ఒక జూలో... ఒక తల్లి ఒంటె, ఒక పిల్ల ఒంటె రెండూ సేదతీరుతున్నాయి. ఉన్నట్టుండి పిల్ల ఒంటెకు ఒక సందేహం రావడంతో.... 'అమ్మా..మన పొట్టలో నీటి తిత్తి ఎందుకు ఉంటుంది?' అని అడిగింది తల్లిని.'మనం ఎడారి జంతువులం కదా... నెలలు నెలలు నీళ్లు దొరక్కపోయినా బతకడానికి మన పొట్టలో నీటిని దాచుకుందుకు దేవుడు నీటి తిత్తిని ఏర్పాటు చేశాడు' అని సమాధానమిచ్చింది తల్లి.
'మరి మన కాళ్లు పొడుగ్గా....పాదాలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి?' ఇంకో సందేహాన్ని లేవనెత్తింది పిల్ల ఒంటె. ' ఇసుకలో నడిచేందుకు వీలుగా అలా ఉన్నాయి. మన కాళ్లు, పాదాలు ఇలా ఉండడం వల్లే ఇతర జంతువుల కన్నా చురుగ్గా, హాయిగా ఎడారిలో తిరగ్గలం మనం' గర్వంగా చెప్పింది తల్లి.
'మరి మన కంటి రెప్పల వెంట్రుకలెందుకు పొడుగ్గా ఉంటాయి చూపుకి అడ్డం పడేలా?' బుంగమూతితో ప్రశ్నించింది పిల్ల ఒంటె.
'పిచ్చి తల్లి.... కంటిరెప్పల వెంట్రుకలు అలా పొడుగ్గా ఉండబట్టే ఎడారిలో వీచే గాలికి ఇసుక మన కంట్లో పడకుండా రక్షణ ఉంటుంది' అనునయంగా వివరించింది తల్లి ఒంటె.
'ఓహో.. ఎడారిలో ఉండడానికి దేవుడు మన శరీరంలో ఇన్ని ఏర్పాట్లు చేస్తే... మరి మనం ఈ జూలో ఎందుకున్నామమ్మా....?' అమాయకంగా అడిగింది పిల్ల ఒంటె.
***
ఇవ్వాళ ఎందరికో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మనుషులుగా మనం నేర్వాల్సిందేమిటి, నేర్చుకున్నదేమిటి, చేయాల్సిందేమిటి, చేస్తున్నదేమిటి, మనుషులుగానే స్థానభ్రంశం చెందుతున్నామా....
పిల్ల ఒంటెకున్న పాటి తెలివి కూడా మనకు లేకుండా పోతోందే!
జీవితంలోని కొన్ని సంఘటనలు ఒక్కోసారి మనసును అమితంగా ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావాల్లోంచే బలమైన కోరికలు అంకురిస్తాయి. ఈ కోరికలే కొందరిలో క్రమంగా విస్తరిస్తూ లక్ష్యాలుగా మారతాయి. ఒక దశలో కోరికలు వేరు, లక్ష్యాలు వేరు అనిపించేంత వ్యత్యాసం ఈ రెంటికీ మధ్య ఏర్పడుతుంది. వాస్తవానికి కోరికలు ఎప్పుడూ ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని అశ్రయించే ఉంటాయి.
ఏదైనా పని ఉన్నప్పుడు వాయిదాలు వేయడం కొంతమంది కుర్రకారు ఎంతో ఇష్టంగా చేసే పని. అయితే ముఖ్యమైన పనులన్నీ పక్కనపెట్టి కొ న్ని టీవీ ఛానల్స్‌లో వచ్చే ఏమాత్రం ఉపయోగంలేని కార్యక్రమాలను చూడడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపడం వృథాగా చెప్పవచ్చు. అసలు ఒక వారంలోని సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారో ఒ జాబితాను తయారు చేసుకుంటే అసలు ఎంత సమయం సద్వినియోగం చేసుకుం టున్నారో వారికి తెలిసిపోతుంది. టీవి వీక్షించేందుకు, సర్ఫింగ్ / చాటిం గ్, తిండికి, ప్రయాణం, కాలేజీకి లేదా ఆఫీసుకు, బయట గడిపేందుకు, స్నేహితులతో షికార్లకు, చదువుకు లేదా ఆఫీసులో చేసే పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారో ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. అలాగే ఆయాపనులు చేస్తున్నప్పుడు మీరు పొందే చిరాకు, ఆనందం, అలసట, ఉత్సాహం, తప్పు చేస్తున్నామనే భావన... వంటి భావోద్వేగాలను కూడా గమనించాలి. మనం వారంలో ఎంత ఖర్చుచేస్తామో పట్టిక తయారు చేసే విధంగానే సమయానికి కూడా పట్టిక రూపొందించుకోవాలి.
'వీడికి ఫ్రెండ్స్ చాలా ఎక్కువయ్యారు... అందుకే చదువు తక్కువయ్యింది. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్‌తో కబుర్లే గానీ చెప్పిన మాట ఒక్కటీ పట్టించుకోడు కదా......' అంటూ తమ పిల్లల గురించి కంప్లెయింట్ చేసే తల్లిదండ్రులను చాలామందిని చూస్తూనే ఉంటాం.