Wednesday, June 1, 2011

ప్రపంచం మీ గుప్పిట్లో...

 http://www.prajasakti.com/images_designer/article_images/2011/4/24/aptn-1303669315342.jpg
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక సామాన్య రైతు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు. సమస్యల్లో ఉన్న ఇరుగుపొరుగు వారికి మంచి సలహాలిచ్చి ఆదుకుంటాడని మంచి పేరుంది ఈ పెద్ద మనిషికి. ఒక రోజు ఆ దేశ రాజు ఆ గ్రామం నుంచి వెళ్తూ.. మన రైతు గురించి, ఆయన మంచి గురించి, అతనిచ్చే సలహాల గురించి విని ఆయన్ను పిలిపించి అడిగాడు రోజూ నీ సంపాదన ఎంతా అని. ఒక రూపాయని చెప్పాడు.

రూపాయికి ఎంతో విలువున్న రోజులవి. ఆ రూపాయిని ఎలా ఖర్చు పెడ్తున్నావన్నాడు రాజు. ఒక పావలా తినేస్తాను, రెండో పావలా అప్పుగా ఇస్తాను. మూడో పావలాతో అప్పు తీరుస్తాను. నాలుగో పావలాని పారేస్తాను అన్నాడు ఆ రైతు. ఇదో పజిల్‌లాగా, మెదడుకు మేత వేసే సమస్యాపూరణం లాగా గోచరించింది రాజుకి. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పవయ్యా అన్నాడు రాజు. మొదటి పావలా నాకు నా భార్య తిండి ఖర్చులకు వినియోగిస్తాను. రెండో పావలా పెట్టుబడిగా నా పిల్లల మీద వెచ్చిస్తాను. రేపు నాకు నా భార్యకు వృద్ధాప్యంలో పిల్లలు తోడు నీడగా ఉంటారనే ఆశతో. మూడో పావలాతో నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాను. మిగిలిన నాలుగో పావలాను బీద వారికి దానం చేస్తానన్నాడు. సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి రాజుకి ఏకకాలంలో. ఈ పజిల్ జవాబుని వేరెవ్వరికీ చెప్పవద్దని, తన ముఖాన్ని వంద సార్లు చూసాకే ఎవరికైనా చెప్పాలని ఆజ్ఞాపించాడు రాజు. సరేనన్నాడు రైతు.

రాజధాని చేరిన రాజు రైతు జీవన శైలిని ఒక చిక్కు ప్రశ్నగా మార్చి దాన్ని విప్పమన్నాడు. ఎంత తలబద్దలు కొట్టుకున్నా ఎవ్వరికీ సమాధానం దొరకలేదు. మంత్రి కనుగొన్నాడు రాజు ఒక గ్రామానికి వెళ్లటం. అక్కడో రైతుని కల్సుకోవటం. వెంటనే ఆ గ్రామం చేరుకొని మన రైతును కల్సుకొని ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పమన్నాడు. రాజుకు మాటిచ్చాను. చెప్పలేనన్నాడు రైతు. వంద నాణాలు బహుమతిగా ఇచ్చి ఇప్పుడు చెప్పమన్నాడు మంత్రి. ఆ నాణాల మీద రాజు శిరస్సు ముద్రించి ఉంది. వంద నాణాలపై వంద రాజు ముఖాలు. ఇంకేం. ఎలాంటి సమస్యా లేదు అనుకుంటూ జవాబు చెప్పాడు రైతు మంత్రికి. హుటాహుటిన మంత్రి రాజధానికి తిరిగొచ్చి రాజుకు సమస్యాపూరణం చేశాడు. ఆశ్చర్యపోయిన రాజు మంత్రిని అడిగాడు సమాధానం ఎవరు చెప్పారని. నిజం తెల్సుకున్న రాజు ఆగ్రహావేశాలతో గ్రామం నుంచి రైతును రప్పించి నిప్పులు చెరిగాడు. శాంతంగా విన్న రైతు రాజా తమరే సెలవిచ్చారు కదా. తమరి వంద ముఖాలు చూసే దాకా ఎవ్వరికీ జవాబు చెప్పొద్దని. మంత్రి ఇచ్చిన వంద నాణాల మీద తమరి ముఖార విందాన్ని వంద సార్లు చూసాకే సమస్యని పూరించానని ఎంతో వినయ విధేయతతో చెప్పాడు.

రైతు రుజువర్తనుడే కాదు నమ్మదగ్గ వ్యక్తి. ఇచ్చిన మాటకు విలువిస్తాడు అని ఆగ్రహించి సన్మానించాడు. మనందరం ఆ రైతు లాగా జీవితంలోని ముఖ్యాంశాలను గ్రహిస్తే అడ్డదోవలు తొక్కుతూ ఈ సమాజాన్ని అల్లకల్లోలం చేయాల్సిన అవసరం ఉండదు కదా! వృద్దాప్యంలో తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించి వెట్టిచాకిరి చేయించుకునే ప్రబుద్ధులు ఎందరో! లేకుంటే చేతులు శుభ్రంగా డెటాల్‌తో కడుక్కొని తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి అంకితం చేయటం. ప్రేమతో గౌరవంగా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో ఆదరించే వారు భూతద్దంలో వెతికితే గాని కనబడదు. ఎంత దురదృష్టం. మాతృదేవోభవా, పితృదేవోభవా అనే సంస్కృతికి నిలయమైన మన భారతంలో ఎన్ని అపశృతులు. ఇతరుల సహాయం కోసమే మానవ జన్మ అని మన శాస్త్రాలు, పురాణాలు, పెద్దలు ఘోషిస్తుండగా.. పట్టపగలే బందిపోటు దొంగల్లా దేశాన్ని, మనల్ని దోచేస్తూ, దేశ సంపదను స్విస్ బ్యాంకులకు తరలిస్తున్నారు మనకు అండదండగా నిలవాల్సిన పెద్దమనుషులు. ధనార్జనకు అడ్డదారులేకాదు. రాజమార్గాలు ఉన్నాయని నిరూపించే ప్రయత్నమే ఈ నిజ జీవిత గాధలన్ని. పదండి ముందుకు ఈ చిన్న ప్రపంచం మన గుప్పిట్లోకి ఎలా వచ్చిందో తెల్సుకుందాం.
http://suryaa.com/Main/gallery/2010/Sep/07/world.jpg
ప్రపంచం మీ గుప్పిట్లో....
రిలయన్స్ మొబైల్ ఫోన్ ప్రకటనలకు ఇది ట్యాగ్‌లైన్.. నేను రాసిందే 2003లో. నిజంగా ప్రపంచం మన గుప్పిట్లోనే ఉంది కదూ నేడు. మా పని అమ్మాయికి ఆవిడ పతి దేవుడైన సెక్యూరిటీ గార్డుకి, మావంటావిడకు, ఆవిడ కుటుంబ సభ్యులందరికీ, మన పోస్టుమ్యాన్‌కు, మన డ్రైవర్లకి, మా మానవరాలికి, మీకు ... నాకు... ఎవ్వరికీ ఇది లేందే జరగదు ఒక్క క్షణం కూడా. సర్వాంతర్యామి మొబైల్. చిన్నా పెద్దా, రాజు పేద, ఆడామగా... ఎలాంటి తేడాలు చూపకుండా అందరికీ అండదండ గా నిలుస్తూ ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చింది ఈ మొబైల్ ఫోన్. చాలా వస్తు, సేవలు, విలాసాలు కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఈ ప్రపంచంలో ఒక్క మొబైల్ ఫోన్ ఎలాంటి బేధాలు చూపకుండా అందరినీ అలరిస్తోంది. మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. ఒక్కోసారి మీకనిపించదూ ఈ మొబైల్ ఫోన్ లేకుండా ఇంతకాలం మనం ఎలా జీవిస్తూ వచ్చామా అని.

అరచేతిలో ఇమిడిపోయి ఎంతో సింపుల్‌గా ఇన్నోసెంట్‌గా కనబడే ఈ మొబైల్ ఫోన్ వెనక ఎన్నో సంవత్సరాల కృషి దాగి ఉంది. రెండు సంస్థలకు చెందిన ఇంజనీర్ల ద్వారా - మోటరోలా, ఎటి అండ్ టి - ఇది ఆవిష్కరించబడింది. ఈ రెండు సంస్థలు కమ్యూనికేషన్ రంగంలో ఉద్దండులే. మోటరోలా టూవే రేడియో టెక్నాలజీతో నిష్ణాతులు కాగా ఎటి అండ్ టి క్లిష్టమైన సెల్యులార్ టెక్నాలజీలో ప్రసిద్ధులు. ఈ రెండు సంస్థలు కలిసి చేసిన కృషికి ఫలితమే నేడు మన జేబుల్లో ఇమిడిపోయి మనతోనే ఎల్లవేళలా ఉండే మొబైల్ ఫోను. అసలు ఈ రెండు సంస్థలు మొదలుపెట్టింది కార్‌ఫోన్ రేంజిని పెంచుదామని. కార్ ఫోన్లు ల్యాండ్ ఫోన్లకు చెందిన రేడియో ఫ్రీక్వెన్సీకి ముడిపడి ఉన్నాయి. ఈ ప్రీక్వెన్సీ రేంజ్‌ని డ్రైవర్ ఎక్కడకు వెళితే అక్కడదాకా పొడిగించాలంటే మరో కొత్త కమ్యూనికేషన్ పద్ధతిని కనుగొనాల్సి ఉంది.

అప్పట్లో వాడుకలో ఉన్న టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమయ్యే పనికాదు. కొత్త టెక్నాలజీ కనుగొనటానికి ఎన్నో సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటగా ఒక కొత్త సెల్యులార్ సిస్టమ్‌ని కనుగొని దాని కోసమై ప్రభుత్వం క్లియరెన్స్‌లను పొందటం. రెండోది ఒక కొత్త ప్రొటోటైపు తయారు చేయటం. దీనికి సంబంధించిన నమూనాలు గాని, ఇతర సమాచారం గాని ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే పూర్తిగా ఇదొక వినూత్న ఆవిష్కారం. మోటరోలా ఇండస్ట్రియల్ డైరెక్టర్ రూడీ క్రాలాప్ ఈ పరిశోధనల గురించి వివరిస్తూ "మేం కనుగొంటున్న దాన్ని షూ ఫోన్'' అని పిలిచే వాళ్లం. ఎందుకంటే అది ఒక బూటులాగా రూపం సంతరించుకుంటోంది. చివరకు సెప్టెంబర్ 1, 1983న మోటరోలా సరికొత్త చరిత్రను సృష్టించింది. అమెరికాకు చెందిన యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, డివైఎన్ఎ టిఎసి 800ఎక్స్ ఫోన్‌ను అంగీకరించింది. ఈ ఫోన్ ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ మొబైల్ ఫోను. పదేళ్లు.. 10 కోట్ల డాలర్ల (450 కోట్ల రూపాయలు) పెట్టుబడికి ఫలితంగా ఉద్భవించిన మొబైల్ ఫోను ఇది.
http://www.travisfitzwater.com/wp-content/uploads/2010/02/dreambig.jpg
కార్ ఫోను రేంజ్‌ని పెంచుదామనుకొన్న చిన్న ప్రయత్నం ప్రపంచాన్ని, మనందరి గుప్పిట్లోకి తెచ్చింది. ఈ మొబైల్ ఫోను నేడు అందరికీ ఎలా కాసుల వర్షం కురిపిస్తోందో మనందరికీ తెలిసిందే. ఒక మంచి ఆలోచన, శ్రమ, దాని ఫలితం పది మందికి ఎలా ఉపయోగపడుతుందో, వారి జీవితాలను ప్రభావితం చేస్తుందో వివరించేదే ఈ మొబైల్ ఫోన్ కథ. అలాంటివే ఈ అధ్యాయం - పేరు ప్రతిష్టల ఫలితమే డబ్బు- లో మనం ముచ్చటించుకున్న ఇతర నిజ జీవిత కథలు కూడా. వాల్ట్ డిస్నీ యానిమేషన్ చరిత్ర, సింఫనీ కూలర్ విజయ గాధ, స్టార్ బక్స్ కాఫీ కప్పుతో ఘన విజయం, హాట్ మెయిల్ హాట్ హాట్ కీర్తి తద్వారా దక్కిన లక్ష్మీ కటాక్షం. యాపిల్ కంప్యూటర్ మెకింతోష్ ఆవిష్కరణ. అది సాధించిన అద్భుత విజయాలు. సోనీ వాక్‌మెన్ ఆవిష్కరణ. అది మన జీవిత సర ళిపై వేసిన చరగని ముద్ర. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్య బర్గర్, ఒక చిన్న ఐడియాతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన మెక్‌డొనార్డ్స్. ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం - మైక్రో చిప్ ద్వారా మానవజాతి జీవిత గమనాన్ని మార్చివేసిన కథాకమామిషు. చివరిగా ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చిన మొబైల్ ఫోన్ అద్భుత ఆవిష్కరణ. ఇవన్నీ ఇలాంటివి మరెన్నో... చిన్నా పెద్దా నిజ జీవిత గాధ లు.http://us.123rf.com/400wm/400/400/kjpargeter/kjpargeter0607/kjpargeter060700180/478803-the-world-in-your-hands--3d-render.jpg
వేలల్లో, లక్షల్లో .. మనకు చెప్పేది ఒక్కటే:
ప్రతిభకు ఫలితం పేరు ప్రతిష్టలు. వాటి ఫలితం డబ్బు. ధనార్జనకు రాచబాట ఇదే. మోసాలు, అన్యాయాలు, అరాచకాలు కాదు. అవి తెచ్చే సంపద కేవలం తాత్కాలికం. మోసపోయిన వారి తిట్లు, శాపనార్ధాలు, మనకు దీవెనలు కాదు కదా! ఆలోచించాల్సిన విషయం ఇది. సువిశాలమైన ఈ ప్రపంచంలో అందరికీ ఉన్నాయి అవకాశాలు. అవి అందిపుచ్చుకొని హాయిగా ఆనందంగా ఉండటమే మన కర్తవ్యం. 
http://drjeffadams.com/wp-content/uploads/2008/07/dream-big.jpg
కలలను, గమ్యాలను విడనాడొద్దు! కలతో, కృషితో నాస్తి దుర్భిక్షమ్!
- ఎజి కృష్ణమూర్తి

No comments: