Wednesday, April 4, 2012

సూకీ స్నేహం

 








    





ఆంగ్ సాన్ సూకీ మరోసారి అంతర్జాతీయ వార్త అయింది. ఆమె గెలుపు మయన్మార్(బర్మా) ప్రజలకే కాదు ప్రజాస్వామ్య ప్రియులందరికీ శుభవార్త అయింది. ప్రజాస్వామ్యం కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతూ, అందులో అధికభాగం గృహనిర్బంధంలో ఉన్న సూకీ రాసిన ఉత్తరాలే- లెటర్స్ ఫ్రమ్ బర్మా. దీనిలో బర్మా ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, మౌలిక భావనలు, విలువలతో పాటు సూకీ వ్యక్తిగత అనుభవాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒక ఆసక్తికరమైన భాగాన్ని మీకు అందిస్తున్నాం.

జైలులో ఉన్నప్పుడు పక్షులు, చిన్న జంతువులు, క్రిమికీటకాదులే నా స్నేహితులు. ఇప్పటికీ అనేక మంది స్నేహితులు, సహచరులు ఈ జీవాలతో తమకున్న అనుభవాలను తమ రచనల ద్వారా పంచుకున్నారు. జైలు గోడల్ని, ఇనుప ఊచల్ని దాటి ఖైదీలతో స్నేహం చేసే జీవుల్లో పిల్లులు ప్రధానమైనవి. ఒంటరి జీవితం గడుపుతున్న ఖైదీలు, తమకు ఇచ్చిన ఆహారంలో కొంత భాగం వీటికి పెడుతూ ఉంటారు. బయట ప్రపంచాన్ని చూడలేని ఖైదీలకు ఈ పిల్లులే సహచరులు. నేను ఇన్‌సియిన్ జైలులో ఉన్న రెండేళ్లలో ఎప్పుడూ పిల్లులను చూడలేదు. కాని గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు మాత్రం పిల్లులు అప్పుడప్పుడు వచ్చి నన్ను పలకరిస్తూ ఉండేవి.

నాకు పిల్లుల కన్నా కుక్కలంటే చాలా ఇష్టం. అయితే నాకు తెలిసిన తొలి పెంపుడు జంతువు పిల్లే. నా చిన్నప్పుడు ఒక పెద్ద పిల్లి ( నేను చిన్నపిల్లను కాబట్టి ఆ పిల్లి చాలా పెద్దగా కూడా కనిపించి ఉండచ్చు) మా ఇంట్లో తిరుగుతూ ఉండేది. మా తాతగారు తన గంభీరమైన గొంతుతో ఆ పిల్లిని 'పస్..పస్..పస్' అని పిలుస్తూ ఉండేవారు. మా కుటుంబసభ్యులందరం ఆ పిల్లిని గౌరవంగా 'తాతగారి పిల్లి' అని సంబోధిస్తూ ఉండేవాళ్లం. మా ఇంటి పక్కనే ఉన్న వీధిలో అనేక పిల్లులు, కుక్కలు తిరుగుతూ ఉండేవి. అవి మా గార్డెన్‌లోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండేవి. ఇంట్లో పెద్దవాళ్లు వాటిని తరిమేస్తూ ఉండేవారు. ఒక సారి నాకొక కల వచ్చింది. దాంట్లో ఒక కుక్క మా వంటింటి పక్కన చాలా పిల్లలను పెట్టింది. ఆ కుక్క పిల్లలు వచ్చి నా కాళ్లను నాకుతున్నాయి. అంతే- కలలోనుంచి ఉలిక్కిపడి లేచా. ఆ కుక్క పిల్లలు ఏమయ్యాయో నాకు అర్థం కాలేదు. ఒక్క క్షణం నాకు అంతా అయోమయంగా అనిపించింది.

1950లలో రంగూన్ వీధుల్లో అనేక రకాల వాహనాలు తిరుగుతూ ఉండేవి. రకరకాల బస్సులు, రెండో ప్రపంచయుద్ధంలో వాడి వదిలేసిన జీపులు, యుద్ధం జరగకముందు వాడిన పెద్ద కారులు, వెనక భాగంలో ఇద్దరు కూర్చోవటానికి వీలుగా ఉన్న సైకిళ్లు (వీటిని సైడ్ కార్స్ అంటారు), రిక్షాలు ఇలా రకరకాల వాహనాలు అందుబాటులో ఉండేవి. వీటితో పాటు గుర్రపు బగ్గీలు కూడా ఉండేవి. గుర్రాలు బక్క చిక్కి గాయాలతో రసి కారుతూ ఉండేవి. ఇలాంటి మరెన్నో మూగజీవాల గురించి నాకు సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ (ఎస్‌పీసీఏ) ద్వారా తెలిసింది.

ఇవి కాకుండా కొందరు హాలీవుడ్ సినిమాల్లో చూపించే గుర్రాలవంటి వాటిపై రంగూన్ వీధుల్లో తిరుగుతూ ఉండేవారు. మా అమ్మ ఢిల్లీలో బర్మా రాయబారిగా ఉన్నప్పుడు గుర్రాలతో నాకు అనుబంధం ఏర్పడింది. ప్యారీ ఆయిస్టర్ అనే గుర్రం మీద నేను గుర్రపుస్వారీ నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఒక రైడింగ్ క్లబ్‌లో కూడా చేరాను. అక్కడ గుర్రాలకు బ్లాక్ ప్రిన్స్, పృధ్వీరాజ్, శివాజీ వంటి పేర్లు ఉండేవి. వీటిలో బ్లాక్ ప్రిన్స్ నాకు ఫేవరెట్. అయితే గుర్రాలపై దూకుతూ సాహసం చేయటం నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు.

ఇంగ్లాండ్‌లో చదువుతున్నప్పుడు నేను కుక్కల ప్రేమికుల ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇంగ్లాండ్‌లో ఉన్న నా స్నేహితుల ఇళ్లకు అప్పుడప్పుడు సెలవులు గడపటానికి వెళుతూ ఉండేదాన్ని. ప్రతి కుటుంబంలోను కుక్కలను ప్రేమించేవారు ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండేవారు. ఒక స్నేహితురాలి ఇంట్లో సెయిలర్ అనే కుక్క ఉండేది. ఈ కుక్క కంటి చుట్టూ నల్లటి మచ్చ ఉండేది. ఇది జిన్ కూడా తాగేది. ఇంటికి ఇచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించేది. మరో స్నేహితురాలి ఇంట్లో హ్యాండ్‌సమ్ అనే గోల్డెన్ లాబ్రిడార్ ఉండేది.అది అందరి పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించేది.

ఈ రెండు నా స్నేహితురాళ్లయితే.. మా ఆంటీ అల్సేషన్ ఇంపీ మాత్రం మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయింది. నేను ఐక్యరాజ్యసమితిలో పనిచేస్తున్నప్పుడు నేను, మా ఆంటీ, ఇంపీ ఒకే చోట ఉండేవాళ్లం. ఇంపీ నన్ను ఎవరైనా ఏదైనా అంటే సహించేది కాదు. నన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉండేది. నేను ఇంటికి ఆలస్యంగా వస్తే- నేను వచ్చేదాకా గుమ్మం దగ్గరే ఎదురుచూస్తూ ఉండేది. ఇంపీకి తెలియని వారు ఎవరైనా ఇంటికి వస్తే- వాళ్లను సోఫాలో నా పక్కన కూర్చోనిచ్చేది కాదు.

1972లో నేను, మైఖల్ పెళ్లి చేసుకున్నాం. బర్మాలో కాపురం పెట్టాం. వెంటనే మేం ఒక కుక్కను తెచ్చుకున్నాం. తెల్లటి బొచ్చుతో, అక్కడక్కడ గోధుమ రంగు మచ్చలతో ఆ కుక్క చూడటానికి చాలా అందంగా ఉండేది. దాని పేరు కోసం చాలా కాలం వెతికి చివరకు పప్పీ అనే పేరే పెట్టాం. పప్పీ చాలా చిన్నగా ఉండేది. నా పీక పట్టుకొని పడుకొనేది. మైఖల్ బెడ్‌రూమ్ చెప్పులకు ఉన్న లైనింగ్‌తో ఆడుకొనేది. మేం ఎక్కడికి వెళ్తే అక్కడకి మాతో వచ్చేది.

ఈ విధంగా మాతో పాటు పప్పీ కూడా సగం ప్రపంచం తిరిగింది. నాకు పిల్లలు పుట్టిన తర్వాత వారి పట్ల కూడా పప్పీ చాలా బాధ్యతగా వ్యవహరించేది. మేం ఆక్స్‌ఫర్డ్‌లో నివసించేటప్పుడు పప్పీ మా ఇంటికి ఒక ట్రేడ్‌మార్క్‌గా మారింది. మా స్నేహితులకు, బంధువులకు ఆ కుక్కంటే చాలా ఇష్టం. 19 ఏళ్ల వయస్సులో పప్పీ చచ్చిపోయింది. పప్పీ చనిపోయే సమయానికి నేను బర్మాలో గృహనిర్బంధంలో ఉన్నా. అందువల్ల దాని చివర చూపులు కూడా నాకు దక్కలేదు.

- లెటర్స్ ఫ్రమ్ బర్మా
ఆంగ్ సాన్ సూకీ
పేజీలు: 224
ప్రచురణ: పెంగ్విన్