కలలను, గమ్యాలను విడనాడొద్దు. ప్రఖ్యాత రచయిత పాల్ కోయిలో చెప్పినట్లుగా మీకే బలమైన కోరికుంటే, ప్రపంచంలోని అన్ని శక్తులు కుట్రపన్ని, కూడబలుక్కుని మీ కలలను సాకారం చేస్తాయి. కుట్రపన్ని.. ఎంతో పవర్‌ఫుల్ శక్తివంతమైన పదప్రయోగం. ఎంత గట్టి నమ్మకం లేకపోతే పాల్ కోయిలో దీన్ని వాడుంటాడు. ది వరల్డ్ లవ్స్ ఎ లవర్ అనేది నానుడి. ప్రేమికులను ప్రపంచం ప్రేమిస్తుందని.. అలాగే కలలు, గమ్యాలు కల వారికి ప్రపంచంలోని అన్ని శక్తులు సహకరిస్తాయి.
తయబ్ మెహతా ఈ మహాశయునికి తన కల నిజమైంది ఎనభయ్యోపడిలో ప్రవేశిస్తున్న తరుణంలో. తయబ్ మెహతా.. నెమ్మదస్తుడు. నిరహంకారి. పెయింటర్. పేరు ప్రఖ్యాతులున్న పెయింటర్ అనగానే ఎంతో గర్వంతో, అంటీ అంటనట్లు ఉంటారేమోననుకుంటాం. మన మనస్సులో సృష్టించుకున్న పెయింటర్ల రూపకల్పనకు పూర్తి విరుద్ధం తయబ్ మెహతా. పెయింటింగ్ తనకు స్పూర్తిదాయకమైంది. గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. కనుకే పెయింటర్ అయ్యాడు కాని ధనార్జన కోసం చేపట్టిన వృత్తి కాదు.
గత అధ్యాయం పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బులో ఈ విషయా న్ని కూలంకషంగా చర్చించుకున్నాం కదా. ఇదే జరిగింది తయబ్ మెహతా విషయంలో కూడా. ఖ్యాతి.. ఆపై ధనార్జన.. వృత్తిరీత్యా ముంబైలోని ఫేమస్ స్టూడియోలో ఎడిటర్‌గా పనిచేస్తుండేవాడు. అయితే ఆ ఉద్యోగం మూడునాళ్ల ముచ్చటే అయింది. మళ్లీ విద్యార్ధిగా మారాడు ముంబైలోని సర్ జెజె ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో చేరి పెయింటింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నాక పుంఖానుపుంఖాలుగా పెయింటింగ్స్ వేశాడు.
మధ్య తరగతి వర్గానికి చెందిన పలు పెయింటర్లలాగా తిండి, బట్టకే కాదు, పెయింటింగ్ చేసుకునే కాన్వాస్ కొనటానికి కూడా డబ్బు ఉండేది కాదు. పేరు ప్రఖ్యాతులు గడించాక న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు తయబ్.. ఎగ్జిబిషన్‌లో పెట్టేందుకు కావాల్సిన కాన్వాస్ కొనే స్థోమత కూడా కరువయ్యేది కొన్నిసార్లు.. అని. ఇంట్లో ఎప్పుడైనా తిండికి డబ్బుల్లేక పోతే పోన్లే ఈ రోజు పస్తుంటాను అని తయబ్ అంటే లేదు మనిద్దరం కలసి పస్తుందాం అనేదట ఆయన భార్య. భార్య సంపాదించేంది. తయబ్ పెయింట్ చేసేవాడు. ఇలా ఒక పుష్కర కాలం గడిచింది కష్టాల్లో, కడగండ్లతో.. చివరికి తయబ్ తన ఫస్ట్ పెయింటింగ్‌ను తన మిత్రుడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ ద్వారా పరిచయమైన వ్యక్తికి అమ్మాడు 30 అమెరికన్ డాలర్లకు.. అంటే 1,350 రూపాయలకు.
పోరాటం..పోరాటం.. జీవన పోరాటం... ఇలా సాగుతూనే ఉంది ఏళ్ల తరబడి తయబ్ జీవితంలో. తను 75వ వసంతంలో ప్రవేశిస్తున్న తరుణంలో, గుర్తింపు అదీ అంతర్జాతీయ ప్రమాణాల్లో లభించింది. ఆ గుర్తింపుతో పాటు లక్ష్మీ కటాక్షం. సెలబ్రేషన్ అనే ఆయన సృష్టి మూడు లక్షల అమెరికన్ డాలర్లకు విక్రయించబడింది. నేటి రేట్ల ప్రకారం కోటి ముప్ఫై లక్షల రూపాయలన్నమాట. ఆ తర్వాత మరో విక్రయం.. క్రిస్టీస్ న్యూయార్క్అనే అంతర్జాతీయ వేలం పాడే సంస్థ తయబ్ మహిషాసుర అనే సృష్టిని 1.58 మిలియన్ అమెరికన్ డాలర్లకు విక్రయించింది. అంటే దాదాపు ఏడు కోట్ల రూపాయలు. ఇది రికార్డులను బద్దలు కొట్టిన విక్రయం.
ఏ భారతీయ పెయింటర్‌కైనా ఒక మిలియన్ డాలర్ల మూల్యం లభించిన ప్రథమ సందర్భం ఇదే. అంటే ఈ రంగంలో ఒక నూతన శకానికి నాంది పలికిన విక్రయం దాన్ని తయబ్ ఎనభయ్యో పడిలోకి ప్రవేశిస్తూ సాధించాడు. అందుకే చెప్పేది మాటిమాటికి, మరోసారి, మరోసారి అని ఆశను, గమ్యాన్ని కోల్పోకుండా మనం ముందుకు సాగిపోతూనే ఉండాలి. కలల్ని గుండెల్లో భద్రంగా పదిలపరచుకొని. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు కాని తప్పక వస్తుందనేది మాత్రం నిజం, ముమ్మాటికీ నిజం. మన నిరీక్షణ సాగిపోతూనే ఉండాలి.
మహిషాసుర రూ.7 కోట్లు
Mahishasura – sold for $1,280,900
తయబ్ జీవిత కాలం కృషికి ప్రతిఫలం.. పేరు ప్రతిష్ఠ, లక్ష్మీ కటాక్షం.. ఆయన డెభ్భై ఏడో వసంతంలోకి అడుగిడబోతుండగా లభించింది. మీకు, నాకు ఎంతో తొందరగా లభ్యం కావచ్చు లేదా ఆలస్యంగానైనా. తన పెయింటింగ్‌కి ఎన్నో కోట్ల ధర పలికిందన్న వార్త సంతోషం కన్నా ఒక తమాషాలాగా, విచిత్రంగా గోచరించింది తయబ్‌కి. ఒక ఇంటర్వ్యూలో ఈ గుర్తింపు నా జీవితంలోనే జరిగినందుకు సంతోషంగా ఉంది. నా వయస్సు ఎనిమిది పదులు. ఎప్పుడైనా పైనుంచి పిలుపు రావచ్చు. ధనవంతుల వాళ్లకిష్టమైన ధరకు నా పెయింటింగ్స్‌ను కొనుక్కోవచ్చు అది వాళ్లిష్టం అన్నాడు తయబ్. తయబ్ జీవిత అనుభవాలు మనకు మార్గదర్శకాలవ్వాలి.
నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా మనపని మనం చేసుకుంటూ ఉండాలి. కలల్ని సజీవంగా ఉంచుకోవాలి. మరోసారి అం టూ అలుపెరగకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. పదేపదే ఈ విషయాన్నే వత్తివత్తి ఎందుకు చెబుతున్నానంటే కొంచెం నిరాశ నిస్పృహలకే గమ్యాలను వదలి కొత్త దోవలను ఎంచుకునే వారెందరో. మరో తరగతికి చెందిన వారు వృత్తి ఒకటి, ప్రవృత్తి మరొకటిగా ఎంచుకుని ఆ రెండింటిలోని ప్రత్యేకమైన అర్హతలుగాను అనుభవం కాని పొందక, ఆశించిన ఫలితాలు పొందలేక జీవితాసక్తి కోల్పోతారు.
ఇదికాదు మార్గం.. తయబ్‌కి తనకిష్టమైన రంగం పెయింటింగ్ అని గ్రహించాక ఆ రంగంలో అర్హత, అనుభవం పొంది కొన్ని దశాబ్దాలు నిరాశ, నిస్పృహలకు గురి కాకుండా తన పనిచేసుకుంటూ పోయాడు. విజయాలు కాక మరేం వరిస్తాయి అటువంటి దీక్ష, పట్టుదల కలిగిన వ్యక్తులను. ఒకే జీవితం, ఎన్నో అవకాశాలు. ఆత్మానందం ఎదురు చూస్తోంది మన కోసం. కల, కృషి, కాలం.. ఇవే మన ఆయుధాలు.
మనపై మనం పెంచుకున్న అపనమ్మకాన్ని పారద్రోలి నమ్మకాన్ని పెంచుకోవాలి. మా గురువుగారు చెప్పినట్లుగా శక్తినంతయు నీలో కలదన్నా... లోని శక్తిని తెలిసి ధైర్యమును కలిగి యుండన్నా. అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి మనలో.. నిద్రాణమైన వాటిని వెలికితీస్తే ఎదురేముంది.
- ఎజి కృష్ణమూర్తి
No comments:
Post a Comment