Sunday, May 22, 2011

'' మిస్టర్ రావును పిలవండి '' * ఆరుగురు ప్రధానుల మాట అది

శ్రీశ్రీ, వివేకానంద, చిన్మయానంద.. ఒకరు కమ్యూనిస్టు. మరొకరు తాత్వికుడు. ఇంకొకరు ఆధ్యాత్మికవేత్త. ఈ ముగ్గురి భావజాలం వేసిన బీజంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన న్యాయమూర్తి డాక్టర్ పి.సి.రావు (పాటిబండ్ల చంద్రశేఖరరావు). కృష్ణా జిల్లా వీరులపాడులో పుట్టి పెరిగిన ఆయన హ్యాంబర్గ్‌లోని 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ' కోర్టుకు జడ్జిగా పనిచేస్తున్నారు. దేశాల మధ్య తలెత్తే తగువుల్ని పరిష్కరించే తీర్పులిస్తున్నారు. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నవ్యతో మాట్లాడారు. "రాజీవ్‌గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, దేవెగౌడతో కలిపి ఆరుగురు ప్రధానుల దగ్గర పనిచేసే అరుదైన అవకాశం నాకే దక్కింది. కొత్త చట్టాలు రూపొందించే సమయంలో ఎలాంటి న్యాయ సందేహాలు తలెత్తినా.. సలహాలు కావాలన్నా "మిస్టర్ రావును పిలవండి'' అనేవారు ప్రధానులంతా. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావులతో నాకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. పీవీగారు తను పదవిలో ఉన్నంత వరకు లా సెక్రటరీగా నన్నే ఉండమన్నారు. రాజ్యాంగంలోని ప్రొవిజన్స్‌ను చాలా సందర్భాల్లో రాజీవ్‌కు వివరించేవాణ్ణి. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ యాక్ట్‌లు తీసుకొచ్చేందుకు నా సలహాలు తీసుకుంది ప్రభుత్వం.''
"ఫిజీలో గొడవలు జరిగినపుడు రహస్యంగా వెళ్లి అక్కడున్న భారతీయులందరినీ కలిశాను. వాళ్ల అవసరాలు, కావాల్సిన హక్కుల గురించి తెలుసుకున్నాను. వాటన్నిటినీ క్రోడీకరించి.. ఆ దేశ ప్రభుత్వానికి మన డిమాండ్లను చెప్పాను. దాంతో కొత్త రాజ్యాంగ రచనలో మన వాళ్ల హక్కులకు స్థానం దొరికింది. కొత్త రాజ్యాంగాలు రాసుకుంటున్న అన్ని దేశాలకు వెళ్లాను నేను. అలా వెళ్లి ప్రవాస భారతీయుల హక్కులకు స్థానం కల్పించమని కోరాను. కొన్ని దేశాలకు ప్రభుత్వం పంపితే, మరి కొన్నింటికి ఆ దేశాల ఆహ్వానంపై వెళ్లాను. టిబెట్, సూడాన్, కరీబియన్ దేశాలకు ఇలాంటి పనిమీదే వెళ్లడం మరిచిపోలేని అనుభవం.''

"చూశారుగా ఈ మూలనున్న పెద్ద పార్శిల్ బాక్సులు. వాటిలో ఉన్న కాగితాలను క్షుణ్ణంగా చదవాలి. బోలెడు పుస్తకాలను రెఫర్ చేయాలి. అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి. ఎవరి వాదనలో ఎంత సత్యముందో అర్థం చేసుకోవాలి. ఇది మూడు దేశాలకు సంబంధించిన వ్యవహారం కదా.. హ్యాంబర్గ్ వెళుతూనే ఈ కేసు మీద తీర్పు చెప్పాలి..'' అంటూ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ఎదురుగ్గా ఉన్న భవంతిలో ఇంటర్వ్యూ మొదలుపెట్టారు డాక్టర్ పి.సి.రావు. ఇండియా, బంగ్లాదేశ్, బర్మా దేశాల సముద్ర జలాలకు సంబంధించిన కేసు అది. ఆ మూడు దేశాలు హ్యాంబర్గ్‌లోని 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ'లో విడివిగా కేసులు వేశాయి. ఆ కేసును విచారించే జడ్జిలలో ఒకరైన డాక్టర్ పి.సి.రావు.. మన దేశంలో ఆ స్థాయికి చేరుకున్న వారిలో నాలుగోవారు. ఇంటర్నేషనల్ కోర్టుకు చీఫ్ జస్టిస్ అయిన వారిలో ప్రథములు.

రెడ్‌విలేజ్...

"కృష్ణా జిల్లాలోనే మంచి చైతన్యవంతమైన గ్రామం మాది. వీరులపాడు పేరు చెప్పగానే ఎంతోమంది పెద్దవాళ్లు గుర్తుకొస్తారు. త్రిపురనేని రామస్వామి చౌదరి మా ఊర్లోనే పెళ్లి చేసుకున్నారు. ఆనాడే రైతుల కోసం ప్రత్యేకించి గ్రంథాలయం స్థాపించారు. ఊర్లో అందరూ కమ్యూనిస్టులే. అందుకే 'రెడ్ విలేజ్' అనేవారంతా దాన్ని. మా అమ్మ పుస్తకాలు బాగా చదివేది. లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి నన్ను కూడా చదవమనేది. అలా అలవాటైన పుస్తకాలను ఇప్పటికీ వదల్లేదు నేను. పెద్దయ్యాక బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లి చదివేవాణ్ణి. అప్పుడే శ్రీశ్రీ, చిన్మయానంద, వివేకానందల భావజాలం నన్ను ఉత్తేజపరిచింది. శ్రీశ్రీ పుస్తకాలతోనే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాను. ఉపనిషత్తుల్లోని గురు, శిష్య సంవాదం తార్కిక, లౌకిక జ్ఞానాన్ని పెంచింది. చెబితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, శ్రీశ్రీ, వివేకానంద, చిన్మయానంద ఆలోచనల్లోని టెక్నిక్‌ను... నా తీర్పుల్లో కూడా అనుసరిస్తాను. టెక్నిక్ అంటే 'నువ్వు ఎటువైపు చూస్తున్నావ్..? ప్రపంచాన్ని నువ్వు ఏ దృక్పథంతో పరిశీలిస్తున్నావ్? అన్నదే''

గోల్డ్‌మెడలిస్ట్...

"వందమందిలో కేవలం పదిమందే ఎం.ఎల్.లో పాసయ్యేవారు పాత రోజుల్లో 'లా' గోల్డ్‌మెడల్ వచ్చింది నాకు. ఆ తర్వాత మద్రాసు యూనివర్శిటీలో ఎల్.ఎల్.డి. (డాక్టర్ ఆఫ్ లాస్) చేశాను. ఆ కోర్సు చేసిన ఆఖరి వ్యక్తిని నేనే. ఎందుకంటే నాకు డాక్టరేట్ వచ్చాక ఆ కోర్సును ఎత్తివేశారు. చదువు గురించి చెబుతున్నాను కాబట్టి ఇక్కడో విషయం గుర్తుచేసుకోవాలి. నేను బీఏలో ఫిలాసఫీ తీసుకుంటుంటే ఒక అధ్యాపకుడు ఏమన్నాడంటే.. "ఏంటయ్యా, ఇది పనికొచ్చే కోర్సు కాదు. ఏదైనా ఉద్యోగం వచ్చే కోర్సులో జాయినవ్వు. టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటావ్..?'' అన్నారు కాస్త విసుగ్గా. "లేదు సార్, నా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఫిలాసఫీ చేశాక న్యాయశాస్త్రం చదువుతాను...'' అన్నాను. ఫిలాసఫీ అనేది ప్రశ్నల్ని లేవనెత్తే గొప్ప శాస్త్రం. ప్రశ్నలతోనే మనో వికాసం సాధ్యం. అలా ఇష్టంతో చదవడంతో 'బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్' అవార్డు దక్కింది నాకు. చదువు పూర్తయ్యాక న్యాయరంగంలోకి అడుగులు పడ్డాయి..''

ఒక్కో మెట్టు ఎక్కుతూ..

"నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 'ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా' నెలకొల్పారు. ఢిల్లీకి వెళ్లి అందులో 'రీసెర్చ్ ఆఫీసర్'గా జాయినవ్వడంతో నా కెరీర్ మొదలైంది. అదే సంస్థ నుంచి వచ్చే 'ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా' లో ఎడిటింగ్ వర్క్ కూడా చేసేవాణ్ణి. 1967లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 'లా ఆఫీసర్'గా పోస్టింగ్ రావడంతో జాయినయ్యాను. ఆ శాఖలో పలు పదవులు నిర్వర్తించాక.. కేంద్ర న్యాయ శాఖకు వెళ్లాను. అక్కడ డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి లా సెక్రటరీ వరకు పనిచేశాను. ఈ సమయంలో రాజీవ్‌గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, దేవెగౌడతో కలిపి ఆరుగురు ప్రధానుల దగ్గర పనిచేసే అరుదైన అవకాశం నాకే దక్కింది.

కొత్త చట్టాలు రూపొందించే సమయంలో ఎలాంటి న్యాయ సందేహాలు తలెత్తినా.. సలహాలు కావాలన్నా "మిస్టర్ రావును పిలవండి'' అనేవారు ప్రధానులంతా. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావులతో నాకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. పీవీగారు తను పదవిలో ఉన్నంత వరకు లా సెక్రటరీగా నన్నే ఉండమన్నారు. రాజ్యాంగంలోని ప్రొవిజన్స్‌ను చాలా సందర్భాల్లో రాజీవ్‌కు వివరించేవాణ్ణి. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ యాక్ట్‌లు తీసుకొచ్చేందుకు నా సలహాలు తీసుకుంది ప్రభుత్వం. విధుల్లో భాగంగా అన్ని దేశాలు తిరిగాను. అక్కడి న్యాయవ్యవస్థలను అర్థం చేసుకున్నాను. నేను అంతర్జాతీయ న్యాయరంగంలోకి వెళితే మన దేశం ప్రతిష్ట పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం... ఇంటర్నేషనల్ కోర్టుకు ప్రపోజ్ చేసింది..''

ఎల్లలు దాటి...

"అంతర్జాతీయ న్యాయవ్యవస్థ ఒకప్పుడు చాలా సంక్లిష్టంగా ఉండేది. ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి తగువులు వచ్చినా ఈ కోర్టే పరిష్కరించాలి. కేసులు పెరిగిపోయి తీర్పుల్లో జాప్యం జరుగుతుండటంతో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని విడదీశారు. అవే మూడు అంతర్జాతీయ ట్రిబ్యునల్ కోర్టులు అయ్యాయి. అందులో ఒకటి 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ'. ఈ కోర్టు జర్మనీలోని హ్యాంబర్గ్‌లో ఉంది. దేశాల మధ్య ఎలాంటి జల వివాదాలు వచ్చినా ఈ కోర్టే విచారిస్తుంది. ఇందులో పలు దేశాలకు చెందిన 21 మంది జడ్జిలు ఉంటారు. జడ్జిగా ఎంపికవ్వాలంటే అదో పెద్ద ప్రక్రియ.

ఆయా దేశాలలో లబ్దప్రతిష్టులైన ఒక న్యాయనిపుణున్ని స్వయంగా ప్రధానే సిఫారసు చేయాలి. ఆ వ్యక్తి వివరాలన్నీ ఆ దేశపు రాయబార కార్యాలయాలకు వెళతాయి. న్యూయార్క్‌లోని డిప్లమాటిక్ మిషన్స్ ప్రచారం చేస్తాయి. ఈ పని అన్ని దేశాలు చేస్తాయి. ఆఖర్న ఐక్యరాజ్యసమితిలో సెక్రటరీ జనరల్ సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికల్లో దేశాలు సిఫారసు చేసిన న్యాయ నిపుణులు జడ్జిలుగా పోటీ చేస్తున్న వారికి ఓటు వేస్తారు. అప్పుడు గెలిచిన వారే సంబంధిత కోర్టుకు జడ్జి అవుతారు. కనీసం 106 దేశాలు ఓటు వేస్తేకానీ జడ్జి కాలేరు. ఎన్నికైన జడ్జిలు తిరిగి చీఫ్ జస్టిస్‌ను ఎన్నుకుంటారు. ఇంత తతంగం ఉంటుంది అంతర్జాతీయ కోర్టులకు జడ్జి కావాలంటే. ఇప్పటి వరకు మన దేశం తరఫున కేవలం ముగ్గురు మాత్రమే జడ్జిలు (బి.ఎన్.రావు, నాగేంద్రసింగ్, ఆర్.ఎస్.పాథక్) అయ్యారు. నాలుగో వ్యక్తిని నేను. హైదరాబాద్‌లోనే ఇల్లు కట్టుకోవడంతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిపోతుంటాను.''

-మల్లెంపూటి ఆదినారాయణ ఫోటోలు : ఎం.గోపికృష్ణ

No comments: