
చారుసిన్హా. తల్లి, తండ్రి ఇద్దరికీ ఫోటోగ్రఫీ అంటే ప్రాణం.వారికి తొలి మోడల్ చారుసిన్హానే. రోజుల బిడ్డ నుంచీ ఇప్పటిదాకా వాళ్ళిద్దరూ ఆమెను ఫోటోలు తీస్తూనే ఉన్నారు. తల్లిదండ్రుల అభిరుచి వారసత్వంగా చారుసిన్హాకీ వచ్చింది. బుడిబుడి అడుగులనాడే ఆమె కెమెరాను చేతబట్టారు. తండ్రి స్నేహితుడి స్టూడియోలోని డార్క్ రూం చారుసిన్హాకు చిన్నప్పటి నుంచి సుపరిచితం. తండ్రితో పాటు అయిదవ ఏట నుంచి 15వ సంవత్సరం వరకు డార్క్ రూంకు వెళ్లి ఫోటోలను డెవలప్ చేసేవారు.
" మా అమ్మకి సూర్యోదయం,సూర్యాస్తమయం అంటే చాలా యిష్టం.ఆమె తీసిన ఫోటోల్లో ఎక్కువ అవే. ఫోటోలు తీసేపుడు నన్ను కూడా వెంట తీసుకుపోయేవారు. అప్పుడామెకి నేనే మోడల్. మా నాన్న ఫోటోలు తీసేపుడు నేను ఆసక్తిగా చూసేదాన్ని, కెమెరా హాండ్లింగ్ అలాగే నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నా ఫోటోలను మా ఫాదర్ చూసి తప్పొప్పులు చెపుతుంటారు. పిల్లలు, వృద్ధులు, ప్రకృతి..ఇవే ఫోటోగ్రఫీలో నా ఆసక్తులు.'' అంటారు చారుసిన్హా.

చారు సిన్హా హైదరాబాద్ లోని సెంట్ఫ్రాన్సిస్ కాలేజీలో డిగ్రీ చదివారు. సెంట్రల్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. 1996లో ఐ.పి.ఎస్కి ఎంపికయ్యారు. 2005లో యు. ఎన్. పీస్ కీపింగ్ మిషన్ కు డిప్యుటేషన్ పైన కొసావో వెళ్లారు. సెలవు దొరికినపుడల్లా ఆ చుట్టుపక్కల దేశాలు తిరిగారు. తనకు నచ్చిన దృశ్యాలను కెమెరాలో బంధించారు. "కొసావోలో ఏడాది పాటు వున్నాను. ఆ దేశాల్లో శీతాకాలంలో మైనస్ 31 డిగ్రీలుంటుంది. ప్రకృతి చాలా అందంగా వుంటుంది. చాలా నిశ్శబ్దంగా వుంటుంది. మంచుపడే చప్పుడులోని సంగీతం విన్నాను. అక్కడ ఉండగానే రష్యా, రుమేనియా, హంగేరి, స్విట్జర్లాండ్,జర్మనీ, ప్యారిస్, బెల్జియం, హాలెండ్, గ్రీస్, ఈజిస్టు, నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఇలా 18 దేశాలు చూశాను.ఎందరినో కలిశాను.
ఆ అనుభూతులన్నీ కెమెరాలోకెక్కించాను.'' అని చెబుతూ ఆ ఫోటోలన్నీ చూపించారు. చారుసిన్హా. తనను దాసోహం చేసుకున్న ప్రకృతిని ఆమె ఫోటోలుగా పదిలపరచుకున్నారు." ఇండో ఛైనా బార్డర్ లో పాంగ్ గాంగ్ లేక్ వుంది. ఆ సరసు కొంత భాగం భారతదేశంలోనూ, మిగిలిన భాగం చైనాలోనూ వుంటుంది. బ్లూ కలర్లో ఎన్ని షేడ్స్ వున్నాయో అన్నీ ఆ సరస్సులో కనిపిస్తాయి. మంచు కొండలు ఆ సరస్సులో అందాలు దిద్దుకుంటూ వుంటాయి. సూర్య కాంతిలోని తీవ్రతను బట్టి సరస్సులోని నీరు రంగులు మారుతుంది. నీటితో పాటు మంచుకొండల రంగులు కూడా మారుతూ వుంటాయి. ఫోటోగ్రాఫర్లకు ఆ సరస్సు ఒక షడ్రసోపేత విందు. త్రీఇడియట్స్ సినిమా చివర్లో ఆ సరస్సు కనిపిస్తుంది. కులుమనాలి నుంచి లడక్ వరకు వెళ్లాను. ఈజిప్టు పిరమిడ్స్‌ను చూశాను.


2006లో కొసావోలో డిప్యుటేషన్ పూర్తవగానే చారుసిన్హాను చిత్తూరు ఎస్పీగా నియమించారు. ముక్కుసూటిదనం ఆమెకు చిక్కులు తెచ్చింది. అనేక పాతకేసులను తిరగదోడారు. మూడు నెలలు తిరక్కముందే ఆమెపై బదిలీ వేటు పడింది. ఆమె బదిలీని నిరసిస్తూ జిల్లాలో ఆటోలవాళ్ళు, కార్మికులు రోడ్లమీదకు వచ్చారు. అది ఆమెను తీవ్రంగా కలచివేసింది. అయితే ఆ కలత బదిలీ గురించి కాదంటారు ఆమె.." .నేను చిత్తూరు ఎస్పీగా వున్నపుడు ఎన్నో సార్లు తిరుమల వెళ్లాను. వీఐపీల వెంట డ్యూటీగా వెళ్ళేదాన్ని. దర్శనానికి కూడా వెళ్ళేదాన్ని. అయినా దేవుడి మీద ప్రత్యేక ఆసక్తి ఏదీ కలుగలేదు.
అయితే, బదిలీ అయిన రోజు ఎందుకో చాలా వెలితిగా అనిపించింది. నేను వెంకటేశ్వరస్వామిని మిస్ అవుతానని అనిపించింది. ఆత్మీయులకు దూరంగా వెళ్ళిపోతున్నాననే ఫీలింగ్ అది. తెలియని అనుబంధం ఏదో శ్రీవేంకటేశ్వరునితో ఏర్పడింది. ఇక అప్పటి నుంచి తిరుమలకు తరచూ వస్తూనే వున్నాను. గొప్ప శాంతి లభిస్తుంది ఇక్కడ నాకు. '' అంటూ తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని బయటపెట్టారు చారుసిన్హా.. చిన్నపిల్లలు, వృద్దులు, ప్రకృతి మాత్రమే అప్పటిదాకా ఆమె సబ్జెక్టులు. ఇప్పుడు తిరుమల వాసుడూ అందులో చేరాడు. 2010 శ్రీవారి బ్రహ్మోత్సవాలపుడు ఆమె మొదటిసారి వెంకటేశ్వరస్వామి ఫోటోలను తీయడం ప్రారంభించారు. అప్పుడు 15- 80 వైడ్ లెన్స్ ఉపయోగించారట. 2011లో 80- 200 జూమ్ లెన్స్‌తో ఉత్సవ మూర్తిని తిలకించే భక్తుల మూడ్స్‌ను క్లోజప్ ఫోటోలు తీశారు.

ఫోటోగ్రఫీతో ఒత్తిడి దూరం...
"వృత్తిలో, కుటుంబంలో ఉండే ఒత్తిళ్ల నుంచి బయటపడడానికి ఫోటోగ్రఫీ నాకు ఎంతో దోహదపడుతోంది. మనసు చికాగ్గా ఉన్నపుడు వెంటనే కెమెరా తగిలించుకుని బయటకు వెళ్ళిపోతాను.ప్రశాంతంగా తిరిగి ఇంటికి చేరుకుంటాను.'' అంటారామె. పెయింటింగ్,శిల్పకళ, సంగీతం,ఫోటోగ్రఫీ ఇలా ఏదో ఒక హాబీ ప్రతి ఒక్కరికీ అవసరం. అన్ని స్థాయిల్లోనూ విద్యాలయాల్లో వీటిని ప్రవేశపెడితే మంచిది అని ఆమె చెబుతున్నారు.
- ఎ.ఎస్.దినేష్ కుమార్, తిరుపతి