Saturday, November 27, 2010

ఎందుకున్నామిక్కడ?

ఒక జూలో... ఒక తల్లి ఒంటె, ఒక పిల్ల ఒంటె రెండూ సేదతీరుతున్నాయి. ఉన్నట్టుండి పిల్ల ఒంటెకు ఒక సందేహం రావడంతో.... 'అమ్మా..మన పొట్టలో నీటి తిత్తి ఎందుకు ఉంటుంది?' అని అడిగింది తల్లిని.
'మనం ఎడారి జంతువులం కదా... నెలలు నెలలు నీళ్లు దొరక్కపోయినా బతకడానికి మన పొట్టలో నీటిని దాచుకుందుకు దేవుడు నీటి తిత్తిని ఏర్పాటు చేశాడు' అని సమాధానమిచ్చింది తల్లి.
'మరి మన కాళ్లు పొడుగ్గా....పాదాలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి?' ఇంకో సందేహాన్ని లేవనెత్తింది పిల్ల ఒంటె. ' ఇసుకలో నడిచేందుకు వీలుగా అలా ఉన్నాయి. మన కాళ్లు, పాదాలు ఇలా ఉండడం వల్లే ఇతర జంతువుల కన్నా చురుగ్గా, హాయిగా ఎడారిలో తిరగ్గలం మనం' గర్వంగా చెప్పింది తల్లి.
'మరి మన కంటి రెప్పల వెంట్రుకలెందుకు పొడుగ్గా ఉంటాయి చూపుకి అడ్డం పడేలా?' బుంగమూతితో ప్రశ్నించింది పిల్ల ఒంటె.
'పిచ్చి తల్లి.... కంటిరెప్పల వెంట్రుకలు అలా పొడుగ్గా ఉండబట్టే ఎడారిలో వీచే గాలికి ఇసుక మన కంట్లో పడకుండా రక్షణ ఉంటుంది' అనునయంగా వివరించింది తల్లి ఒంటె.
'ఓహో.. ఎడారిలో ఉండడానికి దేవుడు మన శరీరంలో ఇన్ని ఏర్పాట్లు చేస్తే... మరి మనం ఈ జూలో ఎందుకున్నామమ్మా....?' అమాయకంగా అడిగింది పిల్ల ఒంటె.

***

ఇవ్వాళ ఎందరికో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మనుషులుగా మనం నేర్వాల్సిందేమిటి, నేర్చుకున్నదేమిటి, చేయాల్సిందేమిటి, చేస్తున్నదేమిటి, మనుషులుగానే స్థానభ్రంశం చెందుతున్నామా....
పిల్ల ఒంటెకున్న పాటి తెలివి కూడా మనకు లేకుండా పోతోందే!

నాన్నకో లేఖ

ఏదో పని మీద కొడుకు గదిలోకి వెళ్లిన తండ్రికి స్టడీ టేబుల్ మీద కొడుకు రాసిన ఉత్తరం కనిపించింది. ఏంటా అని తీసి చదవడం మొదలుపెట్టాడు తండ్రి..


డియర్ డాడ్...
ఈ విషయాలన్నీ మీకు చెప్పాలంటే బాధగానే ఉంది. కాని చెప్పక తప్పడం లేదు. నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. రోజూ ప్రతి చిన్న విషయానికి నువ్వూ, అమ్మా పోట్లాడుకోవడాలు, అరుచుకోవడాలు.. నన్ను చాలా డిస్ట్రర్బ్ చేస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతత కరువవుతోంది. దాన్ని బయట వెదుక్కునే ఆరాటంలో ఉన్నాను. నన్ను ప్రేమగా చూసుకోవడానికి నా కన్నా పెద్దదైన ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. సరదాలు, అల్లర్లు పంచుకోవడానికి ఫ్రెండ్స్, పబ్బులు, క్లబ్బులు ఉండనే ఉన్నాయి. చదువు సంధ్యలు, భవిష్యత్ బెంగలు.. గట్రా మరిచిపోయి ఆనందంగా... గాల్లో తేలిపోవడానికి కొకైనూ అందుబాటులో ఉంది. 
వీటన్నిటినీ అనుభవిస్తూ.... 
హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను డాడీ.... .
నా కోసం వెదకొద్దు.


పిఎస్:  డాడీ.... పైన నేను రాసిన విషయాలన్నీ నా స్టడీ టేబుల్ సెంటర్ డ్రాలో ఉన్న నా ప్రోగ్రెస్ రిపోర్ట్‌లోని మార్కులకన్నా భయంకరమైన విషయాలు. అవన్నీ అబద్దం . నేను ఎక్కడికీ వెళ్లలేదు. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. మంచి, చెడుల విచక్షణ నాకుంది. విచక్షణను అందించేదే కదా...విజ్ఞానం. మరి దీనికి మార్కులు కొలమానమా డాడీ....? ఇది అర్థం చేసుకున్నాక, మీ కోపం తగ్గాక కాల్ చేయండి. 
క్షణంలో మీ ముందుంటాను.
లవ్ యూ డాడీ....  
మీ అబ్బాయి

లక్ష్యాల బాటలో...

మనసులో ఏదో లక్ష్యం అంకురిస్తుంది. చాలా మందిలో ఆ లక్ష్యం సాకారం కాకుండా అలాగే ఉండి పోతుంది. కొందరిలో అది పెరిగి పెరిగి ఒక మహావృక్షమైపోతుంది. తన చుట్టూ ఉండే ఎందరికో నీడగా, ఒక అండగా నిలబడుతుంది. కానీ, అన్ని లక్ష్యాలూ ఆ స్థాయికి చేరుకుంటాయా అంటే లేదు. వినడానికి చేదుగా అనిపించవచ్చేమో కానీ, అత్యధిక లక్ష్యాలు వైఫల్యాలనే మూటకట్టుకుంటాయి. అందుకు ఒకటా రెండా? కారణాలు అనేకం.
అనుకోకుండా రోడ్డు మీద కలసిన ఒకతను నా స్నేహితుడికి ఎవరి గురించో చెబుతున్నాడు. అవే వీ నేను పట్టించుకోలేదు గానీ, మాటల మధ్యలో ఆ వ్యక్తి గురించి చెబుతూ 'ఆయనో వాయుపుత్రుడులే' అన్నాడు. ఆ మాటకు అర్థమేమిటో నాకేమీ బోధపడలేదు. నేనలా దిక్కులు చూస్తూ ఉండిపోయాను. వారి సంభాషణ ముగిసిపోతున్న సమయంలో"ఇందాక ఎవరినో మీరు వాయుపుత్రుడు అన్నారు.


ఆమాటకు అర్థం ఏమిటండి? అన్నాను. ఆయన ఫక్కున నవ్వి " కాస్త గుట్టుగా ఉంచడానికి ఆ మాట వాడతాను. వాయుపుత్రుడు అంటే గాలి మనిషండి. నేను చెప్పే వాడి ధోరణే అది. గాలివాటంగా ఎటు పడితే అటు కొట్టకుపోతుంటాడే తప్ప ఎక్కడా స్థిరంగా ఉండడు'' అన్నాడు. "ఒక లక్ష్యం అంటూ లేని వాడు గాలి మనిషి కాక మరేమవుతాడు?''అంటూ లోలోన నా మనసు గొణుక్కుంటోంది. ఏమైనా ఈయన భలే తమాషా మనిషిలే అనిపించింది. అయితే, ఈ నిలకడలేని తనాన్ని గురించి ఎవరినైనా ప్రశ్నిస్తే వారి నుంచి వచ్చే సమాధానాలు తమాషాగా మాత్రం ఉండవు.


అనుకుంటే మాత్రం?
"ఏమేమో అనుకున్నాను. ఎంతో సాధించాలనుకున్నాను. కానీ, ఏమయ్యింది? వరదల్లో ఊళ్లు కొట్టుకుపోయినట్లు, కాల ప్రవాహంలో ఏళ్లు గడిచిపోయాయి. కానీ, నేను అనుకున్న వాటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేరలేదు. బంగారం ముట్టుకున్నా మట్టి అయిపోతుంటే నేను మాత్రం ఏంచేయగలను? అందుకే ఇక ఏమనుకునీ ప్రయోజనం లేదని తేల్చేసుకుని జీవితం ఎటు తీసుకు వెళితే అటు వెళ్లిపోవ డానికే నిర్ణయించుకున్నాను.''అంటూ కొందరు కొండంత నిర్లిప్తతను వ్యక్తం చేస్తుంటారు. అయితే,ఎంతసేపూ "అనుకున్నానూ అనుకున్నానూ'' అనడమే కానీ అనుకున్నది నె రవేరడానికి చేసిందేమిటి? ఆ చేసింది ఏ స్థాయిలో? అని ప్రశ్నించుకుంటే చాలా సార్లు సరియైన సమాధానమే రాదు.


అపజయానికి వేయి దారులు
అయినా అనుకోవడంతోనే అంతా అయిపోదు కదా! ఒక లక్ష్యంగా అనుకోవడానికి ముందు మన పరిమితులు, మన శక్తి సామర్థ్యాల మీద చాలా సార్లు మనకో అంచనాయే ఉండదు. ఎన్ని వనరులు సమకూర్చుకోవాలి? ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి? ఎంత సేపూ విజయావకాశాల మీదే తప్ప మునుముందు ఎదురయ్యే ప్రమాదాల గురించిన అంచనా లేకపోతే ఎలా?నిజానికి మనిషిని నిలబెట్టేందుకు వచ్చే విజయానికి ఒకే దారి ఉంటుంది.


పడగొట్టాలని చూసే అపజయానికి మాత్రం వేయి దారులు ఉంటాయి. వాటిని నిరోధించడంలో ఏ కాస్త అప్రమత్తంగా ఉన్నా అపజయమే మిగులుతుంది. ఈ విషయంలో మానసిక వేత్త ఆండ్రే మౌరిస్ కొంత భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. " చాలా మంది తాము అనుకున్నది నెరవేరలేదని చెబుతారేగానీ, వాస్తవానికి వారు వాటి గురించి అంత బలంగా అనుకున్నదే లేదు'' అంటాడు. ఈ మాటలు లక్ష్యం వెనుకున్న మూలాల్నే నిలదీస్తుంది. మన సంకల్పాలు చాలా సార్లు ఇంత బలహీనంగా ఉంటున్నాయా? అనిపిస్తుంది.


అంతే స్థిరంగా...
జీవితంలోని కొన్ని సంఘటనలు ఒక్కోసారి మనసును అమితంగా ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావాల్లోంచే బలమైన కోరికలు అంకురిస్తాయి. ఈ కోరికలే కొందరిలో క్రమంగా విస్తరిస్తూ లక్ష్యాలుగా మారతాయి. ఒక దశలో కోరికలు వేరు, లక్ష్యాలు వేరు అనిపించేంత వ్యత్యాసం ఈ రెంటికీ మధ్య ఏర్పడుతుంది. వాస్తవానికి కోరికలు ఎప్పుడూ ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని అశ్రయించే ఉంటాయి.


కోరికలెప్పుడూ స్వీయ సుఖాన్నే కోరుకుంటాయి. ఆ సుఖం దక్కకపోతే చతికిలబడతాయి. లక్ష్యాల గురి వేరు. అవి వ్యక్తిగత గుడారాల్లో ఇమడలేవు. తమ కుటుంబానికి ఆవల ఉండే మిగతా వారి కోసం అంటే సామాజిక హితానికే అవి పాటుపడుతూ ఉంటాయి. ఒత్తిళ్లకూ, గాయాలకూ అవి చలించవు. అవి ఏ త్యాగానికైనా వెనుకాడవు.


రెట్టింపు శ్రమ
మనో విశ్లేషకుడు జాన్ కాపర్ పాయ్స్ " లక్ష్యం అంటే అది సుఖ సౌఖ్యాలకూ, ప్రశాంతతకూ బద్ధ శత్రువు'' అంటాడు చలోక్తిగా. దీనికి కొంచెం భిన్నంగా అబ్దుల్ కలామ్, లక్ష్యాలను కలలుగా చెబుతూ " కలలంటే నిద్రలో వచ్చేవి కావు. నిద్ర పట్టకుండా చేసేవి'' అంటాడు. నిజానికి ఒక విశాలమైన లక్ష్యాన్ని సాధించాలంటే రెట్టింపు శ్రమ అవసరమవుతుంది.


లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఎవరైనా సాధారణ శ్రమతోనే సరిపెడితే వారు అపజయాన్నే మూటగట్టుకుంటారు. అయితే, లక్ష్యాన్ని గాఢంగా ప్రేమించేవారు సహజంగానే రెట్టింపుగా శ్రమిస్తారు. అది వారికి ఆనందంగా ఉంటుందే తప్ప శ్రమగా అనిపించదు. లక్ష్యం మీద ప్రేమ లేకుండా ఎంతసేపూ లక్ష్య సాధనతో వచ్చే ఫలితాల మీద ధ్యాస ఉండే వారికే శ్రమ భారమనిపిస్తుంది. భారంగా చేసే పనులేవీ ఆశించిన ఫలితాల్ని సా«ధించలేవు.


ప్రవాహమై...
పరిమితులు, అవరోధాలు మన గమనానిక్ని నిరంతరం అడ్డుపడుతూనే ఉంటాయి. అవరోధాలన్నీ పూర్తిగా వ్యక్తిగతంగానో పూర్తిగా సామాజికంగానో ఉండవు. చాలా సార్లు అవి ఈ రెండింటి మిశ్రమంగా ఉంటాయి.అందుకే అవరోధాలను అధిగమించడం అన్నది ఆ రెండింటి పట్ల మనకున్న అవగాహన మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.


లక్ష్యసాధనలో కొన్నిసార్లు అవరోధాలు ఏర్పడవచ్చు. నిజానికి అవరోధాలు, ప్రతిష్ఠంభనలు తాత్కాలికంగా ఉండేవే. ప్రతిష్ఠంబనను ఓటమి అనుకోవడం నిద్రను మరణం అనుకోవడమే. లక్ష్యసాధనలో గాయాలు అత్యంత సహజం. ఆ గాయాలు భౌతికమైనవే కావచ్చు. మానసికమైనవే కావచ్చు ఏదో ఒక స్థాయిలో అవి ఉంటాయి. తిరోగమనానికైనా పురోగమానికైనా గాయమే సరిహద్దుగా ఉంటుంది. కొందరు గాయపడితే తక్షణమే లక్ష్యం నుండి వైదొలగిపోతారు. కొందరేమో గాయాలతో పాఠాలు నేర్చుకుని మరింత బలంగా ముందుకు సాగిపోతారు. నిజానికి నీరు లోయల్లోంచి పయనించినట్లు విజయం గాయాల్లోంచే పయనిస్తుంది.

.-బమ్మెర

Friday, November 19, 2010

అమూల్య సమయం

wealth-means
ఒక సంవత్సరం విలువ తెలియాలంటే ఓ ఏడాది పరీక్ష తప్పి న విద్యార్థిని అడగాలి. ఒక నెల విలువ తెలియాలంటే ఉద్యో గిని అడగాలి, ఒక గంట విలువ తెలియాలంటే ప్రేయసి కోసం తహతహలాడే ప్రేమికుడిని అడగాలి. ఒక నిమిషం విలువ తెలియాలంటే బస్సు మిస్సయిన ప్రయాణికుడిని అడగాలి. ఒక క్షణం విలువ తెలియాలంటే పోటీలలో రజతంతో సరిపెట్టుకున్న క్రీడాకారుడిని అడగాలి...ఇప్పటికే ప్రతి క్షణం ఎంతో విలువైనదని మీకు తెలిసుంటుంది. అందుకే మనకు ఏవిధంగానూ ఉపయోగంలేని పనులను తో, మాటలతో సమయాన్ని వృథా చేసుకోకూడదు. ఇలా పనికిరానివి, పక్కన పెట్టాల్సిన పనుల జాబితాను సిద్దం చేసుకుంటే ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవచ్చు.


కాలం చాలా విలువైనది. పోతే తిరిగిరాదని నేడు కొత్తగా చెప్పక్కర్లే దు. కానీ కొంతమంది యువతీయువకులు తమ అమూల్యమైన సమయాన్ని అనవసర విషయాలకు వెచ్చిస్తున్నారు. ముఖ్యమైన పనుల ను వాయిదా వేస్తూ పనికిరాని వాటికి సమయాన్ని కేటాయిస్తున్నారు. చదువుకున్న యువతీ యువకులే ఎక్కువగా సమయాన్ని వృధా చేస్తున్నారు. వారికి ఇష్టమైన కార్యక్రమాల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినా అందుకోసం ఎంతో సమయాన్ని కేటాయించే వీరు అవసరమైన విషయాలకొస్తే మాత్రం తమకు తీరిక లేదంటూ చెబుతుంటారు కొంతమంది. ఒక జాబితా తయారు చేసుకుంటే అసలు మన జీవితంలో ఎంత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామో తెలుసుకుకోవచ్చని కొంతమంది శాస్తవ్రేత్తలు అంటున్నారు.


లెక్క తేల్చారు...
ముపె్ఫై సంవత్సరాల జీవితంలో ఏడు సంవత్సరాలు సద్వినియోగం చేసుకుంటే చాలా గొప్ప అని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఏంటీ ఆశ్చ ర్యంగా ఉందా? అవును వారానికి 168 గంటలలో టీవీలు చూడడం, స్నానాదులు, షికార్లు చేయడం వంటి పనులు మినహాయించి 60 గంట లు సద్వినియోగం చేసుకుంటే ఎంతో సమయం సద్వినియోగం చేసుకు న్నట్టేనని శాస్తవ్రేత్తలు అంటున్నారు. అసలు ఒక ఏడాదిలో ఫోనులో మాట్లాడే సమయం మూడు నెలలకు మించి ఉంటుందని నిపుణులు లెక్కతేల్చారు. ఇటువంటి విషయాలను పరిశీలించినప్పుడు పనికిరాని వాటికి ఎంత సమయం ఇస్తున్నామో అర్థమవుతుంది. అందుకే వేటికి ఎంతసమయం కేటాయించాలో తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువతకు ఎంతో ఉంది.


రూపొందించుకోవాలి...
Dali-Persistence-of-Timeఏదైనా పని ఉన్నప్పుడు వాయిదాలు వేయడం కొంతమంది కుర్రకారు ఎంతో ఇష్టంగా చేసే పని. అయితే ముఖ్యమైన పనులన్నీ పక్కనపెట్టి కొ న్ని టీవీ ఛానల్స్‌లో వచ్చే ఏమాత్రం ఉపయోగంలేని కార్యక్రమాలను చూడడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపడం వృథాగా చెప్పవచ్చు. అసలు ఒక వారంలోని సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారో ఒ జాబితాను తయారు చేసుకుంటే అసలు ఎంత సమయం సద్వినియోగం చేసుకుం టున్నారో వారికి తెలిసిపోతుంది. టీవి వీక్షించేందుకు, సర్ఫింగ్‌ / చాటిం గ్‌, తిండికి, ప్రయాణం, కాలేజీకి లేదా ఆఫీసుకు, బయట గడిపేందుకు, స్నేహితులతో షికార్లకు, చదువుకు లేదా ఆఫీసులో చేసే పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారో ఒక లిస్ట్‌ తయారు చేసుకోవాలి. అలాగే ఆయాపనులు చేస్తున్నప్పుడు మీరు పొందే చిరాకు, ఆనందం, అలసట, ఉత్సాహం, తప్పు చేస్తున్నామనే భావన... వంటి భావోద్వేగాలను కూడా గమనించాలి. మనం వారంలో ఎంత ఖర్చుచేస్తామో పట్టిక తయారు చేసే విధంగానే సమయానికి కూడా పట్టిక రూపొందించుకోవాలి.


మీరే తేల్చుకోవచ్చు...
సరదాగా మీ పనులన్నీ ఒక జాబితాగా తయారు చేయండి. అప్పుడు సమయం వృధా చేస్తున్నారని ఎవరూ మీకు చెప్పక్కర్లేదు. ఆ జాబితాను చూస్తే మీమీద మీకే సిగ్గేస్తుంది. ఇంకా చెప్పాలంటే అసహ్యమేస్తుంది. అందరూ అసహ్యించుకునే బదులు ఏం మార్చుకుంటారో మీరే తేల్చుకో వచ్చు. అనవసర విషయాలకు ఎంతటి అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తున్నారో వాటివల్ల జీవితంలో ఎంత సమయం పనికిరాకుండా పోతుందో ఒక అంచనాకు రావచ్చు. ఇవన్నీ తెలుసుకున్న యువతీ యు వకులు తాము అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించు కుంటారని శాస్తవ్రేత్తలు తెలియజేస్తున్నారు. అలాగే తమ తరువాత తరానికి ఆదర్శంగా ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకునేలా మారతారని నమ్మకంగా చెబుతున్నారు. ఇక వెంటనే మీ సమయ జాబితాను ప్రారం భించండి మరి.

Sunday, November 7, 2010

శంఖారావాలూ ... ఈలారావాలూ

'నాన్నా ... అర్జెంటుగా ఒక వంద శంఖాలు పట్టుకురా'
'శంఖాలా ... శంఖాలేమిటమ్మా?'
'అయ్యో శంఖాలు తెలియదా? శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదంటారు చూడు. ఆ శంఖాలురా' నాయనమ్మ తల దూర్చింది.
'అబ్బా ... ఆ సామెతలన్నీ వాళ్లకేం తెలుస్తాయి? నువ్వుండు. నేను చెపుతా. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పూరిస్తాడే అది రా అబ్బాయ్' తాతగారు కల్పించుకున్నారు.
'ఐ లవ్ యు' అని రాసి బీచిల దగ్గర అమ్మేవీ ఇవీ ఒకటేనా నాన్నా? వాటిల్లోనుంచి అంత శబ్దం వస్తుందా?'
'ఉండు ఊది చూపెడతా' ఎక్కడ్నించో ఒక బుజ్జి శంఖం తీసుకొచ్చి ఊదాడు ఆ అమ్మాయి తమ్ముడు.
తండ్రి ఉలిక్కిపడ్డాడు. తల్లి పరిగెత్తుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్లు గాభరాగా తొంగి చూశారు. అంత చిన్న శబ్దానికే అంత రెస్పాన్స్ రావటం చూసి ముగ్ధురాలయింది ఆ అమ్మాయి.

'నాన్నా మరిచిపోకు సాయంత్రం వచ్చేటపుడు తప్పకుండా తీసుకురా' మరీ మరీ చెప్పింది. కాని నాన్న తేలేదు. అమ్మా తేలేదు. అక్కా తమ్ముళ్లే కష్టపడి కొన్ని శంఖాలు పోగేసి, కొంతమంది పిల్లల్ని రప్పించి ఒక టేప్‌రికార్డర్ ముందు కూర్చున్నారు. ఒక్కొక్క శంఖం ఊదడం, అది ఎందుకు ఊదారో కారణం చెప్పడం ... చాలాసేపు సాగింది ఆ తతంగం.
శంఖాలు తక్కువై పిల్లలు ఎక్కువవడంతో కాసేపయ్యాక విజిల్స్ కూడా బయటకి తీశారు. శంఖారావంలో ఈలలు వేయొచ్చా అని కొందరు సందేహించారు. కాని ఆ పేపర్ యాడ్‌లో శంఖారావం పూరించండి అంటూ ఈల బొమ్మే వేసి ఉండడంతో ఈలారావాలకు వాళ్లు కూడా అంగీకరించారు.
ఎలాగైతేనేం క్యాసెట్ సిద్ధమైంది. ఈ లోగా దీపావళి సెలవు వచ్చేసింది. సత్యభామ దుష్టసంహారం గావించిన రోజు. అంతకంటే మంచి సందర్భం ఇంకేముంటుంది? అనుకున్నారు పిల్లలు.
టేప్‌రికార్డర్ ఆన్ చేసి దానికి మైక్ కనెక్షన్ ఇచ్చారు. ఇంట్లో, వీధిలో, షాపులో, స్కూల్‌లో, ఊర్లో, టౌన్లో, రాష్ట్రంలో, దేశంలో ... తమకు తెలిసిన మొత్తం అవినీతిపరులందరి పేర్లూ వరసాగ్గా వినబడసాగాయి శంఖ ఈలారావాల మధ్య.
వెంటనే ఏం జరిగిందో తెల్సా! ఆ వీధిలోనూ, పేటలోనూ ఉన్న పెద్దవాళ్లందరూ పిల్లల కోసం తెచ్చిన బాణాసంచా మొత్తం టపటపామని కాల్చి పారేశారు. అందుకే మీకెవరికీ ఆ పేర్లు వినిపించలేదు. అయినా ప్రకటన ఇచ్చిన ప్రభుత్వానికి గాని, మనకు గాని వాళ్ల పేర్లు తెలియకపోతేగా!

స్నేహంతోనే ముందంజ

'వీడికి ఫ్రెండ్స్ చాలా ఎక్కువయ్యారు... అందుకే చదువు తక్కువయ్యింది. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్‌తో కబుర్లే గానీ చెప్పిన మాట ఒక్కటీ పట్టించుకోడు కదా......' అంటూ తమ పిల్లల గురించి కంప్లెయింట్ చేసే తల్లిదండ్రులను చాలామందిని చూస్తూనే ఉంటాం.

స్నేహితులు ఎక్కువగా ఉంటే పిల్లలకు చదువు ధ్యాస తక్కువగా ఉంటుందని, ఆటలపైనే మోజుంటుందని చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. కానీ ఇటీవలి అధ్యయనాలు ఇందుకు విరుద్ధమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. బడికి వెళ్లే పిల్లలకు ఎంత ఎక్కువమంది ఫ్రెండ్స్ ఉంటే చదువులో వాళ్లు అంత ముందంజలో ఉంటారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు అధ్యయనకారులు.

పిల్లలు ఎక్కడికి వెళ్లినా ఇట్టే ఫ్రెండ్‌షిప్ చేసేస్తారు. ఇంటి చుట్టుపక్కల, బంధువుల పిల్లలు ఇలా వారి జాబితా పెద్దదే. వయసుతో పనిలేకుండా తమ కన్నా పెద్దవాళ్లతో కూడా ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్లూ ఉంటారు. అయితే ఒకే స్కూల్‌లో, ఒకే క్లాస్‌లో చదువుతున్న పిల్లల మధ్య ఉన్న స్నేహం వారి అభ్యున్నతికి మరింత బాగా సహకరిస్తుందంటున్నారు

కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన మెలిస్సా విట్‌కోవ్. స్కూల్‌కి సంబంధించిన పనులు, హోమ్‌వర్క్, పాఠాల్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు, టీచర్లు చేయించే యాక్టివిటీస్.... ఇలా వీళ్లకి ఒకే రకమైన లక్ష్యాలు, ఇబ్బందులు ఉంటాయి. వీరంతా ఒకే రక మైన వాతావరణంలో పెరగడం, చదువుకోవడం వల్ల ఒకరి సమస్యలు ఒకరు షేర్ చేసుకోగలుగుతారు.

సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. కంప్లీట్ చేయాల్సిన పనులు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. కాబట్టి చదువులో ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు ఒకరికొకరు సహకరించుకోవడం సులువవుతుంది. వారి మిత్రబృందంలో సభ్యులు ఎక్కువగా ఉంటే ఎక్కువ అభిప్రాయాలను షేర్ చేసుకోగలుగుతారు.

అందరికీ ఒకే సమస్య రావడం వల్ల దాని గురించి అందరూ చర్చిస్తారు. అలాంటి చర్చల వల్ల పిల్లల మానసిక పరిణతి పెరుగుతుంది. సమస్యను ఎదుర్కోగలిగే ధైర్యం అలవడుతుంది. చదువులో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అధిగమించగలుగుతారు. తద్వారా ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు.

అందుకే ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం ఉండొద్దని పిల్లల్ని గిరిగీసి కూర్చోపెట్టవద్దని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. సో! ఇకనుంచీ మీరు కూడా మీ పిల్లల స్నేహాన్ని ప్రోత్సహించండి. అలాగని చెడ్డ స్నేహాలను కూడా ఓ కంట కనిపెడుతూ ఉండండి మరి.