Thursday, September 30, 2010

మృత్యువు వీళ్ల గులామ్! * డెత్ ఈజ్ బ్యూటిఫుల్

మరణం...
దేశభక్తికి ఇది అత్యున్నతమైన బహుమతి. దాన్ని సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా దేహాన్ని నాశనం చేయడం ద్వారా ఈ దేశంలో తాము సురక్షితంగా ఉండగలమని వారు అనుకుంటున్నారు. వాళ్లు నన్ను భౌతికంగా అంతమొందించవచ్చు, నా భావాలను అణచి వేయలేరు.

అలా మాట్లాడటం, మాట మీద నిలబడ్డట్టే ఉరికొయ్య ముందు ధిక్కారంగా నిలబడటం భగత్‌సింగుకే సొంతం. సాహసం అతడి స్వభావం. సంచలనం అతడి సిద్ధాంతం. చనిపోయిన తర్వాత కూడా జీవించడమే జీవితానికి అసలైన అర్థమైనప్పుడు, బతికినంతకాలం అందరి కన్నా విభిన్నంగా బతకాలనుకున్నాడు భగత్‌సింగ్.

అణువణువునా దేశభక్తిని నింపుకున్న భగత్, స్వాతంత్య్ర సమర యోధుడు లాలాలజపతిరాయ్ చావుకి కారణమయ్యాడన్న కోపంతో సాండర్స్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని కాల్చి చంపాడు. సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేసి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదించాడు. పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి ఇరవై మూడేళ్లకే ఉరికొయ్యపై విప్లవ గీతమై వేలాడాడు. స్వేచ్ఛా పోరాటాలకు వేగుచుక్కలా నిలిచాడు.
..............
ఒకడి జీవితాన్ని అతడి చావే నిర్ణయిస్తుంది. సిద్ధాంతం ఏదైనా కావచ్చు, ఆదర్శాలేమైనా అవ్వొచ్చు. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. అందుకే కొంతమంది చనిపోయిన తర్వాత జీవిస్తారు.

జీవితమంతా గెరిల్లాగా జీవించిన వీరుడు చేగువేరా. అతడు ప్రజా ఉద్యమాల్లోకి కాంతి వేగంతో విస్తరించాడు. అట్టడుగు జనంలోకి సూర్య కిరణంలా చొచ్చుకుపోయాడు. శత్రువు గుండెల్లోకి బుల్లెట్‌లా దూసుకుపోయాడు. అందుకే ‘లీడర్’ కాగలిగాడు. నరాల్లో అణువణువునా నెత్తురు బదులు లావా ప్రవహిస్తున్నట్టుగా, మాటల తూటాలు పేల్చేస్తున్నట్టుగా, డైనమైట్‌కు ప్యాంట్ చొక్కా తొడిగినట్టుగా ఉంటాడు. ఎక్కడో అర్జెంటీ నాలో పుట్టి, క్యూబాలో పోరాడి, బొలీవియా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సాహసి అతడు. ముప్ఫై తొమ్మిదేళ్ల అతడి దేహం మట్టిలో కలిసిపోయినా, ‘చే’ లైఫ్ కోట్లాది హృద యాల్లో లైఫ్‌సైజ్ పోస్టర్‌లా నిలిచిపోయింది.
..............
మార్షల్ ఆర్ట్స్‌కు మీనింగ్ బ్రూస్లీ. చైనీస్ యుద్ధ కళలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన యోధుడు బ్రూస్లీ. తన స్టైల్ ఆఫ్ ఫైట్స్‌తో కొన్ని జనరేషన్స్‌ను ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. హాంకాంగ్‌లో ఓ చిన్న కుటుంబంలో పుట్టిన బ్రూస్లీకి పరిస్థితులు పోరాటం నేర్పాయి. వీధి పోరాటాల్లో ఆరితేరిన బ్రూస్లీ, హాలీవుడ్ స్క్రీన్‌పై పిడుగులా విరుచుకు పడ్డాడు. నాలుగే నాలుగు సినిమాలు. బ్రూస్లీ స్టార్ అయిపోయాడు. స్క్రీన్ మీద ఒక్కడే వందమందిని మట్టి కరిపించడం చూసి అతన్ని ‘ఐరన్ మ్యాన్’ అని ఆరాధించారు. 1972 జూలైలో ఓ సాయంత్రం పూట బ్రూస్లీ మరణించాడన్న వార్త తెలిసి, ప్రపంచం నివ్వెరపోయింది. 33 ఏళ్ల బ్రూస్లీ ఊపిరి ఆగిందని తెలిసి మరణమే చిన్నబోయింది.
..............
మనుషుల మధ్య దేవత మార్లిన్ మన్రో. ఆమె ఈ భూమ్మీద బతికింది ముప్ఫై ఆరేళ్లు. బతికినంత కాలం తన అందంతో ప్రపంచాన్ని వేడెక్కించింది. ఈ వెండితెర వెన్నెల, తన గ్లామర్‌తో పట్టపగలే చుక్కలు చూపించింది. కష్టాల్ని పలకరిస్తూ, కన్నీళ్లను బుజ్జగిస్తూ, ప్రపంచపు వాకిటిలో గులాబీ పూవై విరిసింది. చాలా చిన్న వయసులో సెలబ్రిటీ స్టేటస్‌ను అందుకుంది. ఆమె కన్ను మూయడంతో, 1962 ఆగస్టు 5 ఉదయం కళ్లు తెరిచింది. అందుకోవడానికి ఇక ఏమీ లేనప్పుడు, మనసు అర్థం చేసుకోవడానికి ఎవరూ రానప్పుడు మార్లిన్ మృత్యువు ఒడిలో సేద తీరింది. మూవీస్‌కే కాదు, మృత్యువుకూ ఆమె గ్లామర్ తెచ్చింది.
..............
మానవసేవయే మాధవసేవ అన్నది స్వామి వివేకానంద ఉనికి. ఆయన హిందూ మతధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన సిద్ధాంతి. భారతీయ ఆధ్యాత్మికత అన్ని అంచులూ చూసిన వేదాంతి. వెస్ట్రన్ లాజిక్, ఫిలాసఫీ, యూరప్ దేశాల చరిత్ర అధ్యయనం వివేకానందుని ఆలోచనా పరిధిని విస్తృతం చేశాయి. నరేంద్రనాథ్ దత్తా వివేకానందుడిగా ఎదిగిన క్రమంలోని ప్రతి మలుపూ ఆయన్ని గాడ్స్‌మన్‌గా మార్చింది. చికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన ప్రతి మాట, భారతీయ సంస్కృతి విలువల్ని విశ్వవ్యాప్తం చేసింది. ముప్ఫై తొమ్మిదేళ్ల వయసులో ఈ ప్రపంచాన్ని వీడినా, ఆయన తరతరాల భారత చరిత్రపై చెరగని ముద్ర వేశారు.
..............
బ్యూటీకి సినానిమ్, గ్లామర్‌కి న్యూ డెఫినిషన్ మధుబాల. తన అందంతో లక్షలాది అభిమానులను సంపాదించుకున్న అద్భుత సౌందర్యరాశి. తన నవ్వుల్తో కోట్లాది మంది అభిమానుల్ని మత్తులో ముంచెత్తిన మెస్మరైజింగ్ స్టార్. ప్యార్ కియాతో డర్‌నా క్యా... అంటూ ప్రేమను ప్రేమించి, ప్రశ్నించి నిజమైన ప్రేమ కోసం ఆరాటపడి, అలిసిపోయి, ముప్ఫై ఆరేళ్లకే జీవితాన్ని ముగించింది. గాయాల్ని తన వెంట తీసుకెళ్లి, అందమైన జాపకాల్ని మిగిల్చి వెళ్లింది.
..............
ప్రతి కళాకారుడికీ ఎంతో కొంత వెర్రి ఉండాలి. విన్సెంట్ వ్యాంగోకు పెయింటింగ్ అంటే పిచ్చి. అతడు మొదటినుంచీ చాలా ఎమోషనల్. ఏ ఉద్యోగంలోనూ ఇమడలేక పోయాడు. చివరికి తన భావాలను ఎక్స్‌ప్రెస్ చేయడానికి, పెయింటింగ్ పర్‌ఫెక్ట్ ఆర్ట్ అని నమ్మాడు. మనిషినీ ప్రకృతినీ తన ఎక్స్‌ప్రెషనిస్ట్ స్టైల్‌లోకి చాలా అందంగా మోసుకొచ్చాడు. తన చివరి మూడేళ్లలో అత్యుత్తమమైన కళాఖండాల్ని సృజించాడు. ఈ ప్రపంచంతో పొత్తు కుదరక, ముప్ఫై ఏడేళ్లకు ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానంతరం ఆయన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దొరికింది.
..............
ఈ ప్రపంచపు రహస్య దుఃఖం గురుదత్ సినిమాలు. సినీ మాయాప్రపంచంలో తిరుగుతూ, నిజమైన ప్రేమకోసం పరితపించిన సున్నిత హృదయుడు ఆయన. ప్రపంచ బాధ తన బాధగా ఫీలైన సెన్సిబుల్ ఫిలిం మేకర్. ప్యాసా, కాగజ్ కే పూల్, మిస్టర్ అండ్ మిసెస్ ఫిఫ్టీ ఫైవ్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా గురుదత్ పాపులర్ ఫిలిం మేకర్ అయ్యాడు. తన ముప్ఫై తొమ్మిదో యేట ఆత్మహత్య చేసుకున్నాడు.
..............
మరణమంటే చనిపోయిన తర్వాత నరాల్లో నెత్తురు కదలకపోవడం కాదు, బతికి ఉన్నప్పుడు అణు మాత్రం స్పందించక పోవడం. అందుకే అతడు ఒక ప్రవాహంలా కదిలాడు. అక్షర ప్రభంజనమై విరుచుకు పడ్డాడు.

కీట్స్ అంటే కవిత్వానికి కేరాఫ్ అడ్రస్ అని పేరు మోశాడు. సెకెండ్ జనరేషన్ రొమాంటిక్ మూమెంట్‌లో లార్డ్ బైరన్, పి.బి.షెల్లీలతో సమానంగా గుర్తింపు పొందాడు. చనిపోయేముందు నాలుగేళ్లలో ప్రచురితమైన కవిత్వం కీట్స్‌కు అపరి మితమైన పేరు తీసుకొచ్చింది. అందమే సత్యం, సత్యమే అందం అన్నది కీట్స్ అభిప్రాయం. అతడిని ‘ఎ న్యూ స్కూల్ ఆఫ్ పొయెట్రీ’ అని విమర్శకులు ప్రశంసించారు. 25 ఏళ్ల వయసులో క్షయ వ్యాధి అతన్ని మింగేసింది.
..............
మృత్యువు జీవితమంత సహజమైంది. కొన్ని మరణాలు పిల్లగాలిలా తేలిపోతుంటాయి. మరికొన్ని పెనుగాలిలా మనల్ని పట్టి కుదిపేస్తుంటాయి. అలాంటి వాళ్లే చనిపోయిన తర్వాత కూడా జీవిస్తారు.
ఇంగ్లండ్-ఫ్రాన్స్‌కు మధ్య జరిగిన వందేళ్ల యుద్ధంలో ఫ్రెంచి దేశపు సైన్యానికి నాయకత్వం వహించి, బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టిన ధీర వనిత జోన్ ఆఫ్ ఆర్క్. దేవుడి ఆజ్ఞగా భావించి, ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా యుద్ధ రంగంలోకి దూకింది. శత్రువులు చుట్టుముట్టినప్పుడు లొంగి పోకుండా, చివరిదాకా పోరాడింది. సైన్యం ఆమెను బంధించి, విచారణ జరిపి మంటల్లో తగులబెట్టింది. పందొమ్మిదేళ్లకే మృత్యువు అంచులకు వెళ్లిన జోన్ ఆఫ్ ఆర్క్‌ను తర్వాత దేవదూతగా కీర్తించారు.
..............
చారిత్రక అవసరంలోంచి పుట్టుకొచ్చిన అగ్నికణం అల్లూరి. అతడు కాలం మలిచిన విప్లవకారుడు, అణచివేతల నుంచి ఉద్భవించిన ఉద్యమకారుడు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం విశాఖ కొండల్లో అడుగుపెట్టిన అల్లూరి, అనివార్యంగా ఆయుధం పట్టాల్సి వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులను నిలువు దోపిడీకి గురిచేస్తున్న ఆంగ్లేయుల దుర్మార్గాన్ని స్వయంగా చూసిన ఆయన, ఏజెన్సీ విముక్తికి పోరాట మార్గాన్ని ఎంచుకున్నాడు. విప్లవానికి వ్యూహం అవసరం, పోరాటానికి ఆయుధాలు అవసరం, నాయకుడికి సాహసం అవసరం.

అందుకే రామరాజు ఆయుధాల కోసం పోలీస్‌స్టేషన్‌లపై దాడి చేశాడు. అతని సాహసం ముందు బ్రిటిష్ సైన్యం నిలువెల్లా వణికిపోయింది. తన పోరాటంలో అమాయకులను బలిచేయవద్దని భావించిన రామరాజు పోలీసులకు లొంగిపోయాడు. లక్ష్యం కోసం 27 ఏళ్లకు సీతారామరాజు తన జీవితాన్ని ముగించాడు. ప్రజల కోసం ప్రాణాలిచ్చిన ఆ వీరుడి త్యాగం వృథాకాలేదు. ఆ విప్లవ వీరుడి స్ఫూర్తి లక్షలాది భారతీయుల్లో స్వేచ్ఛాకాంక్షను రగిల్చింది.

.................
వీళ్లకు మరణం కామా మాత్రమే, ఫుల్‌స్టాప్ కాదు.
శత్రువుకు చిక్కకుండా తుపాకీతో కాల్చుకుని చావును వెక్కిరించిన చంద్రశేఖర్ ఆజాద్, స్పానిష్ యుద్ధంలో నేలకొరిగిన అక్షరయోధుడు క్రిస్టఫర్ కాడ్వెల్, పేదల కోసం పోరాట బాట పట్టి పందొమ్మిదేళ్లకే హత్యకు గురైన పెరూ కమ్యూనిస్ట్ నాయకురాలు ఎడిత్ లాగోస్, రాక్ మ్యూజిక్ స్టార్ జిమ్‌మారిసన్, జర్మన్ అస్తిత్వవాద రచయిత ఫ్రాంజ్ కాఫ్కా, బ్రిటిష్ రచయిత్రి అన్నే బ్రాంటే...

ఎవరైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు.. ఒక సంకల్పంతో, స్పిరిట్‌తో కొత్త జీవితాన్ని కలగంటున్నప్పుడు స్ట్రగుల్స్ ఎదురవు తుంటాయి. పెయిన్స్ పలకరిస్తుంటాయి. అప్పుడప్పుడు జీవితం కందిపోయేంత గట్టిగా మృత్యువు కౌగిలించు కుంటుంది. స్ట్రగుల్స్‌ను ఫేస్ చేయగలిగిన వాళ్లకు మాత్రమే మృత్యువు సలామ్ చేసి, గులామ్ అవుతుంది.
భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ మరణించినప్పుడు ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ స్పందిస్తూ,

జిస్ తేజ్ సే కోయి ముక్తాల్ మే గయా వో షాన్ సలామత్ రహతీ హై
యే జాన్ తో అన్ జానీ హై ఇస్ జాన్ కీ కోయి బాత్ నహీ
(మృత్యువు ఎదురొచ్చినప్పుడు ఎంత హుందాగా వ్యవహరించారన్నదే ఎవరైనా గుర్తుంచుకుంటారు. ప్రాణానిదేముంది వస్తుంది, పోతుంది.)
(సెప్టెంబర్ 27 భగత్‌సింగ్ జయంతి సందర్భంగా)
- కె.క్రాంతికుమార్ రెడ్డి

Thursday, September 23, 2010

ప్రతి విషయంలో మహిళల స్వేచ్ఛకు అడ్డుతగలడం సరికాదు.

ఆత్మవిశ్వా సానికి అడ్డుగా అహం
మారుతున్న సమాజంతోపాటు మహిళలు మారిపోతున్నారు.. పురాతన సంప్రదాయాల నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. వంట ఇంటికే పరిమితమైన స్థాయి నుంచి కుటుంబానికి పెద్దగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఇందుకు తల్లిదండ్రుల దృక్పథంలో వచ్చిన మార్పు ముఖ్య కారణం. కూతురైనా కొడుకైనా సొంతంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని వారు ఆశిస్తున్నారు. కానీ అమ్మాయి ఎంతగా ఎదిగినా సరే... ఉద్యోగాలు చేసినా ఊళ్ళు ఏలినా ఇంటి పని, వంట పని, కుటుంబాన్ని చూసుకునే పని మాత్రం తప్పక నేర్చుకోవాలి. అబ్బాయిలు మాత్రం ఎన్ని మార్పులు వచ్చినా అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నారు. డబ్బు సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం ఇవి మాత్రమే వారి బాధ్యతలుగా వస్తున్నాయి. మహిళ ఎప్పటికీ తమ కంటే తక్కువ అనే వారి దృక్పథంలో మాత్రం మార్పు రావడం లేదు. దీనికి మానసిక నిపుణులు అంజలి చాబ్రియా, క్రిసన్‌ ఏం చెబుతున్నారంటే..

ఎంత సంపాదించినా...
woman-workingటీవీ నడక, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబాన్ని పోషించడం, అన్నిటిలోనూ మగవారే ముందుండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే భర్తలకన్నా ఎక్కువ సంపాదించే భార్యలున్నారు. ‘నా భర్త కన్నా నా జీతం ఎక్కువ. మొదట్లో ఇది నా భర్తకు నచ్చేది కాదు. కానీ ఆ డబ్బును ఇద్దరం సమానంగా ఖర్చుపెట్టుకుంటాం. ఇంటి అవసరాలకు నేను సంపాదించడం కూడా ముఖ్యం.. కానీ ఎంతో ఆత్మన్యూనతకు గురి అవుతారు’ అని తన భర్తను ఉద్దేశించి చెబుతోంది రాధిక.

మానసిక నిపుణులు మాట...
చాలా మంది మగవారు తమ ఉద్యోగాన్ని, బ్యాంకు బ్యాలెన్సునే విజయంగా భావిస్తారు. తమ భాగస్వామి వియాన్ని వారు లెక్కలోకి తీసుకోరు. అది తరతరాలుగా వారిలో వున్న భావన. అందుకే మహిళలు ఎంత ఉద్యోగాలు చేసినా, ఎన్ని విజయాలు సాధించినా తమ భర్తలకు ఆత్మన్యూనతా భావం కలగకుండా జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంటుంది. ఇలా కాకుండా సంబంధాలు ఆరోగ్యవంతంగా వుండాలంటే భార్యా భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎవరు ఎక్కువ సంపాదిస్తారు, తక్కువ సంపాదిస్తారు అని కాక వారి విజయాలకు ఆనందించాలి. తోడుగా వుండాలి. కుటుంబంలో అందరూ ఒక టీమ్‌లా వుండాలి. ఒకరికి ఒకరు గౌరవం ఇవ్వాలి.

తరతరాలుగా వస్తున్న భావాలు...
man_enoughమగవారి భావనలో భర్త అనేవారు సంపాదించి కుటుంబాన్ని కాపాడుకోవాలి. భార్య కుటుంబానికి కావలసిన పనులు చేయాలి. వారు సంపాదించకూడదు. ఒకవేళ సంపాదించినా సరే అది గొప్పగా చెప్పకూడదు. ‘ఈ రోజుల్లో భర్తలు తోడుగా లేని మహిళలు కూడా ఎంతో గొప్పగా బతుకుతున్నారు. తమ పిల్లలను చదివించుకుంటున్నారు. చాలా వరకు మంచి జీవితాలను ఇవ్వగలుగుతున్నారు. వారి కాళ్ళమీద వాళ్లు నిలబడగలరు. దీన్ని మగవారు ఒప్పుకోకపోవడం సిగ్గుచేటు..’ అని 39 ఏళ్ళ గీతాశంకర్‌ అంటున్నారు.

నిపుణుల మాట...

తరతరాలుగా సమాజంలో మగవారినే కుటుంబానికి పెద్దగా భావిస్తూ వస్తున్నారు. ఆడవారిని కుటుంబానికి మూలంగా తీసుకునే సంప్రదాయం ఇక్కడ లేదు. కానీ ఏది ఏమైనా ఈ భావనలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కలిసి కట్టుగా కుటుంబాన్ని నిర్మించుకోవడం, ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది మగవారు కూడా ఇప్పుడు దీన్ని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవాలి కూడా.

పేరు.. ప్రఖ్యాతులు సాధించినా...
MULTI_TALENTEDమహిళలు కూడా అన్ని రకాల పనులను సమర్థవంతం గా నిర్వహించగలరని నిరూపించుకుంటున్నారు.భార్యగా తల్లిగా, కూతురిగా వారు వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.పేరు..ప్రఖ్యాతులు సాధించుకుం టున్నారు. ఎంతమంది వారిని మెచ్చుకున్నా కుటుంబం ఇచ్చే ప్రశంసలనే వారు ఎక్కువగా భావిస్తారు.కానీ ఇంటిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా వుంటాయి.‘నా భర్త నా స్నేహితులను కలిసినప్పుడు అంతగా సరదాగా వుండరు. కాని నేను అలా వుండను. ఎవరి స్నేహితులైనా అందరితోనూ కలిసిపోయేందుకు ప్రయత్నిస్తాను. మంచి విషయాలను షేర్‌ చేసుకుంటాను.చాలా మంది నా స్వభావాన్ని మెచ్చుకుంటారు కూడా.. ఇది మా వారికి నచ్చదు.గతంలో విధంగా కాకుండా ఏ పార్టీలకైనా.. ఒక్కరే వెళ్తున్నారు. దీని కి సమాధానం వుండదు. ఇది నాకు ప్రశ్నగా మారి పోయింది’ అని గీత అంటోంది.

నిపుణులు ఎమంటున్నారంటే...
మగవారు తమ ఫ్యామిలీని, భార్యను స్నేహితులు మెచ్చుకుం టే చాలా గర్వంగా భావిస్తారు. కాని కొన్ని సార్లు తన కన్నా తన భార్య ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవడాన్ని భరించ లేరు. ఇది వారి ఇగోకు అడ్డుగా మారుతుంది. ఇది ఎక్కు వ అయితే భార్యను ఇబ్బందులకు గురి చేస్తారు. కాని భర్తలు ముందుగా భార్యలను నమ్మగలగాలి. వారి పేరు పట్ల సంతోషంగా వుండగలిగే వాతావరణం రావాలి.

అహంకారమే అడ్డు...
ఎన్నో కార్పొరేట్‌ సంస్థలకు నేడు మహిళ లు సిఇఓలుగా వున్నారు. వారి శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు. వారి సొంతంగా వారు పోరాడటం నేర్చుకున్నారు. కానీ మగవారికి మాత్రం మహిళలు ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం కాస్త కష్టంగానే భావిస్తున్నారు. ‘నేను ఒంటరిగా ప్రయాణాలు చేయడం ఇష్టపడతాను. కానీ నా బాయ్‌ఫ్రెండ్‌ దీన్ని ఇష్టపడరు. ఒంటరిగా వెళ్ళడం, బిజినెస్‌ డీల్స్‌కు వెళ్ళడం ఒప్పుకోలేరు.ఈ విషయంలో ఎప్పుడూ వాదిస్తాడు’ అని ఓ ప్రముఖ కంపెనీకి హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న సునీత అంటున్నారు.

నిపుణుల మాట...
మగవారు తమ వారిని కాపాడుకోవడం ఒక బాధ్యతగా భావిస్తారు. వారిని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు. అది ఒక్కోసారి ఎక్కువ అవుతుంది. దీని వల్లనే మహిళ స్వతంత్రాన్ని వారు ఒప్పుకోరు.ప్రతి వి షయంలో వారు స్వతంత్రంగా వ్యవహరించడాన్ని అడ్డుకుంటారు. తమ అధికారిన్ని కాపాడుకోవాలని చూస్తారు. కాని దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. తమ జీవితభాగస్వామి శక్తి సామర్థ్యాలను నమ్మగలగాలి. అవసరమైనప్పుడు తోడుగా వుండటం తప్పుకాదు కానీ.. ప్రతి విషయంలో మహిళల స్వేచ్ఛకు అడ్డుతగలడం సరికాదు.

‘మన సుఖాలు, మన దుఃఖాలు, మన కష్టాలు, మన పోరాటాలు వీటి అన్నిటి నడుమ మనం మోక్ష మార్గాన్నే పయనిస్తూన్నామనటం ఒక వింత విషయం.

సాఫల్యసిద్ధికై కృషి
Hinduజీవ క్రమపరిణామంలో ప్రస్తుతం మానవుడికి గల ఆధిపత్యం, అతడు పొందిన ప్రగతికి కారణం, అతడి మనస్సే అయినా, దానిని గురించి అతడికి అజ్ఞానం, నిర్హేతుకత భీతి ఉన్నవిః ఇది విడ్డూరమే,మనస్సును గవేషించటం ఇప్పుడిప్పుడే మొదలైంది. గత శతాబ్దాల్లో భూమి ఉపరితల గవేష ణం మన ముఖ్యక్యాక్రమం కాగా,రాబోయే శకంలో మనోగవేషణ ముఖ్య కార్య క్రమం కావాలి. భౌగోళిక గవేషణంలో అద్భుతాలు కనబడుతవి. మన వారసులకు పూర్ణమూ,సమృద్ధిమంతమూ ఐనా కొంగ్రొత్త అవకాశాలు దొరుకుతవి.’’ సహస్రాబ్దాలుగా అంతరంగంయొక్క వైజ్ఞానిక గవేషణమే భారతీయుల ముఖ్యకార్యకలాపాలై ఉండింది. గతంలో ఎందరో మహ ర్షులు,కృష్ణుడు,బుద్ధుడు,ఆదిశంకరుడు,ఇంకా ఆధ్యాత్మికం గగనంలో తారలవలె వెలిగిన అనేకానేకులు,నేటికాలంలో రామకృష్ణ వివేకానందులు, ఈ క్షేత్రంలో గవేషకులు, పరిశోధకులు,మానవజాతినఇనుగ్రహించిన జగద్గురువులు వీరు.

వీరు ముక్తిని బాహ్యాం తరంగ ప్రకృతుల బంధాలనుండి విమోచనం-బోధించారు. ఆధ్యాత్మిక సాక్షాత్కారం ద్వారా సార్థకత పొందటం నేర్పారు. విశ్వవికాసంలలోను జీవక్రమపరిణామంలోను వీరికి మోక్షమే సూత్రవాక్యం అని తోచింది. అచిత్తును పరివర్తనం చేసి దానిని దాటి పోవడానికి, దాని కబంధ హస్తాల నుండి విడుదల పొందటానికి ఆత్మ జరిపే నిరంతర యత్నమిది. ఈ విషయమై స్వామి వివేకానంద నుడివిన పలుకులు ఇప్పటికీ చెవులలో గింగిరుమంటున్నాయి.

‘మన సుఖాలు, మన దుఃఖాలు, మన కష్టాలు, మన పోరాటాలు వీటి అన్నిటి నడుమ మనం మోక్ష మార్గాన్నే పయనిస్తూన్నామనటం ఒక వింత విషయం. ఈ ప్రపంచమెట్టిది ఇది దేనిలోనుండి ఉప్పతిల్లింది? దేనిలోకి పోతున్నది అనే సమస్య పుట్టింది. దానికి దొరికిన సమాధానం, ‘ముక్తిలో ఉప్పతిల్లింది, ముక్తిలో విశ్రమిస్తుంది, ముక్తిలో లయిస్తుంది.’ తనను గురించి, తనలో దాగి ఉన్న అపారశక్తుల గురించి ఎరుకగల ఏకైక జీవి మానవుడు మాత్రమే. అయితే తనకున్న హద్దులు కూడా వానికి ఎరుకే.

ఈ అవధులు దాటే పోరాటంలో, తన అంతరంగాన్నే ఒక రణరంగంగా, నిజమైన కురుక్షేత్రంగా మార్చుతాడు. స్వేచ్ఛాబంధనాల నడుమ జరిగే ఈ పోరాటమే, జీవితంలోని అన్ని ఉల్లాసాలను , రమణీయతను సుఖదుఃఖాలను, కలలను, కల్పనలను అందిస్తుంది. మానవ జీవితానికి నిజమైన అర్థమిదే, కాని ఈ పోరాటం నిరంతరం ఉండదు. మానవుడు ఈ రొంపిలో ఎప్పటికీ దిగబడిపోయి ఉండవలసిన అగత్యం లేదు. ఆధ్యాత్మిక మార్గదర్శక కాంతిలో ఈ ఘర్షణే మానవుణ్ణి నైతిక ఆధ్యాత్మిక శిక్షణాకేంద్రంగా మారుస్తుంది. తద్వారా మానవుడు ఆధ్యాత్మిక బలం, సంకల్పబలం, విశదమైన దృష్టి ధ్యేయాను బడిసి, ఆత్మసాక్షాత్కారం ద్వారా తుట్టతుదకు స్వేచ్ఛ ఆనందాలను పొందుతాడు. స్వేచ్ఛే అతడి జన్మహక్కు. జీవన పరిణామంలో సుదీర్ఘ వేదనా మార్గాల వెంబడి నడిచి చివరకు దానిని తిరిగి పొందుతాడు.

గురువు అనే పదప్రయోగం లేకుండా తన ఆధ్యాత్మిక బోధలను సాగించిన మహావ్యక్తి జిడ్డు కృష్ణమూర్తి.

గురు భావాన్ని తిరస్కరించిన జిడ్డు కృష్ణమూర్తి
JidduKrishnamurtiఆధునిక కాలంలో అనేకమంది ఆధ్యాత్మిక గురువులు మనకు కనుపిస్తారు. అయితే గురువు అనే పదప్రయోగం లేకుండా తన ఆధ్యాత్మిక బోధలను సాగించిన మహావ్యక్తి జిడ్డు కృష్ణమూర్తి. ఆయన సమకాలీకులైన గురువులు ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలను స్థాపించడానికి పోటీలు పడుతుండగా జిడ్డు కృష్ణమూర్తి మాత్రం తన బోధల పట్ల ఆసక్తులైన వారికి మార్గదర్శనం చేస్తూ గురువు అనే పదాన్ని కూడా తన దాపులలోకి రానివ్వలేదు. తన స్వానుభవం నుంచి తెలుసుకున్న విషయాన్నే ఆయన బోధిం చారు. ఏదో ఒక మతం, మార్గం లేదా ఒక పంధాను అనుసరించడం ద్వారా సత్యాన్ని చేరుకోలేమని, సాధకుడు తన ఆవిష్కారాల ద్వారా మాత్రమే దానిని కనుగొనగలుగుతాడని ఆయన అంటారు. సాధకుడు తన అనుభవాల చట్రం నుంచి బయటపడి, సత్యమైనదానిని గుర్తించే చైతన్యాన్ని అవరోధపరిచే ఆలోచనా స్రవంతిని నెమ్మదింప చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన అంటారు.

జిడ్డు కృష్ణమూర్తి జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు 1895, మే 12వ తేదీన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి నాటి బ్రిటిష్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఎనిమిదవ బిడ్డగా జన్మించిన అతడికి వారు కృష్ణుడి పేరు పెట్టుకున్నారు. తల్లి సంజీవమ్మ ఆయనకు పదేళ్ళ వయస్సులోనే మరణించింది. ఆయన కుటుంబం 1903లో కడపలో స్థిరపడింది. అక్కడే ఆయనకు మలేరియా వ్యాధి సంక్రమించి అనేక సంవత్సరాలు వెంటాడింది. చిన్నతనం నుంచి ఆయన స్తబ్దుగా, రోగగ్రస్తు డై ఉండడంతో అతడిని మానసిక వికలాంగుడని భావించేవారు. అతడి స్తబ్దత కారణంగా అటు పాఠశాలలో ఉపాధ్యాయుల చేతిలోను, ఇంట్లో తండ్రి చేతిలోనూ దెబ్బలు తినవలసి వచ్చింది. 1907లో పదవీ విరమణ చేసిన నారాయణయ్య పెద్దగా సంపాదించకపోవడంతో జీవనం కోసం తనకు దివ్యజ్ఞాన సమాజంలో ఉద్యగం ఇవ్వవలసిందిగా దాని అధ్యక్షురాలు అనిబిసెంట్‌కు లేఖ రాశారు. స్వతహాగా సంప్రదాయ బ్రాహ్మణుడు అయినప్పటికీ నారాయణయ్య 1882 నుంచీ దివ్యజ్ఞాన సమాజం సభ్యునిగా కొనసాగారు. ఆయన అభ్యర్ధనను మన్నించి ఆనిబిసెంట్‌ ఉద్యోగం ఇవ్వడంతో 1909 జనవరిలో తన కుటుంబాన్ని ఆడయార్‌కు మార్చారు. మొదట్లో నారాయణయ్యకు దివ్యజ్ఞాన సమాజం ఆవరణ బయట చిన్న ఇంటిని ఇచ్చారు. సరైన పారిశుద్ధ్యం లేని ఆ ఇంట్లో ఉండడం వల్ల కృష్ణమూర్తి, ఆయన సోదరులు రోగగ్రస్థులయ్యారు. అడయార్‌కు వచ్చిన కొద్ది నెలల తర్వాత కృష్ణమూర్తి తొలిసారి చార్లెస్‌ వెబ్‌స్టర్‌ లెడ్‌బీటర్‌ను కలిసారు. తొలిసారి కృష్ణమూర్తిని చూసిన లెడ్‌బీటర్‌ కృష్ణమూర్తిలో నిస్వార్ధ కాంతిమండలం(ఆరా)ను చూశారట. బాహ్యంగా అత్యంత నిస్తేజంగా కనిపించే అతడు గొప్ప ఆధ్యాత్మిక గురువు, వక్త కాగలడని లెడ్‌బీటర్‌ స్థిరంగా నమ్మాడు. ఈ నమ్మకంతోనే కృష్ణమూర్తిని అడయార్‌లోని థియొసాఫికల్‌ సొసైటీ పెద్దలు తమ పెంపకంలో తీసుకున్నారు.

jiddu కృష్ణమూర్తిని జాగ్రత్తగా చూసుకుంటూ, అతడికి విద్యా బోధన చేస్తూ ప్రపంచ గురువుగా తయారు చేయాలని లెడ్‌బీటర్‌ తన సహచరులను ఆదేశించారు. తన భౌతిక స్థితి అస్థిరంగా ఉన్నప్పటికీ పద్నాలుగేళ్ళ కృష్ణమూర్తి ఆరు నెలలోనే ఇంగ్లీషు లో రాయడం, చదవడం నేర్చుకున్నారు. ఈ సమయంలోనే కృష్ణమూర్తికి ఆనిబిసెంట్‌తో గాఢమైన సంబంధం ఏర్పడింది. ఆమె ఆయనకు మారు తల్లి అయింది. 1911లో దివ్యజ్ఞాన సమాజం ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ సంస్థను ఏర్పాటు చేసింది. దానికి కృష్ణమూర్తిని అధిపతిగా చేశారు. ప్రపంచ గురువు రాకను ఆమోదించిన వారందరికీ అందులో సభ్యత్వం ఇచ్చారు. అయితే ఆనతికాలంలోనే అది సొసైటీలోనూ, బయట కూడా వివాదమైంది. అయినప్పటికీ కృష్ణమూర్తిని ఆయన సోదరుడు నిత్యను 1911 ఏప్రిల్‌ నెలలో ఇంగ్లాండ్‌ తీసుకొని వెళ్ళారు. ఈ పర్యటనలో భాగంగానే ఆయన తన తొలి ఉపన్యాసాన్ని ఇచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేలోగా ఆయన అనేక ఇతర ఐరోపా దేశాలలో పర్యటించారు. యుద్ధం తర్వాత కూడా కృష్ణమూరర్తి అనేక ఉపన్యాసాలు, సమావేశాలు, చర్చలలో పాల్గొన్నారు. అయితే అప్పట్లో ప్రధానంగా అవన్నీ ఆర్డర్‌ సంస్థ చుట్టూ తిరిగేవి.

దాదాపు పదకొండేళ్ళ అనంతరం అంటే 1922లో ఆయన కాలిఫోర్నియాలోని ఒజాయ్‌లో ఉన్నప్పుడు జీవితాన్ని మార్చివేసే ఆధ్యాత్మిక అనుభవాన్ని చవిచూశారు. ఈ అనుభవం ఆయనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానసిక పరివర్తనను కలిగించింది. అయితే సొసైటీలో పెద్దలు ఆయనకు ఇతర శక్తులు వస్తాయని ఆశించి నిరాశపడ్డారు. మొత్తం మీద 1925లో ఆయనకు దివ్యజ్ఞాన సమాజం పట్ల దాని నాయకుల పట్ల విశ్వాసం పోయింది. సోదరుడి మరణం, అంతర్గతంగా చోటు చేసుకున్న విప్లవం ఆయనను పూర్తిగా మార్చివేశాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణమూర్తి వ్యవస్థాగత విశ్వాసాలను, గురు పరంపర, గురు శిష్య సంబంధాలను తిరస్కరించారు. 1930లో ఆయన ఆర్డర్‌ నుంచి దివ్యజ్ఞాన సమాజం నుంచి విడివడ్డారు.

ఆలోచనలు నూతన అంశాలను కనుగొనలేవు. కానీ ఆలోచనలు ఆగిపోయినప్పుడు కొత్త ఆవిష్కరణ జరిగే అవకాశముంది. అయితే దీనిని కూడా ఆలోచన అనుభవంగా, పాతదానిగా మార్చివేస్తుంది అంటారు కృష్ణమూర్తి. అనుభవానికి అనుగుణంగా ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ, ఆపాదనలు చేస్తూ ఉంటాయి. ఆలోచన విధి దానిని తెలియచేయడమే కానీ ఒక అంశాన్ని అనుభవిస్తూ ఉండడం కాదు. మనం ఒక అనుభవాన్ని ఆస్వాదించడం ఆగిపోయినప్పుడు ఆలోచన ప్రవేశించి దానిని మనకు తెలిసిన విషయాల కేటగిరీలో చేరుస్తుంది. ఆలోచన తెలియదానిలోకి ప్రవేశించలేదు. అందుకే దానికి వాస్తవమైనది అనుభవంలోకి రాదు అంటారు ఆయన.

త్యజించడాలు, నిర్లిప్తత, మత కర్మకాండలు, ధర్మాన్ని పాటించడం అనేవి ఎంత గొప్పవైనప్పటికీ అవన్నీ కూడా ఆలోచనా ప్రక్రియలే. అయితే ఆలోచన అనేది మనకు తెలిసిన దానిని సాధించడానికి ఒక వాహికగా మాత్రమే ఉండగలదు. విజయం లేదా సాధించడమనేది తెలిసిన దానిలో రక్షణ పొందడమే. తెలియని దానిలో రక్షణ పొందాలనుకోవడమంటే దానిని తిరస్కరించడమే. మనకు లభించే రక్షణ మనకు తెలిసిన, గతకాలపు అనుభవానికి పొడిగింపుగానే ఉంటుంది అని కృష్ణమూర్తి చెప్తారు. ఈ కారణంగానే మనస్సు అనేది లోతైన నిశ్శబ్దంలో ఉండాలి. అయితే ఈ నిశ్శబ్దాన్ని త్యాగం ద్వారానో, శరణాగతి ద్వారానో, అణచివేయడం ద్వారానో కొనుగోలు చేయలేవని హెచ్చరిస్తారు.

ఆ నిశబ్దమనేది నువ్వు ఏదీ కోరుకోనప్పుడు, ఏదో కావాలనుకోనప్పుడు మాత్రమే లభిస్తుంది. సాధన ద్వారా ఈ నిశబ్దాన్ని సాధించలేం. ఈ నిశబ్దమనేది మనసుకు పూర్తిగా తెలియనిది అయి ఉండాలి. ఒకవేళ మనసుకు ఈ నిశబ్దం అనుభవంలోకి వచ్చిందంటే గతకాలపు నిశబ్దాన్ని వ్యక్తి అనుభవించాడన్నమాట. వ్యక్తి అనుభవిం చిన ఆ అనుభూతి కేవలం పునరుక్తం అవుతోందని అర్థం. మనస్సు నూతనత్వాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. అందుకే మనస్సనేది ఎప్పుడూ శూన్యస్థితిలో ఉండాలి. అయితే అది ఎటువంటి అనుభవాలనూ ఆస్వాదించకుండా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అంటే అది ఏ అనుభవానికీ పేరు పెట్టకుండా, దానిని జ్ఞాపకపు పుటలలో దాచకుండా ఉంచినప్పుడే ఈ శూన్యత లేదా నిశ్శబ్దం సాధ్యమవుతుందని ఆయన బోధించారు.

మన చైతన్యంలోని వివిధ పొరలలో ఈ రికార్డింగ్‌ అనేది జరుగుతుంటుంది. బాహ్యంగా మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ అంతర్గత మనస్సు తెలిసిన విషయాలను గుర్తు చేస్తుంటుంది. చైతన్యమంతా అనుభవాల నుంచి బయటపడినప్పుడు మాత్రమే సత్యం అనుభవంలోకి వస్తుంది. అయితే స్వేచ్ఛగా ఉండాలనే ఈ కోరిక మళ్ళీ సత్యాన్ని గుర్తించేందుకు అడ్డంకి కాగలదు. సత్యానికి కొనసాగింపు ఉండదు. అది ఎప్పుడూ తాజాగానే ఉంటుంది. క్షణ, క్షణానికి ఉంటుంది. కొనసాగింపు ఉన్నదానిని ఎప్పుడూ సృష్టించలేం.

మనస్సు శూన్యతను పొందినప్పుడు అనుభవం పొందేవారు ఉండరు. ఇందులో ఎటువంటి అలజడి ఉండదు. బాహ్యప్రపంచంలో జరిగేవి జరుగుతున్న వాటిని అలా స్వీకరిస్తూ కొనసాగుతుంటుంది. అంతేతప్ప గతంలోని అనుభవాలను గుర్తు చేసుకోదు. దీనిని మాటలలో చెప్పలేం.

ఈ స్థితిలో మనస్సు కార్యకలాపాలు పూర్తిగా ఉండవు. ఇది ఆద్యంతాలు లేనిది. అలా అని ఇది కొనసాగింపు కాదు. ఈ నిశ్శబ్ద స్థితిలో అన్ని పోలికలూ మాయమవుతాయి. ఇది కనుక భ్రాంతి అయితే మనస్సు దానిని తిరస్కరించడమో లేదా దానినే పట్టుకు వేళ్ళాడలని కోరుకోవడమో జరుగుతుంది. నిజమైన నిశ్శబ్దానికి, శూన్యతకు మనస్సుతో సంబంధం ఉండదు కనుక అది దానిని ఆమోదించడమో తిరస్కరించడమో జరుగదు. ఇది మాటలతో కొలవలేనిది అన్న కృష్ణమూర్తి ఉపన్యాసాలు ఎన్నో పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఏ మతాన్ని, ఏ పద్ధతిని బోధించని కృష్ణమూర్తికి శిష్యగణం తక్కువ లేదు. తన జీవితమంతా వ్యక్తులు సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకున్న కృష్ణమూర్తి తన చివరి ఉపన్యాసాన్ని 1986 జనవరిలో మద్రాసులో ఇచ్చారు. మరుసటి నెలలోనే కాలిఫోర్నియాలోని ఒజాయ్‌లో తన గృహంలో ఆయన మరణించారు.
- జి. అనఘ

Sunday, September 12, 2010

జయహో విజయ గాధలు: ధీరూభాయ్‌లు కావాలి..

కుబేరులున్న బీద దేశం మనది...
స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా..
ఎందువల్లనంటారు ? కొందరి దృష్ట్యా మనకు అంటే మన దేశ ప్రజలకు మితిమీరిన స్వాతంత్య్రం ఉండటం వల్లనని !
చట్టాలున్నాయి.. అమలు కావు.. చట్టాలు కూడా అందరికీ సమానం కావు.

మూర్ఖత్వం దేశంలో నాలుగు చెరగులా రాజ్యమేలుతుంది.
సంఘం మీద, తోటి మానవుల మీద గౌరవం శూన్యం. సభ్యత, నాగరికత కోసం భూతద్దాలతో వెతకాలి. పొరుగు దేశాల్లో ఎంతో సభ్యత, సంస్కారంతో మసలే భారతీయులు కూడా. స్వదేశం రాగానే అసభ్యత, అనాగరికత ప్రదర్శిస్తారు. చెత్త చెదారం ప్రతిచోటా వెదజల్లుతారు.

ఎందువల్ల? భయభక్తులు లేకే! అక్కడ విదేశాల్లో క్షణాల్లో పట్టుకుని శిక్షిస్తారు. మరి ఇక్కడో...?
ఎందుకు లెండి అందరికీ తెల్సిన కథాకమామీషుల్ని పదేపదే వల్లె వేసుకోవటం...
కంట్రోల్స్ ఉండాలి. భయముండాలి. నేరాలకు కఠినమైన శిక్షలు వెంటనే అమలు కావాలి. ఇలా ఎన్నెన్నో.. ఇవి లేకనే మనం ఇంకా మిగతా దేశాల కన్నా ఎంతో వెనకబడి ఉన్నాం. చైనా దేశ పురోగతిని ఉదహరిస్తారు వీరు.

ఇవి కొందరి అభిప్రాయాలు, ఆలోచనలు కాగా మరికొందరి దృష్టిలో పేట్రేగిపోతున్న స్వార్థం, లంచగొండితనం మన దేశ భవిష్యత్తును చావుదెబ్బకొడుతున్నాయని. వీరు ఇచ్చే ఉదాహరణ ఆనాటి బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ మన దేశానికి స్వాతంత్య్రం రాబోతున్న సమయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు..

"అధికారం రోగ్సు (మోసగాళ్లు), రాస్కెల్స్ (దుష్టులు, పోకిరివాళ్లు), ఫ్రీ బూటర్స్ (దోచుకునే వాళ్లు, కొల్లగొట్టేవాళ్లు) హస్తగతమౌతుంది. భారత దేశంలోని నాయకులందరూ 'లో కేలిబర్'- తక్కువ మేధాశక్తి, బలహీన వ్యక్తిత్వాలు గల వారుగా ఉంటారు. తీయని పలుకులు, బుద్ది హీనత్వం వారి సొంతం. అధికారం కోసం తమలో తాము యుద్ధాలు చేసుకుంటారు. ఫలితంగా రాజకీయ అంతర్యుద్ధాలతో దేశం నష్టపోతుంది..''
నేడు జరుగుతున్న కథే ఇది. మనమంతా కష్టపడి చర్చిల్ మాటలను నిజం చేసుకుంటున్నాం. రాజకీయ అంతర్యుద్ధాలు, ముఠాతత్వాలు, అలసత్వం, స్వార్ధం ఎలాంటి భయభక్తులు, కంట్రోల్సు లేకపోవటం దేశాన్ని భ్రష్టు పట్టించి, పలు దేశాల కన్నా, సహజ సంపదలున్నా మనమింకా బీదరికం, రోగాల్తో కొట్టుమిట్టాడి పోతున్నాం.

ఈ చీకట్లో కాంతి పుంజాల్లాంటి వారు నేటి యువత. వారు చూపిస్తున్న అసాధారణ చొరవ, ప్రజ్ఞాపాటవాలు. మనం సాధిస్తున్న కాస్తో కూస్తో నేటి ప్రగతికి మూలకారణాలు. నిజానికి ఈ దేశ భవిష్యత్తుకి, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కీలకమైన వారు మన దేశ యువతే.

నేడు దేశం గర్వింప దగ్గ వ్యాపారవేత్తలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పలు రంగాలకు చెందిన నిపుణులు.. వీరందరూ ఎంతో చిన్నవారే. గతంలో లాగా తలలు పండితేనే విజయాలు వరించాల్సిన అవసరం లేదు నేడు. కొత్త ఉత్పాదనల ఆవిష్కరణలతో, సరికొత్త టెక్నాలజీలతో ఎంతో మంది యువకులు నాలుగు పదుల వయస్సు రాకముందే పేరు ప్రతిష్ఠలు అవి తెచ్చే ధన సంపదలతో తులతూగుతున్నారు దేశ విదేశాల్లో.. ఇవన్నీ స్వార్జితమైనవి.

కష్టపడి సంపాదించుకున్నవి. మనకు మార్గదర్శకమైనవి వీరి ప్రయోగాలు, విజయాలు. వీరెవ్వరూ కుటుంబ పలుకుబడి మీద, పెట్టుబడుల మీద, తరతరాలుగా వస్తున్న వ్యాపారాల పైన, వృత్తుల పైన ఆధార పడకుండా తమ తమ సామ్రాజ్యాలను సృష్టించుకొన్నారు పట్టుదలతో.. గమ్యాలతో రేయింబవళ్లు ఏకం చేసి.. ఇలాంటి వారు వందల్లో, వేలల్లో, లక్షల్లో విజయాలను తమ కైవసం చేసుకుంటుంటే నేటి భారతంలో మనమూ ఆ పని చేయొచ్చు కదా! వారు మనలాగే సామాన్యులే కదా.. స్వశక్తిపై నమ్మకం ఉంచుకుని ముందడుగు వేసిన వారే కదా ! వారూ మనలాగే రెండు కాళ్లు, రెండు చేతులు, రెండు కళ్లు.. ఇంకా ఇతర శరీర అవయవాలు కలవారే కదా !!!

వారిలో ఎంతమంది మనలాగే అట్టడుగు సమాజం నుంచి లేచివచ్చి ఈ సువిశాలమైన ఆకాశం కింద తమ అస్థిత్వాన్ని నిరూపించుకున్నవారే. తమ ఉనికిని పదిల పరుచుకున్నవారే. వీరిలో ఒకరు మనందరికి ఎంతో సుపరిచయమైన ధీరూభాయి అంబానీ గారు. ఎంతో క్లుప్తంగా వారి గురించి ముచ్చటిస్తాను ఇక్కడ.. ఎందుకంటే వారి గురించి రెండు పుస్తకాలు (ధీరూభాయిజమ్, ఎదురీత), పలు వ్యాసాలు, గతంలో రాయటం జరిగింది.
దేశాభివృద్ధి గురించి, నేటి భారతంలోని వ్యాపార విజయాల గురించి, గమ్యాలతో పట్టుదలతో ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురొడ్డి పోరాడి దేశంలోని లక్షల మందికి స్ఫూర్తిదాయకమైన నాయకుడు ధీరూభాయి. అందుకని వారి జీవిత విశేషాలు, ఇక్కడ క్లుప్తంగానైనా ముచ్చటించుకోవటం అవసరం.

వారు వ్యాపార రంగ ప్రవేశం చేసినప్పుడు మన దేశంలోని పరిస్థితులు నేటికి పూర్తిగా విరుద్ధం. లైసెన్స్ కోటారాజ్ తీవ్రంగా రాజ్యమేలుతున్న రోజులవి. సామాన్య కోరికలు కూడా ఆకాశంలో నక్షత్రాల్లా అందకుండా పోయిన రోజులవి. అన్నిటికీ కొరతలే పాలడబ్బాల నుంచి ప్లెయిన్‌లో సీటు దాకా.

అన్నిటికీ పరపతి కావాలి. ఫోను కావాలన్నా, స్కూటర్ కావాలన్నా, బ్యాంకులో లోను కావాలన్నా... పరపతి, ఆపై ఓర్పు మెండుగా ఉండాల్సిన కాలమది. ఫోను, స్కూటర్ వగైరాలు గృహ ప్రవేశం చేయాలంటే పది పదిహేను సంవత్సరాల నిరీక్షణ అవసరం. ఈ పరిస్థితుల్లో కలలకు, గమ్యాలకు, పట్టుదలకు చోటేది..!?

నిరీక్షణ, ఓర్పు- రెండే ప్రధాన జీవితావసరాలు ఆ రోజుల్లో. వ్యాపార రంగం నత్తనడకన నడుస్తున్న కాలం. వ్యాపారస్తులంటే అనుమానంతో చూడబడుతున్న సమయం. అటువంటి దేశ కాల పరిస్థితుల్లో రంగప్రవేశం చేసి తన జీవిత కాలంలోనే, ముప్ఫై ఏళ్ల లోపే అంతర్జాతీయ శ్రేణికి చెందిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు ధీరూభాయి.

పాలడబ్బాలకు పరపతి ఉపయోగించాల్సిన దేశంలో, అంతటి వ్యాపార సా మ్రాజ్య స్థాపనలో ఆయన ఎన్ని అడ్డంకులు, కష్టాలు ఎదుర్కొని ఉంటారో ఊ హించుకోండి.అందువల్లే ఆయన మనలాంటి సామాన్యులకు స్ఫూర్తిదాత, మా ర్గదర్శకుడయ్యారు. ఈ దేశంలో సామాన్యులు కూడా గొప్ప కలలు కని వాటిని తమ తమ జీవిత కాలాల్లోనే సాకారం చేసుకునే ధైర్యాన్ని మనలో కలిగించారు.

ధీరూభాయి అంత ఎత్తు ఎదగాలని నేడు కలలు కనే యువకులు లక్షల్లోనే ఉంటారు మనదేశంలో.. మన ఆలోచనా విధానంలో ఈ పెనుమార్పు ఆయన సాధించిన విజయాల వల్లే ఏర్పడింది. ఇన్ని విజయాలు సాధించిన ధీరూభాయి 28 డిసెంబర్ 1932న హీరాచంద్, జమునాబెన్ అంబానీలకు ఐదో సంతానంగా గుజరాత్‌లోని చోర్‌వాడ్‌లో పుట్టాడు.

హీరాచంద్ టీచరు. ఆనాటి పలువురిత ఉపాధ్యాయుల్లాగా బీదవాడు హీరాచంద్. చెప్పుల్లేని కాళ్లు, వంటికి రెండే రెండు జతల బట్టలు, స్కూలు ఫీజు కట్టాలంటే. తనే స్వయంగా ఏదైనా చిన్న వ్యాపారం చేసి సంపాదించాల్సిన పరిస్థితులు. బజ్జీలు చేసి వచ్చిన లాభాలతో స్కూలు ఫీజు కట్టేవాడు చిన్న ధీరూభాయి.

ఎస్ఎస్ఎల్‌సి పాసయ్యాక తన 17వ ఏట కుటుంబాన్ని పోషించటానికి బ్రిటీష్ కాలనీ అయిన ఎడెన్‌కి వెళ్లారు. అడుగులోనే హంసపాదన్నట్లుగా ఏ ప్యాసింజర్ షిప్‌లోనూ సీటు దొరకలేదు. సమయంలో చేరకపోతే ఉద్యోగం మాయమవుతుంది. కార్గో షిప్‌లో ప్రయాణం చేసి గడువులోగా ఎడెన్ చేరుకున్నాడు.

శుద్దమైన బ్రిటీష్ ఇంగ్లీష్ భాష అక్కడి వాడుక భాష. తనకు ఇంగ్లీష్‌తో అంతగా పరిచయం లేదు. మరో సమస్య. ఇలా జీవితాంతం అన్నీ సమస్యలే. తొమ్మిదేళ్ల అనంతరం ఎడెన్ నుంచి బాంబే వచ్చి కొద్దిపాటి మూలధనంతో ఆహార దినుసుల ఎగుమతి-దిగుమతి వ్యాపారం మొదలు పెట్టారు. ఇతర వ్యాపారులతో సమస్యలు. మెల్లగా ఎదిగి యార్న్ వ్యాపారంలోకి ప్రవేశించి 1966లో తమ సొంత బట్టల తయారీకి మొదలుపెట్టారు.

'విమల్' ఆ వస్త్ర సంపద పేరు. గమ్యం పద్ధతుల మీద పూర్తి నమ్మకం, అవగాహన ఉన్న వ్యక్తి ధీరూభాయి.
ఏ వ్యాపారం చేసినా, అందులో ప్రధమ స్థానం ఆక్రమించాలన్నది గమ్యం.
పద్ధతులు- ఉత్తమ శ్రేణికి చెందిన టెక్నాలజీ, మానవ వనరుల సహాయంతో అత్యుత్తమ ఉత్పాదనలకు పెద్దపీట వేశారు.
వ్యాపారమన్నాక జీవితంలో లాగానే ఎత్తుపల్లాలు, హెచ్చుతగ్గులు సహజం.

కనుక వాటి నుంచి పారిపోకుండా, ఎదురొడ్డి పోరాడి విజేత కావాలన్నది మరో వ్యూహం. ఈ ప్రయాణంలో మంచి టీము, వారికి స్ఫూర్తినిచ్చే ఛాలెంజెస్, జీత భత్యాలు సంస్థతో మమేకమయ్యేలా పరిసరాలు, పరిస్థితులు సమకూర్చటం మరో వ్యూహం.

నేను 23 ఏళ్లు వారితో కలిసి పని చేశాను. ఏనాడు నేను ఒక ఉద్యోగస్తుణ్ని 9 నుంచి 5 దాకా పనిచేసి. నెలాఖరున జీతం పుచ్చుకుని అంటీముట్టనట్లు వ్యవహరించలేదు. వారి కుటుంబంలో, వారి కలల్లో, గమ్యాల్లో, కష్టాల్లో ,సుఖాల్లో మాలాంటి వారు భాగస్తులు, ఇది మా కృషి వల్లకాదు. వారి చొరవ వల్లే.

ప్రభుత్వ పరంగా, పోటీ దారుల నుంచి, పత్రికల నుంచి పెను సమస్యలే ఎదురయ్యాయి ధీరూభాయికి . పోరాడారే తప్ప పారిపోవాలనుకోలేదు. విదేశాల్లో సెటిల్ కావటం ఆ రోజుల్లో చాలా ఫ్యాషనబుల్, ధీరూభాయికి కాదు. జీవితాంతం మధ్యతరగతి విలువలు ఎదుటివాడికి సహాయం చేసే తత్వం ధీరూభాయిది. ప్రతిభకు పట్టం కట్టేవారు, మాలాంటి వారంటే బోలెడంత ప్రేమాభిమానాలు. ఎంతో గౌరవించేవారు.
భారతీయ వ్యాపార రంగంలోని పలువరి దిగ్గజాలతో నాకు పరిచయాలున్నప్పటికి ధీరూభాయి లాంటి వ్యాపార వేత్తను, వ్యక్తిని మరెవరిలో చూడలేదు. ధైర్యం.. గమ్యాలు .. వాటిని చేరుకునే విధానాలు.. అన్నీ సుసాధ్యాలేనని నమ్మే పాజిటివ్ వ్యక్తిత్వం.. ఇతరులను నమ్మి, వారికి బాధ్యతలను అప్పగించగలిగిన ధైర్య సాహసాలు.. గొప్ప కలలుకనే ఆత్మస్థైర్యం, వాటిని ఎలాగైనా చేరుకోవాలనే తపన. అసాధ్యమైన కలలంటూ ఏవీ ఉండవనే గాఢ విశ్వాసం.

ధీరూభాయి గారి అస్త్రాలు ఇవన్నీ. అతి సామాన్యుడు, అసామాన్యుడైనాడు కేవలం మూడు దశాబ్దాల్లో, తన జీవిత కాలంలోనే. ఇది అందరికీ సాధ్యమేనని నమ్మి, మనని నమ్మించి, మనలో కలల్ని, గమ్యాల్ని ప్రేరేపించగలిగారు ధీరూభాయి ఇదే ఆయన విజయం. 
-ఎజి కృష్ణమూర్తి

కృషితో నాస్తి దుర్భిక్షం

ఇష్టపడే రంగం ఒకటి.
ఉదర పోషణార్థమై మరో రంగంతో ముడి.
అందుకే అనుదినం నిరాశ, నిస్పృహ. ఇది మనలో నూటికి తొంభై తొమ్మిది మందికి పరిచయమైన అనుభవమే కదా.
నా మిత్రుడొకడున్నాడు- ప్రబీర్ పురకాయస్త అని.. ముద్రాలో నాతో కలిసి దాదాపు పది సంవత్సరాలు పని చేశాడు. వృత్తిరీత్యా అడ్వర్‌టైజింగ్ రంగానికి చెందిన వాడైనా. ఆయనకి పూర్తి తృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది ఫొటోగ్రఫీ.

ప్రతి ఏడు హిమాలయాల్లోకి వెళ్లి ఆ పర్వత శ్రేణుల అలౌకిక సౌందర్యాన్ని తన కెమెరాలో బంధించి పుస్తకాలు ప్రచురించేవాడు.
అంతర్జాతీయ స్థాయికి చెందిన పుస్తకాలు.
వృత్తి ప్రవృత్తి - రెండూ ఏకం కావాల్సినవేననే నిబంధన ఎక్కడా రాసి లేదు. రెండు వేరువేరైనా, కన్నకలల్ని ఇష్టపడే రంగంలో సాకారం చేసుకోవచ్చు.
నాకు వృత్తి, ప్రవృత్తి రెండు ఒకటే. ఎటువంటి నిరాశా లేదు.
రెండు వేరువేరైనా సరే ప్రబీర్ అసాధారణమైన ప్రతిభా పాటవాలు కనబర్చాడు ఫొటోగ్రఫీలో. తృప్తి, సంతోషంతో నిండిన జీవితం ప్రబీర్‌ది. జీవితంలో ఇటువంటి ఎందరో మహానుభావులు మనకు దర్శనమిస్తూ ఉంటారు.

ఈ రెండు తరగతుల వారేకాకుండా, మరో తరహాకు చెందిన వ్యక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే మనకు కనబడుతుంటారు.
కాంక్షించే రంగంలో ప్రవేశించలేక ఉన్న రంగాన్ని ఇష్టపడక, అశాంతితో అసంతృప్తితో జీవితాలు వెళ్లబుచ్చేవాళ్లు కోకొల్లలు.
వారికి జీవితం నిత్యం సంగ్రామమే.
ఈ మనస్వత్వం, ఈ అలవాటు నా ఉద్దేశంలో ఎంతో నిష్ప్రయోజనకరమైనవి.

ప్రేమించే పనిని చేయి..
లేదా చేసే పనిని ప్రేమించు..
రెండూ కాకుండా, చేసే పనిని ద్వేషిస్తాను, ప్రేమించే పని చేయటానికి అవసరమైన అర్హతలను పొందనూ అంటే, జీవితం అనుక్షణం ఒక సంగ్రామం లాగానే మిగిలి పోతుంది.
సర్ సివి రామన్ గారినే ఉదాహరణగా తీసుకుందాం. మనకు స్ఫూర్తినిచ్చే ప్రపంచ విఖ్యాతిగాంచిన కొద్దిమందిలో ఒకరు రామన్ గారు. ఆయన అమితంగా ప్రేమించేది ఫిజిక్స్‌ను, ఆ రంగంలో రీసెర్చిని..అయితే ఆయన చేరిన మొదటి ఉద్యోగం అకౌంట్స్‌లో. రెండింటింకి వీసమెతైనా సంబంధముందా !?

పర్‌ఫెక్టు చదువు, పర్‌ఫెక్టు ఉద్యోగం అవసరం లేదు జీవితంలో ఏదైనా సాధించాలంటే.
మనసుంటే మార్గముందంటారు కదా పెద్దలు. మనసుంటే పట్టుదల, పట్టువదలని విక్రమార్కుడి లాంటి పట్టుదల సహజంగానే అబ్బుతుంది మనకి.
ఆ పట్టుదలే మనని మన కలల ప్రపంచాన్ని సాకారం చేసుకునేలా చేస్తుంది.
ఆ పట్టుదలకు మారుపేరు సర్ సివి రామన్.
నవంబర్ 7, 1888న ఒక ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించాడు రామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ అక్కడ ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఫిజిక్స్, మేథమెటిక్స్‌లలో ప్రావీణ్యుడు.

తమిళులకు తండ్రి పేరు ఇంటి పేరుగా మారుతుంది. కనుక వెంకట రామన్, చంద్రశేఖర్ వెంకట్ రామన్ - సివి రామన్‌గా మారిపోయాడు.
17వఏటనే పట్టభద్రుడయ్యాడు రామన్. చిన్నప్పట్నుంచీ అన్ని త రగతులలో ఫస్టే మన రామన్. సంగీతమన్నా, సైన్స్ అన్నా ప్రాణం.
15వ ఏట ప్రెసిడెన్సీ కాలేజీ మద్రాసులో డిగ్రీ కోసం చేరిన రామన్‌కి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురైంది. అది ఆయన్ను తన కాలేజీలో అందరికీ తెలిసేలా చేసింది.
పొట్టిగా, మరీ చిన్న కుర్రాడిలా ఒకతన్ని చూశాడు తన క్లాసులో ప్రొఫెసర్ ఎలియట్.
పొరపాటున తన క్లాసులోకి వచ్చాడేమో ఈ బుడతడనుకొని. ఆ కుర్రవాణ్ణి ప్రొఫెసర్ అడిగాడు "నీవు బిఎ స్టూడెంట్ వా'' అని. "యస్ సర్ '' అన్నాడు ఆ కుర్రాడు.

"నీ పేరేంటి ?'' "సివి రామన్''
ఈ సంఘటన మన చిన్ని రామన్‌ను కాలేజిలో అందరికీ పరిచయం చేసింది.
1905లో పట్టభద్రుడైన రామన్ ఆ యేడు ఫస్ట్ క్లాసు తెచ్చుకున్న ఒకే ఒక విద్యార్థి. గోల్డ్ మెడలిస్టు కూడా.
వెంటనే ఎంఎ ఫిజిక్స్‌లో చేరాడు అదే కాలేజీలో..
1907లో డిస్టింక్షన్‌తో ఎంఎ పట్టా పుచ్చుకున్నాడు. అంతవరకు మద్రాసు యూనివర్సిటీలో ఎవ్వరికీ రానన్ని ఎక్కువ మార్కులతో.
సైన్సుకి ఆ రోజుల్లో ఏమంత ప్రాముఖ్యత కాని, ఆ రంగంలో ఉన్న వారికి ఎక్కువగా అవకాశాలు గాని ఉండేవి కావు. తన అన్న బాటననుసరించి 'ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్' పరీక్షలు రాసి, వాటిలో కూడా ప్రథమ స్థానంలో నిలిచి తన పందొమ్మిదో ఏట అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్‌గా చేరాడు కలకత్తాలో.

చదువుకుంది ఫిజిక్స్‌లో
తను మనస్ఫూర్తిగా ప్రేమించింది ఫిజిక్స్‌ను. ఉదరపోషణార్థమై ఎంచుకున్న వృత్తి అకౌంట్స్.
అయితే ఇవేవి రామన్ కలలకు, గమ్యాలకు అడ్డు నిలువ లేదు.
ముందు చెప్పుకున్నాంకదా మనసుంటే మార్గముంటుందని ; పట్టుదల - విక్రమార్కుని పట్టుదల, మనసుంటే మనకు అబ్బుతుందని.
మనసుంది రామన్‌కి ఫిజిక్స్‌లో కృషి చేయాలని. అకౌంట్స్ ఉద్యోగం అడ్డుగా నిలువలేదు.
పగలంతా అకౌంట్స్ ఉద్యోగం - రాత్రంతా ఫిజిక్స్‌లో రీసెర్చ్.
ఒక రోజున తన ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ "ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్'' అనే బోర్డును చూశాడు రామన్.
ఉత్సుకతతో ఆ బోర్డు ఉన్న భవనం లోపలికి వెళ్లాడు. విశాలమైన రూములో పలు రకాలైన సైంటిఫిక్ పరికరాలు. ఫిజిక్స్‌లో పరిశోధనలకు అనువైన ప్రదేశంలాగా గోచరించింది.
డాక్టర్ అమృత్ లాల్ సర్కార్ ఆ సంస్థకు ఆనరరీ సెక్రటరీ. ఆయన్ను సంప్రదించగా రామన్‌కు అనుమతి లభించింది తన రీసెర్చిని అక్కడ నిరాటంకంగా చేసుకొనేందుకై.
ఇంకేం స్వర్గ ద్వారాలు తెరుచుకున్నంత సంతోషపడిపోయాడు రామన్. ఆ ప్రయోగ శాలలో పదేళ్ల పాటు తానొక్కడే నిర్విరామంగా కృషి చేసి 27 రీసెర్చి పేపర్లను ప్రచురించాడు. ఎంత నిర్విరామంగానంటే కొన్ని రోజులు తిండి, నిద్రల గురించి కూడా మర్చిపోయాడు. తన నివాసాన్ని లేబ్ పక్కకు మార్చుకున్నాడు. ల్యాబ్‌కి తన ఇంటికి మధ్య రాకపోకలకై ఒక దారి, దానికో తలుపు.

ఎనిమిది గంటలు ఆఫీసు..మిగతా పదహారు గంటలు ల్యాబ్‌లో ఇదీ దినచర్య.
పదేళ్ల పాటు.. ఫలితం 27 పేపర్లు
ఈ సంకలనమే ప్రపంచ విఖ్యాతి పొందిన 'రామన్ ఎఫెక్ట్'గా మనందరికీ సుపరిచియం.
ఈ వ్యాసాలు, ఈ రామన్ ఎఫెక్టే 1930లో అంటే రామన్‌కి 42 ఏళ్ల వయస్సులోనే ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి.
ఆసియా ఖండంలోనే ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి సైంటిస్ట్ శ్రీ రామన్.
వృత్తి వేరు. ప్రవృత్తి వేరు.
తాను చేసిన రీసెర్చి ల్యాబ్‌లో ఉన్న సదుపాయాలు, పరికరాలు ఎంతో సామాన్యమైనవి. ఆ రోజుల్లో వాటి విలువ కేవలం 300 రూపాయలు.
అవకాశాలు మనని వెతుక్కుంటూ రావు... మనమే వాటిని వెతుక్కుని చేజిక్కించుకోవాలి.
అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు కనబడతాయి. మనమే వాటిని అధిగమించాలి.
నారు పోసి, నీరు పోసి పంట పండించి వడ్డించి వార్చరు ఎవ్వరు మనకోసం.
మనమే స్వయంకృషితో, ఏం కావాలన్నా దాన్ని సాధించుకోవాలి.
పర్‌ఫెక్ట్ చదువు, పర్‌ఫెక్ట్ ఉద్యోగం, పర్‌ఫెక్ట్ కుటుంబం, పర్‌ఫెక్ట్ నగరం.. ఏవీ అవసరం లేదు. పర్‌ఫెక్ట్ మనసు కావాలి. అప్పుడు పర్‌ఫెక్ట్ మార్గం దానంతటదే వస్తుంది. దాంతోపర్‌ఫెక్ట్ పట్టుదల కూడా..

ప్రతి విజేత కథ చెప్పేది ఇదే. విజేత కావాలనుకునే ప్రతి వ్యక్తికి ముందున్న ఒకే ఒక మార్గం కూడా ఇదే.
ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల..
అప్పుడు అన్నీ సుసాధ్యాలే..
ఆలోచించి చూడండి...
-ఎజి కృష్ణమూర్తి