Monday, October 25, 2010

' అబద్ధం ' చాలా చిన్న బలమైన పదం.

అబద్ధం...నేటి నిజం!

అబద్ధం చెప్పటం కొందరికి ప్రాణావసరం. మరి కొందరికి సరదా. ఇంకొందరికి ఒక జీవన విధానం. తరచి చూస్తే- మన చుట్టూ అనేక అబద్ధాలు. రోజూ వీటిలోనే మనం బతుకుతూ ఉంటాం. జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పని వ్యక్తి ఎవరూ ఉండరు. అసలు మనం ఎందుకు అబద్ధం చెబుతాం? దానికి కారణాలేమిటి? ఈ విషయాలను డోరతి రో- 'వై వుయ్ లై' అనే పుస్తకంలో కూలంకషంగా చర్చించారు. అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న ఈ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు.


"అవతల వ్యక్తులను మోసం చేయటానికి ఉపయోగించే పదాలను కాని, చర్యలను కాని అబద్ధాలు అని మనం పిలుస్తాం. చాలా సార్లు మనం ఇతరులకు వాస్తవం చెప్పం. అబద్ధం చెబుతాం. కొన్ని సార్లు మనకు మనమే అబద్ధం చెప్పుకుంటాం. అబద్ధం అనే పదం చాలా చిన్నదే. కాని ఇది చాలా బలమైన పదం.


ప్రయోగిస్తే మనసులోకి సూటిగా దిగుతుంది. అందుకే ఎక్కువ మంది ఈ పదాన్ని ఉపయోగించటానికి ఇష్టపడరు. భాషాపరంగా చూస్తే అబద్ధానికి కచ్చితమైన అర్థం ఏదీ లేదు. వివిధ సమాజాల్లో దీనిని విభిన్నరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక సారి రోమ్ విశ్వవిద్యాలయంలో ఫెరారీ కంపెనీ ప్రెసిడెంట్, ఫియట్ కంపెనీ ఛైర్మన్ ల్యూకా కార్డిరో-మోంటిజీమోలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. "నేను స్కూల్లో ఉన్నప్పుడు కాపీ చేయటంలో ప్రపంచ ఛాంపియన్‌నని చెప్పొచ్చు.


ఈ విషయంలో నాకు ఎవరూ పోటీ ఉండేవారు కాదు. తెలివైన వారి పక్కన కూర్చోవటానికి ఏదో ఒక మార్గం వెతికేవాడిని. వారి దగ్గర కూర్చుని అంతా కాపీ కొట్టేవాడిని'' అని ల్యూకా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ఈ అంశం గురించి ఫ్రాంక్స్ ఎక్స్ రోకా అనే పాత్రికేయుడు వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఒక వ్యాసం రాశాడు. 'అమెరికాలో విద్యార్థులు ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని సేకరించి ఉపయోగించుకుంటూ ఉండొచ్చు.


కాని పక్క విద్యార్థుల నుంచి కాపీ కొట్టి.. దానిని తమ సొంత ప్రతిభగా ప్రదర్శించుకోరు. ఇది చాలా గర్హించదగ్గ విషయం''అని ఆ వ్యాసంలో వ్యాఖ్యానించాడు. అంతేకాదు 'ఇటలీలో కాపీ చేయటాన్ని ఒకరి పట్ల విశ్వాసానికి, విద్యార్థుల మధ్య బంధానికి చిహ్నంగా భావిస్తూ ఉండొచ్చు. చాలాసార్లు మోసగాళ్లు జీవితంలో పైమెట్టు ఎక్కలేకపోవచ్చు


. కానీ కాపీరాయుళ్ల మాత్రం పైకి వస్తారనటానికి నిదర్శనాలు ఉన్నాయి' అని ల్యూకాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారం లేపాయి. ఇటలీకి చెందిన అనేకమంది మేధావులు ఈ వ్యాఖ్యలను ఖండించారు...


ఎందుకు?
అబద్ధం ఆడి తప్పించుకు పోవచ్చని చాలామంది భావిస్తూ ఉంటారు. చాలా మందికి ఈ అలవాటు చిన్నప్పుడే అబ్బుతుంది. కొందరు చెప్పే అబద్ధాలు ఇట్టే తెలిసిపోతాయి. అవి అబద్ధాలని మనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉండదు. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన అంశం- మనకు మనం అబద్ధం చెప్పుకోవటం.


ముందుగా ఒక విషయాన్ని నిజమని నమ్మటం మొదలుపెట్టి దానిని ఇతరులకు చెప్పటం మొదలుపెడతారు. అది బయటకు వస్తుందేమోననే భయంతో- వాస్తవాన్ని కప్పిపుచ్చటానికి మరొక అబద్ధం చెబుతారు. అది అబద్ధమనే అనుమానం రాకుండా ఉండటానికి ఇంకొకటి చెబుతారు. ఇలా ఒక వలను అల్లుతారు.


కొందరు మంచి పని చేయటం కోసం అబద్ధం చెప్పామనో.. ఒక ఉన్నతమైన విలువను కాపాడటం కోసం అబద్ధం చెప్పామనో కూడా చెబుతూ ఉంటారు. కాని చాలాసార్లు అవతల వ్యక్తులు వీటిని గుర్తిస్తారు.అయినా భయం వల్లనో, గౌరవం వల్లనో బయటకు చెప్పరు.


మౌనమే నీ భాష..
కుటుంబ జీవితం ఒక పెద్ద అబద్ధాల పుట్ట. అయితే కొందరు చాలాసార్లు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోతారు. అలాంటి సమయాల్లో మౌనమే పెద్ద ఆయుధంగా మారుతుంది. "ఎంత తక్కువ మాట్లాడితే- పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి'' అనే సిద్ధాంతాన్ని కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు.


సాధారణంగా కుటుంబంలో అతి శక్తివంతమైన వ్యక్తి అబద్ధాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు- మౌనాన్ని ఒక బలమైన ఆయుధంగా వాడుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు మా ఇంట్లో మా అమ్మకు ఏదైనా విషయం చెప్పటం ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండిపోతుంది.


నన్ను ఏదైనా విషయంలో శిక్షించాలన్నా.. నేను విమర్శలు చేస్తున్నప్పుడు అడ్డుకోవాలన్నా ఆమె ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తుంది. మా ఇంటికి సంబంధించిన చాలా రహస్యాలు ఇప్పటికీ నాకు తెలియదు. ఎప్పుడైనా రహస్యాల వైపు సంభాషణలు మళ్లినప్పుడు- అమ్మ మౌనం వహిస్తుంది. కొన్నిసార్లు అబద్ధం కూడా చెబుతుంది. ఆ విషయం ఆమెకు కూడా స్పష్టంగా తెలుసు.


'పిల్లలకు అన్ని చెప్పలేం కాబట్టి అబద్ధం చెప్పినా పర్వాలేదు' అని ఆమె నమ్ముతుంది... ఎవరికైనా చెప్పవచ్చు కానీ..
మనకు మనం అబద్ధాలు చెప్పుకోవటం మొదలుపెట్టినప్పుడు వాస్తవానికి దూరంగా జరిగిపోవటం మొదలుపెడతాం. తెలియకుండానే కళ్లకు గంతలు కట్టేసుకుంటాం. "కొందరికి కొంత కాలం పాటు మనం అబద్ధాలు చెప్పవచ్చు. కాని ఆ తర్వాత అది సాధ్యం కాదు. అయితే మనకు మనం ఎప్పటికీ అబద్ధాలు చెప్పుకుంటూ బతికేయవచ్చు'' అంటాడు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిమన్ హోగర్ట్.


కొత్త జీవులను కనుక్కోవటానికి జీవ శాస్త్రవేత్త తన అధ్యయనాలను కొనసాగించవచ్చు. కొత్త రసాయనాలను కనుగొనటానికి రసాయన శాస్త్రవేత్త పరిశోధనలు చేయవచ్చు. కాని మనుషుల్లో కొత్త రకం ప్రవర్తనను కనిపెట్టడం చాలా కష్టం. మన చుట్టూ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాని మనం మాత్రం తరతరాలుగా ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం...


మనకు తెలుసు..
అబద్ధం ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. ప్రతిరోజూ మనకు అనేక మంది అబద్ధాలు చెబుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటంలో వ్యక్తులు, సంస్థలు అనే తేడా కూడా ఏమీ లేదు. చాలాసార్లు ఇలాంటి అబద్ధాల వలన మనకు హాని కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం- ప్రతి కంపెనీ తన వార్షిక ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.


కంపెనీ సైజు పెరిగే కొద్దీ వార్షిక నివేదిక కూడా ఆకర్షణీయంగా తయారవుతూ ఉంటుంది. దీనిలో షేర్‌హోలర్డ్స్‌ను ఆకట్టుకొనే అంశాలెన్నో ఉంటాయి. ఈ నివేదికలు చదవటానికి చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అయితే ఈ భాష వెనక అనేక అబద్ధాలను కప్పిపెడతారు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణను చూద్దాం.


2007వ సంవత్సరపు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ వార్షిక నివేదికను 2008, ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేశారు. "రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ (ఆర్‌బీఎస్) చాలా బాధ్యతాయుతమైన కంపెనీ. మా అధ్యయనాల ఆధారంగా షేర్‌హోల్డర్స్‌కు లాభదాయకమైన వాటిని ఎంపిక చేస్తాము..'' అని ఉంది. కాని ఆ ఏడాది షేర్ హోల్డర్స్‌కు తెలియకుండా ఆ బ్యాంకు రిస్కుతో కూడిన అనేక పెట్టుబడులు పెట్టింది.


చివరకు బ్యాంకు దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం సాయంతో తిరిగి కోలుకుంది. దీని ఆధారంగా చూస్తే- సాధారణంగా ఇలాంటి నివేదికల్లో బయటకు చెప్పేది ఒకటి.. వాస్తవ పరిస్థితి మరొకటి ఉంటుందని తేలుతుంది. 
వై వుయ్ లై
రచయిత్రి: డోరతి రో
ప్రచురణ: ఫోర్త్ ఎస్టేట్, లండన్
ధర: రూ. 350
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాల్లోను దొరుకుతుంది

Sunday, October 24, 2010

పట్టు దలే పేట్టుబడి...


 గమనించారో లేదో, సాధారణ వ్యక్తుల అసాధారణ విజయాల ద్వారా కేవలం వారికి సుఖ సంతోషాలే కాదు, మానవ కళ్యాణం కూడా జరుగుతూ వస్తుంది. ఫోర్డు కల సాకారమై మనకి కార్లు, రోడ్లు.ఎడిసన్ కలలు సాకారమై మనకో కొత్త ప్రపంచం, సరికొత్త జీవితం. స్వామినాథన్ గమ్యాల సాకారంతో మనదేశంలో హరిత విప్లవం. రైట్ బ్రదర్స్ కలలు నిజమై మానవ జాతికి రెక్కలొచ్చినాయి.ధీరూభాయ్ ధర్మమా అని మన లోని కొన్ని లక్షల మంది సామాన్యులకు మనమూ విజేతలవగలమనే స్ఫూర్తి, ధైర్యం వచ్చినాయి.ఇలా అందరి సొంత విజయాలు వారికే పరిమితం కాకుండా మన జీవితాల్లో కూడా పెనుమార్పులు తెచ్చినాయి. నిజానికి వీరెవ్వరూ మానవజాతి కళ్యాణానికి నడుంబిగించి రంగ ప్రవేశం చేయలేదు. తమ కలలను.. జీవించాలనే తపనతో కార్యోన్ముఖులైనారు.

ఫలితమేమిటంటే వారి విజయాలు మానవ విజయాలుగా మారినాయి. గొప్ప విషయం కదా ! ఈకోవకు చెందిన మరో వ్యక్తి మన మధ్యలోనే ఉన్నాడు. మనందరికి ఎంతో మాన్యుడు, స్ఫూర్తిదాత. మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తి. ఆయన ఎవరో కాదు మన అబ్డుల్ కలామ్ గారు.బాల్యంలో కూటికి, గుడ్డకి, స్కూలు ఫీజుకి అన్నింటికీ అనునిత్యం యుద్ధం. ఓర్పు, చిరునవ్వు, స్వశక్తిపై, తన కలలు గమ్యాలపై అపారమైన నమ్మకం. ఇవే కాక ఎంతో పాజిటివ్ థృక్పధం. జీవన పోరాటంలో ఇవీ ఆయన ఆయుధాలు. ఫలితంగా విజయ పరంపర. భారత్‌లోని అత్యున్నత పురస్కారం భారతరత్న తన సొంతం చేసుకున్న మహోన్నతుడు...రాకెట్ సైన్సులో అసామాన్యమైన ప్రతిభ కనబరిచి. అంతటితో ఆయన విజయ ప్రస్థానం ఆగలేదు. మన దేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఉత్త రాష్ట్రపతి కాదు.. మనందరం ఎంతో అభిమానించి, ప్రేమించి, గౌరవించిన రాష్ట్రపతిగా. మనదేశ చరిత్రలో అంతటి ప్రేమాభిమానాలు పొందిన మరో రాష్ట్రపతి లేడంటే అతిశయోక్తి కాదేమో !అబ్దుల్ కలామ్ గారు నావలను నిర్మించే జైనుల్లాబుద్దీన్ కుమారుడు. రామేశ్వరం సొంత ఊరు. బీద కుటుంబం అయినప్పటికి తల్లిదండ్రుల ప్రేమానురాగాలు ఆ బీదరికపు బాధలను మరుగుపర్చాయి.

కలాంలో మేలైన భావసంపద, మంచి చెడుల గురించి అవగాహన, సద్భుద్ధి, పరోపకారం, సద్భుద్ధులను, జ్ఞానఖనిని తల్లిదండ్రులు ఆయనకు కానుకగా ఇచ్చారు. ఈ జ్ఞాన ఖనే తన స్వ గ్రామంలోని మాస్క్ స్ట్రీట్ నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దాకా నడిపించింది.సామాన్యంగా ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు అపారమైన సంపద తరతరాలకి సరిపడా డబ్బుదస్కాలు వదిలి వెళ్లాలనుకుంటారు కాని ఎందరు తల్లిదండ్రులు సద్భుద్ధి, జ్ఞాన సంపద పరోపకారం లాంటి గుణగణాలను తమ పిల్లలకు తమ వారసత్వంగా ఇస్తారో ఆలోచించాల్సిన విషయమే!! ముఖ్యంగా నేటి కాలమాన పరిస్థితుల్లో సంపదే సర్వస్వంగా భావించే నేటి సమాజంలో దానిని పొందేందుకై అన్ని అడ్డదారులు బాహాటంగా తొక్కే తల్లిదండ్రులకు భావి కలామ్ ఎలా లభిస్తారు ? మరి దేశం మాటేమిటి ?? కలామ్ గారికి చిన్నప్పటి నుంచి ఒక గొప్ప కల ఉండేది. నేడు మనలాంటి వారికి అదో సర్వసామాన్య కలలా గోచరించవచ్చు. కాని దేశపుటంచున ఒక కుగ్రామంలో బీదరికంలో కొట్టుమిట్టాడుతూ, దినపత్రికలు అమ్మే కుర్రవానికి. తానో పైలట్ కావాలనుకోవటం చాలా పెద్ద కలే కదా !!

సముద్రపుటొడ్డున నిలిచి, ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షులను చూస్తూ. ఏదో ఒకనాడు తనూ అలా ఎగరాలనే కలలు కనేవాడు కలామ్. ఈ కలలే ఆయన భావి జీవితానికి మార్గదర్శకాలైనాయి. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు కలామ్. ఇదంత సులభంగా జరగలేదు. తన సోదరి బంగారు నగలు ఆయన చదువుకి పెట్టుబడిగా మారాయి. డబ్బుకి ఎంత ఇబ్బందిగా ఉండేదంటే మాంసాహారం నుంచి పూర్తి శాకాహారానికి మారిపోవాల్సి వచ్చింది. అయితే లక్ష్మీ కటాక్షం తర్వాత కూడా పూర్తి శాకాహారిగా, ధూమ మద్యపానాలకు దూరంగా ఉండి పోయాడు కలామ్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ లభించినా ఆకాశయానం కోరిక తీరలేదు. తనకెంతో ఇష్టం, జీవిత గమ్యమైన ఎయిర్‌ఫోర్సు పైలట్ ఉద్యోగం లభించలేదు. నిరాశ నిస్పృహలతో రిషికేష్ వెళ్లాడు కలామ్. అక్కడేమైన జవాబులు దొరుకుతాయేమోననే ఆలోచనతో. అక్కడ ఒక ఆశ్రమంలో స్వామి శివానంద బోధించిన బోధ తనెప్పుడు మరువలేనిది.

"ఏవైనా కోరికలు హృదయాంతరాల్లో జనించినవైతే అవి నిర్మలంగాను, ఎంతో బలమైనవిగాను ఉంటే, వాటికి ఎంతో గొప్ప విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది. మన మెదడు విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ శక్తి ప్రతిరాత్రి ప్రకృతిలో పయనించి, తిరిగి ఉదయం జాగృతమైన మెదడులోకి ప్రవేశిస్తుంది. కాస్మిక్ తరంగాలతో ఎంతో బలోపేతమై.. ఈ ప్రక్రియ వల్ల మన కోరికలు సాకారమవుతాయి. ఇది నిత్యం. ఇది సత్యం కనుక నీ విషయంలో కూడా నీ కోరికలు నెరవేరుతాయి... తప్పకుండా.. ఎంత తప్పకుండా అంటే.. ప్రతిరోజు ఉదయించే సూర్యునిలా ప్రతి ఏడు వచ్చే వసంత కాలంలా...''

దీన్నే మరో విధంగా చెప్పాడు వాల్ట్ డిస్నీ మహాశయుడు.. "నీ కంటూ కలలుంటే, అవి తప్పక నెరవేరుతాయని..'' కుదుటపడ్డ మనసుతో తిరిగి వచ్చిన కలామ్, 1958 వ సంవత్సరంలో భారత డిఫెన్స్ మినిస్ట్రీలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్‌గా చేరాడు. నెలకి 250 రూపాయల వేతనం. నేడు ఈ మొత్తానికి ఏమంత విలువ లేనప్పటికీ ఆరోజుల్లో అది మంచి వేతనమే. తాను ఎంతగానో కాంక్షించిన ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం పొందలేకపోయినప్పటికి దానికి సంబంధించిన శాఖలోనే పనిచేస్తున్నందుకు కాస్తో కూస్తో తృప్తిగా ఉండేది కలామ్‌కి.. అక్కణ్ణుంచి కలామ్ జీవితం ఎక్కలేని ఎత్తుల్లేవు.. ఎగరలేని ఆకాశపుటంచుల్లేవు. భారత దేశపు మొట్టమొదటి స్పేస్ మిషన్ టీమ్‌లో ఒక సభ్యుడు కలామ్. రాకెట్ నిర్మాణంలో ప్రావీణ్యుడు.

ఆనాడు రుషికేష్‌లో స్వామి శివానంద్ ప్రవచనం భవిష్య వాణి నిజమైనాయి. కలామ్ కలలు, కోరికలు సత్యమైనవి. ఆయన హృదయాంతరాళం నుంచి బయలుదేరినవి. వీటిని ప్రకృతి, పంచభూతాలు దీవించి అవి సాకారమయ్యే దిశగా కలామ్‌ని నడిపించినాయి. కలామ్ నేతృత్వంలో రూపుదిద్దుకొన్న భారత్ గైడెడ్ మిసైల్ ప్రొగ్రామ్ మనదేశానికి శక్తిని గౌరవ మర్యాదలే కాకుండా కలామ్‌కి ఎంతో పేరు ప్రతిష్టలనార్జించినాయి. అత్యున్నత పదవి, అత్యున్నత పురస్కారం, ప్రజల గుండెల్లో అపారమైన ప్రేమాభిమానాలు. ఎక్కడ రామేశ్వరంలోని అతి బీద కుర్రవాడు..! ఎక్కడ భారత దేశపు రాష్ట్రపతిగా, భారత రత్నగా వెలుగొందిన డాక్టర్ అబ్దుల్ కలామ్..!! ఒకే జీవితం. కలలని, గమ్యాలను బట్టి సాగే జీవన యానం. మన కలామ్ గారి జీవిత కథ, జీవన యాత్ర మనను ఉత్తేజ పరిచి, కొందరినైనా ఆకాశపు అంచులను తాకేలా ప్రోత్సహిస్తుందా???

మన తల్లిదండ్రుల ద్వారా మనం పొందిన పెంపకం, మనం పుణికి తెచ్చుకున్న విలువలు, సంస్కారం మీద ఆధారపడ్డ విషయం ఇది. కేవలం ధనార్జన కోసమే జీవితాన్ని అడ్డదారులు తొక్కించకుండా, సన్మార్గంలో, మంచి విలువలతో కూడా పేరు ప్రఖ్యాతులు, వాటితో పాటు లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. మన జీవిత కాలంలోనే. ఇది సాధ్యమే. మనందరికీ అందుబాటులో ఉన్న మార్గమనేనని పదేపదే చెప్పేవే. మనం గత 12 వారాలుగా ముచ్చటించుకుంటున్న జీవిత గాథలన్నీ. పెద్ద పెద్ద కలలు కనటం, వాటిని జీవిత గమ్యాలుగా మార్చుకోవటంతో నే ఇటువంటి ప్రస్థానం మొదలయ్యేది.

"ఏవైనా కోరికలు హృదయాంతరాల్లో జనించినవైతే అవి నిర్మలంగాను, ఎంతో బలమైనవిగాను ఉంటే, వాటికి ఎంతో గొప్ప విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది. మన మెదడు విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ శక్తి ప్రతిరాత్రి ప్రకృతిలో పయనించి, తిరిగి ఉదయం జాగృతమైన మెదడులోకి ప్రవేశిస్తుంది''. 
- ఎజి కృష్ణమూర్తి

Tuesday, October 5, 2010

అరవై అంటే నలభై... * శోభా ఎట్ సిక్స్‌టి. అరవై ఏళ్లు దాటిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ఈ పుస్తకం.

అంతర్జాతీయంగా మన దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన ఇంగ్లిషు రచయిత్రులలో శోభా డే ఒకరు. మోడల్‌గా, ఎడిటర్‌గా, కాలమిస్ట్‌గా, రచయితగా- విశేష అనుభవం గడించిన శోభా డే రాసిన తాజా పుస్తకం- శోభా ఎట్ సిక్స్‌టి. అరవై ఏళ్లు దాటిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దీనిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు....

"నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు- ఎప్పుడో ఒకప్పుడు నాకు కూడా అరవై ఏళ్లు వస్తాయని ఊహించలేదు.
అది దాదాపు అసాధ్యమైన విషయం అనుకున్నా. 60 ఏళ్లు.. అంటే ముసలి అయిపోయినట్లే.. చనిపోవచ్చు కూడా.. అయితే 60 అంకె నన్ను ఎప్పుడూ భయపెట్టలేదు. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఆ ఆలోచనే ఎప్పుడూ రాలేదు. నా బుర్రలో మిగిలిన విషయాలు ఉండేవి తప్ప- వార్థక్యం గురించి ఎప్పుడైనా ఆలోచించలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి.

పదాహారేళ్లు ఉన్నప్పుడు ఇరవై వచ్చిన వాళ్లు కూడా వయస్సు మీద పడినట్లు కనిపిస్తారు. మరి అరవై ఏళ్లు వచ్చినప్పుడు? అని మీరు అడగవచ్చు. నా వరకూ- 60 ఏళ్లు రావటం భయంకరమైన అనుభవం కాదు. ఒక విధంగా చూస్తే చాలా సంతృప్తినిచ్చే విషయం.

అరవై ఏళ్లు వచ్చినప్పుడు- నేను ఆనందపడ్డానని మాత్రం చెప్పను. అలాగని నిరాశ, నిస్పృహలు మాత్రం చెందలేదు. కొంత ప్రశాంతంగా అనిపించింది. నేను సీనియర్ సిటిజన్ అనే భావన నాలో వచ్చి చేరింది. ఇంకా నా తల మీద బోలెడంత జుట్టు ఉంది (ప్రతి ఇరవై రోజులకు ఒక సారి రంగు వేసుకుంటా.. కాని అది వేరే సంగతి). నా ముప్ఫై రెండు పళ్లకి వచ్చిన ఢోకా లేదు

. కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఇటీవలే నేను గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో కొద్ది భాగాన్ని గుండెపోటు రాకుండానే ఎక్కగలిగాను. నా కళ్ల చుట్ట్టూ వలయాలు, మొహం మీద, మెడ మీద ముడతలు పడిఉండచ్చు. అయితే ఏంటి? ఈ ఆలోచన రాగానే నాకు నవ్వొచ్చింది. నా మూడ్ మారింది. "ఎప్పుడూ నవ్వుతూనే ఉండు..ఇది జీవితంలో మరో అధ్యాయం. దీనిని ఎలా నడుపుతావనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది

సమాజంలో ఉన్న కట్టుబాట్లు, ఇతర అంశాలకు తల వంచితే- భవిష్యత్తు చాలా బాధాకరంగా ఉంటుంది. నిన్ను నువ్వు సానుకూల దృక్పథంతో చూసుకుంటే- పరిస్థితులు మెరుగుగా ఉంటాయి..'' అని నాకు నేనే భరోసా ఇచ్చుకున్నా. ఈ భరోసా నా ఒక్కదానికి మాత్రమే కాదు. నా వయస్సులో ఉన్న మహిళలందరికి కూడా. నిరాశ చెందాల్సిన అవసరమేమీ లేదు.

"అరవై అంటే నలభై..'' అని గట్టిగా అనుకున్నా. చాలామంది మహిళలకు వయస్సు ఒక పెద్ద ఉచ్చు. వయస్సు మీద పడిన మహిళలను మన సమాజం చాలా ఘోరంగా చూస్తుంది. పురుషులకు ఈ సమస్య ఉండదు. ఒక మహిళ విలువను మనం ఆమె రూపురేఖల ఆధారంగా నిర్ధారిస్తాం.ఈ ప్రయాణం ఆధారంగా చూస్తే అరవై ఏళ్ల మహిళకు ఉండే విలువ తక్కువ.

ఇటీవల కాలంలో ఇరవై ఐదేళ్లు ఉన్న మహిళలు కూడా వయస్సు మీదపడటం వల్ల వచ్చే సమస్యల గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. "మీకేం సమస్యలున్నాయి?'' అని వాళ్లని అడిగా. జుట్టు రాలిపోవటం, కళ్ల చుట్టూ వలయాలు, చలాకీగా ఉండలేకపోవటం, పొట్ట- ఇలాంటి సమస్యలు చెప్పారు. వాళ్లు చెబుతున్న మాటలను నేను నమ్మలేకపోయాను. నా కళ్లకు వాళ్లు అప్సరసల్లా కనిపిస్తున్నారు.

మరి వారు తమ గురించి తాము అంత తక్కువగా ఎందుకు అనుకుంటున్నారు? బహుశా- ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే వివిధ రంగాల్లో విజయం సాధిస్తున్న వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. అందువల్ల 25 ఏళ్లు ఉన్నవారు కూడా మధ్యవయస్కుల్లా మధనపడుతూ ఉండచ్చు.

"సిగ్గు పడకుండా, జీవితాన్ని అనుభవించండి. ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే సమయం ఇదే. ప్రతి వారానికి ఒక సెక్స్ బ్రేక్ తీసుకోండి. దానిని రొమాంటిక్‌గా, మరిచిపోలేని అనుభవంగా మార్చుకోండి..''
సెక్స్‌ను ఆనందించండి...
మన సంస్కృతి సంప్రదాయాల పరంగా చూస్తే- వృద్ధులకు శృంగార వాంఛలు ఉండకూడదు. శృంగార ఆలోచనలను దరిచేరనివ్వకూడదు. సెక్స్‌ను మనం పునరుత్పత్తికి సాధనంగా మాత్రమే చూస్తాం. దానిని ఒక అందమైన అనుభవంగా పరిగణించం. పిల్లలు పుట్టిన తర్వాత ( అంటే పునరుత్పత్తి తర్వాత) శృంగార వాంఛలను తగ్గించుకోవాలని చెబుతారు.

ఇది నా దృష్టిలో చాలా పొరపాటు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంత కాలం, శృంగారం పట్ల ఒక సానుకూలవైఖరి ఉన్నంత కాలం, సమాజంలో కట్టుబాటు కుంగదీయనంత కాలం- 60వ దశకంలో కూడా ఆనందంగానే గడపవచ్చు. అర్థం చేసుకొని ఆనందించే భార్య లేక భర్త ఉంటే ఇంకా మంచిది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్నవారైతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

ఒకరి శారీరక, మానసిక అవసరాలు మరొకరికి తెలియటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉన్నా తొలగిపోతాయి. అంతే కాకుండా శృంగారంలో తాను ధీరుడినని రుజువు చేసుకోవాల్సిన అవసరం భర్తకు కాని.. తాను భర్తను అన్ని విధాలుగా సుఖపెట్టలేకపోతున్న భావన భార్యకు కాని ఉండదు. అందువల్ల ఎటువంటి ఆందోళన లేకుండా ఆనందించటానికి ఈ వయస్సు పనికొస్తుంది. నాకు తెలిసిన కొందరు దంపతులు- పెళ్లైన కొత్తలో కన్నా- 50 ఏళ్లు దాటిన తర్వాతే శృంగారంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నామని చెబుతూ ఉంటారు.

చాలాసార్లు రుతుక్రమం ఆగిపోయిన తర్వాత- మహిళలు తమలో ఉన్న శృంగారభావనలను వెలికి తీయగలుగుతారు. గర్భం వస్తుందనే భయం లేకపోవటం వల్ల శృంగార అనుభూతులను ఆనందించగలుగుతారు. ఎక్కువ మందితో సంబంధాలు లేని దంపతులు- అరవై, డెబ్బైలలోనే ఎక్కువగా శృంగార భావనలను అనుభవించగలుగుతారని, ఆరోగ్యంగా కూడా ఉంటారని సర్వేలు చెబుతున్నాయి

అయితే ఈ వయస్సులో ఉన్నవారికి- "మన పిల్లలు చూస్తే ఎలా భావిస్తారు? మనవలు ఎలా ఫీల్ అవుతారు? ఈ వయస్సులో సెక్స్ కోర్కెలు కలగడం అసహజం కదా..'' వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఈ వయస్సులో ఉన్నవారికి ఖాళీ సమయం ఎక్కువగా ఉంటుంది.

రోజూ ఏదో ఒక పని కోసం పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండవు. అయితే భార్యాభర్తల్లో శారీరకంగా అనేక మార్పులు వచ్చి ఉండచ్చు. భార్యలు పెళ్లిఅయిన కొత్తలో ఉన్నంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. భర్తలకు బట్టతలలు వచ్చి ఉండచ్చు. అయినా దంపతుల మధ్య ప్రేమ ఉంటే- అది ఈ లోపాలన్నింటిని కప్పివేస్తుంది.

సంప్రదాయానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే సమాజాలు వృద్ధుల్లో సెక్స్ వాంఛలను హర్షించవు. వారికి అటువంటి భావనలు కలుగుతున్నాయనే విషయాన్నే తట్టుకోలేవు. అయితే- ఆ వయస్సులో సెక్స్ వాంఛలు ఎందుకు ఉండకూడదు? మనవలు పుట్టినంత మాత్రాన వారిలో వాంఛలు ఇంకిపోవాలా? పాశ్చాత్య సమాజాలు ఈ విషయం మీద భిన్నంగా ఆలోచిస్తాయి

. అక్కడ ఇతరులకు సంబంధించిన అంశాలపై జడ్జిమెంట్స్ ఇవ్వరు. ఒక వేళ వృద్ధులు సెక్స్‌ను అనుభవిస్తున్నా పెద్దగా పట్టించుకోరు. మన దేశంలో ఈ విషయం గురించి మాట్లాడటానికే ఎవరూ ఇష్టపడరు. ప్రస్తుతం మనమున్న సమాజంలో పిల్లలకు పెళ్లిళ్లు అయిన తర్వాత- మహిళలు సెక్స్‌కు సంబంధించిన అంశాల గురించి మాట్లాడితే చిత్రంగా చూస్తారు. పురుషులు మాట్లాడితే- వారిని కామ వాంఛితులుగా ముద్రవేస్తారు.

అయితే సమాజం ఏదో అనుకుంటుందని మధురమైన అనుభూతులను వదులుకోవటం సరైనది కాదు. కొందరు మహిళలకు నిజంగానే సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవచ్చు. అలాంటి వారి భావనలను కూడా మనం గౌరవించాలి....

నేను పైన చెప్పిన అనుభవాలను కోల్పోతున్నామనే భావన ఉన్నవారికి మాత్రం నేను ఇచ్చే సలహా ఒకటే. సిగ్గు పడకుండా, జీవితాన్ని అనుభవించండి. ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే సమయం ఇదే. ప్రతి వారానికి ఒక సెక్స్ బ్రేక్ తీసుకోండి. దానిని రొమాంటిక్‌గా, మరిచిపోలేని అనుభవాలుగా మార్చుకోండి..

Monday, October 4, 2010

ఆ తబలా కుర్రాడు * Child Tabla Show at CWG 2010 Delhi

ఆదివారం ఢిల్లీలో కామన్‌వెల్త్‌గేమ్స్ ప్రారంభోత్సవంలో అందరినీ ఆకర్షించిన దృశ్యం ఏమిటో మనందరికీ తెలుసు. రింగు రింగుల జుట్టుతో తబలా వాయించిన ఏడేళ్ల బుడతడు. అచ్చు తబలా విద్వాంసుడు జాకీర్‌హుస్సేన్‌లా జుట్టు ఊపుకుంటూ బుల్లి చేతులతో తబలా వాయిస్తుంటే క్రీడాభిమానులంతా ఆసక్తిగా తిలకించారు.

'ఎవరీ కుర్రాడు, భలే తమాషాగా వాయిస్తున్నాడే' అంటూ దేశవ్యాప్తంగా టీవీలలో కార్యక్రమం చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇంకేముంది..? ఒక్క రోజులోనే మినీ సెలబ్రిటీ అయిపోయిన ఆ కుర్రాడి పేరు కేశవ్. పాండిచ్చేరికి దగ్గర్లోని ఆరవిల్లిలో ఉంటున్న కేశవ్ కుటుంబీకులంతా కళాకారులే.

తల్లిదండ్రులు గోపిక, ప్రఫుల్ల మహనుకర్. "పుట్టుకతోనే వాడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ పాటలు, వాయిద్యాలు వినిపించినా సరే వినాలంటాడు. వాడు ఇప్పుడు రెండో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఓ ప్రైవేటు ప్రోగ్రామ్‌లో తబలా ప్రదర్శన ఇచ్చాడు. ఇంత చిన్న వయసులోనే తబలా చాలా సహజంగా వాయిస్తున్నాడని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు.

మాకు చాలా సంతోషమేసింది..'' అంటూ కేశవ్ తల్లి గోపిక మురిపెంగా చెప్పుకొచ్చారు. కామన్‌వెల్త్‌గేమ్స్ ప్రారంభోత్సవంలో "రిథమ్స్ ఆఫ్ ఇండియా'' పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న పలు వాయిద్యాలను ప్రదర్శించారు. "నేనొకసారి ఆరవిల్లికి వెళ్లినపుడు అక్కడ కేశవ్ ప్రోగ్రామ్ చూశాను. ఆ కుర్రాడి హావభావాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కామన్‌వెల్త్‌గేమ్స్‌లో ఈ కుర్రాడితో తబలా ప్రదర్శనపెడితేఎంతో బాగుంటుందన్న ఆలోచన వచ్చింది.

వెంటనే ఎంపిక చేశాం. ఆదివారం జరిగిన ప్రారంభోత్సవంలో కేశవ్ తబలా వాయిస్తుంటే దేశప్రజలందరూ ముచ్చటపడ్డారు...'' అని 'రిథమ్స్ ఆఫ్ ఇండియా క్రియేటివ్ హెడ్ చెప్పారు. కేశవ్‌కు సైకిల్ తొక్కడమన్నా, గిటార్ వాయించడమన్నా చాలా ఇష్టమట. 

Keshav Tabla 7 Year old Child Tabla Show at CWG 2010 Delhi | 

2nd Std Student

Child Prodigy Delights Spectators

He was selected to play by CWG creative head Bharat Bala; “It runs in the family,” says the boy's mother
Audiences across the country were charmed when they saw cherubic seven-year-old Keshav expertly drumming his fingers on the tabla with a wide grin on his face and bobbing his curly head with obvious enjoyment while performing at “Rhythms of India,” the opening event of the Commonwealth Games (CWG) opening ceremony here on Sunday.Latest Top News Videos Follow Us alagukanthavel.blogspot.com

video

Keshav stays in Auroville near Puducherry.

Selected by Bharat Bala

He was selected to play by CWG creative head Bharat Bala, who said: “I spotted him in a show at Auroville at Puducherry. I was conceiving ‘Rhythms of India,' the first item of the Commonwealth Games opening ceremony, when I saw him perform.

“The event had folk drummers from all over the country so I thought it would be interesting to have a boy perform alongside them.”

“He is a natural”

Keshav's mother Gopika said: “He is a natural. Besides, it runs in the family which has musicians and artists. Keshav is also the grandson of artist Prafulla Dahanukar.”

According to Ms. Gopika, her son performs as and when he feels like it and nobody forces him.

“We are aware of his talent, but we also want him to have a normal childhood.

“Music is something spontaneous for him and he performs with a lot of passion.”

The prodigy tabla player's first performance was in February this year when he played at a private gathering.

Keshav who is in Class II, enjoys cycling and playing the guitar as well.


Short clips of Keshava on the tabla in concert with Nadaka and Gopika - Hornby island BC May 2010

కలలను నిజంచేస్తూ వారికి గృహాన్ని నిర్మించి ఇవ్వడం ఓ గొప్ప అనుభూతి - దేవినా హేమ్‌ దేవ్‌..

పులిని అడవిలోనే చూడాలి 
సంపన్న కుటుంబంలో పుట్టిన దేవినా హేమ్‌ దేవ్‌.. చిన్నతనం నుండి తనకంటూ కొన్ని ప్రత్యేకతలను సంతరిం చుకుంది. ఇంట్లో వారందరూ గొప్ప గొప్ప వ్యాపారాల్లో వున్నా సరే ఎటువంటి అవగాహన లేని నిర్మాణ రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.ఇద్దరు పిల్లల తల్లి అయినా తన జీవితాన్ని సాహసవంతంగా గడిపేందుకు మక్కువ చూపు తోంది. బిజినెస్‌, పిల్లలు, కుటుంబం వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూనే తన అభిరుచులన్నిటికీ సమయం కేటాయించు కుంటోంది. ఓ మహిళగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇతర అభిరుచులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న దేవినా గురించి...
కుటుంబ నేపథ్యం...
devinaకుటుంబంలోని అందరూ పెద్ద పెద్ద వ్యాపారా నిర్వహణలో వున్నారు. దేవినా తండ్రి ‘బ్యాండ్‌ బాక్స్‌’ను 1968లో స్థాపించారు. నేడు అది ప్రముఖ సంస్థగా వెలుగొందుతోంది. కానీ దేవినా మాత్రం వారసత్వంగా వచ్చిన సంస్థ నిర్వహణా బాధ్యతలను వదలుకుంది. తనకు ఇష్టమైన నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.. ‘ఇంటిని డిజైన్‌ చేయడం అనేది ఒక గొప్ప కళ. అందరూ తమ కలల ఇంటిని చాలా గొప్పగా ఊహించుకుంటారు. అటువంటి కలలను నిజంచేస్తూ వారికి గృహాన్ని నిర్మించి ఇవ్వడం ఓ గొప్ప అనుభూతి’ అని దేవినా చెబుతు న్నారు.

మొదటి అనుభవం నుండి...

మొదట నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె ఎన్నో చేదు అనుభవా లను ఎదుర్కొన్నారు. వాటి నుండి ఎన్నో విలువైన పాఠాలు కూడా నేర్చుకు న్నారు. ‘ప్రారంభించడమే కాదు వాటికి సంబంధించి అన్ని బాధ్యతలను చూసు కోవాలన్న విషయాన్ని నేను నిర్మాణ రంగంలో అడుగుపెట్టి ఒక వెంచర్‌ను నిర్మించిన తర్వాత గ్రహించాను. ఇప్పుడు మెటీరియల్‌ దగ్గరి నుండి పూర్తయిన తర్వాత దానికి వేసే పెయింటింగ్‌ వరకు మొత్తం అన్నీ దగ్గరుండి చూసు కుంటున్నాను’ అని అంటోంది.

చిన్న స్థాయి నుండి...
దేవినా మొదట సిటీ వెలుపల తన నిర్మాణాలను చేపట్టి విజయం సాధించింది. అనంతరం పూర్తి స్థాయిలో వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు నిర్ణయించు కుంది. ‘మొదటి నిర్మాణం పూర్తి అయిన తరువాత ఇక అపార్ట్‌మెంట్స్‌ నిర్మిం చాలని నిర్ణయం తీసుకున్నాను. సిటీలో కొంత భూమిని కొనుగోలు చేశాను.అపార్ట్‌మెంట్‌ నిర్మాణాన్ని మొదలు పెట్టేశాము. మధ్యలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుప్పకూలింది. ఏం చేయాలో తోచలేదు. కానీ నిర్మాణాన్ని మాత్రం ఆపలేదు. నష్టపోకుండా వుండేందుకు వాటిని అమ్మకుండా సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌గా చేయా లని నిర్ణయించుకున్నాను’ అని తన బిజినెస్‌ సంబంధించి ఎదుర్కొన్న సంఘట నలను దేవినా గుర్తు చేసుకుంటారు.

నచ్చింది చేయడం...
దేవినా ప్రతి రోజూ యోగా, ధ్యానం చేస్తుంది. ఆనందంగా, ఆరోగ్యంగా వుండ టానిి ఇవి ఎంతో ముఖ్యం అని ఆమె చెబుతుంది. ఆమెకు సినిమాలు చూడ టం అంటే చాలా ఇష్టం. ఒక్కోసారి రోజుకు మూడు సినిమాలు చూస్తారు. మరో సారి వారాల వరకు వాటి జోలికి వెళ్లరు. ఈ సందర్భంగా ఓ సారి జరిగిన సం ఘటనను ఆమె గుర్తుచేసుకుంటూ ‘కార్‌ పార్కింగ్‌ చేసి మాల్‌లో వుండే థియే టర్‌లోకి వెళ్లాను..వరుసగా మూడు సినిమాలు చూసి బయటికి వచ్చి కార్‌ పార్కింగ్‌ దగ్గరికి వెళ్లాను. అన్ని గంటలు వెళ్లి వుట్టి చేతులతో వస్తున్న నన్ను చూసి అక్కడి వాచ్‌మెచ్‌ విచిత్రంగా చూశాడు. చాలా నవ్వొ చ్చింది అతని స్థితికి’ అని నవ్వేస్తారు.

అయినా తన పనికి ఏ రోజూ ఆటంకం కలగనివ్వనని చెబుతున్నారు. ‘నా బాధ్య తలు నాకు తెలుసు..సినిమాలు చూసినా, ఏ పనీ చేయ కుండా ఆలోచిస్తూ వున్నా నా పనులన్నీ చేసేస్తాను.అన్నిట ికన్నా నాకు చాలా ముఖ్యమైంది నా కుటుంబం. ఆ తరు వాతే ఇంకేమైనా.. ఎక్కువ సమయం వారికే కేటాయిస్తాను. ఇక తరువాత నా బిజినెస్‌. నాకు ఇష్టం కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నాను. దానికి కూడా తగినంత సమయం కేటా యిస్తాను. ఎన్ని పనులున్నా వాటన్నిటినీ సమన్వయం చేసు కోవడం చిన్నతనం నుండి మా ఇంట్లో వాళ్ళని చూసి నేర్చు కున్నాను’ అని దేవినా అంటున్నారు.

ఇతర వ్యాపకాలు...
దేవినా తన స్నేహితురాలితో కలిసి ఓ మేనేజ్‌మెంట్‌ ఫర్మ్‌ను కూడా నిర్వహిస్తోంది. దాని పేరు హోప్‌స్కాచ్‌. దీని ద్వారా చిన్నపిల్లల పుట్టినరోజుల వంటి కార్యక్రమాలను వీరు నిర్వ హిస్తారు.కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు, అతిథుల ను ఆహ్వానించడం వంటివన్నీ చూసుకుంటారు.‘ఓ తల్లిగా వుండటం వలన పిల్లలకు నచ్చిన విధంగా కార్యక్రమాలను నిర్వహించగలుగుతున్నా... ప్రస్తుతానికి చిన్న పిల్లలవి మాత్రమే చేస్తున్నాం.. తొందరలోనే అన్ని రకాల కార్య క్రమాలు నిర్వహించే స్థాయికి వెళ్లేందుకు ఆలోచిస్తున్నాము’ అని చెబుతున్నారు.
childrens
పులలను చూడటం అంటే ఇష్టం...
దేవినాకు చాలా ఇష్టమైనది పులలను దగ్గరి నుండి చూడటం.. వాటిని గమనించడం... అదీ జూలో కాదు... అడవిలో.. ట్రిప్‌లో భాగంగా దేవినా తన సోదరితో కలసి అభయారణ్యాల్లో ట్రెకింగ్‌కి వెళ్లారు. ఈ ట్రిప్‌ ఐదు రోజుల పాటు సాగించారు. అడవిలో అక్కడి స్థానిక గిరిజనుల సాయంతో వారు 15 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. చిరు త పులులను చాలా దగ్గరి నుండి చూడగలిగారు. ఇంకా ఎలుగుబంటి వంటి జంతువులను కూడా చూశారు. ‘అడవి లోపలికి వెళ్లేందుకు సరైన మార్గం కూడా లేదు. స్థానికులు ప్రమాదకరం అని చెప్పినా వెనక్కి వెళ్లాలని అనిపించలేదు. అక్కడి స్థానిక గిరిజన నాయకుడి సాయంతో మార్గం చేసు కుంటూ కాలా నడకన వెళ్లి చూశాం. ఎంతో అద్భుతం.. ఆ అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేను...’ అంటూ తన అను భవాలను ఆమె చెబుతోంది.

చిన్నతనం నుండి..
‘నాకు 12 సంవత్సరాల వయసు వున్నప్పుడు ఆఫ్రికా వెళ్లాం.. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒక్కసారైనా అడవి లో ట్రిప్‌ వేస్తుంటాం’ అని చెప్పారు. ‘అదే ఇప్పటికీ కొనసా గుతోంది. ఈ సంవత్సరం మా కుటుంబ సభ్యులందరం కలిసి రెండు ట్రిప్స్‌ వేశాం. ఒకటి బాందవ్‌ఘర్‌, రెండవది కబినీని చూశాం.వీటిలో భాగంగానే ట్రెకింగ్‌కి కూడా వెళ్లాం’ అని చెబుతున్నారు.

Sunday, October 3, 2010

గాడ్ అండ్ డెవిల్ * చైనా మహోన్నత విప్లవకారుడిగా, మహాసారథిగా, దుష్ట దైవాంశ సంభూతుడిగా అమరుడైన మావో జేడోంగ్ మనోగత చిత్రణ ...

చైనాలో రాజులు పోయాక మావో దేవుడయ్యాడు. జనచైనా వచ్చాక నిర్దయుడయ్యాడు. జనం కోసం ‘గ్రేట్ లీప్ ఫార్వార్డ్ ’, తన కోసం ‘కల్చరల్ రెవల్యూషన్’ తెచ్చాడన్న పేరుపడ్డాడు. అతడు మంచివాడయ్యాడు. చెడ్డవాడయ్యాడు. స్ర్తీలకు వంటింటి పొగగొట్టాలనుంచి విముక్తి ప్రసాదించాలన్నాడు. కఠిన నిర్ణయాలలో కారుణ్యం తగదన్నాడు. చైనా మహోన్నత విప్లవకారుడిగా, మహాసారథిగా, దుష్ట దైవాంశ సంభూతుడిగా అమరుడైన మావో జేడోంగ్ మనోగత చిత్రణే ఈ ‘నేను’!

పొలం నుంచి ఇంటికి వెళుతుంటే దారి మధ్య మసక వెలుగులో క్వింగ్ సామ్రాజ్యం మటి ్ట పెళ్లలై రాలిపడి వుంది!
‘‘పీడ విరగడైందిరా పిల్లోడా, మీ నాయనకు చెప్పు నేనిక పన్లోకి వెళ్లనని’’ - రైతు కూలీల గుంపులోంచి ఒక పెద్దాయన నా మీదికి మురిపెంగా పాలకంకి విసిరాడు.
గడ్డిమోపులు తలపై మోసుకుంటూ నా పక్కగా, నన్ను దాటి వెళుతున్న వారు - ‘హమ్మయ్య... బరువు దిగింది’ అని అనుకోవడం వారి నిట్టూర్పులతో కలిసి నాకు వినిపిస్తోంది. గిట్టల నుంచి రేగుతున్న గోరువెచ్చని గోధూళి... అలసిన ముఖాలను, మనసులలోని బాధల్ని కడిగేస్తోంది! చైనాలో రెండు వేల ఏళ్లకు పైగా కొనసాగిన ఎనిమిది రాజవంశాల పరంపరలోని క్వింగ్ పాలకుల వెన్నెముకలను - సాధారణ ప్రజలు, సిపాయిలు కలిసి గునపాలతో పెకిలించారట!!

అంటే... నేను మళ్లీ బడికి వెళ్లొచ్చా?
చదువుకున్న యువకులు దండ్లు దండ్లుగా వీధుల్లో చేరి ఊపుగా పాటలు పాడుతున్నారు. చిన్నారులను రెండు చేతులతో మృదువుగా పట్టి లేపి, గాలిలోకి విసిరి ‘జనచైనా వర్థిల్లాలి’ అని నినదిస్తున్నారు. వాళ్ల దగ్గర కాసేపు ఆగాను. డాక్టర్ సన్‌యత్‌సేన్ విప్లవ దళాలు... మంచూ వంశస్థుల సింహాసనాన్ని కాళ్లతో ఒక్క తోపు తోశాయట!
అంటే... ఇప్పుడు నేను మా ఊరు షావ్షాన్‌లోని చిన్నబడి నుంచి హునాన్ ప్రావిన్సు రాజధాని ఛాంఘ్షాలోని పెద్దబడికి వెళ్లి చదువుకోవచ్చా?
కవాతు గీతం వినిపిస్తోంది.
‘నీదే చైనా... నీదే చైనా... నీదే చైనా’’.
గూట్లో దాచిన పలకను తీసి, ఉమ్మితో శుభ్రంగా తుడిచి ముందు నా పేరు రాసుకున్నాను. తర్వాత నా బడి పేరు.
మావో సే టుంగ్, ఛాంఘ్షా సెకండరీ స్కూల్!

పిల్లలకు అన్నీ అప్పటికప్పుడు జరిగిపోవాలి. బహుశా ఆడవాళ్లకు కూడానేమో! పిల్లలు, స్త్రీలు అని ఏముంది? పరాధీనంలో ఉండేవారెవరైనా - పంజరం కదిలిన ప్రతిసారీ ఎవరో తలుపు తెరుస్తున్నారన్న ఆశతో రెక్కల్ని టపటపలాడించే పక్షుల్లా - తక్షణ స్వేచ్ఛను కోరుకుంటారు.

ఎరస్రైన్యం... శత్రుదేశాల గుండెలపై పన్నెండు వేల కిలోమీటర్ల దూరం ధడధడమని ‘లాంగ్‌మార్చ్’ జరిపి భూస్వామ్య కబంధనాల నుంచి రైతులను విడిపించినప్పుడు, చైనా విప్లవాన్ని కర్షకులు సారవంతం చేసినప్పుడు, ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ’ కోసం చైనా కమ్యూనిస్టు పార్టీ నడుము వంచినప్పుడు, ‘సాంస్కృతిక విప్లవం’ ఉవ్వెత్తున దేశాన్ని కుదిపినప్పుడు ... ఇలా చైనాలో జరిగిన ప్రతి మార్పులో, ప్రతి మలుపులో... చైనా మహిళ తన చేతిలోని గరిటెను విసిరి కొట్టేసినట్లు, ఉద్యోగం చేస్తున్నట్లు, నచ్చినవాడిని నిర్భయంగా పెళ్లి చేసుకుంటున్నట్లు విముక్తి కలలు కనే ఉంటుంది. నేనూ అలాగే ఛాంష్షూలోని పెద్దబడిని కలగన్నాను. నియంత పాలకుల నుంచి ప్రజలు, నియంత పెద్దల నుంచి పిల్లలు, నియంత భర్తల నుంచి స్ర్తీలు నిరంతరం స్వేచ్ఛను కాంక్షిస్తూనే ఉంటారు.

రివల్యూషనరీ ఆర్మీలో చేర్చడానికి స్కూళ్లకొచ్చి పెద్ద పిల్లల్ని తీసుకెళుతున్నారు. నేను ఛాంఘ్షా బడిలో ఉన్నాను. ‘‘నువ్వూ వెళ్లాలి సే టుంగ్. నవై చెనా ఆవిర్భావం కోసం నీ పలకా బలపాలను పక్కన పడేసి, కలుపును ఏరే పనిలో పడాలి’’ అన్నాడు నా తండ్రి. రాచరికపు అవశేషాలపై సన్‌యత్‌సేన్ నాయకత్వంలోని ‘కొమిటాంగ్’ పార్టీ ఆవిర్భవించడం వెనుక నేను బిగించిన పిడికిలి కూడా ఉందనుకుంటే ఎంత గర్వం!

ఐదేళ్ల తర్వాత మళ్లీ దేశంలోని విద్యార్థులంతా ఏకమయ్యారు. అప్పటికి నా డిగ్రీ పూర్తయింది. హ్యునాన్‌లోని ఫస్ట్ ప్రొవిన్షియల్ నార్మల్ స్కూల్ ప్రొఫెసర్ యాగ్ ఛాంగ్జీ తన వెంట నన్ను బీజింగ్ తీసుకెళ్ళారు. పెకింగ్ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా ఆయనకు ఉద్యోగం వచ్చింది. అదే యూనివర్శిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా నాకూ ఉద్యోగం ఇప్పించారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులవి. వర్సెయిల్స్ ఒప్పందం ప్రకారం - చైనాలో జర్మనీకి ఉన్న హక్కులను జపాన్‌కు మార్చే సమమయంలో దేశంలోని ఉడుకు నెత్తురు కుతకుతలాడింది. విద్యార్థులు పెద్ద ఉద్యమంగా పెకింగ్ చేరుకున్నారు. వారికి నగరాలలోని కార్మికులు తోడయ్యారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘‘కానీ ఏం లాభం? రాజకీయ పునరుజ్జీవనాన్ని సాధించుకున్న చైనా సామాజిక విప్లవాన్ని విస్మరించింది. స్ర్తీల విషయంలోనైతే ఇంకా మధ్యయుగాల నాటి న్యాయాన్నే పాటిస్తున్నాం’’ అని లి డెఝావో ఆవేదన చెందారు. యూనివర్శిటీ లైబ్రరీలో ఆయన నా క్యూరేటర్. నా భవిష్యత్ ఆలోచనలను మలిచింది ఆయనే.
లీ డెఝావోతోపాటు ఛెన్ డ్యుగ్జీ, హ్యూషీ, జియాంగ్ జువాన్‌టాంగ్‌లు - బీజింగ్ యూనివర్శిటీలో నేను పార్ట్‌టైమ్ స్టూడెంట్‌గా ఉన్నపుడు - నాకొక సైద్ధాంతిక వ్యక్తిత్వాన్ని ప్రసాదించారు.

అప్పట్లో ఘ్జావో అనే యువతిని చైనా ఫ్యూడల్ వివాహ సంప్రదాయాలు పొట్టన పెట్టుకున్న హృదయ విదారక సంఘటన ఒకటి నా ముద్దను నాకు మింగుడు పడనివ్వలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు ఘ్జావో ఆత్మహత్య చేసుకుంది. సమాజం - పుట్టినిల్లు - మెట్టినిల్లు అనే త్రిభుజాకారపు ఇనుప తెర ల్లో చిక్కుకున్న స్ర్తీ బయటికి వచ్చే దారి లేక అసహాయంగా మగ్గిపోవడమన్నది వివాహ వ్యవస్థలోని అవలక్షణంగా నాకు కనిపిస్తుంది. కోరుకున్న వ్యక్తిని జీవితభాగస్వామిగా ఎంచుకునే అవకాశాన్ని స్ర్తీకి ఇవ్వలేని సమాజం ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని ఎత్తులు ఎదిగితే మాత్రం నాగరికం అవుతుందా? గృహ బానిసత్వంలో మగ్గుతున్న స్ర్తీలు తమ వంటింటి పొగగొట్టాలనుంచి వదిలే దట్టమైన శోకాలను, శాపాలను జాతీయ స్థూల ఉత్పత్తికి సూచికలనుకుంటే ఎలా?


చైనాలో మగవాళ్లు మూడు ఆధిక్యతలకు లోబడి జీవిస్తుంటారు. రాజకీయం, కుటుంబం, మతం... మగవాడి పక్కలో పడుకుని వాడిని ఎటూ కదలనివ్వక, మీద కాళ్లేస్తాయి. రాజకీయ నిర్ణయాలు అతడి జుట్టు పట్టుకుంటాయి. కుటుంబ బాధ్యతలు అతడి ముక్కును మూస్తూ, వదులుతూ, మూస్తూ వదులుతూ ఉంటాయి. మతం అతడిపై కుండల కొద్దీ సంప్రోక్షణ జలాన్ని కుమ్మరిస్తుంటుంది. స్ర్తీల పరిస్థితి ఇంకా ఘోరం. పురుషుడు భరించే మూడు ఆధిక్యతలతో పాటు పురుషుడి దురహంకార దుర్గంధాన్ని కూడా వారు భరించాలి!

సాంస్కృతిక విప్లవంతో తప్ప దేశం లోపల, బయట
ఉన్న ఆధిక్యతల నిర్మూలన జరగదని నేను బలంగా విశ్వసించాను. ఛైర్మన్ మావో... నియంతలా మారిపోయాడన్నారు. పార్టీలో ప్రబలిన ఉదారవాద బూర్జువాలను బలహీనపరచడానికి, ‘గ్రేట్ లీప్ ఫార్వార్డ్ ’తప్పిదాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సాంస్కృతి విప్లవాన్ని నేను అడ్డుపెట్టుకున్నానని అన్నారు. రాచరిక భూస్వామిక భావజాలం నుంచి ప్రజలను మానసికంగా బయటికి తేవడం కోసం వారి జీవితాలను సర్వనాశనం చేశానని ఆరోపించారు. విప్లవం వల్ల ఇంత హింస ఎందుకు జరుగుతుందని వారి ప్రశ్న!
విప్లవం డిన్నర్ పార్టీ కాదు. తీరిగ్గా చదువుకునే స్ఫూర్తిదాయక వ్యాసం కాదు. చక్కటి పెయింటింగ్ కాదు. ఎంబ్రాయిడరీ వర్క్ కాదు. అది సున్నితంగా, సరళంగా, సక్రమంగా, మెల్లిమెల్లిగా ముందుకు సాగదు. గౌరవంగా, మర్యాదగా, నొప్పిలేకుండా, డిప్లొమాటిక్‌గా మాట్లాడదు. అవసరమనుకుంటే హింసతో వ్యవస్థను అదుపులోకి తీసుకునే దుస్సాహసమే విప్లవం. రేపటి స్థిమితమైన జీవితాల కోసం ఇవాళ కొంత అశాంతికి లోనైనా తప్పులేదన్న భావనకు ఆచరణ రూపమే విప్లవం.

నేను వాంఛించినది శాశ్వత విప్లవం. అయితే అది ట్రాట్‌స్కీ తరహా శాశ్వత విప్లవం కాదు. ఒక విప్లవం తర్వాత మరొకటి రావాలి. విప్లవం నిరంతరం పురోగమించాలి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేనప్పుడు జాప్యం చేయడం వల్ల చెడ్డపేరును వాయిదా వేసుకుంటూ పోగలమే గానీ అసలంటూ తప్పించుకోలేం.
మావో జేడోంగ్ (మావో సే టుంగ్)
26 డిసెంబర్ 1893 - 9 సెప్టెంబర్ 1976
జన్మస్థలం : షావ్షాన్, హునాన్ ప్రావిన్సు
సంతతి : పదిమంది
భార్యలు : నలుగురు
ప్రతిష్ట : చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి ఛైర్మన్
అప్రతిష్ట : సాంస్కృతిక విప్లవ సారథిగా.

ది లవ్ ఆఫ్ ది హాథోర్న్ ట్రీ
చైనా మహోన్నత నేత మావో జేడోంగ్ 1966-1976 మధ్య ‘సాంస్కృతిక విప్లవం’ పేరిట అనుసరించిన విధానాలను సునిశిత హాస్యంతో విమర్శిస్తూ చైనా దర్శకుడు ఝంగ్ ఇమౌ తీసిన ‘ది లవ్ ఆఫ్ ది హాథోర్న్ ట్రీ’ చిత్రం ఇప్పుడక్కడ హౌస్‌ఫుల్ కలెక్షన్‌లతో నడుస్తోంది. అనుమానాలతో, అసహనంతో ప్రజలను వేధించుకుతిన్న సాంస్కృతిక విప్లవం... ఇద్దరు యువ ప్రేమికుల జీవితాలను దయనీయంగా మార్చిన వైనమే చిత్ర కథాంశం. చైనా యువతీ యువకులతో పాటు, కరడు గట్టిన కమ్యూనిస్టులు కూడా ఈ చిత్రాన్ని ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారట! మావోను పరోక్షంగా విమర్శిస్తూ డైలాగులు వినిపించిన ప్రతిసారీ సినిమాహాళ్లు చప్పట్లతో దద్దరిల్లుతున్నాయని ఘంగ్ ఇమౌ అంటున్నారు. అప్పట్లో చైర్మన్ మావో ఆధ్వర్యంలోని ‘రెడ్ ఆర్మీ’ దళాలతో పోరాడిన ‘నేషనల్ కొమింటాంగ్’ పార్టీలోని ఒక అధికారి కుమారుడే ఈ చిత్ర దర్శకుడు. 

కూర్పు, స్వగత కథనం:
మాధవ్ శింగరాజు