. నడుస్తూ, వాహనాలు నడుపుతూ, నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ, నిద్రపోతూ, చదువుకుంటూ, మాట్లాడుతూ సర్వవేళ సర్వావస్తలా ఈ మొబైల్ సంగీతం ఉండాల్సిందే... దాదాపు అందరికీ.. దీని పూర్వాపరాలు తెలుసుకుందాం.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOq4Sn_UmgdFYJQobMXVhW58urKO3fmE4miz5RPNkvqXJAjkc4hSWTR-O7b_VvQEqrV13tNMr3A-n65phQxCX_fpYXs1PbjX-w7JrIn8GLif1i0srWyFYHhLs6JMihwm0wlfLlgFSabjQ/s1600/Akio+Mirota.jpg
ఈ మొబైల్ సంగీత యుగం ఆరంభం కాకముందు ప్రయాణాలు ముఖ్యంగా గంటలతరబడి చేసేవి, చాలా కష్టతరంగా, బోరింగ్ గాను ఉండేవి. ఒక్కసారిగా ఊహించుకోండి. దాదాపు ఇరవై నాలుగు గంటలకు పైగా సాగే భారత్-అమెరికా విమాన యాత్రలో సీట్లకు అతుక్కుపోయి అలాగే ఉండిపోవటం ఎంత కష్టంగా ఉండేదో ! తనువు, మనసు రెండు కష్టపడేవి విసుగెత్తిపోయేవి. అలాంటి ఒక ప్రయాణంలో సోనీ కార్పొరేషన్ చైర్మన్ అకియో మోరిటా బ్రహ్మాండంగా బోర్ అయిపోయి ఒక సరికొత్త ఐడియాతో ప్లేన్ దిగాడు. ఆ ఐడియా మ్యూజిక్ పరిశ్రమను పూర్తిగా మార్చివేయటమే కాకుండా, మనం సంగీతం వినే పద్ధతులను కూడా గుర్తుపట్టలేనంతగా మార్చేసింది. ఆ సుదీర్ఘ విమానయానం తర్వాత జపాన్‌లోని తన ఆఫీసుకు వెళ్లిన మోరిటా తన బృందాన్ని పిలిచి అటువంటి సుదీర్ఘ విమానయానాల్లో మనం మనకిష్టమైన మ్యూజిక్ వింటుంటే ఎంత బాగుండునో కదా అని అన్నాడు. ఆ ఆలోచనే నేడు కొన్ని వేల కోట్ల విలువైన ' వెళ్తూ వినే సంగీతానికి '(మ్యూజిక్ ఆన్ ది మూవ్) నాంది పలికింది.http://www.conceivablytech.com/wp-content/uploads/2010/10/sony-walkman.jpg
ఈ ఆలోచనకు మొదటి ప్రత్యక్ష రూపమే సోనీ వాక్‌మెన్. యువతను సంపూర్ణంగా ఆకట్టుకొని వాక్‌మెన్ లేని జీవితం కూడా ఒక జీవితమేనా అనేలా చేసింది. వాక్‌మెన్ మన వెంట తీసుకెళ్లగలిగిన మొట్టమొదటి మ్యూజిక్ సిస్టమ్. ఈ సిస్టమ్ వృద్ధి చెంది స్టీరియో రికార్డింగ్ చేసుకునే సదుపాయాన్ని కలిగించింది. కంప్యూటర్ మ్యూజిక్, ఎంపి 3 వచ్చిందాకా ఏకచ్ఛత్రాధిపత్యంతో మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలింది వాక్‌మెన్. వాక్‌మెన్‌ను సృష్టించిన మోరిటాకు ఆ పేరంటే అస్సలు ఇష్టముండేది కాదు. వాక్‌మెన్ ఏమిటి అసహ్యంగా అనుకున్నాడు. పేరు మార్చుదామని ప్రయత్నిస్తే సలహాదారులు చాలా పాపులర్ అయిన పేరు వాక్‌మెన్ మార్చవద్దని సలహా ఇచ్చారు. వాక్‌మెన్ పేరు అలాగే ఉండిపోయింది.

ఒక చిన్న ఐడియా దూరాభారపు విమాన ప్రయాణాల్లో సొంత సంగీతం వినటం ఎలాగా అన్న ఆలోచన సంగీత ప్రపంచంలో సంచలనం కలిగించి, వేల కోట్ల వ్యాపారానికి మూలకారణమైంది. డబ్బు సంపాదించాలంటే ఐడియాలు కావాలి. అడ్డదార్లు కాదు మహాప్రభో !! వెళ్తూ ... తింటూ... తింటూ వెళ్తూ... రెండు బ్రెడ్ ముక్కలు.. వాటి మధ్య ఒక బర్గర్.. మరో చిన్న ఐడియా వేల కోట్ల వ్యాపారానికి, లాభాలకు నాంది పలికింది. అంతేకాదు నాగరిక జీవనానికి ఒక గుర్తుగా మారింది. అనగనగా ఒకప్పుడు కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఇద్దరు సోదరులు డిక్, మేక్ మెక్ డొనాల్డ్‌లకు ఒక ఆలోచన కలిగింది. ప్రయాణంలో ఉన్నప్పుడు సాధారణంగా రెండు భోజనాల మధ్య ఆకలవుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో ఏదో ఒక సామాన్యమైంది, సింపుల్‌గా ఉంటే చాలు. నక్షత్రాల హోటళ్ల విందులవసరం లేదు. వేడిగా, తాజాగా, రుచిగా, తొందరగా లభ్యమయ్యే ఆహారమైతే చాలు. కార్లోను, బస్సులోను ప్రయాణం చేస్తుంటే వాహనం దిగకుండా ఆ ఆహారం దొరికితే అది బోనస్ కింద లెక్క. అప్పుడు ఆ ఆహారం కోసం కస్టమర్లు పదేపదే వస్తారు... ఇదీ ఆ సోదరులు ఆలోచన.
http://www.index.hr/images2/McDWend1.jpg
బ్రహ్మాండమైన ఆలోచన ఈ ఆలోచనలోంచి ఉద్భవించిందే.. ప్రపంచంలోని అతి పెద్ద ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్. గ్రాండ్‌గా ఐదు నక్షత్రాల రెస్టారెంట్స్ కావివి.. సింపుల్‌గా, క్లీన్ గా, ఫాస్ట్‌గా మన ఆకలిని తీర్చే ఆహారం అమ్మే రెస్టారెంట్స్. మెక్‌డొనాల్డ్స్ కథ కూడా వాళ్లు అందించే ఆహారం లాగానే చాలా సింపుల్. ఈ అన్నదమ్ములతో చేయి కలిపాడు రేక్రాక్ అనే ఓ పెద్ద మనిషి. తర్వాత ఆయనే ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేసి నేడు మనం చూస్తున్న మెక్‌డొనాల్డ్స్‌గా తీర్చిదిద్దాడు. మెక్‌డొనాల్డ్స్ అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న రెస్టారెంట్ చైన్. ఎన్నో చోట్ల, ఎల్ల వేళలా ఒకే రకంగా ఉండే సామర్థ్యం, ఆహారం.. ఇవీ మెక్‌డొనాల్డ్స్ విజయానికి మూల కారణాలు. ప్రపంచంలోని ఏ భాగనున్నా, మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఒకే రూపంలో ఉంటాయి. వెంటనే క్షణంలో ఇట్టే గుర్తుపట్టేయొచ్చు. లోపలికెళ్లగానే ఒక రకమైన ఫుడ్, అదే సామర్థ్యం అన్ని చోట్ల ఒకేలా.http://www.thegimcrackmiscellany.com/wp-content/uploads/2008/09/whopper.jpg

కొత్త దేశాల్లో, కొత్త మనుషులు మధ్య ఒంటరితనం కాకుండా మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్‌ను ఒక చిరపరిచితమైన స్నేహితుడిగా భావిస్తాం మనం. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్యలో ఓ బర్గర్... చిన్న ఐడియా... వేల కోట్లలో వ్యాపారం, లాభాలు. నేడు 119 దేశాల్లో 31 వేల పైచిలుకు మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి. రోజుకి 4 కోట్ల 7 లక్షల మంది పైనే కస్టమర్లు. ఇదండీ కథ.

ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం
http://gigaom.files.wordpress.com/2008/09/kilby1lg.jpg
కిల్బీ, నోయిస్ అనే ఇద్దరు సైంటిస్టులు మైక్రోచిప్‌ను కనుగొని ఒక కొత్త ప్రపంచానికి శ్రీకారం చుట్టారు. మనం నేడు నివసిస్తున్న ఈ అధునాతన ప్రపంచంలోని కొత్త ఆవిష్కరణలో కెల్లా ఎంతో ముఖ్యమైంది ఈ మైక్రోచిప్ ఆవిష్కరణ. ఈ ఇద్దరు సైంటిస్టులు వేర్వేరుగా దీన్ని కనుగొని కొన్నేళ్లు కీచులాడుకొని చివ్వరికి మైక్రో చిప్ ఆవిష్కరణ తమ సమిష్టి కృషిగా నిర్ధారించుకొన్నారు. మైక్రోచిప్ ఎంత చిన్నదంటే దాన్ని ఒక చిరు చీమ నెత్తినపెట్టుకొని మోసుకెళ్లగలదు. అటువంటి అతి సూక్ష్మమైన చిప్ మీద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని పొందుపరుస్తారు. ప్రతి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌కి సర్క్యూట్ ప్రాణంలాంటింది. ఆ ప్రాణం ఉంది ఈ చిన్న ఇసుక రేణువులో !! ఆశ్చర్యంగా ఉంది కదూ ! ఈ ప్రక్రియ ద్వారా ఒక గది నిండా ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మన అరచేతిలో సులభంగా అమరే ఒక బుల్లి డివైస్‌లో కూర్చోపెట్టవచ్చు.

మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ అని అంటూ ఉంటామే. దీని అవతరణకి మూల కారణం ఈ సిలికాన్ మైక్రోచిప్ వల్లనే. ఈ చిప్‌ను దీని వాడకంతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అమ్మకాలు 2004లో 179 అమెరికన్ బిలియన్ డాలర్లని అంచనా. అంటే 8 లక్షల కోట్ల రూపాయలకు పైబడే. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆధారంగా అమ్ముడుబోతున్న ఎలక్ట్రానిక్ పరికరాల విలువ 1.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే 50 లక్షల కోట్ల రూపాయలను మించి. ఈ అంచనాలు టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ వారివి. ఇక్కడే కిల్బీ పనిచేశాడు. కిర్బీ కథనం ప్రకారం ఒక సమస్యను తొందరగా పరిష్కరించాలనే ప్రయత్నంలో ఉన్నాడతను.

ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని అతడు కనుగొని ఉండకపోతే, ఆయన కంపెనీ ఆయన్ను ఒక సమస్యాపూరితమైన పనిలోకి మార్చి ఉండేది. అది ఎలాగైనా తప్పించుకోవాలని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద దృష్టి సారించాడు. వేసవి కాలం సెలవులు కావటం వల్ల తను పనిచేసే టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో తన సహోద్యోగులందరూ సమ్మర్ హాలిడేస్ మీద వెళ్లారు. ఆయనొక్కడే ఉన్నాడు పనిలో. టిఆర్ రీడ్ అనే వ్యక్తి రాసిన పుస్తకం 'ది చిప్'లో ఇలా అంటాడు కిల్బీ.. నేను తొందరగా ఒక మంచి ఐడియాను కనుగొన లేకపోతే వేసవి సెలవుల తర్వాత నన్ను మైక్రో మాడ్యుల్ డిపార్ట్‌మెంట్‌లోకి మారుస్తారేమోననిపించింది. అది ఇష్టం లేదు కిల్బీకి .అందుకే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద దృష్టి కేంద్రీకరించాడు.
http://www.biographicon.com/images/Noyce_Robert.jpg
మరోపక్కన నోయిస్ తన పరిశోధనల ద్వారా మైక్రో చిప్‌ని తక్కువ ధరల్లో పెద్ద ఎత్తున (మాస్ మాన్యుఫ్యాక్చర్) తయారు చేసే పద్దతిని కనుగొన్నాడు. అంతేకాదు ఫెయిర్ చైల్డ్ సెమికండక్టర్ సంస్థలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తుండగా చిప్‌ని కనుగొన్నాడు. కాలిఫోర్నియాలోని సిలికాన్ నేవీలో ఉన్న మొట్టమొదటి విజయవంతమైన సిలికాన్ సంస్థ ఈ ఫెయిర్ చైల్డ్ సెమికండక్టర్. వాళ్ల ప్రేరణలు ఎటువంటివైనప్పటికీ ఈ ఇద్దరు సైంటిస్టులు.. కిల్బీ, నోయిస్ మనందరి జీవిత విధానాన్ని మార్చివేసిన మైక్రోచిప్‌ని కనుగొన్నారు. ప్రతి ఆవిష్కరణకు ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కటి మటుకు ఉండదు.. డబ్బు.. ఒక ఆవిష్కరణ ఫలించటం ద్వారా దాని ఉప ఉత్పాదనగా, బై ప్రొడక్టుగా ప్రతిఫలంగా డబ్బు వస్తుంది తప్పితే కేవలం డబ్బు కోసం నూతన విధానాల ఆవిష్కరణ ఎక్కడా జరగలేదు. ఎవ్వరూ చేయలేదు.
- ఎజి కృష్ణమూర్తి

Saturday, February 19, 2011

అపజయాల దారులలోనే గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఓటముల పుటలతో పుస్తకం బరువెక్కుతుందనుకుంటే విజయకావ్యం తేలికయిపోతుంది కదా! సుఖం విలువ తెలియాలంటే కష్టం బాధా తెలియాల్సిందే. కన్నీటి వ్యధని ఆలకించగలిగితేనే ఆనంద బాష్ప కథ మిగిలేది. ఓటమి రుచి తెలియనిదే గెలుపు విలువ తెలిసి రాదు. విజయగాథలన్నీ గుణపాఠాలు నేర్పుతాయని కాదు. నిజానికి అపజయం నేర్పే పాఠాలే గుణపాఠాలవుతాయి.
కళ కళ కోసమే అన్నట్టుగా గెలుపు కూడా గెలుపు కోసమే! అలా గెలుపు నుంచి గెలుపునకు చేసే ప్రయాణమే జీవితం. అది నిరంతరం. ఆ నిరంతరతలో చైతన్యం ఉంటుంది. సాధన ఉంటుంది. ఆ సాధనలో అభ్యాసం ఉంటుంది. శిక్షణా ఉంటుంది. ఇంతటి పరిశ్రమకు కారణం గాడి తప్పకుండా ఉండటం కోసమే. ఎదురు దెబ్బలు తగలకుండా ఉండటం కోసమే. అసలు శిక్షణ అనేది ఒకరు ఇచ్చేది అయినా కావచ్చు లేదా తనకు తానుగా తయారుకావటం అయినా కావచ్చు. ఇక్కడ తనకు తాను అంటే స్వశిక్షణ అనే. దీన్నే సెల్ఫ్ ట్రెయినింగ్ అంటుంటాం. అంటే నాకు నేనుగా ఒక సృజన మార్గంలో శిక్షణకు ఉపక్రమించడం. గెలుపులోని తృప్తి తాత్కాలికం అని తెలుసు కాబట్టే మరిన్ని గెలుపుల కోసం ఇటువంటి శిక్షణ, సాధన అవసరమవుతుంటుంది. నిజానికి శిక్షణ అనేది గెలుపు దాహానికి ప్రతీక. అంతేకాదు విజయ తృష్ణ, కీర్తికాంక్షల ప్రతిబింబం కూడా!

విరామం లేనిదే విజయం
ఒక గెలుపును చవిచూసి విజయతీరాన్ని చేరాననుకోవటం అపజయానికి మొదటిమెట్టవుతుంది. అది తీర ప్రాంతం లేని చైతన్య స్రవంతి. గెలుపునకు ఆరంభమే తప్ప ముగింపు ఉండదు. అంటే విజయగాధలకు ముగింపు వాక్యాలుండవు. అనుభవాలు సక్సెస్ మంత్రాలవుతాయే తప్ప అవే విజయానికి నిర్వచనాలు కాలేవు. విజయాన్ని చరిత్రపుటలకు ఎక్కించాలనుకున్నప్పుడు అపజయాల పుటలూ ఉంటాయని మరచిపోకూడదు. మనకు కనిపించేవి వెలుతురు సీమలే కావచ్చు... కనిపించని చీకటి కోణాలను చూడగలగటమే సక్సెస్ సీక్రసీ. ఓటముల పుటలతో పుస్తకం బరువెక్కుతుందనుకుంటే విజయకావ్యం తేలికయిపోతుంది కదా! సుఖం విలువ తెలియాలంటే కష్టం బాధా తెలియాల్సిందే. కన్నీటి వ్యధని ఆలకించగలిగితేనే ఆనంద బాష్ప కథ మిగిలేది. ఓటమి రుచి తెలియనిదే గెలుపు విలువ తెలిసి రాదు.

విజయగాథలన్నీ గుణపాఠాలు నేర్పుతాయని కాదు. నిజానికి అపజయం నేర్పే పాఠాలే గుణపాఠాలవుతాయి. చలిజ్వరం మనిషిని ఎంతలా వొణికిస్తుందో అపజయమూ అంతలా పట్టి కుదిపేస్తుంది. ఇది తెలిసిన వారికి ఓటములూ రుచికరంగానే ఉంటుంటాయి. విజయం వరించాలంటే సాధన, శిక్షణ బలపడాల్సిందే. అప్పుడే విజయపం«థాలో సృజనశీలత చోటు చేసుకుంటుంది. లేకపోతే మూసపోకడల విజయగాథలు బోర్ కొట్టిస్తాయి. అందుకే విజయం రక్తి కట్టాలంటే సాధన, శిక్షణ శక్తిమంతం కావాలి.

ఓటమి ఆటంకం కాదు
ఓటములన్నీ విజయానికి ఆటంకాలనుకోవటం పొరపాటు. ఓడినంత మాత్రాన తలదించుకోవాల్సిన పనిలేదు. నా ఓటమికి ఇతరులు కారణమని తలపోస్తే నిజంగానే నేను తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లే. అలా ఇతరులను మన ఓటమికి కర్తలను చేస్తున్నామంటే మనం ఓడిపోతున్నట్లే. విజయానికి నేను కర్తను...అపజయానికి పరులు కర్తలు అనటంలోనే మన సంకుచితత్వం బయటపడుతుంటుంది. నిజానికి ఓడిపోవటం ఓటమి కాదు.

ఆ ఓటమికి పరులను కర్తలను చేయటమే అసలైన ఓటమి. అన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్ని ఈ సందర్భంలో మనం అన్వయించుకోగలిగితే అపజయాలన్నీ మేఘాలలా వర్షాన్నో, గాలివాననో సృష్టించవు. అవి అస్తమయ ఆకాశానికి రంగులద్దుతాయి. ఇక్కడ అస్తమించటం అనేది సూరీడే తప్ప ఆకాశం కాదు. పైగా అస్తమయం మరో ఉషోదయానికి తెరలేపుతుంది. అంటే అపజయం విజయానికి భూమిక అవుతోంది. ఓటమి గెలుపుకు మార్గదర్శి అవుతున్నట్లే. ఈ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే విజయపథం ఆనందమార్గమే అవుతుంది. అప్పుడు ఆనందానికి హద్దులు ఉండనట్లే విజయానికీ ఎల్లలు ఉండవు.

సమ ఆదరణ ముఖ్యం
అపజయాలు సైతం విజయసోపానాలు అవుతున్నాయంటే అన్ని అపజయాల ఇటుకలను మన జీవితం నుంచే ఏరుకొచ్చినట్లు కాదు. ఇతరుల జీవితాలలోని ఓటములూ మన కళ్లు తెరిపిస్తాయి. చేజారిన విజయం విలువను అపజయం అనుభవంతో తూయటం నేర్పిస్తాయి. ఎన్నోమార్లు పడిలేస్తేనే పరుగు నిలకడ తెలిసి వచ్చేది. ఎదురు దెబ్బలు తగలనిదే విజయశిఖరం అందిరాదు. జారిన ప్రతిసారీ పురోగమనంపై పట్టు కలుగుతుంది.

ఆ ఆరోహణలో జారిపడ్డ సందర్భాలన్నీ విజయ సంకేతాలే. జారిన ప్రతిసారీ ఓడినట్లు కాదు. జారినంత మాత్రాన అవమానం దరిచేరినట్టుకాదు. తలదించుకోవలసిన అవసరం లేదు. జారిన ప్రతిసారీ తల ఎత్తి పట్టుదలగా ఆరోహించాలి. పట్టుపట్టరాదు... పట్టి విడువరాదు. అంటే ఇదే! సంకల్పిస్తే సాధించాల్సిందే. సాధించటం అంటే విజయాన్ని వరించటమే.

ఇలా విజయాన్ని చవి చూడాలంటే అన్ని ఓటములు మన జీవితంలోనే చోటు చేసుకోవాలని కాదు. అందరి అనుభవాలను సమంగా ఆదరించగలిగితే అవే మనకు గెలుపు పాఠాలు నేర్పుతాయి. విజయపథానికి మైలురాళ్లవుతాయి. విజయపథంలో మైలు రాళ్లను లెక్కించాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. 'మన లక్ష్యం ఏమిటి? మన గమ్మం ఏది?' అని గెలుపుకూ గెలుపుకూ మధ్య అయినా సరే, గెలుపు ఓటముల మధ్య అయినా సరే. ఇలా ప్రశ్నించుకోక తప్పదు. ఈ ప్రశ్నే సమాధానాన్ని అందిస్తుంది. సాధననూ నేర్పుతుంది, స్వశిక్షితుల్నీ చేస్తుంది.

- డా. వాసిలి వసంతకుమార్
యోగాలయ రీసెర్చ్ సెంటర్
ఫోన్ : 9393933946

Saturday, November 27, 2010

ఎందుకున్నామిక్కడ?

ఒక జూలో... ఒక తల్లి ఒంటె, ఒక పిల్ల ఒంటె రెండూ సేదతీరుతున్నాయి. ఉన్నట్టుండి పిల్ల ఒంటెకు ఒక సందేహం రావడంతో.... 'అమ్మా..మన పొట్టలో నీటి తిత్తి ఎందుకు ఉంటుంది?' అని అడిగింది తల్లిని.
'మనం ఎడారి జంతువులం కదా... నెలలు నెలలు నీళ్లు దొరక్కపోయినా బతకడానికి మన పొట్టలో నీటిని దాచుకుందుకు దేవుడు నీటి తిత్తిని ఏర్పాటు చేశాడు' అని సమాధానమిచ్చింది తల్లి.
'మరి మన కాళ్లు పొడుగ్గా....పాదాలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి?' ఇంకో సందేహాన్ని లేవనెత్తింది పిల్ల ఒంటె. ' ఇసుకలో నడిచేందుకు వీలుగా అలా ఉన్నాయి. మన కాళ్లు, పాదాలు ఇలా ఉండడం వల్లే ఇతర జంతువుల కన్నా చురుగ్గా, హాయిగా ఎడారిలో తిరగ్గలం మనం' గర్వంగా చెప్పింది తల్లి.
'మరి మన కంటి రెప్పల వెంట్రుకలెందుకు పొడుగ్గా ఉంటాయి చూపుకి అడ్డం పడేలా?' బుంగమూతితో ప్రశ్నించింది పిల్ల ఒంటె.
'పిచ్చి తల్లి.... కంటిరెప్పల వెంట్రుకలు అలా పొడుగ్గా ఉండబట్టే ఎడారిలో వీచే గాలికి ఇసుక మన కంట్లో పడకుండా రక్షణ ఉంటుంది' అనునయంగా వివరించింది తల్లి ఒంటె.
'ఓహో.. ఎడారిలో ఉండడానికి దేవుడు మన శరీరంలో ఇన్ని ఏర్పాట్లు చేస్తే... మరి మనం ఈ జూలో ఎందుకున్నామమ్మా....?' అమాయకంగా అడిగింది పిల్ల ఒంటె.

***

ఇవ్వాళ ఎందరికో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మనుషులుగా మనం నేర్వాల్సిందేమిటి, నేర్చుకున్నదేమిటి, చేయాల్సిందేమిటి, చేస్తున్నదేమిటి, మనుషులుగానే స్థానభ్రంశం చెందుతున్నామా....
పిల్ల ఒంటెకున్న పాటి తెలివి కూడా మనకు లేకుండా పోతోందే!

నాన్నకో లేఖ

ఏదో పని మీద కొడుకు గదిలోకి వెళ్లిన తండ్రికి స్టడీ టేబుల్ మీద కొడుకు రాసిన ఉత్తరం కనిపించింది. ఏంటా అని తీసి చదవడం మొదలుపెట్టాడు తండ్రి..


డియర్ డాడ్...
ఈ విషయాలన్నీ మీకు చెప్పాలంటే బాధగానే ఉంది. కాని చెప్పక తప్పడం లేదు. నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. రోజూ ప్రతి చిన్న విషయానికి నువ్వూ, అమ్మా పోట్లాడుకోవడాలు, అరుచుకోవడాలు.. నన్ను చాలా డిస్ట్రర్బ్ చేస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతత కరువవుతోంది. దాన్ని బయట వెదుక్కునే ఆరాటంలో ఉన్నాను. నన్ను ప్రేమగా చూసుకోవడానికి నా కన్నా పెద్దదైన ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. సరదాలు, అల్లర్లు పంచుకోవడానికి ఫ్రెండ్స్, పబ్బులు, క్లబ్బులు ఉండనే ఉన్నాయి. చదువు సంధ్యలు, భవిష్యత్ బెంగలు.. గట్రా మరిచిపోయి ఆనందంగా... గాల్లో తేలిపోవడానికి కొకైనూ అందుబాటులో ఉంది. 
వీటన్నిటినీ అనుభవిస్తూ.... 
హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను డాడీ.... .
నా కోసం వెదకొద్దు.


పిఎస్:  డాడీ.... పైన నేను రాసిన విషయాలన్నీ నా స్టడీ టేబుల్ సెంటర్ డ్రాలో ఉన్న నా ప్రోగ్రెస్ రిపోర్ట్‌లోని మార్కులకన్నా భయంకరమైన విషయాలు. అవన్నీ అబద్దం . నేను ఎక్కడికీ వెళ్లలేదు. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. మంచి, చెడుల విచక్షణ నాకుంది. విచక్షణను అందించేదే కదా...విజ్ఞానం. మరి దీనికి మార్కులు కొలమానమా డాడీ....? ఇది అర్థం చేసుకున్నాక, మీ కోపం తగ్గాక కాల్ చేయండి. 
క్షణంలో మీ ముందుంటాను.
లవ్ యూ డాడీ....  
మీ అబ్బాయి

Sunday, November 7, 2010

స్నేహంతోనే ముందంజ

'వీడికి ఫ్రెండ్స్ చాలా ఎక్కువయ్యారు... అందుకే చదువు తక్కువయ్యింది. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్‌తో కబుర్లే గానీ చెప్పిన మాట ఒక్కటీ పట్టించుకోడు కదా......' అంటూ తమ పిల్లల గురించి కంప్లెయింట్ చేసే తల్లిదండ్రులను చాలామందిని చూస్తూనే ఉంటాం.

స్నేహితులు ఎక్కువగా ఉంటే పిల్లలకు చదువు ధ్యాస తక్కువగా ఉంటుందని, ఆటలపైనే మోజుంటుందని చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. కానీ ఇటీవలి అధ్యయనాలు ఇందుకు విరుద్ధమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. బడికి వెళ్లే పిల్లలకు ఎంత ఎక్కువమంది ఫ్రెండ్స్ ఉంటే చదువులో వాళ్లు అంత ముందంజలో ఉంటారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు అధ్యయనకారులు.

పిల్లలు ఎక్కడికి వెళ్లినా ఇట్టే ఫ్రెండ్‌షిప్ చేసేస్తారు. ఇంటి చుట్టుపక్కల, బంధువుల పిల్లలు ఇలా వారి జాబితా పెద్దదే. వయసుతో పనిలేకుండా తమ కన్నా పెద్దవాళ్లతో కూడా ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్లూ ఉంటారు. అయితే ఒకే స్కూల్‌లో, ఒకే క్లాస్‌లో చదువుతున్న పిల్లల మధ్య ఉన్న స్నేహం వారి అభ్యున్నతికి మరింత బాగా సహకరిస్తుందంటున్నారు

కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన మెలిస్సా విట్‌కోవ్. స్కూల్‌కి సంబంధించిన పనులు, హోమ్‌వర్క్, పాఠాల్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు, టీచర్లు చేయించే యాక్టివిటీస్.... ఇలా వీళ్లకి ఒకే రకమైన లక్ష్యాలు, ఇబ్బందులు ఉంటాయి. వీరంతా ఒకే రక మైన వాతావరణంలో పెరగడం, చదువుకోవడం వల్ల ఒకరి సమస్యలు ఒకరు షేర్ చేసుకోగలుగుతారు.

సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. కంప్లీట్ చేయాల్సిన పనులు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. కాబట్టి చదువులో ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు ఒకరికొకరు సహకరించుకోవడం సులువవుతుంది. వారి మిత్రబృందంలో సభ్యులు ఎక్కువగా ఉంటే ఎక్కువ అభిప్రాయాలను షేర్ చేసుకోగలుగుతారు.

అందరికీ ఒకే సమస్య రావడం వల్ల దాని గురించి అందరూ చర్చిస్తారు. అలాంటి చర్చల వల్ల పిల్లల మానసిక పరిణతి పెరుగుతుంది. సమస్యను ఎదుర్కోగలిగే ధైర్యం అలవడుతుంది. చదువులో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అధిగమించగలుగుతారు. తద్వారా ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు.

అందుకే ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం ఉండొద్దని పిల్లల్ని గిరిగీసి కూర్చోపెట్టవద్దని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. సో! ఇకనుంచీ మీరు కూడా మీ పిల్లల స్నేహాన్ని ప్రోత్సహించండి. అలాగని చెడ్డ స్నేహాలను కూడా ఓ కంట కనిపెడుతూ ఉండండి మరి.