గురు భావాన్ని తిరస్కరించిన జిడ్డు కృష్ణమూర్తి
ఆధునిక కాలంలో అనేకమంది ఆధ్యాత్మిక గురువులు మనకు కనుపిస్తారు. అయితే గురువు అనే పదప్రయోగం లేకుండా తన ఆధ్యాత్మిక బోధలను సాగించిన మహావ్యక్తి జిడ్డు కృష్ణమూర్తి. ఆయన సమకాలీకులైన గురువులు ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలను స్థాపించడానికి పోటీలు పడుతుండగా జిడ్డు కృష్ణమూర్తి మాత్రం తన బోధల పట్ల ఆసక్తులైన వారికి మార్గదర్శనం చేస్తూ గురువు అనే పదాన్ని కూడా తన దాపులలోకి రానివ్వలేదు. తన స్వానుభవం నుంచి తెలుసుకున్న విషయాన్నే ఆయన బోధిం చారు. ఏదో ఒక మతం, మార్గం లేదా ఒక పంధాను అనుసరించడం ద్వారా సత్యాన్ని చేరుకోలేమని, సాధకుడు తన ఆవిష్కారాల ద్వారా మాత్రమే దానిని కనుగొనగలుగుతాడని ఆయన అంటారు. సాధకుడు తన అనుభవాల చట్రం నుంచి బయటపడి, సత్యమైనదానిని గుర్తించే చైతన్యాన్ని అవరోధపరిచే ఆలోచనా స్రవంతిని నెమ్మదింప చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన అంటారు.
జిడ్డు కృష్ణమూర్తి జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు 1895, మే 12వ తేదీన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి నాటి బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి. ఎనిమిదవ బిడ్డగా జన్మించిన అతడికి వారు కృష్ణుడి పేరు పెట్టుకున్నారు. తల్లి సంజీవమ్మ ఆయనకు పదేళ్ళ వయస్సులోనే మరణించింది. ఆయన కుటుంబం 1903లో కడపలో స్థిరపడింది. అక్కడే ఆయనకు మలేరియా వ్యాధి సంక్రమించి అనేక సంవత్సరాలు వెంటాడింది. చిన్నతనం నుంచి ఆయన స్తబ్దుగా, రోగగ్రస్తు డై ఉండడంతో అతడిని మానసిక వికలాంగుడని భావించేవారు. అతడి స్తబ్దత కారణంగా అటు పాఠశాలలో ఉపాధ్యాయుల చేతిలోను, ఇంట్లో తండ్రి చేతిలోనూ దెబ్బలు తినవలసి వచ్చింది. 1907లో పదవీ విరమణ చేసిన నారాయణయ్య పెద్దగా సంపాదించకపోవడంతో జీవనం కోసం తనకు దివ్యజ్ఞాన సమాజంలో ఉద్యగం ఇవ్వవలసిందిగా దాని అధ్యక్షురాలు అనిబిసెంట్‌కు లేఖ రాశారు. స్వతహాగా సంప్రదాయ బ్రాహ్మణుడు అయినప్పటికీ నారాయణయ్య 1882 నుంచీ దివ్యజ్ఞాన సమాజం సభ్యునిగా కొనసాగారు. ఆయన అభ్యర్ధనను మన్నించి ఆనిబిసెంట్ ఉద్యోగం ఇవ్వడంతో 1909 జనవరిలో తన కుటుంబాన్ని ఆడయార్‌కు మార్చారు. మొదట్లో నారాయణయ్యకు దివ్యజ్ఞాన సమాజం ఆవరణ బయట చిన్న ఇంటిని ఇచ్చారు. సరైన పారిశుద్ధ్యం లేని ఆ ఇంట్లో ఉండడం వల్ల కృష్ణమూర్తి, ఆయన సోదరులు రోగగ్రస్థులయ్యారు. అడయార్‌కు వచ్చిన కొద్ది నెలల తర్వాత కృష్ణమూర్తి తొలిసారి చార్లెస్ వెబ్‌స్టర్ లెడ్‌బీటర్‌ను కలిసారు. తొలిసారి కృష్ణమూర్తిని చూసిన లెడ్‌బీటర్ కృష్ణమూర్తిలో నిస్వార్ధ కాంతిమండలం(ఆరా)ను చూశారట. బాహ్యంగా అత్యంత నిస్తేజంగా కనిపించే అతడు గొప్ప ఆధ్యాత్మిక గురువు, వక్త కాగలడని లెడ్‌బీటర్ స్థిరంగా నమ్మాడు. ఈ నమ్మకంతోనే కృష్ణమూర్తిని అడయార్‌లోని థియొసాఫికల్ సొసైటీ పెద్దలు తమ పెంపకంలో తీసుకున్నారు.
కృష్ణమూర్తిని జాగ్రత్తగా చూసుకుంటూ, అతడికి విద్యా బోధన చేస్తూ ప్రపంచ గురువుగా తయారు చేయాలని లెడ్‌బీటర్ తన సహచరులను ఆదేశించారు. తన భౌతిక స్థితి అస్థిరంగా ఉన్నప్పటికీ పద్నాలుగేళ్ళ కృష్ణమూర్తి ఆరు నెలలోనే ఇంగ్లీషు లో రాయడం, చదవడం నేర్చుకున్నారు. ఈ సమయంలోనే కృష్ణమూర్తికి ఆనిబిసెంట్‌తో గాఢమైన సంబంధం ఏర్పడింది. ఆమె ఆయనకు మారు తల్లి అయింది. 1911లో దివ్యజ్ఞాన సమాజం ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థను ఏర్పాటు చేసింది. దానికి కృష్ణమూర్తిని అధిపతిగా చేశారు. ప్రపంచ గురువు రాకను ఆమోదించిన వారందరికీ అందులో సభ్యత్వం ఇచ్చారు. అయితే ఆనతికాలంలోనే అది సొసైటీలోనూ, బయట కూడా వివాదమైంది. అయినప్పటికీ కృష్ణమూర్తిని ఆయన సోదరుడు నిత్యను 1911 ఏప్రిల్ నెలలో ఇంగ్లాండ్ తీసుకొని వెళ్ళారు. ఈ పర్యటనలో భాగంగానే ఆయన తన తొలి ఉపన్యాసాన్ని ఇచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేలోగా ఆయన అనేక ఇతర ఐరోపా దేశాలలో పర్యటించారు. యుద్ధం తర్వాత కూడా కృష్ణమూరర్తి అనేక ఉపన్యాసాలు, సమావేశాలు, చర్చలలో పాల్గొన్నారు. అయితే అప్పట్లో ప్రధానంగా అవన్నీ ఆర్డర్ సంస్థ చుట్టూ తిరిగేవి.
దాదాపు పదకొండేళ్ళ అనంతరం అంటే 1922లో ఆయన కాలిఫోర్నియాలోని ఒజాయ్‌లో ఉన్నప్పుడు జీవితాన్ని మార్చివేసే ఆధ్యాత్మిక అనుభవాన్ని చవిచూశారు. ఈ అనుభవం ఆయనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానసిక పరివర్తనను కలిగించింది. అయితే సొసైటీలో పెద్దలు ఆయనకు ఇతర శక్తులు వస్తాయని ఆశించి నిరాశపడ్డారు. మొత్తం మీద 1925లో ఆయనకు దివ్యజ్ఞాన సమాజం పట్ల దాని నాయకుల పట్ల విశ్వాసం పోయింది. సోదరుడి మరణం, అంతర్గతంగా చోటు చేసుకున్న విప్లవం ఆయనను పూర్తిగా మార్చివేశాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణమూర్తి వ్యవస్థాగత విశ్వాసాలను, గురు పరంపర, గురు శిష్య సంబంధాలను తిరస్కరించారు. 1930లో ఆయన ఆర్డర్ నుంచి దివ్యజ్ఞాన సమాజం నుంచి విడివడ్డారు.
ఆలోచనలు నూతన అంశాలను కనుగొనలేవు. కానీ ఆలోచనలు ఆగిపోయినప్పుడు కొత్త ఆవిష్కరణ జరిగే అవకాశముంది. అయితే దీనిని కూడా ఆలోచన అనుభవంగా, పాతదానిగా మార్చివేస్తుంది అంటారు కృష్ణమూర్తి. అనుభవానికి అనుగుణంగా ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ, ఆపాదనలు చేస్తూ ఉంటాయి. ఆలోచన విధి దానిని తెలియచేయడమే కానీ ఒక అంశాన్ని అనుభవిస్తూ ఉండడం కాదు. మనం ఒక అనుభవాన్ని ఆస్వాదించడం ఆగిపోయినప్పుడు ఆలోచన ప్రవేశించి దానిని మనకు తెలిసిన విషయాల కేటగిరీలో చేరుస్తుంది. ఆలోచన తెలియదానిలోకి ప్రవేశించలేదు. అందుకే దానికి వాస్తవమైనది అనుభవంలోకి రాదు అంటారు ఆయన.
త్యజించడాలు, నిర్లిప్తత, మత కర్మకాండలు, ధర్మాన్ని పాటించడం అనేవి ఎంత గొప్పవైనప్పటికీ అవన్నీ కూడా ఆలోచనా ప్రక్రియలే. అయితే ఆలోచన అనేది మనకు తెలిసిన దానిని సాధించడానికి ఒక వాహికగా మాత్రమే ఉండగలదు. విజయం లేదా సాధించడమనేది తెలిసిన దానిలో రక్షణ పొందడమే. తెలియని దానిలో రక్షణ పొందాలనుకోవడమంటే దానిని తిరస్కరించడమే. మనకు లభించే రక్షణ మనకు తెలిసిన, గతకాలపు అనుభవానికి పొడిగింపుగానే ఉంటుంది అని కృష్ణమూర్తి చెప్తారు. ఈ కారణంగానే మనస్సు అనేది లోతైన నిశ్శబ్దంలో ఉండాలి. అయితే ఈ నిశ్శబ్దాన్ని త్యాగం ద్వారానో, శరణాగతి ద్వారానో, అణచివేయడం ద్వారానో కొనుగోలు చేయలేవని హెచ్చరిస్తారు.
ఆ నిశబ్దమనేది నువ్వు ఏదీ కోరుకోనప్పుడు, ఏదో కావాలనుకోనప్పుడు మాత్రమే లభిస్తుంది. సాధన ద్వారా ఈ నిశబ్దాన్ని సాధించలేం. ఈ నిశబ్దమనేది మనసుకు పూర్తిగా తెలియనిది అయి ఉండాలి. ఒకవేళ మనసుకు ఈ నిశబ్దం అనుభవంలోకి వచ్చిందంటే గతకాలపు నిశబ్దాన్ని వ్యక్తి అనుభవించాడన్నమాట. వ్యక్తి అనుభవిం చిన ఆ అనుభూతి కేవలం పునరుక్తం అవుతోందని అర్థం. మనస్సు నూతనత్వాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. అందుకే మనస్సనేది ఎప్పుడూ శూన్యస్థితిలో ఉండాలి. అయితే అది ఎటువంటి అనుభవాలనూ ఆస్వాదించకుండా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అంటే అది ఏ అనుభవానికీ పేరు పెట్టకుండా, దానిని జ్ఞాపకపు పుటలలో దాచకుండా ఉంచినప్పుడే ఈ శూన్యత లేదా నిశ్శబ్దం సాధ్యమవుతుందని ఆయన బోధించారు.
మన చైతన్యంలోని వివిధ పొరలలో ఈ రికార్డింగ్ అనేది జరుగుతుంటుంది. బాహ్యంగా మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ అంతర్గత మనస్సు తెలిసిన విషయాలను గుర్తు చేస్తుంటుంది. చైతన్యమంతా అనుభవాల నుంచి బయటపడినప్పుడు మాత్రమే సత్యం అనుభవంలోకి వస్తుంది. అయితే స్వేచ్ఛగా ఉండాలనే ఈ కోరిక మళ్ళీ సత్యాన్ని గుర్తించేందుకు అడ్డంకి కాగలదు. సత్యానికి కొనసాగింపు ఉండదు. అది ఎప్పుడూ తాజాగానే ఉంటుంది. క్షణ, క్షణానికి ఉంటుంది. కొనసాగింపు ఉన్నదానిని ఎప్పుడూ సృష్టించలేం.
మనస్సు శూన్యతను పొందినప్పుడు అనుభవం పొందేవారు ఉండరు. ఇందులో ఎటువంటి అలజడి ఉండదు. బాహ్యప్రపంచంలో జరిగేవి జరుగుతున్న వాటిని అలా స్వీకరిస్తూ కొనసాగుతుంటుంది. అంతేతప్ప గతంలోని అనుభవాలను గుర్తు చేసుకోదు. దీనిని మాటలలో చెప్పలేం.
ఈ స్థితిలో మనస్సు కార్యకలాపాలు పూర్తిగా ఉండవు. ఇది ఆద్యంతాలు లేనిది. అలా అని ఇది కొనసాగింపు కాదు. ఈ నిశ్శబ్ద స్థితిలో అన్ని పోలికలూ మాయమవుతాయి. ఇది కనుక భ్రాంతి అయితే మనస్సు దానిని తిరస్కరించడమో లేదా దానినే పట్టుకు వేళ్ళాడలని కోరుకోవడమో జరుగుతుంది. నిజమైన నిశ్శబ్దానికి, శూన్యతకు మనస్సుతో సంబంధం ఉండదు కనుక అది దానిని ఆమోదించడమో తిరస్కరించడమో జరుగదు. ఇది మాటలతో కొలవలేనిది అన్న కృష్ణమూర్తి ఉపన్యాసాలు ఎన్నో పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఏ మతాన్ని, ఏ పద్ధతిని బోధించని కృష్ణమూర్తికి శిష్యగణం తక్కువ లేదు. తన జీవితమంతా వ్యక్తులు సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకున్న కృష్ణమూర్తి తన చివరి ఉపన్యాసాన్ని 1986 జనవరిలో మద్రాసులో ఇచ్చారు. మరుసటి నెలలోనే కాలిఫోర్నియాలోని ఒజాయ్‌లో తన గృహంలో ఆయన మరణించారు.

- జి. అనఘ
No comments:
Post a Comment