Sunday, October 3, 2010

గాడ్ అండ్ డెవిల్ * చైనా మహోన్నత విప్లవకారుడిగా, మహాసారథిగా, దుష్ట దైవాంశ సంభూతుడిగా అమరుడైన మావో జేడోంగ్ మనోగత చిత్రణ ...

చైనాలో రాజులు పోయాక మావో దేవుడయ్యాడు. జనచైనా వచ్చాక నిర్దయుడయ్యాడు. జనం కోసం ‘గ్రేట్ లీప్ ఫార్వార్డ్ ’, తన కోసం ‘కల్చరల్ రెవల్యూషన్’ తెచ్చాడన్న పేరుపడ్డాడు. అతడు మంచివాడయ్యాడు. చెడ్డవాడయ్యాడు. స్ర్తీలకు వంటింటి పొగగొట్టాలనుంచి విముక్తి ప్రసాదించాలన్నాడు. కఠిన నిర్ణయాలలో కారుణ్యం తగదన్నాడు. చైనా మహోన్నత విప్లవకారుడిగా, మహాసారథిగా, దుష్ట దైవాంశ సంభూతుడిగా అమరుడైన మావో జేడోంగ్ మనోగత చిత్రణే ఈ ‘నేను’!

పొలం నుంచి ఇంటికి వెళుతుంటే దారి మధ్య మసక వెలుగులో క్వింగ్ సామ్రాజ్యం మటి ్ట పెళ్లలై రాలిపడి వుంది!
‘‘పీడ విరగడైందిరా పిల్లోడా, మీ నాయనకు చెప్పు నేనిక పన్లోకి వెళ్లనని’’ - రైతు కూలీల గుంపులోంచి ఒక పెద్దాయన నా మీదికి మురిపెంగా పాలకంకి విసిరాడు.
గడ్డిమోపులు తలపై మోసుకుంటూ నా పక్కగా, నన్ను దాటి వెళుతున్న వారు - ‘హమ్మయ్య... బరువు దిగింది’ అని అనుకోవడం వారి నిట్టూర్పులతో కలిసి నాకు వినిపిస్తోంది. గిట్టల నుంచి రేగుతున్న గోరువెచ్చని గోధూళి... అలసిన ముఖాలను, మనసులలోని బాధల్ని కడిగేస్తోంది! చైనాలో రెండు వేల ఏళ్లకు పైగా కొనసాగిన ఎనిమిది రాజవంశాల పరంపరలోని క్వింగ్ పాలకుల వెన్నెముకలను - సాధారణ ప్రజలు, సిపాయిలు కలిసి గునపాలతో పెకిలించారట!!

అంటే... నేను మళ్లీ బడికి వెళ్లొచ్చా?
చదువుకున్న యువకులు దండ్లు దండ్లుగా వీధుల్లో చేరి ఊపుగా పాటలు పాడుతున్నారు. చిన్నారులను రెండు చేతులతో మృదువుగా పట్టి లేపి, గాలిలోకి విసిరి ‘జనచైనా వర్థిల్లాలి’ అని నినదిస్తున్నారు. వాళ్ల దగ్గర కాసేపు ఆగాను. డాక్టర్ సన్‌యత్‌సేన్ విప్లవ దళాలు... మంచూ వంశస్థుల సింహాసనాన్ని కాళ్లతో ఒక్క తోపు తోశాయట!
అంటే... ఇప్పుడు నేను మా ఊరు షావ్షాన్‌లోని చిన్నబడి నుంచి హునాన్ ప్రావిన్సు రాజధాని ఛాంఘ్షాలోని పెద్దబడికి వెళ్లి చదువుకోవచ్చా?
కవాతు గీతం వినిపిస్తోంది.
‘నీదే చైనా... నీదే చైనా... నీదే చైనా’’.
గూట్లో దాచిన పలకను తీసి, ఉమ్మితో శుభ్రంగా తుడిచి ముందు నా పేరు రాసుకున్నాను. తర్వాత నా బడి పేరు.
మావో సే టుంగ్, ఛాంఘ్షా సెకండరీ స్కూల్!

పిల్లలకు అన్నీ అప్పటికప్పుడు జరిగిపోవాలి. బహుశా ఆడవాళ్లకు కూడానేమో! పిల్లలు, స్త్రీలు అని ఏముంది? పరాధీనంలో ఉండేవారెవరైనా - పంజరం కదిలిన ప్రతిసారీ ఎవరో తలుపు తెరుస్తున్నారన్న ఆశతో రెక్కల్ని టపటపలాడించే పక్షుల్లా - తక్షణ స్వేచ్ఛను కోరుకుంటారు.

ఎరస్రైన్యం... శత్రుదేశాల గుండెలపై పన్నెండు వేల కిలోమీటర్ల దూరం ధడధడమని ‘లాంగ్‌మార్చ్’ జరిపి భూస్వామ్య కబంధనాల నుంచి రైతులను విడిపించినప్పుడు, చైనా విప్లవాన్ని కర్షకులు సారవంతం చేసినప్పుడు, ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ’ కోసం చైనా కమ్యూనిస్టు పార్టీ నడుము వంచినప్పుడు, ‘సాంస్కృతిక విప్లవం’ ఉవ్వెత్తున దేశాన్ని కుదిపినప్పుడు ... ఇలా చైనాలో జరిగిన ప్రతి మార్పులో, ప్రతి మలుపులో... చైనా మహిళ తన చేతిలోని గరిటెను విసిరి కొట్టేసినట్లు, ఉద్యోగం చేస్తున్నట్లు, నచ్చినవాడిని నిర్భయంగా పెళ్లి చేసుకుంటున్నట్లు విముక్తి కలలు కనే ఉంటుంది. నేనూ అలాగే ఛాంష్షూలోని పెద్దబడిని కలగన్నాను. నియంత పాలకుల నుంచి ప్రజలు, నియంత పెద్దల నుంచి పిల్లలు, నియంత భర్తల నుంచి స్ర్తీలు నిరంతరం స్వేచ్ఛను కాంక్షిస్తూనే ఉంటారు.

రివల్యూషనరీ ఆర్మీలో చేర్చడానికి స్కూళ్లకొచ్చి పెద్ద పిల్లల్ని తీసుకెళుతున్నారు. నేను ఛాంఘ్షా బడిలో ఉన్నాను. ‘‘నువ్వూ వెళ్లాలి సే టుంగ్. నవై చెనా ఆవిర్భావం కోసం నీ పలకా బలపాలను పక్కన పడేసి, కలుపును ఏరే పనిలో పడాలి’’ అన్నాడు నా తండ్రి. రాచరికపు అవశేషాలపై సన్‌యత్‌సేన్ నాయకత్వంలోని ‘కొమిటాంగ్’ పార్టీ ఆవిర్భవించడం వెనుక నేను బిగించిన పిడికిలి కూడా ఉందనుకుంటే ఎంత గర్వం!

ఐదేళ్ల తర్వాత మళ్లీ దేశంలోని విద్యార్థులంతా ఏకమయ్యారు. అప్పటికి నా డిగ్రీ పూర్తయింది. హ్యునాన్‌లోని ఫస్ట్ ప్రొవిన్షియల్ నార్మల్ స్కూల్ ప్రొఫెసర్ యాగ్ ఛాంగ్జీ తన వెంట నన్ను బీజింగ్ తీసుకెళ్ళారు. పెకింగ్ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా ఆయనకు ఉద్యోగం వచ్చింది. అదే యూనివర్శిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా నాకూ ఉద్యోగం ఇప్పించారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులవి. వర్సెయిల్స్ ఒప్పందం ప్రకారం - చైనాలో జర్మనీకి ఉన్న హక్కులను జపాన్‌కు మార్చే సమమయంలో దేశంలోని ఉడుకు నెత్తురు కుతకుతలాడింది. విద్యార్థులు పెద్ద ఉద్యమంగా పెకింగ్ చేరుకున్నారు. వారికి నగరాలలోని కార్మికులు తోడయ్యారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘‘కానీ ఏం లాభం? రాజకీయ పునరుజ్జీవనాన్ని సాధించుకున్న చైనా సామాజిక విప్లవాన్ని విస్మరించింది. స్ర్తీల విషయంలోనైతే ఇంకా మధ్యయుగాల నాటి న్యాయాన్నే పాటిస్తున్నాం’’ అని లి డెఝావో ఆవేదన చెందారు. యూనివర్శిటీ లైబ్రరీలో ఆయన నా క్యూరేటర్. నా భవిష్యత్ ఆలోచనలను మలిచింది ఆయనే.
లీ డెఝావోతోపాటు ఛెన్ డ్యుగ్జీ, హ్యూషీ, జియాంగ్ జువాన్‌టాంగ్‌లు - బీజింగ్ యూనివర్శిటీలో నేను పార్ట్‌టైమ్ స్టూడెంట్‌గా ఉన్నపుడు - నాకొక సైద్ధాంతిక వ్యక్తిత్వాన్ని ప్రసాదించారు.

అప్పట్లో ఘ్జావో అనే యువతిని చైనా ఫ్యూడల్ వివాహ సంప్రదాయాలు పొట్టన పెట్టుకున్న హృదయ విదారక సంఘటన ఒకటి నా ముద్దను నాకు మింగుడు పడనివ్వలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు ఘ్జావో ఆత్మహత్య చేసుకుంది. సమాజం - పుట్టినిల్లు - మెట్టినిల్లు అనే త్రిభుజాకారపు ఇనుప తెర ల్లో చిక్కుకున్న స్ర్తీ బయటికి వచ్చే దారి లేక అసహాయంగా మగ్గిపోవడమన్నది వివాహ వ్యవస్థలోని అవలక్షణంగా నాకు కనిపిస్తుంది. కోరుకున్న వ్యక్తిని జీవితభాగస్వామిగా ఎంచుకునే అవకాశాన్ని స్ర్తీకి ఇవ్వలేని సమాజం ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని ఎత్తులు ఎదిగితే మాత్రం నాగరికం అవుతుందా? గృహ బానిసత్వంలో మగ్గుతున్న స్ర్తీలు తమ వంటింటి పొగగొట్టాలనుంచి వదిలే దట్టమైన శోకాలను, శాపాలను జాతీయ స్థూల ఉత్పత్తికి సూచికలనుకుంటే ఎలా?


చైనాలో మగవాళ్లు మూడు ఆధిక్యతలకు లోబడి జీవిస్తుంటారు. రాజకీయం, కుటుంబం, మతం... మగవాడి పక్కలో పడుకుని వాడిని ఎటూ కదలనివ్వక, మీద కాళ్లేస్తాయి. రాజకీయ నిర్ణయాలు అతడి జుట్టు పట్టుకుంటాయి. కుటుంబ బాధ్యతలు అతడి ముక్కును మూస్తూ, వదులుతూ, మూస్తూ వదులుతూ ఉంటాయి. మతం అతడిపై కుండల కొద్దీ సంప్రోక్షణ జలాన్ని కుమ్మరిస్తుంటుంది. స్ర్తీల పరిస్థితి ఇంకా ఘోరం. పురుషుడు భరించే మూడు ఆధిక్యతలతో పాటు పురుషుడి దురహంకార దుర్గంధాన్ని కూడా వారు భరించాలి!

సాంస్కృతిక విప్లవంతో తప్ప దేశం లోపల, బయట
ఉన్న ఆధిక్యతల నిర్మూలన జరగదని నేను బలంగా విశ్వసించాను. ఛైర్మన్ మావో... నియంతలా మారిపోయాడన్నారు. పార్టీలో ప్రబలిన ఉదారవాద బూర్జువాలను బలహీనపరచడానికి, ‘గ్రేట్ లీప్ ఫార్వార్డ్ ’తప్పిదాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సాంస్కృతి విప్లవాన్ని నేను అడ్డుపెట్టుకున్నానని అన్నారు. రాచరిక భూస్వామిక భావజాలం నుంచి ప్రజలను మానసికంగా బయటికి తేవడం కోసం వారి జీవితాలను సర్వనాశనం చేశానని ఆరోపించారు. విప్లవం వల్ల ఇంత హింస ఎందుకు జరుగుతుందని వారి ప్రశ్న!
విప్లవం డిన్నర్ పార్టీ కాదు. తీరిగ్గా చదువుకునే స్ఫూర్తిదాయక వ్యాసం కాదు. చక్కటి పెయింటింగ్ కాదు. ఎంబ్రాయిడరీ వర్క్ కాదు. అది సున్నితంగా, సరళంగా, సక్రమంగా, మెల్లిమెల్లిగా ముందుకు సాగదు. గౌరవంగా, మర్యాదగా, నొప్పిలేకుండా, డిప్లొమాటిక్‌గా మాట్లాడదు. అవసరమనుకుంటే హింసతో వ్యవస్థను అదుపులోకి తీసుకునే దుస్సాహసమే విప్లవం. రేపటి స్థిమితమైన జీవితాల కోసం ఇవాళ కొంత అశాంతికి లోనైనా తప్పులేదన్న భావనకు ఆచరణ రూపమే విప్లవం.

నేను వాంఛించినది శాశ్వత విప్లవం. అయితే అది ట్రాట్‌స్కీ తరహా శాశ్వత విప్లవం కాదు. ఒక విప్లవం తర్వాత మరొకటి రావాలి. విప్లవం నిరంతరం పురోగమించాలి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేనప్పుడు జాప్యం చేయడం వల్ల చెడ్డపేరును వాయిదా వేసుకుంటూ పోగలమే గానీ అసలంటూ తప్పించుకోలేం.
మావో జేడోంగ్ (మావో సే టుంగ్)
26 డిసెంబర్ 1893 - 9 సెప్టెంబర్ 1976
జన్మస్థలం : షావ్షాన్, హునాన్ ప్రావిన్సు
సంతతి : పదిమంది
భార్యలు : నలుగురు
ప్రతిష్ట : చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి ఛైర్మన్
అప్రతిష్ట : సాంస్కృతిక విప్లవ సారథిగా.

ది లవ్ ఆఫ్ ది హాథోర్న్ ట్రీ
చైనా మహోన్నత నేత మావో జేడోంగ్ 1966-1976 మధ్య ‘సాంస్కృతిక విప్లవం’ పేరిట అనుసరించిన విధానాలను సునిశిత హాస్యంతో విమర్శిస్తూ చైనా దర్శకుడు ఝంగ్ ఇమౌ తీసిన ‘ది లవ్ ఆఫ్ ది హాథోర్న్ ట్రీ’ చిత్రం ఇప్పుడక్కడ హౌస్‌ఫుల్ కలెక్షన్‌లతో నడుస్తోంది. అనుమానాలతో, అసహనంతో ప్రజలను వేధించుకుతిన్న సాంస్కృతిక విప్లవం... ఇద్దరు యువ ప్రేమికుల జీవితాలను దయనీయంగా మార్చిన వైనమే చిత్ర కథాంశం. చైనా యువతీ యువకులతో పాటు, కరడు గట్టిన కమ్యూనిస్టులు కూడా ఈ చిత్రాన్ని ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారట! మావోను పరోక్షంగా విమర్శిస్తూ డైలాగులు వినిపించిన ప్రతిసారీ సినిమాహాళ్లు చప్పట్లతో దద్దరిల్లుతున్నాయని ఘంగ్ ఇమౌ అంటున్నారు. అప్పట్లో చైర్మన్ మావో ఆధ్వర్యంలోని ‘రెడ్ ఆర్మీ’ దళాలతో పోరాడిన ‘నేషనల్ కొమింటాంగ్’ పార్టీలోని ఒక అధికారి కుమారుడే ఈ చిత్ర దర్శకుడు. 

కూర్పు, స్వగత కథనం:
మాధవ్ శింగరాజు

No comments: