మరణం...
దేశభక్తికి ఇది అత్యున్నతమైన బహుమతి. దాన్ని సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా దేహాన్ని నాశనం చేయడం ద్వారా ఈ దేశంలో తాము సురక్షితంగా ఉండగలమని వారు అనుకుంటున్నారు. వాళ్లు నన్ను భౌతికంగా అంతమొందించవచ్చు, నా భావాలను అణచి వేయలేరు.
అలా మాట్లాడటం, మాట మీద నిలబడ్డట్టే ఉరికొయ్య ముందు ధిక్కారంగా నిలబడటం భగత్‌సింగుకే సొంతం. సాహసం అతడి స్వభావం. సంచలనం అతడి సిద్ధాంతం. చనిపోయిన తర్వాత కూడా జీవించడమే జీవితానికి అసలైన అర్థమైనప్పుడు, బతికినంతకాలం అందరి కన్నా విభిన్నంగా బతకాలనుకున్నాడు భగత్‌సింగ్.
అణువణువునా దేశభక్తిని నింపుకున్న భగత్, స్వాతంత్య్ర సమర యోధుడు లాలాలజపతిరాయ్ చావుకి కారణమయ్యాడన్న కోపంతో సాండర్స్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని కాల్చి చంపాడు. సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేసి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదించాడు. పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి ఇరవై మూడేళ్లకే ఉరికొయ్యపై విప్లవ గీతమై వేలాడాడు. స్వేచ్ఛా పోరాటాలకు వేగుచుక్కలా నిలిచాడు.
..............
ఒకడి జీవితాన్ని అతడి చావే నిర్ణయిస్తుంది. సిద్ధాంతం ఏదైనా కావచ్చు, ఆదర్శాలేమైనా అవ్వొచ్చు. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. అందుకే కొంతమంది చనిపోయిన తర్వాత జీవిస్తారు.
జీవితమంతా గెరిల్లాగా జీవించిన వీరుడు చేగువేరా. అతడు ప్రజా ఉద్యమాల్లోకి కాంతి వేగంతో విస్తరించాడు. అట్టడుగు జనంలోకి సూర్య కిరణంలా చొచ్చుకుపోయాడు. శత్రువు గుండెల్లోకి బుల్లెట్‌లా దూసుకుపోయాడు. అందుకే ‘లీడర్’ కాగలిగాడు. నరాల్లో అణువణువునా నెత్తురు బదులు లావా ప్రవహిస్తున్నట్టుగా, మాటల తూటాలు పేల్చేస్తున్నట్టుగా, డైనమైట్‌కు ప్యాంట్ చొక్కా తొడిగినట్టుగా ఉంటాడు. ఎక్కడో అర్జెంటీ నాలో పుట్టి, క్యూబాలో పోరాడి, బొలీవియా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సాహసి అతడు. ముప్ఫై తొమ్మిదేళ్ల అతడి దేహం మట్టిలో కలిసిపోయినా, ‘చే’ లైఫ్ కోట్లాది హృద యాల్లో లైఫ్‌సైజ్ పోస్టర్‌లా నిలిచిపోయింది.
..............
మార్షల్ ఆర్ట్స్‌కు మీనింగ్ బ్రూస్లీ. చైనీస్ యుద్ధ కళలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన యోధుడు బ్రూస్లీ. తన స్టైల్ ఆఫ్ ఫైట్స్‌తో కొన్ని జనరేషన్స్‌ను ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. హాంకాంగ్‌లో ఓ చిన్న కుటుంబంలో పుట్టిన బ్రూస్లీకి పరిస్థితులు పోరాటం నేర్పాయి. వీధి పోరాటాల్లో ఆరితేరిన బ్రూస్లీ, హాలీవుడ్ స్క్రీన్‌పై పిడుగులా విరుచుకు పడ్డాడు. నాలుగే నాలుగు సినిమాలు. బ్రూస్లీ స్టార్ అయిపోయాడు. స్క్రీన్ మీద ఒక్కడే వందమందిని మట్టి కరిపించడం చూసి అతన్ని ‘ఐరన్ మ్యాన్’ అని ఆరాధించారు. 1972 జూలైలో ఓ సాయంత్రం పూట బ్రూస్లీ మరణించాడన్న వార్త తెలిసి, ప్రపంచం నివ్వెరపోయింది. 33 ఏళ్ల బ్రూస్లీ ఊపిరి ఆగిందని తెలిసి మరణమే చిన్నబోయింది.
..............
మనుషుల మధ్య దేవత మార్లిన్ మన్రో. ఆమె ఈ భూమ్మీద బతికింది ముప్ఫై ఆరేళ్లు. బతికినంత కాలం తన అందంతో ప్రపంచాన్ని వేడెక్కించింది. ఈ వెండితెర వెన్నెల, తన గ్లామర్‌తో పట్టపగలే చుక్కలు చూపించింది. కష్టాల్ని పలకరిస్తూ, కన్నీళ్లను బుజ్జగిస్తూ, ప్రపంచపు వాకిటిలో గులాబీ పూవై విరిసింది. చాలా చిన్న వయసులో సెలబ్రిటీ స్టేటస్‌ను అందుకుంది. ఆమె కన్ను మూయడంతో, 1962 ఆగస్టు 5 ఉదయం కళ్లు తెరిచింది. అందుకోవడానికి ఇక ఏమీ లేనప్పుడు, మనసు అర్థం చేసుకోవడానికి ఎవరూ రానప్పుడు మార్లిన్ మృత్యువు ఒడిలో సేద తీరింది. మూవీస్‌కే కాదు, మృత్యువుకూ ఆమె గ్లామర్ తెచ్చింది.
..............
మానవసేవయే మాధవసేవ అన్నది స్వామి వివేకానంద ఉనికి. ఆయన హిందూ మతధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన సిద్ధాంతి. భారతీయ ఆధ్యాత్మికత అన్ని అంచులూ చూసిన వేదాంతి. వెస్ట్రన్ లాజిక్, ఫిలాసఫీ, యూరప్ దేశాల చరిత్ర అధ్యయనం వివేకానందుని ఆలోచనా పరిధిని విస్తృతం చేశాయి. నరేంద్రనాథ్ దత్తా వివేకానందుడిగా ఎదిగిన క్రమంలోని ప్రతి మలుపూ ఆయన్ని గాడ్స్‌మన్‌గా మార్చింది. చికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన ప్రతి మాట, భారతీయ సంస్కృతి విలువల్ని విశ్వవ్యాప్తం చేసింది. ముప్ఫై తొమ్మిదేళ్ల వయసులో ఈ ప్రపంచాన్ని వీడినా, ఆయన తరతరాల భారత చరిత్రపై చెరగని ముద్ర వేశారు.
..............
బ్యూటీకి సినానిమ్, గ్లామర్‌కి న్యూ డెఫినిషన్ మధుబాల. తన అందంతో లక్షలాది అభిమానులను సంపాదించుకున్న అద్భుత సౌందర్యరాశి. తన నవ్వుల్తో కోట్లాది మంది అభిమానుల్ని మత్తులో ముంచెత్తిన మెస్మరైజింగ్ స్టార్. ప్యార్ కియాతో డర్‌నా క్యా... అంటూ ప్రేమను ప్రేమించి, ప్రశ్నించి నిజమైన ప్రేమ కోసం ఆరాటపడి, అలిసిపోయి, ముప్ఫై ఆరేళ్లకే జీవితాన్ని ముగించింది. గాయాల్ని తన వెంట తీసుకెళ్లి, అందమైన జాపకాల్ని మిగిల్చి వెళ్లింది.
..............
ప్రతి కళాకారుడికీ ఎంతో కొంత వెర్రి ఉండాలి. విన్సెంట్ వ్యాంగోకు పెయింటింగ్ అంటే పిచ్చి. అతడు మొదటినుంచీ చాలా ఎమోషనల్. ఏ ఉద్యోగంలోనూ ఇమడలేక పోయాడు. చివరికి తన భావాలను ఎక్స్‌ప్రెస్ చేయడానికి, పెయింటింగ్ పర్‌ఫెక్ట్ ఆర్ట్ అని నమ్మాడు. మనిషినీ ప్రకృతినీ తన ఎక్స్‌ప్రెషనిస్ట్ స్టైల్‌లోకి చాలా అందంగా మోసుకొచ్చాడు. తన చివరి మూడేళ్లలో అత్యుత్తమమైన కళాఖండాల్ని సృజించాడు. ఈ ప్రపంచంతో పొత్తు కుదరక, ముప్ఫై ఏడేళ్లకు ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానంతరం ఆయన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దొరికింది.
..............
ఈ ప్రపంచపు రహస్య దుఃఖం గురుదత్ సినిమాలు. సినీ మాయాప్రపంచంలో తిరుగుతూ, నిజమైన ప్రేమకోసం పరితపించిన సున్నిత హృదయుడు ఆయన. ప్రపంచ బాధ తన బాధగా ఫీలైన సెన్సిబుల్ ఫిలిం మేకర్. ప్యాసా, కాగజ్ కే పూల్, మిస్టర్ అండ్ మిసెస్ ఫిఫ్టీ ఫైవ్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా గురుదత్ పాపులర్ ఫిలిం మేకర్ అయ్యాడు. తన ముప్ఫై తొమ్మిదో యేట ఆత్మహత్య చేసుకున్నాడు.
..............
మరణమంటే చనిపోయిన తర్వాత నరాల్లో నెత్తురు కదలకపోవడం కాదు, బతికి ఉన్నప్పుడు అణు మాత్రం స్పందించక పోవడం. అందుకే అతడు ఒక ప్రవాహంలా కదిలాడు. అక్షర ప్రభంజనమై విరుచుకు పడ్డాడు.
కీట్స్ అంటే కవిత్వానికి కేరాఫ్ అడ్రస్ అని పేరు మోశాడు. సెకెండ్ జనరేషన్ రొమాంటిక్ మూమెంట్‌లో లార్డ్ బైరన్, పి.బి.షెల్లీలతో సమానంగా గుర్తింపు పొందాడు. చనిపోయేముందు నాలుగేళ్లలో ప్రచురితమైన కవిత్వం కీట్స్‌కు అపరి మితమైన పేరు తీసుకొచ్చింది. అందమే సత్యం, సత్యమే అందం అన్నది కీట్స్ అభిప్రాయం. అతడిని ‘ఎ న్యూ స్కూల్ ఆఫ్ పొయెట్రీ’ అని విమర్శకులు ప్రశంసించారు. 25 ఏళ్ల వయసులో క్షయ వ్యాధి అతన్ని మింగేసింది.
..............
మృత్యువు జీవితమంత సహజమైంది. కొన్ని మరణాలు పిల్లగాలిలా తేలిపోతుంటాయి. మరికొన్ని పెనుగాలిలా మనల్ని పట్టి కుదిపేస్తుంటాయి. అలాంటి వాళ్లే చనిపోయిన తర్వాత కూడా జీవిస్తారు.
ఇంగ్లండ్-ఫ్రాన్స్‌కు మధ్య జరిగిన వందేళ్ల యుద్ధంలో ఫ్రెంచి దేశపు సైన్యానికి నాయకత్వం వహించి, బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టిన ధీర వనిత జోన్ ఆఫ్ ఆర్క్. దేవుడి ఆజ్ఞగా భావించి, ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా యుద్ధ రంగంలోకి దూకింది. శత్రువులు చుట్టుముట్టినప్పుడు లొంగి పోకుండా, చివరిదాకా పోరాడింది. సైన్యం ఆమెను బంధించి, విచారణ జరిపి మంటల్లో తగులబెట్టింది. పందొమ్మిదేళ్లకే మృత్యువు అంచులకు వెళ్లిన జోన్ ఆఫ్ ఆర్క్‌ను తర్వాత దేవదూతగా కీర్తించారు.
..............
చారిత్రక అవసరంలోంచి పుట్టుకొచ్చిన అగ్నికణం అల్లూరి. అతడు కాలం మలిచిన విప్లవకారుడు, అణచివేతల నుంచి ఉద్భవించిన ఉద్యమకారుడు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం విశాఖ కొండల్లో అడుగుపెట్టిన అల్లూరి, అనివార్యంగా ఆయుధం పట్టాల్సి వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులను నిలువు దోపిడీకి గురిచేస్తున్న ఆంగ్లేయుల దుర్మార్గాన్ని స్వయంగా చూసిన ఆయన, ఏజెన్సీ విముక్తికి పోరాట మార్గాన్ని ఎంచుకున్నాడు. విప్లవానికి వ్యూహం అవసరం, పోరాటానికి ఆయుధాలు అవసరం, నాయకుడికి సాహసం అవసరం.
అందుకే రామరాజు ఆయుధాల కోసం పోలీస్‌స్టేషన్‌లపై దాడి చేశాడు. అతని సాహసం ముందు బ్రిటిష్ సైన్యం నిలువెల్లా వణికిపోయింది. తన పోరాటంలో అమాయకులను బలిచేయవద్దని భావించిన రామరాజు పోలీసులకు లొంగిపోయాడు. లక్ష్యం కోసం 27 ఏళ్లకు సీతారామరాజు తన జీవితాన్ని ముగించాడు. ప్రజల కోసం ప్రాణాలిచ్చిన ఆ వీరుడి త్యాగం వృథాకాలేదు. ఆ విప్లవ వీరుడి స్ఫూర్తి లక్షలాది భారతీయుల్లో స్వేచ్ఛాకాంక్షను రగిల్చింది.
.................
వీళ్లకు మరణం కామా మాత్రమే, ఫుల్‌స్టాప్ కాదు.
శత్రువుకు చిక్కకుండా తుపాకీతో కాల్చుకుని చావును వెక్కిరించిన చంద్రశేఖర్ ఆజాద్, స్పానిష్ యుద్ధంలో నేలకొరిగిన అక్షరయోధుడు క్రిస్టఫర్ కాడ్వెల్, పేదల కోసం పోరాట బాట పట్టి పందొమ్మిదేళ్లకే హత్యకు గురైన పెరూ కమ్యూనిస్ట్ నాయకురాలు ఎడిత్ లాగోస్, రాక్ మ్యూజిక్ స్టార్ జిమ్‌మారిసన్, జర్మన్ అస్తిత్వవాద రచయిత ఫ్రాంజ్ కాఫ్కా, బ్రిటిష్ రచయిత్రి అన్నే బ్రాంటే...
ఎవరైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు.. ఒక సంకల్పంతో, స్పిరిట్‌తో కొత్త జీవితాన్ని కలగంటున్నప్పుడు స్ట్రగుల్స్ ఎదురవు తుంటాయి. పెయిన్స్ పలకరిస్తుంటాయి. అప్పుడప్పుడు జీవితం కందిపోయేంత గట్టిగా మృత్యువు కౌగిలించు కుంటుంది. స్ట్రగుల్స్‌ను ఫేస్ చేయగలిగిన వాళ్లకు మాత్రమే మృత్యువు సలామ్ చేసి, గులామ్ అవుతుంది.
భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ మరణించినప్పుడు ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ స్పందిస్తూ,
జిస్ తేజ్ సే కోయి ముక్తాల్ మే గయా వో షాన్ సలామత్ రహతీ హై
యే జాన్ తో అన్ జానీ హై ఇస్ జాన్ కీ కోయి బాత్ నహీ
(
మృత్యువు ఎదురొచ్చినప్పుడు ఎంత హుందాగా వ్యవహరించారన్నదే ఎవరైనా గుర్తుంచుకుంటారు. ప్రాణానిదేముంది వస్తుంది, పోతుంది.)
No comments:
Post a Comment