Sunday, November 7, 2010

శంఖారావాలూ ... ఈలారావాలూ

'నాన్నా ... అర్జెంటుగా ఒక వంద శంఖాలు పట్టుకురా'
'శంఖాలా ... శంఖాలేమిటమ్మా?'
'అయ్యో శంఖాలు తెలియదా? శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదంటారు చూడు. ఆ శంఖాలురా' నాయనమ్మ తల దూర్చింది.
'అబ్బా ... ఆ సామెతలన్నీ వాళ్లకేం తెలుస్తాయి? నువ్వుండు. నేను చెపుతా. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పూరిస్తాడే అది రా అబ్బాయ్' తాతగారు కల్పించుకున్నారు.
'ఐ లవ్ యు' అని రాసి బీచిల దగ్గర అమ్మేవీ ఇవీ ఒకటేనా నాన్నా? వాటిల్లోనుంచి అంత శబ్దం వస్తుందా?'
'ఉండు ఊది చూపెడతా' ఎక్కడ్నించో ఒక బుజ్జి శంఖం తీసుకొచ్చి ఊదాడు ఆ అమ్మాయి తమ్ముడు.
తండ్రి ఉలిక్కిపడ్డాడు. తల్లి పరిగెత్తుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్లు గాభరాగా తొంగి చూశారు. అంత చిన్న శబ్దానికే అంత రెస్పాన్స్ రావటం చూసి ముగ్ధురాలయింది ఆ అమ్మాయి.

'నాన్నా మరిచిపోకు సాయంత్రం వచ్చేటపుడు తప్పకుండా తీసుకురా' మరీ మరీ చెప్పింది. కాని నాన్న తేలేదు. అమ్మా తేలేదు. అక్కా తమ్ముళ్లే కష్టపడి కొన్ని శంఖాలు పోగేసి, కొంతమంది పిల్లల్ని రప్పించి ఒక టేప్‌రికార్డర్ ముందు కూర్చున్నారు. ఒక్కొక్క శంఖం ఊదడం, అది ఎందుకు ఊదారో కారణం చెప్పడం ... చాలాసేపు సాగింది ఆ తతంగం.
శంఖాలు తక్కువై పిల్లలు ఎక్కువవడంతో కాసేపయ్యాక విజిల్స్ కూడా బయటకి తీశారు. శంఖారావంలో ఈలలు వేయొచ్చా అని కొందరు సందేహించారు. కాని ఆ పేపర్ యాడ్‌లో శంఖారావం పూరించండి అంటూ ఈల బొమ్మే వేసి ఉండడంతో ఈలారావాలకు వాళ్లు కూడా అంగీకరించారు.
ఎలాగైతేనేం క్యాసెట్ సిద్ధమైంది. ఈ లోగా దీపావళి సెలవు వచ్చేసింది. సత్యభామ దుష్టసంహారం గావించిన రోజు. అంతకంటే మంచి సందర్భం ఇంకేముంటుంది? అనుకున్నారు పిల్లలు.
టేప్‌రికార్డర్ ఆన్ చేసి దానికి మైక్ కనెక్షన్ ఇచ్చారు. ఇంట్లో, వీధిలో, షాపులో, స్కూల్‌లో, ఊర్లో, టౌన్లో, రాష్ట్రంలో, దేశంలో ... తమకు తెలిసిన మొత్తం అవినీతిపరులందరి పేర్లూ వరసాగ్గా వినబడసాగాయి శంఖ ఈలారావాల మధ్య.
వెంటనే ఏం జరిగిందో తెల్సా! ఆ వీధిలోనూ, పేటలోనూ ఉన్న పెద్దవాళ్లందరూ పిల్లల కోసం తెచ్చిన బాణాసంచా మొత్తం టపటపామని కాల్చి పారేశారు. అందుకే మీకెవరికీ ఆ పేర్లు వినిపించలేదు. అయినా ప్రకటన ఇచ్చిన ప్రభుత్వానికి గాని, మనకు గాని వాళ్ల పేర్లు తెలియకపోతేగా!

No comments: