Sunday, November 20, 2011

తంత్ర చాణక్య

http://www.soundoflife.net/wp-content/uploads/2007/10/chanakya.jpg
 http://www.chanakya.de/images/chanakya_logo.gif


అమెరికా అప్పుల్లో ఉంది. లక్షల కోట్ల డాలర్ల తిప్పలవి!
ఐరోపా గొప్పల్లో ఉంది. ఉడకని ‘ఉమ్మడి’ యూరోల పప్పులవి!
అయిల్ కంట్రీల జాతకం ఘాతుకంలా ఉంది. 

నియంతల గొంతుకు బిగుస్తున్న పిడికిళ్లవి!
ఆసియన్ల అభివృద్ధి ఎక్కడిదక్కడే ఉంది. ముందుకు పడని అడుగులవి!!
కూటములకు, పాటవాలకు ఈ లెక్కలేవీ అందడం లేదు. 

దిక్కులు తోచడం లేదు.
రాచరికం, రిపబ్లికనిజం, సోషలిజం, ఐరాసయిజం... 

చిల్లర డబ్బుల కోసం దేబిరిజం!!
ఓ మై చాణక్యా! మౌర్యవంశ మంత్రివర్యా!! 

అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నడిపావయ్యా?!
ఇవాళ 20 నవంబర్. క్రీ.శ. 2011. 

ఇవాళ్టికీ అగ్రరాజ్యాలు, అల్పాదాయ దేశాలు...
ఓం చాణక్యాయ నమః దరి చేర్చాయనమః అంటున్నాయి! 

ఏమిటి చాణక్యుడి గొప్పతనం?
ప్రభుత్వాలు ఎందుకిలా ఆయన్ని జపిస్తున్నాయి? ఇదే ఈ బయోగ్రఫీ.



దూకుడు మీద ఉన్నాడు అలెగ్జాండర్.
బల్గేరియా, ఇజ్రాయిల్, ఈజిప్టు, లిబియా, ఇరాక్, ఇరాన్, ఆప్ఘనిస్థాన్, సోవియెట్ యూనియన్... ఒకటొకటీ మోకాళ్లపై కుంగిన గుర్రాలవుతున్నాయి.
మిగిలింది... భారతావని!
ప్రపంచాన్ని జయించడం అలెగ్జాండర్ టార్గెట్. హిందూఖుష్ పర్వతాలకు కాస్త అవతల... ప్రపంచ భూభాగం అంతమౌతుందని అతడి గురువు అరిస్టాటిల్ చెప్పినట్లు గుర్తు. ఇప్పుడు అటువైపే వస్తున్నాడు అలెక్స్.
హిందూఖష్ దగ్గర అప్పటికే నాలుగు నదుల్ని దాటింది అలెగ్జాండర్ సైన్యం. ఐదవ నది హైఫాసిన్ కూడా దాటితే... మగధ, గాంధార రాజ్యాలు! వాటిని కూడా జయిస్తే... తనిక మేసిడోనియా చక్రవర్తి కాదు. జగదేక గ్రీకు వీరుడు.
నదిలోని నీళ్లను తలపై చల్లుకుని పులకరించిపోయాడు అలెగ్జాండర్.
నదిని దాటి వస్తే... మ-గ-ధ!
********

దిగ్గున లేచి కూర్చున్నాడు చాణక్యుడు!

కలగన్నాడా? కాదు, అలెగ్జాండర్ కంటున్న కల నెరవేరబోతున్నదని గ్రహాలు చెబుతున్నట్లు గ్రహించాడు.
భుజాల కిందికి దిగిన శిరోజాలను సాలోచనగా సవరించుకుని, జుట్టు ముడివేసుని పైకి లేచాడు చాణక్యుడు. తక్షశిల నుంచి తక్షణం మగధకు బయల్దేరాడు. అతడిప్పుడు మగధ చక్రవర్తి ధననందుడిని కలవాలి. అలెగ్జాండర్ ఎంతటి శక్తిమంతుడో వివరించాలి. మగధను రక్షించుకునే మార్గం చెప్పాలి. వింటాడా? విందులు, చిందులలో తేలిపోతున్న చక్రవర్తి.. మేఘాలలోంచి కిందికి దిగుతాడా? లేక పర్షియా చక్రవర్తి డేరియస్‌లా పరాజితుడై ప్రజల్ని, పడతుల్ని అలెగ్జాండర్‌కు వదిలి పారిపోతాడా?
రాజప్రాసాదం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు చాణక్యుడు. తక్షశిల విశ్వవిద్యాలయ ఆచార్యుడతడు. చరిత్ర తెలుసు, వర్తమానం తెలుసు. భవిష్యత్తూ తెలుస్తోంది. అలెక్స్ మూకలు పర్షియా రాజధాని పెర్సిపొలిస్‌ను విజయగర్వంతో ఎలా తొక్కి నాశనం చేసిందీ అతడి బుద్ధి ఊహిస్తోంది. అంతటి దుర్గతి మగధకు గానీ, మరే భారత భూభాగానికి గానీ పట్టకూడదు.
సభకు చేరుకున్నాడు చాణక్యుడు. నిండు సభలో కొలువై ఉన్నాడు ధననందుడు.
‘ఈ అందవికారుడికి ఇక్కడేమిటి పని’ అన్నట్లు సభ అతడిని నిలబెట్టి నిశ్శబ్దంగా చూస్తోంది. చక్రవర్తికి రుచించని ఏ వార్తనూ వినేందుకు సభ సిద్ధంగా లేదు!
చాణక్యుడు గొంతు సవరించుకున్నాడు.
‘‘దేవుడి దయ వల్ల మనమింకా మన రాజ్యంలోనే ఉన్నాము చక్రవర్తీ. సమయం మించిపోలేదు. సరిహద్దులవైపు అలెగ్జాండర్ సైనిక బలగాలు కదులుతున్న సూచనలు గోచరిస్తున్నాయి. వారిని మనవైపు రానివ్వకుండా గాలివానలు ఆపుతున్నాయి. ఈలోపే మగధ, గాంధార రాజ్యాలు ఏకం కావాలి. లేదంటే మగధరాజ్యం మేసిడోనియా మహాసామ్రాజ్యపు తునకగా మిగిలిపోతుంది’’ అన్నాడు.
గర్జన, ఘీంకారం కలగలిపి అహంకరించాడు ధననందుడు! సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సభలోని నిశ్శబ్దం బిక్కచచ్చింది.
‘‘ఎవరక్కడ! ఈ తీతువును తరిమికొట్టండి’’ అన్నాడు. మళ్లీ ఒక్క క్షణంలో - ఆగమన్నాడు.
‘‘అతడి జుట్టు పట్టుకుని ఈడ్చుకువెళ్లండి. ఆ జుట్టు కిందే కదా మగధసామ్రాజ్య భవిష్యత్తు ఉంది! అలెగ్జాండరట, గాంధారదేశంతో సంధులు, సమాలోచనలట. జోస్యం వినేందుకు నేనీ పీఠం మీద కూర్చోలేదని ఆచార్యులవారికి అర్థమయ్యేలా దేహబుద్ధులను శుద్ధి చెయ్యండి’’ అని ధననందుడు అజ్ఞాపించాడు.
మంత్రులు, పరరాజ్య ప్రతినిధులు, రాజ్యాధికారులు, రమణులు... ఇందరున్న సభలో చాణక్యుడుకి అవమానం జరిగింది. అతడి ప్రజ్ఞకు ఘోర పరాభవం జరిగింది. శరీరంతో పాటు మనసూ గాయపడింది. రక్తం ఓడింది. ఆగ్రహంతో. ఆవేదనతో, ప్రతీకారంతో బయటికి నడిచాడు. జుట్టు ముడి విప్పాడు. ధననందుడిని రాజ్యభ్రష్టుడిని చేసేవరకు, భరతదేశాన్నంతటినీ సమైక్యంగా ఉంచే సమర్థుడిని మగధకు చక్రవర్తిని చేసేవరకు జుట్టుముడి వేయనని శపథం చేశాడు.
********


క్రీస్తుకు పూర్వం 300 ఏళ్ల నాటి సంగతి ఇది.

చాణక్యుడు శపథం నెరవేర్చుకున్నాడు. నందవంశ పాలనను అంతమొందించి, తన శిష్యుడు చంద్రగుప్తుడిని మగధకు చక్రవర్తిని చేశాడు. తను మంత్రి అయ్యాడు. మౌర్య సామ్రాజ్యానికి పునాదులు వేశాడు.
అలెగ్జాండర్‌తో అసలు గొడవేలేకుండా పోయింది. హైఫాసిన్ నదిని దాటేందుకు అతడి సేనాపతులు సంశయించారు. అప్పటికే మూడు నెలలుగా ఏకధాటిన వర్షం. ఆహార పదార్థాలు పాడయ్యాయి. ఆయుధాలు తుప్పుపట్టాయి. శకునాలేవీ బాగోలేవని త్రికాలజ్ఞులు తేల్చేశారు. అలెక్స్ నిరాశ చెంది, అంతదూరం వచ్చినందుకు ఆనవాళ్లుగా పన్నెండు మంది గ్రీకు దీవుళ్లకు పన్నెండు ప్రార్థనా పీఠాలు ప్రతిష్టింపజేసి వెనుదిరిగాడు.

ఒక వేళ - ప్రకృతి అలెగ్జాండర్‌కు సానుకూలంగా ఉండి ఉంటే, అతడు మగధను, గాంధారను కలుపుకుని ఉంటే... మౌర్య వంశ స్థాపన జరిగి ఉండేది కాదు. చాణక్యుని ‘అర్థశాస్త్రం’, ‘నీతిశాస్త్రం’ గ్రీకు సామ్రాజ్య సంపదలై ఉండేవి.

ఎనిమిదేళ్ల సుదీర్ఘ దండయాత్రల అనంతరం హిందూఖుష్ నుంచి వెనుదిరిగి నేరుగా మేసిడోనియాలో అడుగుపెట్టినప్పుడు అలెగ్జాండర్‌కు అరాచకం, అవినీతి స్వాగతం పలికాయి. వాటిని చక్కదిద్దలేక సతమతమయ్యాడు అలెక్స్. పక్కన చాణక్యుడు ఉంటే బహుశా పరిస్థితి ఇంకోలా ఉండేది. రాజనీతి వ్యూహాలకు, సంక్షోభ నివారణ తంత్రాలకు చాణక్యుడిని మించినవారు అవనిలోనే లేరు.
********

క్రీస్తు శకం 2011. నవంబర్ 20.

అమెరికా. ఒంట్లో బాగోలేదు. డాలర్‌కి అస్తమానం ఏవో ఇన్ఫెక్షన్‌లు.
ఐరోపా. ఉమ్మడి ఇంట్లో యూరోల గొడవలు. చాల్లేదని ఒకరు. సరిపెట్టుకొమ్మని ఒకరు.
ఇండియా. జనాభా ఎక్కువ. జాగ్రత్తలు తక్కువ.
కూటములకు, కటిక రాజనీతిజ్ఞులకు సైతం దిక్కుతోచడం లేదు. హే, చాణక్యా! మౌర్యసామ్రాజ్యాన్ని ఎలా నడిపావయ్యా?!
రెండు వేల మూడొందల ఏళ్ల తర్వాత... ఇవాళ్టికీ ప్రపంచ దేశాలు, రాజ్యాలు... చాణక్యుడిని తలచుకుంటూనే ఉన్నాయి. కష్టమొచ్చినప్పుడు మనిషి దేవుడి వైపు చూసినట్లు, సంక్షోభ కాలంలో దేశాలు చాణక్యుడు రచించిన అర్థశాస్త్రాన్ని తిరగేస్తున్నాయి. గిట్టనివారు అతడిని కౌటిల్యుడు అన్నప్పటికీ, గట్టెక్కడానికి చివరికి ఆ కౌటిల్యతనే అనుసరించారు. నిజానికది కుటిలత్వం కాదు. జీవనలౌక్యం. బతకడం ఎలాగో నేర్పించ డం.
‘‘అంత నిజాయితీ పనికిరాదు’’ అంటాడు చాణక్యుడు. దీన్ని మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. చాణక్యుడి అర్థం వేరే. నిటారుగా ఉండే చెట్లను మొదట నరికేస్తారనీ, నిజాయితీగా ఉండేవాళ్లు త్వరగా నమ్మకద్రోహానికి గురవుతారని ఆయన ఉద్దేశం.
‘‘ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మొదట నిన్ను నువ్వు మూడు ప్రశ్నలు వేసుకో. నేనెందుకు ఈ పని చేస్తున్నాను? ఫలితం ఎలా ఉండబోతోంది? ఇందులో నేను విజయం సాధిస్తానా?
ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తే అప్పుడు నువ్వు ముందుకు వెళ్లవచ్చు’’
‘‘పుస్తకాలకే పరిమితమైన జ్ఞానం, ఇతరుల స్వాధీనంలో ఉన్న ఆస్తి మన అవసరాలకు ఉపయోగపడవు’’.
చాణక్యుడి అర్థశాస్త్రంలోని సూత్రాలివి. ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటి అంతస్సూత్సం ఒకటే - ‘‘నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు. అది నిన్ను నాశనం చేస్తుంది’’.

చాణక్యుని కీలక గురుమంత్రం ఇది. నువ్వు బయట పడితే నీకు భయపడడం తగ్గుతుందన్నది అంతరార్థం.

చాణక్యుని అర్థశాస్త్రంలో ఆరువేలకు పైగా సూత్రాలు ఉన్నాయి. ‘చాణక్య నీతి’ అనేది మరో ఉద్గ్రందం. అందులో నీతి సూత్రాలు ఉన్నాయి. ఆర్థశాస్త్రంలో డబ్బు గురించి ఉన్నప్పటికీ, డబ్బు గురించి మాత్రమే లేదు. రాజనీతి, యుద్ధనీతి, వ్యక్తి నీతి, సంఘ నీతి... ఇలా అనేక జీవన నీతులున్నాయి. ఇప్పటికీ, ఎప్పటికీ అవి మనిషికి, వ్యవస్థలకు అవసరమైనవి. అప్పుడప్పుడు మన బడ్జెట్ ప్రసంగాలలో చాణక్యుని మాట వినిపిస్తుంటుంది. బడ్డెట్‌ల రూపకల్పనల్లో చాణక్య నీతి కనిపిస్తుంటుంది.

బతకడానికి, బాగా బతకడానికి మధ్య తేడాలను చెప్పిన తాత్విక పండితుడు చాణక్యుడు. అనుభవంతో పండి, అనుభవసారాన్ని పిండి లోకానికి ఉగ్గు పట్టించిన ‘హితా’మహుడతడు. వృత్తిలో ఎదగదలచిన వాడికి స్నేహమెంత ముఖ్యమో, శత్రుత్వం అంత ముఖ్యమని అంటాడు. ఎదుగుతున్న క్రమంలో మంచీచెడూ రెండూ సోపానాలే అంటాడు.

http://www.rudraksha-life.com/images/thumbs/0000571.png

ఏదైనా పని మొదలు పెట్టేముందు ఎవరైనా తమ ఇష్టదైవాన్ని స్తుతిస్తారు. చాణక్యుడు మాత్రం ఓం మంచీచెడాయనమః అంటాడు. ఆయన భాషలో అది ‘ఓం నమః శుక్రబృహస్పతిభ్యాం’. అంటే బృహస్పతికొక దండం, శుక్రాచార్యుడికొక దండం అని. బృహస్పతి దేవతల గురువు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. దండం ఇద్దరికీ పెట్టినా మంచికే లయబద్ధుడై ఉంటాడు చాణక్యుడు.

ఇంతటి విజ్ఞత, స్థితప్రజ్ఞత చాణక్యుడికి ఎక్కడివి? ఏ తల్లికి ఏ దేవుడి మంత్రోపదేశంతో ఈ లోకంలో కళ్లు తెరిచి ఉంటాడు. ఉహు.. లోకంలోకి వచ్చే వరకు ఆగి ఉండడు. తల్లి గర్భంలోనే కళ్లు తెరిచి ఉంటాడు!
********

చాణక్యుడు రాసిన గ్రంథాలు రెండే రెండు. చాణక్యుడిపై వచ్చిన పుస్తకాలు వందలు వేలు. చాణక్యుడు తను చెప్పదలచింది రాశాడు గానీ తన గురించి రాసుకోలేదు. కనుక చాణక్యుడి గురించి రాయడానికి ఎవరికీ ఏమీ దొరకలేదు. వందేళ్ల క్రితం మైసూరులోని ప్రాచ్యలిఖిత భాండాగారంలో చెదలు పట్టబోతున్న స్థితిలో ఉన్న చాణక్యుని అర్థశాస్త్రం తాళపత్ర గ్రంథం నకలు దొరికిందని, వాటి అర్థం తెలిసిన పండితులొకరు ఆంగ్లంలోకి అనువదించి, పుస్తకాలుగా ముద్రించడంతో చాణక్యుని ఖ్యాతి, భారతీయ సంస్కృతి గొప్పదనం ప్రపంచానికి తెలిసిందని అంటారు. అప్పటి వరకు చాణక్యుడు ఒక పురాణ పాత్ర, కావ్య పండితుడు. అంతే.
విశాఖదత్తుని ‘ముద్రారాక్షసం’ నాటకంలో -

‘‘చాణక్యుడు తంత్ర జ్ఞుడైన బ్రాహ్మణుడు. అర్థశాస్త్రాన్ని రచించినవాడు. చాణక్య కుటిల నీతి అనేది ఇతడి నుంచే వాడుకలోకి వచ్చింది. కొంతమంది ఇతడిని కౌటిల్యుడు అంటారు. నందుల్ని (నందవంశస్థులు) మ్లేచ్ఛుల చేత చంపించి, చంద్రగుప్తుణ్ణి రాజుగా చేసి నందుల మంత్రి రాక్షసుణ్ణే చంద్రగుప్తుడి మంత్రిగా చేస్తాడు’’ అని ఉంది.


ఎవరెలా అభివర్ణించినా, ఏ గ్రంథం ఎలా ప్రస్తావించినా... చాణక్యుడు పుట్టిన స్థల కాలాల విషయంలో మాత్రం అన్ని గ్రంథాలలోనూ దాదాపుగా ఏకరూపత కనిపిస్తుంది. చాణక్యుడి అసలు పేరు విష్ణుగుప్తుడు. తండ్రి చణకుడు కాబట్టి ఆ పేరుతో చాణక్యుడయ్యాడు. (పంజాబ్‌లోని ‘చాణక్’ అనే ప్రదేశంలో జన్మించాడు కాబట్టి చాణక్యుడయ్యాడనే భావన కూడా ఉంది).

http://www.atlantadunia.com/dunia/News09/chanakya1.jpg
చాణక్యుడు కౌటిల్యుడిగా కూడా ప్రసిద్ధుడయ్యాడు. కుటిలత్వం కారణంగా కౌటిల్యుడనే పేరు వచ్చిందనే సాధారణ అపార్థం ఒకటి చెలామణిలో ఉంది కానీ, నిజానికది గోత్రనామం అని చరిత్రకారుల పరిశీలన.

ఇంతకీ చాణక్యుడు ఎప్పటి వాడు? ఎక్కడి వాడు?

క్రీ.పూ. 370 - 283 మధ్య చాణక్యుడి జీవించి ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే అతడు ఏ ప్రాంతానికి చెందినవాడనే విషయమై అనేక వాదనలు ఉన్నాయి. అతడు రాశాడని చెబుతున్న అర్థశాస్త్రంగానీ, నీతిశాస్త్రం కానీ అతడివి కావ నే వాదనా ఉంది, షేక్స్‌పియర్ రచనల మీద ఉన్నట్లు.

చాణక్యుని జన్మస్థలం ఉత్తర భారతదేశమని, దక్షిణ భారతదేశమనీ, తక్షశిల అనీ భావించడానికి ఆధారమైన రచనా సాహిత్యం కొంత అందుబాటులో ఉంది. తెలుగులో మామిడిపూడి వెంకట రంగయ్య, నెల్లూరి సత్యనారాయణ వంటి పరిశోధకులు... చాణక్యుని ప్రాంతీయతను నిర్థరించే ప్రయత్నం కొంత చేశారు. ఈ ప్రయత్నాలన్నిటికీ మూలాధారం మళ్లీ చాణక్యుని ఆర్థ, నీతి శాస్త్రాలే.


ఉదా: అర్థశాస్త్రంలో 18 ముహూర్తాలు గల పగలు అతి దీర్ఘమైనదని చాణక్యుడు పేర్కొన్నాడు. అటువంటి దీర్ఘమైన పగలు ఉత్తరదేశంలో కనిపిస్తుంది. ఈ విధంగా చాణక్యుడు ఉత్తరదేశస్థుడు. అయితే అర్థశాస్త్ర ప్రతులు చాలావరకు దక్షిణ దేశంలో లభించడాన్ని బట్టి ఆయన దక్షిణదేశస్థుడు అని భావించడానికి వీలు కలిగింది. తక్షణశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు కాబట్టి తక్షశిల ప్రాంతీయుడు అయివుంటారని ఇంకో అభిప్రాయం. పూర్వం గాంధార రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఉన్న తక్షశిల ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండి జిల్లా పరిధిలో ఉంది. గుప్తులశకం అంతరిస్తున్న తరుణంలో కనుమరుగైన చాణక్య గ్రంథాలు తిరిగి 1915 వరకూ లభ్యం కాలేదు. చాణక్యుడి గురించి ప్రపంచానికి కాస్త గట్టిగా తెలుస్తున్నదంతా గత వందేళ్ల నుంచే.

********
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEifRziiP_7eF9wyYFNJ0FiEQn80zB2ki9dSjUy6Sf8Ww9gczjhnxiYvCfmwUIMitF44LTNxJqukNMSbzPuv1teu3UBRPF6_zpeSrjcSeYWVSwkTzw-P_CxAGou_dl48QYMOdQnTqKRycOiP/s1600/chanakya.jpg
ఎవరి తెలివితేటలనైనా ప్రస్తుతించేటప్పుడు ‘అపర చాణక్యుడు’ అంటారు. అంటే చాణక్యుడంతటి వాడని. చాణక్యుడు మేధావి. చంద్రగుప్తుడు అనే ఓ సాధారణ బాలుడిని చేరదీసి, అతడి తల్లి పేరుతో ఒక సామ్రాజ్యాన్నే స్థాపించి, దానికి చక్రవర్తిని చేసిన రాజనీతిజ్ఞుడు. చంద్రగుప్తుడి తల్లి పేరు ‘ముర’. ఆమె పేరు మీదే చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మంత్రిగా సలహాలిచ్చి చంద్రగుప్తుడికి తిరుగులేని సార్వభౌమాధిపత్యాన్ని సాధించిపెట్టాడు.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjyYLVJZADnj262oOjpQrSJP5I7QTPVjuasCexLefkKsgt5CzhkUDMJVBADvaT01Ta_M7ohCWhkZSFEyjsYIp-yuJXhsgnP929NHGZivA_qC0YI9Y4GOFfzFaBVYyhEtCBqAO9IlcH0Iw/s320/Chanakya-quotes.jpg
ఇన్ని తెలివితేటలు, ఇంత లౌక్యం, అపారమైన ప్రజ్ఞ, దార్శనికత... ఇవన్నీ చాణక్యుడికి తండ్రి నుంచి పుట్టుకతో సంక్రమించాయనుకోవాలి. తండ్రి చణకుడు వేద పారంగతుడు. వైద్య పండితుడు. గొప్ప జ్యోతిష్యుడు. శివ, విష్ణువులను ఆరాధించే భగవత్ సంప్రదాయాన్ని అనుసరించే శోత్రీయ కుటుంబానికి చెందినవాడు. అయితే వ్యక్తిగతంగా చణకుడు విష్ణు భక్తుడు. అందుకే కావచ్చు తనయుడికి విష్ణుగుప్తుడు అనే పేరు పెట్టుకున్నాడు. విష్ణుదేవుడి సేవకుడి పేరు అది. తర్వాత చాణక్యుడు కూడా తండ్రినే అనుసరించాడు. విష్ణువుని ఆరాధించాడు.

చాణక్యుని తండ్రి చణకుని పూర్వీకులు కేరళ ప్రాంతానికి చెందినవారనీ, అక్కడి నుంచి విద్యాభ్యాసం కోసం చాణక్యుడిని తక్షశిల పంపారనీ, ఆ తర్వాత అక్కడి విశ్వవిద్యాలయంలోనే ఆచార్యుడిగా చేరాడని ఒక కథనం. తక్ష శిల... మహామహులు చదివిన విద్యాపీఠం. తక్షశిల అంటే కఠిన శిల అని అర్థం. జీవితంలో ఎదురయ్యే కఠినమైన సమస్యలను తట్టుకుని నెగ్గుకు రావడం ఎలాగో తక్షశిల నేర్పుతుందనే ఉద్దేశంలో ఆ పేరు పెట్టారు.

http://4.bp.blogspot.com/_A-GYH536THk/TE2KMJeo1oI/AAAAAAAAACc/FDKvVMOcTl8/S220/chanakya.jpg
విద్యార్థిగా చాణక్యుడు ఇక్కడే రాటు తేలాడు. మనం ఇప్పుడు కష్టమనుకుంటున్న పాఠ్యాంశాలన్నీ ఇష్టంగా చదివాడు. ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, మేథ్స్, మెడిసిన్, ఆస్ట్రాలజీలను తేలిగ్గా చదివి సూక్ష్మాలను గ్రహించాడు. కొత్త విషయాలను కనిపెట్టి ప్రొఫెసర్‌గా ఇక్కడే విద్యార్థులకు బోధించాడు. మధ్య యుగాలనాటి అంధకారం నుంచి భారతావనికి వెలుగును ప్రసాదించిన జీవన నైపుణ్యాల జనకుడు చాణక్యుడు.

చంద్రగుప్తుడి తర్వాత మూడు తరాలు చాణక్యుని నీతి సూత్రాలతోనూ దేశాన్ని పాలించాయి. తర్వాతి రాజ వంశాలు, రాజ్యాంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలూ ఆ సూత్రాలను అనుసరిస్తూ వస్తున్నాయి. ఇప్పటికీ మన బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో చాణక్యుడిదే సిలబస్!


రాజులకు, చక్రవర్తులకు మంచి చెప్పాలనుకోవడం ప్రాణాలకు తెగించడమే. తండ్రి చణకుడు, తనయుడు చాణక్యుడు ఇలా ఇద్దరూ ప్రాణాలకు తెగించినవారే. ఇందుకు దారితీసిన కారణాలు కూడా ఒకే విధమైనవి కావడం విధి చిత్రమో, యాదృచ్ఛికమో తెలీదు. బహుశా అనువంశికం అయి ఉండాలి. మగధరాజు మహానందుడికి మంచి చెప్పబోయి చణకుడు ప్రాణాలు పోగొట్టుకుంటే, మహానందుడి వారసుడు ధననందుడికి మంచి చెప్పబోయి చాణక్యుడు తన ప్రతిష్టను భంగపరుచుకుని, శపథం చేయవలసి వచ్చింది.


రాజవంశీయుడు కాకుండానే రాజైన వాడు మహానందుడు! అతడొక సాధారణ పౌరుడు. మగధ రాజధాని పాటలీపుత్రంలో క్షురకునిగా జీవితం సాగిస్తున్నవాడు. అలాంటివాడు కుట్రపన్ని మగధ రాజును హతమార్చి అందలం ఎక్కుతాడు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మహానందుడు ఆ తిరుగుబాటును అణిచివేస్తాడు. విజయగర్వంతో ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తాడు. కేళీవిలాసాలకు బానిసై కాలక్షేపం చేస్తుంటాడు. ఈ సంగతి దక్షిణాదిని (ప్రస్తుతం మైసూరు) పాలిస్తున్న ఉత్తుంగ నరసింహుడుకి తెలుస్తుంది. అతడు తెలివైనవాడు. శక్తిమంతుడు. మగధపై దాడి చేసి తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేస్తాడు. ఈ విషయం తెలిసిన చణకుడు మహానందుడిని కలిసి రాబోతున్న ముప్పు గురించి హెచ్చరిస్తాడు. ‘ఏం చెయ్యాలో నాకు తెలుసు. నాకు నీతులు చెప్పడానికి వస్తావా?’ అని ఆగ్రహించి మహానందుడు అతడిని చంపిస్తాడు. తర్వాత నరసింహుడు మహానందుడిని చంపేస్తాడు. నవనందులైన మహానందుడి తొమ్మిది మంది కుమారులను చెరసాలలో వేయిస్తాడు.

సరిగ్గా ఇక్కడే చాణక్యుడు రంగ ప్రవేశం చేస్తాడు. నరసింహుడుని ఒప్పించి, నవనందులను విడిపించి, వారి కుటుంబాల క్షోభ తీరుస్తాడు. తిరిగి తక్షశిల వెళ్లిపోతాడు. తర్వాతి పరిస్థితులు త్వరత్వరగా మారిపోతాయి. మగధపై నరసింహుడు పట్టు తగ్గుతుంది. నవనందులలో ఒకరైన ధననందుడు తన ఎనిమిది మంది సోదరులను హతమార్చి తనను తను మగధకు రాజుగా ప్రకటించుకుంటాడు. అప్పుడది అలెగ్జాండర్ జైత్రయాత్ర జరుపుతున్న సమయం. లోకాలన్నీ జయించాక చివరిగా అతడు భారతావనిని కూడా సమీపించే సూచనలు ఉన్నాయని చాణక్యుడు ధననందుడిని హెచ్చరిస్తాడు. ధననందుడు అతడిని అవమానించి పంపుతాడు. అప్పుడు చేసిందే చాణక్యుడు శపథం. దాన్ని నెరవేర్చుకునేందుకు అతడి పడిన కష్టం, పట్టిన దీక్ష... ఇవే చాణక్యుడి జీవితంలోని ప్రధాన ఘట్టాలు. ఇవే అతడి జీవితంలో చరిత్రకారులు గుర్తించిన ముఖ్యాంశాలు.


ధననందుడిని పదవీచ్యుతుడిని చేసి, నందవంశాన్ని అన్యాక్రాంతం చేస్తానని ప్రతిన పూని తక్షశిల వెళ్లిపోయాక చాణక్యుడు యోగ్యుడైన భావి చక్రవర్తిని అన్వేషించే పనిలో పడ్డాడు. ముడి వీడిన శిరోజాలు ప్రతీకార జ్వాలలై అనుక్షణం అతడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తున్నాయి. ఎదురవుతున్న ప్రతి యువకుడిలోనూ అతడు మగధ వారసుడినే చూస్తున్నాడు! కానీ ఎవ్వరిలోనూ తనకు కావలసిన లక్షణాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో... చెట్లు, పుట్టలు, పల్లెలు, పట్నాలు గాలిస్తున్న చాణక్యుడికి లొఖాండీ అనే అటవీ ప్రాంతంలో (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో)... ఒక వేసవి ఉదయం, బాల భానుడితోపాటు, ప్రచండ భానుడిలాంటి బాలుడు చాణక్యుడి కంట పడ్డాడు. అతడే చంద్రగుప్తుడు!


ఆ సమయంలో చంద్రగుప్తుడు.. క్రూరుడైన తన గురువును ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాడు. ‘తమరు చేస్తున్నది తప్పు’ అని వాదిస్తున్నాడు. విద్యాబోధన పేరుతో జరిగే దౌర్జన్యాన్ని సహించనని చెబుతున్నాడు. ‘చదువులో మాత్రమే మీరు నాకన్నా అధికులు. మనిషిగా నేను మీకన్నా అధికుడిని’ అని ధైర్యంగా అంటున్నాడు.


చాణక్యుడికి ముచ్చటేసింది. నేరుగా బాలుడి తల్లి దగ్గరకు వెళ్లాడు. ‘‘నీ కుమారుడిని మగధకు చక్రవర్తిని చేస్తాను. నాతో పంపించు’’ అని అడిగాడు. అమె పేరు మురా దేవి. మయూరాలను కాసే కొండ ప్రాంత మహిళ. నందసోదరులలో ఒకరు ధననందుడి చేతిలో మరణించక ముందు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇటువైపు వచ్చి ముర అందానికి ముగ్ధుడై ఆమెను వివాహమాడతాడు. వారికి పుట్టినవాడే చంద్రగుప్తుడని, ఈ తల్లీకొడుకులు ధననందుడి కంటపడకుండా అడవిలో జీవనం సాగిస్తున్నారని చాణక్యుడు గ్రహిస్తాడు. ముర అనుమతిపై చంద్రగుప్తుడిని తన వెంట తీసుకెళ్లి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. అతడి పద్దెనిమిదవ యేట రాజ్యాధికార కాంక్ష రగిలిస్తాడు.


అప్పటికి నందవంశం... మధ్య, దిగువ గంగానదీ పరివాహక ప్రాంతలలో విస్తరించి ఉంటుంది. చాణక్యుని వ్యూహం ప్రకారం చంద్రగుప్తుడు నంద వంశానికి వ్యతిరేకంగా భారతావనిలోని మిగతా రాజ్యాలను ఏకం చేసి దండయాత్ర చేస్తాడు. నందులను రాజ్యభ్రష్టులను చేసి, మౌర్యసామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. తూర్పున బెంగాల్ అస్సాంల నుంచి పశ్చిమాన ఆఫ్గనిస్థాన్, బెలూచిస్తాన్‌ల వరకు, ఉత్తరాన కాశ్మీర్, నేపాల్‌ల నుంచి, దక్షిణాన దక్కను పీఠభూమి వరకూ మౌర్యులదే రాజ్యం! అప్పటికిగానీ చాణక్యుడు శాంతించడు!


తొలి ఐదేళ్ల వరకు నీ బిడ్డపై గారాలు కురిపించు. తర్వాతి ఐదేళ్లు దారిలో పెట్టేందుకు దండించు. పదహారేళ్లు వచ్చేటప్పటికి స్నేహితుడిగా మసులుకో. ఎదిగిన బిడ్డలే నీ ఆప్తమిత్రులు - అంటాడు చాణక్యుడు. చంద్రగుప్తుడిని కూడా అతడు తన బిడ్డలానే చూసుకున్నాడు. చివరి వరకు వెన్నంటే ఉన్నాడు. చంద్రగుప్తుడి తర్వాత ఆయన కుమారుడు బిందుసారుడు, బిందుసారుడి తర్వాత అతడి కుమారుడు అశోకుడు... చాణక్యనీతిని అనుసరించే రాజ్యపాలన సాగించారు. శిష్యుడు చంద్రగుప్తుడు 42 వ యేట చనిపోతే... గురువు చాణక్యుడు తన 87 యేట వృద్ధాప్యంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.

********

చాణక్యుడి స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోడానికి అర్థశాస్త్రం ఉపయుక్తమైన గ్రంథం. రామాయణం కాండలుగా, మహాభారతం పర్వాలుగా, భాగవతం స్కందాలుగా ఉన్నట్లే చాణక్యుడి అర్థశాస్త్రం అధికరణాలుగా ఉంటుంది. మొత్తం పదిహేను అధికరణాలివి. రాజ్యపాలన, పౌరధర్మం, సామాజిక నీతి ఇందులోని ముఖ్యాంశాలు. ఇవన్నీ ఆయన అనుభవాలలోంచి సిద్ధాంతీకరించిన సూత్రీకరణలే కాబట్టి చాణక్యుడు ఇంకోలా ఇంకోలా ఉండేందుకు లేదు. రాసిందొకటీ, చేసిందొకటీ అయ్యేందుకు లేదు.

********

నీతి, ధర్మం అనేవి తప్పకూడనివి. కానీ... తప్పడమే నీతి, ధర్మం అనే పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. అప్పుడు మనం తీసుకునే నిర్ణయం ఎలాంటిదైనా, దానిని సమర్థించుకోడానికి కారణాలు వెతుక్కునే పనిలేకుండా, పరిస్థితులనే వాటంతటవి మనకు కాపుగాసేలా మలుచుకోవాలి. ఇదే చాణక్య నీతి.

చాణక్యుడు, ఆర్థికవేత్త
(మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని గురువు)
జననం : పూ. 370
మరణం : పూ. 283
జన్మస్థలం : ఉత్తర భారతదేశం
తండ్రి : చణకుడు
తల్లి : కచ్చితమైన వివరాలు లేవు.
చదువు, కొలువు : మొదట తక్షశిల విశ్వవిద్యాలయంలో తర్వాత చంద్రగుప్తుని మంత్రిగా
రాసిన గ్రంధాలు : అర్థశాస్త్రం, చాణక్య నీతి

చాణక్య నీతి చంద్రిక

పూల సౌరభం గాలి వీస్తున్న వైవే వ్యాపిస్తుంది. మంచితనపు పరిమళాలు అన్ని దిక్కులకూ విస్తరిస్తాయి.

నిరంతరం పనిలో నిమగ్నమైయున్నవారు నిత్యం సంతోషంగా ఉంటారు.


ఓటమికి ఇంకొక పేరు అసూయ.


రాజు సగటు మనిషిగా జీవించే చోట ప్రజలు రాజభోగాలు అనుభవిస్తారు. పాలకులు రాచరిక సౌఖ్యాలను అనుభవించే చోట ప్రజలు యాచకులై జీవిస్తారు.


అధముడి దగ్గరైనా సరే , ఏదైనా మంచిని నేర్చుకోవలసి వస్తే వెనుకాడవద్దు.


భయం దరి చేరగానే దాన్ని ఎదుర్కొని నాశనం చెయ్యి.


చాణక్య చంద్రగుప్త


అది 1977వ సంవత్సరం. ఎన్టీఆర్ ‘చాణక్య చంద్రగుప్త’ సినిమా చేయాలనుకున్నారు. పైగా ఆ సినిమాను భారీ మల్టీస్టారర్‌గా నిర్మించాలనుకున్నారాయన. అక్కినేనిని ఎలాగైనా తన సంస్థలో, తన డెరైక్షన్‌లో నటింపజేయాలనేది ఎన్టీఆర్ చిరకాల వాంఛ. స్వతహాగా ఎన్టీఆర్‌కి చాణక్యుడి పాత్రంటే ఇష్టం. అందుకే ఆ పాత్రను తానే పోషించి, చంద్రగుప్తుడి పాత్రను అక్కినేనితో చేయించాలి అనుకున్నారాయన. కానీ ఏఎన్నార్ అందుకు ఒప్పుకోలేదు. ‘‘చంద్రగుప్తుడు మహావీరుడు. అలాంటి పాత్ర నువ్వు చేస్తేనే కరెక్ట్ బ్రదర్. నేను చాణక్యుడిగా చేస్తాను’’ అని తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆయన అభిప్రాయాన్ని గౌరవించి ఎన్టీఆర్ చంద్రగుప్తుడిగా, అక్కినేని చాణక్యుడిగా సినిమా మొదలైంది. అలెగ్జాండర్‌గా శివాజీగణేశన్ చేశారు. అదే ఏడాది ఆగస్ట్ నెలలో సినిమా విడుదలైంది. సరిగ్గా ఆ సినిమా విడుదలైన పదిహేళ్ల తర్వాత ఎన్టీఆర్ ‘సామ్రాట్ అశోక’ చిత్రం నిర్మాణానికి పూనుకున్నారు. అశోకుడిగా ఎన్టీఆరే నటించారు. అయితే.. చాణక్యుడిగా నటించాలన్న తన కోరిక తీరకపోవడంతో... చనిపోయిన చాణక్యుడు ఆత్మరూపంలో వచ్చి అశోకుడి తల్లికి గురోపదేశం చేసినట్టుగా.. అవసరం లేకపోయినా ఓ సన్నివేశాన్ని ఆ సినిమా కోసం సృష్టించారు ఎన్టీఆర్. ఆ సన్నివేశంలో తానే చాణక్యుడిగా నటించి కోరిక తీర్చుకున్నారు. తెలుగు సినిమా తల్లికి రెండుకళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ఇష్టపడి మరీ చాణక్యుడి పాత్రను పోషించడం విశేషం.
- సాక్షి ఫ్యామిలీ

No comments: