Tuesday, June 14, 2011

నమ్మకమే నడిపిస్తుంది

ఎన్ని అడ్డంకులొచ్చినా మీ కలలను, గమ్యాలను విడవద్దు.. మరోసారి ప్రయత్నిస్తానంటూ పదండి ముందుకు. విజేతలకి, ఇతరులకు ఉన్న తేడా ఇదే. కలల్ని మన సొంతం చేసుకొని అవి మన పంచప్రాణాలేమోనన్నట్లుగా వాటిని గుండెలకు హత్తుకుని మన దగ్గరే పదిలంగా ఉంచుకుంటే అవి సాకారం కాక మానవు.  
రోమ్‌ని ఒక రోజులో నిర్మించలేదన్నట్లుగా మన గమ్యాలు, కలలు ఒక్క రోజులో తీరేవి కావు. మన కలలకు ప్రతి రూపాలుగా మనం తీర్చిదిద్దే మన పిల్లలు పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావటానికి దాదాపు పాతికేళ్లు పడుతుంది కదా అందాక మనం శ్రమిస్తూనే ఉంటాం కదా! అలాగే మన ఇతర కలలు, గమ్యాలు కూడా. ఈ మధ్య నా గురువు గారు గీరా బెన్ శరభాయి గారిని కలుసుకున్నాను.
http://gujarattourism.net/gifs/baroda-museum.jpg
ప్రపంచం గర్వింపతగిన కేలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్ సృష్టికర్త ఆవిడ. ఒక జీవిత కాలం అవిరామ శ్రమకు ప్రతిరూపం ఆ మ్యూజియం. భారతీయ వస్త్ర సంపద 15 వ శతాబ్దం నుంచి నేటి దాకా కన్నులకు కట్టినట్లు కనబడుతుంది ఆ మ్యూజియంలో. అక్కడ నేను పనిచేయటం ఆ మ్యూజియంలో ప్రదర్శించిన వస్త్ర సంపదను విస్తృతపరిచే యజ్ఞంలో నేను సైతం రెండు మూడు చిరు సమిధలు వేశాను.

భారతీయ వస్త్ర సంపదను తిలకించాలంటే ఈ మ్యూ జియం కన్నా మెండైనది ప్రపంచంలో మరెక్కడా లేదు. వారిని కలుసుకున్నప్పుడు అన్నాను ఇంత గొప్ప మ్యూ జియం సృష్టించిన మీరు చరితార్ధులని. ఆవిడ జవాబు.. కల, గమ్యం స్పష్టంగా మన ముందుంటే పట్టుదల దానికి జోడిస్తే కాలమే మన కలలను సాకారం చేస్తుందని. నిజమే ఓర్పు ఉండాలి. కృషిని విడనాడకూడదు. మన కలలపై నమ్మకముండాలి. అశాంతితో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఓ పెద్దమనిషి ఒక గురువు గారి దగ్గరకు వెళ్లి మనశ్శాంతికి తనకేదైనా మంత్రోపదేశం చేయమన్నాట్ట అదీ చాలా సింపుల్‌గా! సూక్ష్మంలో మోక్షం కావాలి ఈ పెద్ద మనిషికి. ఆ గురువు గారు అతి చిన్న మంత్రాన్ని ఉపదేశించారు ఈయన గారికి.. అదేమంటే.. ఓ గాడ్ సేవ్ మీ. చాలా చిన్న మంత్రం కదూ. ఈ పెద్ద మనిషి అనుమానాల పుట్ట. అన్నీ అనుమానాలే. గురువు గారు చెప్పిన మంత్రాన్ని మార్చి ఇలా చెప్పుకున్నాడు. ఓ గాడ్ (ఇఫ్ యూ ఆర్ దేర్.. ఓ భగవంతుడా నీవంటూ అసలు ఉంటే) సేవ్ మీ (ఇఫ్ యూ కెన్ సేవ్ మీ.. నన్ను రక్షించగలిగితే రక్షించు). ఎంత నమ్మకం ! ఎంత గురి ! ఇటువంటి వ్యక్తిత్వమున్న వ్యక్తులను అంటే తన మీద గాని ఇతరుల మీద గాని నమ్మకం విశ్వాసం లేని వ్యక్తులు.. కలలేం కనగలరు ? వాటినెలా సాకారం చేసుకోగలరు ?? కల, కృషి, కాలం.. ఈ మూడు మనని మన గమ్యాల దాకా చేరుస్తాయి. వాటిని ఎట్టి పరిస్థితులలో మరిచిపోకూడదు, గమ్యాలను విడనాడకూడదు. రచయిత అంటే సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. అవి ఇతరులను ఇంప్రెస్ చేయటానికి కూడా పనికొస్తాయని, చిన్న చిన్న రచనలు చేయటం మొదలుబెట్టాను. ఎప్పటికైనా కాస్త పేరున్న రచయిత కావాలని బలమైన కల ఉండేది. 1964లో నా మొట్టమొదటి కథ... తానొకటి తలిస్తే.. ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అచ్చయింది. ఆ పైన అడపాదడపా కథలు, రేడియో నాటికలు రాస్తుండేవాణ్ణి. ఈ వ్యాపకంలోనే మహానుభావుడు ఉషశ్రీతో పరిచయమైంది 1967లో. న్యూ నల్లకుంటలో పక్కపక్క భాగాల్లో ఒకే ఇంట్లో ఉంటుండే వాళ్లం నా కుటుంబం, ఉషశ్రీ గారి కుటుంబం. రేడియో నాటకాల రచనకు ప్రోదల్భం, సూచనలు ఆయనే అందిచ్చారు. కొన్ని దశాబ్దాలైనా వారి జ్ఞాపకాలు మదిలో ఇంకా ఎంతో తాజాగానే ఉన్నాయి.

1967లో పెళ్లి. 1968లో అహ్మదాబాదుకి తరలి వెళ్లటంతో నా రచనా వ్యాసాంగం మరుగున పడిపోయింది. కొత్త ఊరు, కొత్త మనుషులు, మరీ కొత్త భాష, సంస్కృతి.. జీవన పోరాటంలో నిమగ్నుడినై పోయాను. అయితే నాలోని రచయిత నిద్రాణమై ఉన్నాడు తప్పితే పూర్తిగా నా నుంచి దూరం కాలేదు. రచయిత కావాలనే తృష్ణే పలు అంశాలపై వ్యాసాలు రాసేందుకు పురికొల్పింది. ఈ తృష్ణే ప్రకటనలను సృష్టించటం అందులో భాగంగా ప్రకటనలు రాస్తూ ఉండటం నా వృత్తిగా, నా వృత్తి ధర్మంగా మారిపోయింది అయితే అవన్నీ ఇంగ్లీషులో, తెలుగులో. 1968 తర్వాత ఏదైనా రాసిన జ్ఞాపకం లేదు. 2001లో ముద్రాకు నేనింకా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తుండగా, సడన్‌గా పుస్తక రచనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అమెరికన్ పబ్లిషింగ్ సంస్థ మెక్‌గ్రా హిల్ మేనేజింగ్ డైరెక్టర్ సింగపూర్ నుంచి అహ్మదాబాదు ఏదో పనిమీద వచ్చి నన్ను కలుసుకున్నాడు. నా ముద్రా అనుభవాల మీద ఒక పుస్తకం రాస్తే చాలా బాగుంటుందని, అది అడ్వర్‌టైజింగ్ రంగానికే కాకుండా, మేనేజమెంట్ రంగానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. ఆలోచిస్తానని మాటిచ్చి, జీవన పోరాటంలో మళ్లీ తలమునకలయ్యా.

2003లో నేను ముద్రాను విడిచి రిలయన్స్‌లో అడ్వైజర్‌గా చేరటం, నాకు రచనా వ్యాసాంగానికి సరిపడా టైమ్ లభ్యం కావటంతో దాదాపు 35 ఏళ్ల క్రితం నాలో నిద్రించిన రచయిత మేలుకొని మళ్లీ రచయితనయ్యాను. 2005లో నా మొదటి ఇంగ్లీషు పుస్తకం ది ఇన్‌విజిబుల్ సిఇఒ ప్రచురింపబడింది. కవర్ పేజీ మీద ఉన్న నా పేరును అలాగా ఎంత సేపు ఎన్నిసార్లు ఆనందంగా చూస్తూ ఉండిపోయానో ! కల నిజమాయెగా, కోరిక తీరెగా అని పాట పాడానో లేదో తెలియదు కాని, ఆనాటి నుంచి నేటి దాకా నా ప్రతి పుస్తకం ప్రతి వ్యాసం ప్రచురింపడిన రోజున అమితానందం కలుగుతుంది. రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నానేమో అనిపిస్తుంది. ఇష్టమైన పని చేస్తే వచ్చే తృప్తి ఆనందం ఈ రచనా వ్యాసాంగం ద్వారా నేను తెలుసుకున్నాను , అనుభవిస్తున్నాను. ఇంగ్లీషులో నిర్విరామంగా పక్షానికో వ్యాసం చొప్పున బిజినెస్ స్టాండర్డ్‌లో ఆరు సంవత్సరాల పాటు ఎజికె స్పీక్ అనే శీర్షిక కింద నా వ్యాసాలు అచ్చయ్యాయి. వాటి ద్వారా ఎందరో ప్రముఖులతో పరిచయమైంది ఎందరో నా అభిమానులుగా మారారు. ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం ఎజికె వారం వారం శీర్షికన 2005 నుంచి మూడేళ్లు 130కి పైగా వ్యాసాలు అచ్చయ్యాయి. తిరిగి గత 43 వారాలుగా ఈ జయహో వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. నేటి దాకా ఇంగ్లీషులో ఆరు పుస్తకాలు, తెలుగులో పది పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఇంగ్లీషులోని నా పుస్తకాలు ధీరూభాయిజమ్, ఎగెనెస్ట్ ఆల్ ఆడ్స్, టెన్ మచ్ పలు దేశీయ భాషల్లో ప్రచురితమై అసాధారణ విజయాన్ని చవిచూసినాయి. గుజరాతీలో అయితే ధీరూభాయిజమ్ పుస్తకం ఆ భాషలోని ఆల్‌టైమ్ బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా చేరింది. ఇంగ్లీష్‌లో ఇదే పుస్తకం 2007 నుంచి నేటిదాకా పన్నెండు సార్లు ముద్రితమైంది. ఇదంతా సొంత డబ్బా కొట్టుకోవటం కాదు. బలమైన కల ఉంటే కాలమే దాన్ని సాకారం చేస్తుందనే నిజాన్ని మీ ముందు సోదాహరణంగా ఉంచటానికే.

35 ఏళ్లు రచనా వ్యాసాంగానికి దూరంగా ఉన్న నేను ఇంత ప్రాలిఫిక్ రైటర్.. అంటే ఎంతో విరివిగా రచనలు చేసే రచయితగా ఎలా మారానో నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇట్టే అవగతమవుతుంది. బలమైన కల, గమ్యం, పట్టుదల అవే మనకు మార్గదర్శకాలవుతాయని. చిన్నప్పటి నా కల 45 ఏళ్ల తర్వాత నిజమైంది. అయితే ముందుగా ముచ్చటించుకొన్నట్లుగా కలలను విడనాడకూడదు. వీటిని మనస్సులోనే పెట్టి బంధించాలి. ఓర్పు పెంచుకోవాలి. రోమ్ మహానగరం ఒక్క రోజులో నిర్మాణం కాలేదనే సత్యాన్ని పదేపదే మననం చేసుకోవాలి. కల, కృషి, కాలం.. ఈ మూడు ఏకమై మన కలల్ని నేడు కాకపోతే రేపైనా సాకారం చేస్తాయనే ధృడమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకోవాలి. మనసు మార్చుకోవద్దు. కలలను చంపుకోవద్దు. అర్థాంతరంగా జీవితాన్ని వివిధ మలుపులు తిప్పవద్దు. ఇష్టమైన దాని కోసం కష్టపడండి. మరోసారి ప్రయత్నించి చూడండి. ఇంకొంచెం, మరికొంచెం కాలం వేచి చూడండి. ఈ ప్రక్రియ వల్ల లాభమే కాని నష్టమంటూ ఏమీ జరగదు. ప్రసిద్ధ రచయిత పాల్ కోయిలో అన్నట్లు మీకే బలమైన కోరికుంటే ప్రపంచంలోని అన్ని శక్తులు కుట్రపన్ని కూడబలుక్కొని మీ కలను సాకారం చేస్తాయి. అక్షర సత్యం ఇది.
* ఎజి కృష్ణమూర్తి

No comments: