Showing posts with label AGK. Show all posts
Showing posts with label AGK. Show all posts

Wednesday, June 15, 2011

నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. * రే క్రాక్

రే క్రాక్.. 52వ వసంతంలో మొదలైన జీవనయానం. నా వయస్సు 52 డయాబెటీస్ ఆర్ధట్రాయిస్.. రెండూ ఉన్నాయి నాకు. ఇంతకు మునుపే గాల్ బ్లాడర్‌ని, థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం తీసేసారు. అయినప్పటికీ నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెక్ డొనాల్డ్ సంస్థ నిర్మాణంలో ముఖ్య భూమిక నిర్వహించిన రే క్రాక్ చెప్పిన మాటలివి. ఎప్పుడు మెక్ డొనాల్డ్ సంస్థలో చేరే ముందు.

మనలో చాలా మంది ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా చివరికి జలుబు చేసినా తల్లడిల్లి పోతాం. ధైర్యం తక్కువ, పిరికితనం ఎక్కువ. గెలుపు మీద కంటే ఓటమి మీదే నమ్మకం ఎక్కువ. తప్పక గెలుస్తామనే నమ్మకం కంటే గ్యారెంటీగా ఓడిపోతామనే నమ్మకం జాస్తి. వీరందరికీ రే క్రాక్ మాటలు మార్గదర్శకమవ్వాలి. 

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgJui9JLjQSSMUu6m30oSGwwJUjy9FpdJI6HMCiYM0D1gIf9sIF2UJt4E7QASFX7MtzciTlpdcS1dtEjRNMmn1v8FGMBqbI-tfOPKRxf1fWp76Xw7bE1KigHftvuFOS-DIc1OJ3qzpm7BN8/s320/Kroc.jpg

సాధించిన రేక్రాక్

మెక్ డొనాల్డ్స్‌ను ఒక గొప్ప అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దిన రే క్రాక్ గురించిన ముచ్చట్లు మొదలుబెట్టాం గతవారం. ఆయన ఎంతో గర్వంగా తనను గురించి చెప్పుకున్న మాటల్ని మరోసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. నా వయస్సు 52, డయాబిటీస్, ఆర్ధయిటిస్ రెండు ఉన్నాయి. నాకు ఇంతకు మునుపే గాల్ బ్లాడర్‌ని, థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం తీసేసారు. అయినప్పటికీ నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. ఇటువంటి ధైర్య సాహసాలు, స్వశక్తిపై విశ్వాసం, నమ్మకం.. ఎటువంటి అడ్డంకులు వచ్చినా కలలను సాకారం చేసుకోవాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తి విజేతగా రూపాంతరం చెందుతాడు. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు.http://www.browsebiography.com/images/2/808-ray_kroc_biography.jpg
ఆశావాదం విజేతకి కావాల్సిన ఒక గొప్ప అవసరం. చాలామంది విజేతల్లో మనకు కొట్టొచ్చినట్లు కనబడే గుణమిదే. మనం ఓ స్వామివారి దగ్గరికెళ్లి మన కష్టాల్ని ఆయన పాదాల మీద కుమ్మరిస్తాం. ఆయనేమని దీవిస్తారు ? ధైర్యంతో ఉండు.. అన్ని సర్దుకుంటాయి అనేగా. అలాకాకుండా ఇది కష్టకాలమే అంటే మన గతేం కాను. ప్రాణం ఊసురుమంటుంది.

అలాగే డాక్టర్ కూడా.. మా ఫ్యామిలీ డాక్డర్ గారున్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గారని. ఆయన్ని కలుసుకుంటేనే సగం బాధ, రోగం తగ్గిపోతాయి. ఇక ఆయన చెప్పిన ధైర్య వచనాలు విన్నాక మిగతా సగం మారిపోతాయి. వైద్యుడు దేముడితో సమానం అన్నారు కదా ఆర్యులు. వారు మనకిచ్చేదేమిటి ? ధైర్యమే కదా. ఆపదలు తొలగిపోతాయని నమ్మకమే కదా.
http://jeremywaite.files.wordpress.com/2010/05/0427_18innova.jpg
ధైర్యే సాహసే లక్ష్మీ. ఆశావాదికి అలవోకగా అబ్బే గుణమే ధైర్యం. రే క్రాక్‌కి ఉన్నన్ని ఆరోగ్య సమస్యలు మరెవరికైనా ఉండి ఉంటే అన్ని పనులు వదిలి, నిరంతరం దిగులుతో నిస్సహాయంగా పైవాడి పిలుపుకి ఎదురు చూస్తుండేవారు అవునా కాదా ? మెక్‌డొనాల్డ్ సోదరులు స్థాపించిన మెక్‌డొనాల్డ్ హేంబర్గర్ రెస్టారెంట్స్‌ని కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసిన ఘనత రే క్రాక్‌ది.http://static6.businessinsider.com/image/4d52e37349e2ae5b32180000-400-300/1-raymond-albert-kroc-mcdonalds.jpg
ఈ రంగ ప్రవేశం చేసే ముందు రే క్రాక్ రకరకాల పనులు చేశాడు. తన పదిహేనో ఏట ట్రక్ డ్రైవర్ అయ్యాడు. ఆ తర్వాత పియానో ప్లేయర్ ఉద్యోగం సంపాదించాడు. ఆ పిమ్మట పేపర్ కప్పులు అమ్మే కంపెనీలో సేల్స్‌మెన్ అయ్యాడు. ఈ ఉద్యోగంలో ఉన్నప్పుడే మిల్క్ షేక్ మిక్సర్లు తయారు చేసే ఓ పెద్ద మనిషితో పరిచయమైంది. ఆ పరిచయం ఆ కంపెనీలో ఓ ఉద్యోగిగా మార్చగా ఆ తర్వాత 17 సంవత్సరాలు మిక్సర్లు అమ్ముతూ అమెరికా అంతా తిరిగాడు. http://www.keyvive.com/wp-content/userimages/1268755181ray-kroc-and-mcdonalds.jpg
అలా తిరుగుతూ మిక్సర్లు అమ్మటానికై మెక్ డొనాల్డ్ సోదరులను కల్సుకున్నాడు. వాళ్లు నడుపుతున్న రెస్టారెంట్స్ రే క్రాక్‌ని ఎంతో ప్రభావితం చేసినాయి. అవి ఎంతో చక్కని రెస్టారెంట్స్ అని వాటిని దేశవ్యాప్తంగా తెరిస్తే వాటికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని రే క్రాక్ ఆ సోదరులకు చెప్పాడు.http://www.teambuilding-leader.com/images/RayKroc.jpg
ఆయన బాగానే ఉంది కాని ఈ బాధ్యతనెవరు తలకెత్తుకుంటారంటే నేలేనా అన్నాడు. రెస్ట్ ఈజ్ హిస్టరీ మిగతాదంతా చరిత్ర అంటాం కదా. అలాగే రే క్రాక్ మెక్ డొనాల్డ్స్‌లో చేరాక ఒక చరిత్ర సృష్టికి మూలకారకుడయ్యాడు. అప్పుడు ఆయన వయస్సు 52. ఎన్నో ఆరోగ్య సమస్యలతో పో రాడుతున్నాడు. అయితే అదేమి ఆయన్ని క్రుంగ దీయలేదు. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjvvaf_ciKkNtoQdbaK3Ij51pW3FN7mkQH5Vr1nOg8q1ACLyoPPaWnbHdSSGjpZ4UX9fs2aPuMxIuyuXT48mb5F0CyD8NmYMCb4MSU1xIkHkH7xHkeiBNRE8B_LYBq7gsNzYbBTLi720xnD/s1600/June+Martino.jpg

June Martino - The Silent Backbone of McDonald's

Ray Kroc, Harry Sonnenborn, June Martino, Don Conley & Fred Turner - 1960 
In 1948 June Martino became Ray Kroc's (founder of McDonald's Restaurants) bookkeeper. She rose to Corporate Secretary, Director and part owner of the corporation. 

అందుకు ఒకటే బలమైన కారణం. ఆయన కన్న కలలు సాకారం చెందే ఘడియలు ఇంకా చేరువ కాలేదు. అందాకా తన కృషి సాగుతూనే ఉండాలి అనేది ఆయన నమ్మకం. ముందు చెప్పుకున్నట్లుగా వేరెవరికయినా అలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన వలసి వస్తే అదే జీవిత చరమాంకం అనుకుని ఆగిపోయి ఉండేవారు. కాని రే క్రాక్ విషయంలో ఆయనకు తన ఆరోగ్య సమస్యలు గొప్ప సమస్యలుగా గోచరించినట్లు ఆధారాలు లేవు.

రే క్రాక్ గురించి నేను రీసెర్చి చేస్తున్నప్పుడు ఎక్కడ ఆయన తన ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించలేదు. కనుక ఆయన పరిపూర్ణ ఆరోగ్యవంతుడనుకున్నాను. తర్వాత ఆయన ఆరోగ్య విషయం గురించి అసలు సంగతి తెలుసుకున్నాక నోట మాట రాలేదు. ఈయన తన 52 వ ఏట ఇటువంటి అనారోగ్యంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడా? ఆకాశానికి అంతేది ? అవకాశాలకు అంతేది? ధైర్య సాహసాలు, కలలు గమ్యాలున్న వ్యక్తికి ఎదురేది ? నేను ఆరాధించే హీరోల్లో రే క్రాక్ ముఖ్యులు. కొండంత ధైర్యం, అన్నీ సుసాధ్యాలే అని నమ్మే ఆయన మనస్తత్వం ఈ ఆరాధానికి కారణం. ఇలాంటి వ్యక్తులు చాలా కొద్ది మంది తారసపడ్తారు మనకు జీవితంలో.

వారి జీవితాలు నేర్పే పాఠాలు అమూల్యమైనవి. ఆచరణీయమైనవి. నేటి మెక్‌డొనాల్డ్స్ విశ్వ దర్శనానికి రే క్రాక్ కృషి మూల స్థంభం. ఒకసారి గూగుల్ సెర్చ్‌కి వెళ్లి నేటి మెక్ డొనాల్డ్ రూప దర్శనం చేయండి. అదో అంతర్జాతీయ మహా వృక్షం. విత్తనం వేసింది మెక్ డొనాల్డ్స్ సోదరులైనప్పటికీ ఈ సంస్థను ప్రపంచమంతటా విస్తరింప చేసి నేటి స్థాయికి తెచ్చిన ఘనత రే క్రాక్‌దే.

జయహో రే క్రాక్ మహాశయా.. జయహో.

 - ఎజి కృష్ణమూర్తి

Tuesday, June 14, 2011

నమ్మకమే నడిపిస్తుంది

ఎన్ని అడ్డంకులొచ్చినా మీ కలలను, గమ్యాలను విడవద్దు.. మరోసారి ప్రయత్నిస్తానంటూ పదండి ముందుకు. విజేతలకి, ఇతరులకు ఉన్న తేడా ఇదే. కలల్ని మన సొంతం చేసుకొని అవి మన పంచప్రాణాలేమోనన్నట్లుగా వాటిని గుండెలకు హత్తుకుని మన దగ్గరే పదిలంగా ఉంచుకుంటే అవి సాకారం కాక మానవు.  
రోమ్‌ని ఒక రోజులో నిర్మించలేదన్నట్లుగా మన గమ్యాలు, కలలు ఒక్క రోజులో తీరేవి కావు. మన కలలకు ప్రతి రూపాలుగా మనం తీర్చిదిద్దే మన పిల్లలు పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావటానికి దాదాపు పాతికేళ్లు పడుతుంది కదా అందాక మనం శ్రమిస్తూనే ఉంటాం కదా! అలాగే మన ఇతర కలలు, గమ్యాలు కూడా. ఈ మధ్య నా గురువు గారు గీరా బెన్ శరభాయి గారిని కలుసుకున్నాను.
http://gujarattourism.net/gifs/baroda-museum.jpg
ప్రపంచం గర్వింపతగిన కేలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్ సృష్టికర్త ఆవిడ. ఒక జీవిత కాలం అవిరామ శ్రమకు ప్రతిరూపం ఆ మ్యూజియం. భారతీయ వస్త్ర సంపద 15 వ శతాబ్దం నుంచి నేటి దాకా కన్నులకు కట్టినట్లు కనబడుతుంది ఆ మ్యూజియంలో. అక్కడ నేను పనిచేయటం ఆ మ్యూజియంలో ప్రదర్శించిన వస్త్ర సంపదను విస్తృతపరిచే యజ్ఞంలో నేను సైతం రెండు మూడు చిరు సమిధలు వేశాను.

భారతీయ వస్త్ర సంపదను తిలకించాలంటే ఈ మ్యూ జియం కన్నా మెండైనది ప్రపంచంలో మరెక్కడా లేదు. వారిని కలుసుకున్నప్పుడు అన్నాను ఇంత గొప్ప మ్యూ జియం సృష్టించిన మీరు చరితార్ధులని. ఆవిడ జవాబు.. కల, గమ్యం స్పష్టంగా మన ముందుంటే పట్టుదల దానికి జోడిస్తే కాలమే మన కలలను సాకారం చేస్తుందని. నిజమే ఓర్పు ఉండాలి. కృషిని విడనాడకూడదు. మన కలలపై నమ్మకముండాలి. అశాంతితో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఓ పెద్దమనిషి ఒక గురువు గారి దగ్గరకు వెళ్లి మనశ్శాంతికి తనకేదైనా మంత్రోపదేశం చేయమన్నాట్ట అదీ చాలా సింపుల్‌గా! సూక్ష్మంలో మోక్షం కావాలి ఈ పెద్ద మనిషికి. ఆ గురువు గారు అతి చిన్న మంత్రాన్ని ఉపదేశించారు ఈయన గారికి.. అదేమంటే.. ఓ గాడ్ సేవ్ మీ. చాలా చిన్న మంత్రం కదూ. ఈ పెద్ద మనిషి అనుమానాల పుట్ట. అన్నీ అనుమానాలే. గురువు గారు చెప్పిన మంత్రాన్ని మార్చి ఇలా చెప్పుకున్నాడు. ఓ గాడ్ (ఇఫ్ యూ ఆర్ దేర్.. ఓ భగవంతుడా నీవంటూ అసలు ఉంటే) సేవ్ మీ (ఇఫ్ యూ కెన్ సేవ్ మీ.. నన్ను రక్షించగలిగితే రక్షించు). ఎంత నమ్మకం ! ఎంత గురి ! ఇటువంటి వ్యక్తిత్వమున్న వ్యక్తులను అంటే తన మీద గాని ఇతరుల మీద గాని నమ్మకం విశ్వాసం లేని వ్యక్తులు.. కలలేం కనగలరు ? వాటినెలా సాకారం చేసుకోగలరు ?? కల, కృషి, కాలం.. ఈ మూడు మనని మన గమ్యాల దాకా చేరుస్తాయి. వాటిని ఎట్టి పరిస్థితులలో మరిచిపోకూడదు, గమ్యాలను విడనాడకూడదు. రచయిత అంటే సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. అవి ఇతరులను ఇంప్రెస్ చేయటానికి కూడా పనికొస్తాయని, చిన్న చిన్న రచనలు చేయటం మొదలుబెట్టాను. ఎప్పటికైనా కాస్త పేరున్న రచయిత కావాలని బలమైన కల ఉండేది. 1964లో నా మొట్టమొదటి కథ... తానొకటి తలిస్తే.. ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అచ్చయింది. ఆ పైన అడపాదడపా కథలు, రేడియో నాటికలు రాస్తుండేవాణ్ణి. ఈ వ్యాపకంలోనే మహానుభావుడు ఉషశ్రీతో పరిచయమైంది 1967లో. న్యూ నల్లకుంటలో పక్కపక్క భాగాల్లో ఒకే ఇంట్లో ఉంటుండే వాళ్లం నా కుటుంబం, ఉషశ్రీ గారి కుటుంబం. రేడియో నాటకాల రచనకు ప్రోదల్భం, సూచనలు ఆయనే అందిచ్చారు. కొన్ని దశాబ్దాలైనా వారి జ్ఞాపకాలు మదిలో ఇంకా ఎంతో తాజాగానే ఉన్నాయి.

1967లో పెళ్లి. 1968లో అహ్మదాబాదుకి తరలి వెళ్లటంతో నా రచనా వ్యాసాంగం మరుగున పడిపోయింది. కొత్త ఊరు, కొత్త మనుషులు, మరీ కొత్త భాష, సంస్కృతి.. జీవన పోరాటంలో నిమగ్నుడినై పోయాను. అయితే నాలోని రచయిత నిద్రాణమై ఉన్నాడు తప్పితే పూర్తిగా నా నుంచి దూరం కాలేదు. రచయిత కావాలనే తృష్ణే పలు అంశాలపై వ్యాసాలు రాసేందుకు పురికొల్పింది. ఈ తృష్ణే ప్రకటనలను సృష్టించటం అందులో భాగంగా ప్రకటనలు రాస్తూ ఉండటం నా వృత్తిగా, నా వృత్తి ధర్మంగా మారిపోయింది అయితే అవన్నీ ఇంగ్లీషులో, తెలుగులో. 1968 తర్వాత ఏదైనా రాసిన జ్ఞాపకం లేదు. 2001లో ముద్రాకు నేనింకా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తుండగా, సడన్‌గా పుస్తక రచనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అమెరికన్ పబ్లిషింగ్ సంస్థ మెక్‌గ్రా హిల్ మేనేజింగ్ డైరెక్టర్ సింగపూర్ నుంచి అహ్మదాబాదు ఏదో పనిమీద వచ్చి నన్ను కలుసుకున్నాడు. నా ముద్రా అనుభవాల మీద ఒక పుస్తకం రాస్తే చాలా బాగుంటుందని, అది అడ్వర్‌టైజింగ్ రంగానికే కాకుండా, మేనేజమెంట్ రంగానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. ఆలోచిస్తానని మాటిచ్చి, జీవన పోరాటంలో మళ్లీ తలమునకలయ్యా.

2003లో నేను ముద్రాను విడిచి రిలయన్స్‌లో అడ్వైజర్‌గా చేరటం, నాకు రచనా వ్యాసాంగానికి సరిపడా టైమ్ లభ్యం కావటంతో దాదాపు 35 ఏళ్ల క్రితం నాలో నిద్రించిన రచయిత మేలుకొని మళ్లీ రచయితనయ్యాను. 2005లో నా మొదటి ఇంగ్లీషు పుస్తకం ది ఇన్‌విజిబుల్ సిఇఒ ప్రచురింపబడింది. కవర్ పేజీ మీద ఉన్న నా పేరును అలాగా ఎంత సేపు ఎన్నిసార్లు ఆనందంగా చూస్తూ ఉండిపోయానో ! కల నిజమాయెగా, కోరిక తీరెగా అని పాట పాడానో లేదో తెలియదు కాని, ఆనాటి నుంచి నేటి దాకా నా ప్రతి పుస్తకం ప్రతి వ్యాసం ప్రచురింపడిన రోజున అమితానందం కలుగుతుంది. రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నానేమో అనిపిస్తుంది. ఇష్టమైన పని చేస్తే వచ్చే తృప్తి ఆనందం ఈ రచనా వ్యాసాంగం ద్వారా నేను తెలుసుకున్నాను , అనుభవిస్తున్నాను. ఇంగ్లీషులో నిర్విరామంగా పక్షానికో వ్యాసం చొప్పున బిజినెస్ స్టాండర్డ్‌లో ఆరు సంవత్సరాల పాటు ఎజికె స్పీక్ అనే శీర్షిక కింద నా వ్యాసాలు అచ్చయ్యాయి. వాటి ద్వారా ఎందరో ప్రముఖులతో పరిచయమైంది ఎందరో నా అభిమానులుగా మారారు. ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం ఎజికె వారం వారం శీర్షికన 2005 నుంచి మూడేళ్లు 130కి పైగా వ్యాసాలు అచ్చయ్యాయి. తిరిగి గత 43 వారాలుగా ఈ జయహో వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. నేటి దాకా ఇంగ్లీషులో ఆరు పుస్తకాలు, తెలుగులో పది పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఇంగ్లీషులోని నా పుస్తకాలు ధీరూభాయిజమ్, ఎగెనెస్ట్ ఆల్ ఆడ్స్, టెన్ మచ్ పలు దేశీయ భాషల్లో ప్రచురితమై అసాధారణ విజయాన్ని చవిచూసినాయి. గుజరాతీలో అయితే ధీరూభాయిజమ్ పుస్తకం ఆ భాషలోని ఆల్‌టైమ్ బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా చేరింది. ఇంగ్లీష్‌లో ఇదే పుస్తకం 2007 నుంచి నేటిదాకా పన్నెండు సార్లు ముద్రితమైంది. ఇదంతా సొంత డబ్బా కొట్టుకోవటం కాదు. బలమైన కల ఉంటే కాలమే దాన్ని సాకారం చేస్తుందనే నిజాన్ని మీ ముందు సోదాహరణంగా ఉంచటానికే.

35 ఏళ్లు రచనా వ్యాసాంగానికి దూరంగా ఉన్న నేను ఇంత ప్రాలిఫిక్ రైటర్.. అంటే ఎంతో విరివిగా రచనలు చేసే రచయితగా ఎలా మారానో నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇట్టే అవగతమవుతుంది. బలమైన కల, గమ్యం, పట్టుదల అవే మనకు మార్గదర్శకాలవుతాయని. చిన్నప్పటి నా కల 45 ఏళ్ల తర్వాత నిజమైంది. అయితే ముందుగా ముచ్చటించుకొన్నట్లుగా కలలను విడనాడకూడదు. వీటిని మనస్సులోనే పెట్టి బంధించాలి. ఓర్పు పెంచుకోవాలి. రోమ్ మహానగరం ఒక్క రోజులో నిర్మాణం కాలేదనే సత్యాన్ని పదేపదే మననం చేసుకోవాలి. కల, కృషి, కాలం.. ఈ మూడు ఏకమై మన కలల్ని నేడు కాకపోతే రేపైనా సాకారం చేస్తాయనే ధృడమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకోవాలి. మనసు మార్చుకోవద్దు. కలలను చంపుకోవద్దు. అర్థాంతరంగా జీవితాన్ని వివిధ మలుపులు తిప్పవద్దు. ఇష్టమైన దాని కోసం కష్టపడండి. మరోసారి ప్రయత్నించి చూడండి. ఇంకొంచెం, మరికొంచెం కాలం వేచి చూడండి. ఈ ప్రక్రియ వల్ల లాభమే కాని నష్టమంటూ ఏమీ జరగదు. ప్రసిద్ధ రచయిత పాల్ కోయిలో అన్నట్లు మీకే బలమైన కోరికుంటే ప్రపంచంలోని అన్ని శక్తులు కుట్రపన్ని కూడబలుక్కొని మీ కలను సాకారం చేస్తాయి. అక్షర సత్యం ఇది.
* ఎజి కృష్ణమూర్తి

Wednesday, June 1, 2011

ప్రపంచం మీ గుప్పిట్లో...

 http://www.prajasakti.com/images_designer/article_images/2011/4/24/aptn-1303669315342.jpg
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక సామాన్య రైతు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు. సమస్యల్లో ఉన్న ఇరుగుపొరుగు వారికి మంచి సలహాలిచ్చి ఆదుకుంటాడని మంచి పేరుంది ఈ పెద్ద మనిషికి. ఒక రోజు ఆ దేశ రాజు ఆ గ్రామం నుంచి వెళ్తూ.. మన రైతు గురించి, ఆయన మంచి గురించి, అతనిచ్చే సలహాల గురించి విని ఆయన్ను పిలిపించి అడిగాడు రోజూ నీ సంపాదన ఎంతా అని. ఒక రూపాయని చెప్పాడు.

రూపాయికి ఎంతో విలువున్న రోజులవి. ఆ రూపాయిని ఎలా ఖర్చు పెడ్తున్నావన్నాడు రాజు. ఒక పావలా తినేస్తాను, రెండో పావలా అప్పుగా ఇస్తాను. మూడో పావలాతో అప్పు తీరుస్తాను. నాలుగో పావలాని పారేస్తాను అన్నాడు ఆ రైతు. ఇదో పజిల్‌లాగా, మెదడుకు మేత వేసే సమస్యాపూరణం లాగా గోచరించింది రాజుకి. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పవయ్యా అన్నాడు రాజు. మొదటి పావలా నాకు నా భార్య తిండి ఖర్చులకు వినియోగిస్తాను. రెండో పావలా పెట్టుబడిగా నా పిల్లల మీద వెచ్చిస్తాను. రేపు నాకు నా భార్యకు వృద్ధాప్యంలో పిల్లలు తోడు నీడగా ఉంటారనే ఆశతో. మూడో పావలాతో నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాను. మిగిలిన నాలుగో పావలాను బీద వారికి దానం చేస్తానన్నాడు. సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి రాజుకి ఏకకాలంలో. ఈ పజిల్ జవాబుని వేరెవ్వరికీ చెప్పవద్దని, తన ముఖాన్ని వంద సార్లు చూసాకే ఎవరికైనా చెప్పాలని ఆజ్ఞాపించాడు రాజు. సరేనన్నాడు రైతు.

రాజధాని చేరిన రాజు రైతు జీవన శైలిని ఒక చిక్కు ప్రశ్నగా మార్చి దాన్ని విప్పమన్నాడు. ఎంత తలబద్దలు కొట్టుకున్నా ఎవ్వరికీ సమాధానం దొరకలేదు. మంత్రి కనుగొన్నాడు రాజు ఒక గ్రామానికి వెళ్లటం. అక్కడో రైతుని కల్సుకోవటం. వెంటనే ఆ గ్రామం చేరుకొని మన రైతును కల్సుకొని ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పమన్నాడు. రాజుకు మాటిచ్చాను. చెప్పలేనన్నాడు రైతు. వంద నాణాలు బహుమతిగా ఇచ్చి ఇప్పుడు చెప్పమన్నాడు మంత్రి. ఆ నాణాల మీద రాజు శిరస్సు ముద్రించి ఉంది. వంద నాణాలపై వంద రాజు ముఖాలు. ఇంకేం. ఎలాంటి సమస్యా లేదు అనుకుంటూ జవాబు చెప్పాడు రైతు మంత్రికి. హుటాహుటిన మంత్రి రాజధానికి తిరిగొచ్చి రాజుకు సమస్యాపూరణం చేశాడు. ఆశ్చర్యపోయిన రాజు మంత్రిని అడిగాడు సమాధానం ఎవరు చెప్పారని. నిజం తెల్సుకున్న రాజు ఆగ్రహావేశాలతో గ్రామం నుంచి రైతును రప్పించి నిప్పులు చెరిగాడు. శాంతంగా విన్న రైతు రాజా తమరే సెలవిచ్చారు కదా. తమరి వంద ముఖాలు చూసే దాకా ఎవ్వరికీ జవాబు చెప్పొద్దని. మంత్రి ఇచ్చిన వంద నాణాల మీద తమరి ముఖార విందాన్ని వంద సార్లు చూసాకే సమస్యని పూరించానని ఎంతో వినయ విధేయతతో చెప్పాడు.

రైతు రుజువర్తనుడే కాదు నమ్మదగ్గ వ్యక్తి. ఇచ్చిన మాటకు విలువిస్తాడు అని ఆగ్రహించి సన్మానించాడు. మనందరం ఆ రైతు లాగా జీవితంలోని ముఖ్యాంశాలను గ్రహిస్తే అడ్డదోవలు తొక్కుతూ ఈ సమాజాన్ని అల్లకల్లోలం చేయాల్సిన అవసరం ఉండదు కదా! వృద్దాప్యంలో తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించి వెట్టిచాకిరి చేయించుకునే ప్రబుద్ధులు ఎందరో! లేకుంటే చేతులు శుభ్రంగా డెటాల్‌తో కడుక్కొని తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి అంకితం చేయటం. ప్రేమతో గౌరవంగా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో ఆదరించే వారు భూతద్దంలో వెతికితే గాని కనబడదు. ఎంత దురదృష్టం. మాతృదేవోభవా, పితృదేవోభవా అనే సంస్కృతికి నిలయమైన మన భారతంలో ఎన్ని అపశృతులు. ఇతరుల సహాయం కోసమే మానవ జన్మ అని మన శాస్త్రాలు, పురాణాలు, పెద్దలు ఘోషిస్తుండగా.. పట్టపగలే బందిపోటు దొంగల్లా దేశాన్ని, మనల్ని దోచేస్తూ, దేశ సంపదను స్విస్ బ్యాంకులకు తరలిస్తున్నారు మనకు అండదండగా నిలవాల్సిన పెద్దమనుషులు. ధనార్జనకు అడ్డదారులేకాదు. రాజమార్గాలు ఉన్నాయని నిరూపించే ప్రయత్నమే ఈ నిజ జీవిత గాధలన్ని. పదండి ముందుకు ఈ చిన్న ప్రపంచం మన గుప్పిట్లోకి ఎలా వచ్చిందో తెల్సుకుందాం.
http://suryaa.com/Main/gallery/2010/Sep/07/world.jpg
ప్రపంచం మీ గుప్పిట్లో....
రిలయన్స్ మొబైల్ ఫోన్ ప్రకటనలకు ఇది ట్యాగ్‌లైన్.. నేను రాసిందే 2003లో. నిజంగా ప్రపంచం మన గుప్పిట్లోనే ఉంది కదూ నేడు. మా పని అమ్మాయికి ఆవిడ పతి దేవుడైన సెక్యూరిటీ గార్డుకి, మావంటావిడకు, ఆవిడ కుటుంబ సభ్యులందరికీ, మన పోస్టుమ్యాన్‌కు, మన డ్రైవర్లకి, మా మానవరాలికి, మీకు ... నాకు... ఎవ్వరికీ ఇది లేందే జరగదు ఒక్క క్షణం కూడా. సర్వాంతర్యామి మొబైల్. చిన్నా పెద్దా, రాజు పేద, ఆడామగా... ఎలాంటి తేడాలు చూపకుండా అందరికీ అండదండ గా నిలుస్తూ ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చింది ఈ మొబైల్ ఫోన్. చాలా వస్తు, సేవలు, విలాసాలు కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఈ ప్రపంచంలో ఒక్క మొబైల్ ఫోన్ ఎలాంటి బేధాలు చూపకుండా అందరినీ అలరిస్తోంది. మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. ఒక్కోసారి మీకనిపించదూ ఈ మొబైల్ ఫోన్ లేకుండా ఇంతకాలం మనం ఎలా జీవిస్తూ వచ్చామా అని.

అరచేతిలో ఇమిడిపోయి ఎంతో సింపుల్‌గా ఇన్నోసెంట్‌గా కనబడే ఈ మొబైల్ ఫోన్ వెనక ఎన్నో సంవత్సరాల కృషి దాగి ఉంది. రెండు సంస్థలకు చెందిన ఇంజనీర్ల ద్వారా - మోటరోలా, ఎటి అండ్ టి - ఇది ఆవిష్కరించబడింది. ఈ రెండు సంస్థలు కమ్యూనికేషన్ రంగంలో ఉద్దండులే. మోటరోలా టూవే రేడియో టెక్నాలజీతో నిష్ణాతులు కాగా ఎటి అండ్ టి క్లిష్టమైన సెల్యులార్ టెక్నాలజీలో ప్రసిద్ధులు. ఈ రెండు సంస్థలు కలిసి చేసిన కృషికి ఫలితమే నేడు మన జేబుల్లో ఇమిడిపోయి మనతోనే ఎల్లవేళలా ఉండే మొబైల్ ఫోను. అసలు ఈ రెండు సంస్థలు మొదలుపెట్టింది కార్‌ఫోన్ రేంజిని పెంచుదామని. కార్ ఫోన్లు ల్యాండ్ ఫోన్లకు చెందిన రేడియో ఫ్రీక్వెన్సీకి ముడిపడి ఉన్నాయి. ఈ ప్రీక్వెన్సీ రేంజ్‌ని డ్రైవర్ ఎక్కడకు వెళితే అక్కడదాకా పొడిగించాలంటే మరో కొత్త కమ్యూనికేషన్ పద్ధతిని కనుగొనాల్సి ఉంది.

అప్పట్లో వాడుకలో ఉన్న టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమయ్యే పనికాదు. కొత్త టెక్నాలజీ కనుగొనటానికి ఎన్నో సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటగా ఒక కొత్త సెల్యులార్ సిస్టమ్‌ని కనుగొని దాని కోసమై ప్రభుత్వం క్లియరెన్స్‌లను పొందటం. రెండోది ఒక కొత్త ప్రొటోటైపు తయారు చేయటం. దీనికి సంబంధించిన నమూనాలు గాని, ఇతర సమాచారం గాని ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే పూర్తిగా ఇదొక వినూత్న ఆవిష్కారం. మోటరోలా ఇండస్ట్రియల్ డైరెక్టర్ రూడీ క్రాలాప్ ఈ పరిశోధనల గురించి వివరిస్తూ "మేం కనుగొంటున్న దాన్ని షూ ఫోన్'' అని పిలిచే వాళ్లం. ఎందుకంటే అది ఒక బూటులాగా రూపం సంతరించుకుంటోంది. చివరకు సెప్టెంబర్ 1, 1983న మోటరోలా సరికొత్త చరిత్రను సృష్టించింది. అమెరికాకు చెందిన యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, డివైఎన్ఎ టిఎసి 800ఎక్స్ ఫోన్‌ను అంగీకరించింది. ఈ ఫోన్ ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ మొబైల్ ఫోను. పదేళ్లు.. 10 కోట్ల డాలర్ల (450 కోట్ల రూపాయలు) పెట్టుబడికి ఫలితంగా ఉద్భవించిన మొబైల్ ఫోను ఇది.
http://www.travisfitzwater.com/wp-content/uploads/2010/02/dreambig.jpg
కార్ ఫోను రేంజ్‌ని పెంచుదామనుకొన్న చిన్న ప్రయత్నం ప్రపంచాన్ని, మనందరి గుప్పిట్లోకి తెచ్చింది. ఈ మొబైల్ ఫోను నేడు అందరికీ ఎలా కాసుల వర్షం కురిపిస్తోందో మనందరికీ తెలిసిందే. ఒక మంచి ఆలోచన, శ్రమ, దాని ఫలితం పది మందికి ఎలా ఉపయోగపడుతుందో, వారి జీవితాలను ప్రభావితం చేస్తుందో వివరించేదే ఈ మొబైల్ ఫోన్ కథ. అలాంటివే ఈ అధ్యాయం - పేరు ప్రతిష్టల ఫలితమే డబ్బు- లో మనం ముచ్చటించుకున్న ఇతర నిజ జీవిత కథలు కూడా. వాల్ట్ డిస్నీ యానిమేషన్ చరిత్ర, సింఫనీ కూలర్ విజయ గాధ, స్టార్ బక్స్ కాఫీ కప్పుతో ఘన విజయం, హాట్ మెయిల్ హాట్ హాట్ కీర్తి తద్వారా దక్కిన లక్ష్మీ కటాక్షం. యాపిల్ కంప్యూటర్ మెకింతోష్ ఆవిష్కరణ. అది సాధించిన అద్భుత విజయాలు. సోనీ వాక్‌మెన్ ఆవిష్కరణ. అది మన జీవిత సర ళిపై వేసిన చరగని ముద్ర. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్య బర్గర్, ఒక చిన్న ఐడియాతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన మెక్‌డొనార్డ్స్. ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం - మైక్రో చిప్ ద్వారా మానవజాతి జీవిత గమనాన్ని మార్చివేసిన కథాకమామిషు. చివరిగా ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చిన మొబైల్ ఫోన్ అద్భుత ఆవిష్కరణ. ఇవన్నీ ఇలాంటివి మరెన్నో... చిన్నా పెద్దా నిజ జీవిత గాధ లు.http://us.123rf.com/400wm/400/400/kjpargeter/kjpargeter0607/kjpargeter060700180/478803-the-world-in-your-hands--3d-render.jpg
వేలల్లో, లక్షల్లో .. మనకు చెప్పేది ఒక్కటే:
ప్రతిభకు ఫలితం పేరు ప్రతిష్టలు. వాటి ఫలితం డబ్బు. ధనార్జనకు రాచబాట ఇదే. మోసాలు, అన్యాయాలు, అరాచకాలు కాదు. అవి తెచ్చే సంపద కేవలం తాత్కాలికం. మోసపోయిన వారి తిట్లు, శాపనార్ధాలు, మనకు దీవెనలు కాదు కదా! ఆలోచించాల్సిన విషయం ఇది. సువిశాలమైన ఈ ప్రపంచంలో అందరికీ ఉన్నాయి అవకాశాలు. అవి అందిపుచ్చుకొని హాయిగా ఆనందంగా ఉండటమే మన కర్తవ్యం. 
http://drjeffadams.com/wp-content/uploads/2008/07/dream-big.jpg
కలలను, గమ్యాలను విడనాడొద్దు! కలతో, కృషితో నాస్తి దుర్భిక్షమ్!
- ఎజి కృష్ణమూర్తి

Tuesday, May 17, 2011

ఐడియాలతో అద్భుతాలు

'' పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బు ''  ఆ పద్ధతి రాచమార్గం కాగా కుయుక్తులతో, అన్యాయంతో, అక్రమాలతో దేశాన్ని కొల్లగొట్టడం, అక్రమార్జన చేయటం అడ్డదారులుగాను. నాలుగు కాలాలపాటు నిలిచేదిగాను కాదని  తెలుసుకున్నాం. పదండి ముందుకి.. మిగతా అందిరి లాగే మనం కూడా మొబైల్ సంగీతం ఆస్వాదిద్దాం. మొబైల్ సంగీతం... జేబులో మొబైల్, చెవిలో స్పీకర్ లేని వ్యక్తి నేడు మనకెక్కెడా తారసపడరు. నడుస్తూ, వాహనాలు నడుపుతూ, నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ, నిద్రపోతూ, చదువుకుంటూ, మాట్లాడుతూ సర్వవేళ సర్వావస్తలా ఈ మొబైల్ సంగీతం ఉండాల్సిందే... దాదాపు అందరికీ.. దీని పూర్వాపరాలు తెలుసుకుందాం.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOq4Sn_UmgdFYJQobMXVhW58urKO3fmE4miz5RPNkvqXJAjkc4hSWTR-O7b_VvQEqrV13tNMr3A-n65phQxCX_fpYXs1PbjX-w7JrIn8GLif1i0srWyFYHhLs6JMihwm0wlfLlgFSabjQ/s1600/Akio+Mirota.jpg
ఈ మొబైల్ సంగీత యుగం ఆరంభం కాకముందు ప్రయాణాలు ముఖ్యంగా గంటలతరబడి చేసేవి, చాలా కష్టతరంగా, బోరింగ్ గాను ఉండేవి. ఒక్కసారిగా ఊహించుకోండి. దాదాపు ఇరవై నాలుగు గంటలకు పైగా సాగే భారత్-అమెరికా విమాన యాత్రలో సీట్లకు అతుక్కుపోయి అలాగే ఉండిపోవటం ఎంత కష్టంగా ఉండేదో ! తనువు, మనసు రెండు కష్టపడేవి విసుగెత్తిపోయేవి. అలాంటి ఒక ప్రయాణంలో సోనీ కార్పొరేషన్ చైర్మన్ అకియో మోరిటా బ్రహ్మాండంగా బోర్ అయిపోయి ఒక సరికొత్త ఐడియాతో ప్లేన్ దిగాడు. ఆ ఐడియా మ్యూజిక్ పరిశ్రమను పూర్తిగా మార్చివేయటమే కాకుండా, మనం సంగీతం వినే పద్ధతులను కూడా గుర్తుపట్టలేనంతగా మార్చేసింది. ఆ సుదీర్ఘ విమానయానం తర్వాత జపాన్‌లోని తన ఆఫీసుకు వెళ్లిన మోరిటా తన బృందాన్ని పిలిచి అటువంటి సుదీర్ఘ విమానయానాల్లో మనం మనకిష్టమైన మ్యూజిక్ వింటుంటే ఎంత బాగుండునో కదా అని అన్నాడు. ఆ ఆలోచనే నేడు కొన్ని వేల కోట్ల విలువైన ' వెళ్తూ వినే సంగీతానికి '(మ్యూజిక్ ఆన్ ది మూవ్) నాంది పలికింది.http://www.conceivablytech.com/wp-content/uploads/2010/10/sony-walkman.jpg
ఈ ఆలోచనకు మొదటి ప్రత్యక్ష రూపమే సోనీ వాక్‌మెన్. యువతను సంపూర్ణంగా ఆకట్టుకొని వాక్‌మెన్ లేని జీవితం కూడా ఒక జీవితమేనా అనేలా చేసింది. వాక్‌మెన్ మన వెంట తీసుకెళ్లగలిగిన మొట్టమొదటి మ్యూజిక్ సిస్టమ్. ఈ సిస్టమ్ వృద్ధి చెంది స్టీరియో రికార్డింగ్ చేసుకునే సదుపాయాన్ని కలిగించింది. కంప్యూటర్ మ్యూజిక్, ఎంపి 3 వచ్చిందాకా ఏకచ్ఛత్రాధిపత్యంతో మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలింది వాక్‌మెన్. వాక్‌మెన్‌ను సృష్టించిన మోరిటాకు ఆ పేరంటే అస్సలు ఇష్టముండేది కాదు. వాక్‌మెన్ ఏమిటి అసహ్యంగా అనుకున్నాడు. పేరు మార్చుదామని ప్రయత్నిస్తే సలహాదారులు చాలా పాపులర్ అయిన పేరు వాక్‌మెన్ మార్చవద్దని సలహా ఇచ్చారు. వాక్‌మెన్ పేరు అలాగే ఉండిపోయింది.

ఒక చిన్న ఐడియా దూరాభారపు విమాన ప్రయాణాల్లో సొంత సంగీతం వినటం ఎలాగా అన్న ఆలోచన సంగీత ప్రపంచంలో సంచలనం కలిగించి, వేల కోట్ల వ్యాపారానికి మూలకారణమైంది. డబ్బు సంపాదించాలంటే ఐడియాలు కావాలి. అడ్డదార్లు కాదు మహాప్రభో !! వెళ్తూ ... తింటూ... తింటూ వెళ్తూ... రెండు బ్రెడ్ ముక్కలు.. వాటి మధ్య ఒక బర్గర్.. మరో చిన్న ఐడియా వేల కోట్ల వ్యాపారానికి, లాభాలకు నాంది పలికింది. అంతేకాదు నాగరిక జీవనానికి ఒక గుర్తుగా మారింది. అనగనగా ఒకప్పుడు కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఇద్దరు సోదరులు డిక్, మేక్ మెక్ డొనాల్డ్‌లకు ఒక ఆలోచన కలిగింది. ప్రయాణంలో ఉన్నప్పుడు సాధారణంగా రెండు భోజనాల మధ్య ఆకలవుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో ఏదో ఒక సామాన్యమైంది, సింపుల్‌గా ఉంటే చాలు. నక్షత్రాల హోటళ్ల విందులవసరం లేదు. వేడిగా, తాజాగా, రుచిగా, తొందరగా లభ్యమయ్యే ఆహారమైతే చాలు. కార్లోను, బస్సులోను ప్రయాణం చేస్తుంటే వాహనం దిగకుండా ఆ ఆహారం దొరికితే అది బోనస్ కింద లెక్క. అప్పుడు ఆ ఆహారం కోసం కస్టమర్లు పదేపదే వస్తారు... ఇదీ ఆ సోదరులు ఆలోచన.
http://www.index.hr/images2/McDWend1.jpg
బ్రహ్మాండమైన ఆలోచన ఈ ఆలోచనలోంచి ఉద్భవించిందే.. ప్రపంచంలోని అతి పెద్ద ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్. గ్రాండ్‌గా ఐదు నక్షత్రాల రెస్టారెంట్స్ కావివి.. సింపుల్‌గా, క్లీన్ గా, ఫాస్ట్‌గా మన ఆకలిని తీర్చే ఆహారం అమ్మే రెస్టారెంట్స్. మెక్‌డొనాల్డ్స్ కథ కూడా వాళ్లు అందించే ఆహారం లాగానే చాలా సింపుల్. ఈ అన్నదమ్ములతో చేయి కలిపాడు రేక్రాక్ అనే ఓ పెద్ద మనిషి. తర్వాత ఆయనే ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేసి నేడు మనం చూస్తున్న మెక్‌డొనాల్డ్స్‌గా తీర్చిదిద్దాడు. మెక్‌డొనాల్డ్స్ అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న రెస్టారెంట్ చైన్. ఎన్నో చోట్ల, ఎల్ల వేళలా ఒకే రకంగా ఉండే సామర్థ్యం, ఆహారం.. ఇవీ మెక్‌డొనాల్డ్స్ విజయానికి మూల కారణాలు. ప్రపంచంలోని ఏ భాగనున్నా, మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఒకే రూపంలో ఉంటాయి. వెంటనే క్షణంలో ఇట్టే గుర్తుపట్టేయొచ్చు. లోపలికెళ్లగానే ఒక రకమైన ఫుడ్, అదే సామర్థ్యం అన్ని చోట్ల ఒకేలా.http://www.thegimcrackmiscellany.com/wp-content/uploads/2008/09/whopper.jpg

కొత్త దేశాల్లో, కొత్త మనుషులు మధ్య ఒంటరితనం కాకుండా మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్‌ను ఒక చిరపరిచితమైన స్నేహితుడిగా భావిస్తాం మనం. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్యలో ఓ బర్గర్... చిన్న ఐడియా... వేల కోట్లలో వ్యాపారం, లాభాలు. నేడు 119 దేశాల్లో 31 వేల పైచిలుకు మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి. రోజుకి 4 కోట్ల 7 లక్షల మంది పైనే కస్టమర్లు. ఇదండీ కథ.

ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం
http://gigaom.files.wordpress.com/2008/09/kilby1lg.jpg
కిల్బీ, నోయిస్ అనే ఇద్దరు సైంటిస్టులు మైక్రోచిప్‌ను కనుగొని ఒక కొత్త ప్రపంచానికి శ్రీకారం చుట్టారు. మనం నేడు నివసిస్తున్న ఈ అధునాతన ప్రపంచంలోని కొత్త ఆవిష్కరణలో కెల్లా ఎంతో ముఖ్యమైంది ఈ మైక్రోచిప్ ఆవిష్కరణ. ఈ ఇద్దరు సైంటిస్టులు వేర్వేరుగా దీన్ని కనుగొని కొన్నేళ్లు కీచులాడుకొని చివ్వరికి మైక్రో చిప్ ఆవిష్కరణ తమ సమిష్టి కృషిగా నిర్ధారించుకొన్నారు. మైక్రోచిప్ ఎంత చిన్నదంటే దాన్ని ఒక చిరు చీమ నెత్తినపెట్టుకొని మోసుకెళ్లగలదు. అటువంటి అతి సూక్ష్మమైన చిప్ మీద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని పొందుపరుస్తారు. ప్రతి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌కి సర్క్యూట్ ప్రాణంలాంటింది. ఆ ప్రాణం ఉంది ఈ చిన్న ఇసుక రేణువులో !! ఆశ్చర్యంగా ఉంది కదూ ! ఈ ప్రక్రియ ద్వారా ఒక గది నిండా ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మన అరచేతిలో సులభంగా అమరే ఒక బుల్లి డివైస్‌లో కూర్చోపెట్టవచ్చు.

మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ అని అంటూ ఉంటామే. దీని అవతరణకి మూల కారణం ఈ సిలికాన్ మైక్రోచిప్ వల్లనే. ఈ చిప్‌ను దీని వాడకంతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అమ్మకాలు 2004లో 179 అమెరికన్ బిలియన్ డాలర్లని అంచనా. అంటే 8 లక్షల కోట్ల రూపాయలకు పైబడే. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆధారంగా అమ్ముడుబోతున్న ఎలక్ట్రానిక్ పరికరాల విలువ 1.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే 50 లక్షల కోట్ల రూపాయలను మించి. ఈ అంచనాలు టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ వారివి. ఇక్కడే కిల్బీ పనిచేశాడు. కిర్బీ కథనం ప్రకారం ఒక సమస్యను తొందరగా పరిష్కరించాలనే ప్రయత్నంలో ఉన్నాడతను.

ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని అతడు కనుగొని ఉండకపోతే, ఆయన కంపెనీ ఆయన్ను ఒక సమస్యాపూరితమైన పనిలోకి మార్చి ఉండేది. అది ఎలాగైనా తప్పించుకోవాలని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద దృష్టి సారించాడు. వేసవి కాలం సెలవులు కావటం వల్ల తను పనిచేసే టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో తన సహోద్యోగులందరూ సమ్మర్ హాలిడేస్ మీద వెళ్లారు. ఆయనొక్కడే ఉన్నాడు పనిలో. టిఆర్ రీడ్ అనే వ్యక్తి రాసిన పుస్తకం 'ది చిప్'లో ఇలా అంటాడు కిల్బీ.. నేను తొందరగా ఒక మంచి ఐడియాను కనుగొన లేకపోతే వేసవి సెలవుల తర్వాత నన్ను మైక్రో మాడ్యుల్ డిపార్ట్‌మెంట్‌లోకి మారుస్తారేమోననిపించింది. అది ఇష్టం లేదు కిల్బీకి .అందుకే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద దృష్టి కేంద్రీకరించాడు.
http://www.biographicon.com/images/Noyce_Robert.jpg
మరోపక్కన నోయిస్ తన పరిశోధనల ద్వారా మైక్రో చిప్‌ని తక్కువ ధరల్లో పెద్ద ఎత్తున (మాస్ మాన్యుఫ్యాక్చర్) తయారు చేసే పద్దతిని కనుగొన్నాడు. అంతేకాదు ఫెయిర్ చైల్డ్ సెమికండక్టర్ సంస్థలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తుండగా చిప్‌ని కనుగొన్నాడు. కాలిఫోర్నియాలోని సిలికాన్ నేవీలో ఉన్న మొట్టమొదటి విజయవంతమైన సిలికాన్ సంస్థ ఈ ఫెయిర్ చైల్డ్ సెమికండక్టర్. వాళ్ల ప్రేరణలు ఎటువంటివైనప్పటికీ ఈ ఇద్దరు సైంటిస్టులు.. కిల్బీ, నోయిస్ మనందరి జీవిత విధానాన్ని మార్చివేసిన మైక్రోచిప్‌ని కనుగొన్నారు. ప్రతి ఆవిష్కరణకు ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కటి మటుకు ఉండదు.. డబ్బు.. ఒక ఆవిష్కరణ ఫలించటం ద్వారా దాని ఉప ఉత్పాదనగా, బై ప్రొడక్టుగా ప్రతిఫలంగా డబ్బు వస్తుంది తప్పితే కేవలం డబ్బు కోసం నూతన విధానాల ఆవిష్కరణ ఎక్కడా జరగలేదు. ఎవ్వరూ చేయలేదు.
- ఎజి కృష్ణమూర్తి

Sunday, September 12, 2010

జయహో విజయ గాధలు: ధీరూభాయ్‌లు కావాలి..

కుబేరులున్న బీద దేశం మనది...
స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా..
ఎందువల్లనంటారు ? కొందరి దృష్ట్యా మనకు అంటే మన దేశ ప్రజలకు మితిమీరిన స్వాతంత్య్రం ఉండటం వల్లనని !
చట్టాలున్నాయి.. అమలు కావు.. చట్టాలు కూడా అందరికీ సమానం కావు.

మూర్ఖత్వం దేశంలో నాలుగు చెరగులా రాజ్యమేలుతుంది.
సంఘం మీద, తోటి మానవుల మీద గౌరవం శూన్యం. సభ్యత, నాగరికత కోసం భూతద్దాలతో వెతకాలి. పొరుగు దేశాల్లో ఎంతో సభ్యత, సంస్కారంతో మసలే భారతీయులు కూడా. స్వదేశం రాగానే అసభ్యత, అనాగరికత ప్రదర్శిస్తారు. చెత్త చెదారం ప్రతిచోటా వెదజల్లుతారు.

ఎందువల్ల? భయభక్తులు లేకే! అక్కడ విదేశాల్లో క్షణాల్లో పట్టుకుని శిక్షిస్తారు. మరి ఇక్కడో...?
ఎందుకు లెండి అందరికీ తెల్సిన కథాకమామీషుల్ని పదేపదే వల్లె వేసుకోవటం...
కంట్రోల్స్ ఉండాలి. భయముండాలి. నేరాలకు కఠినమైన శిక్షలు వెంటనే అమలు కావాలి. ఇలా ఎన్నెన్నో.. ఇవి లేకనే మనం ఇంకా మిగతా దేశాల కన్నా ఎంతో వెనకబడి ఉన్నాం. చైనా దేశ పురోగతిని ఉదహరిస్తారు వీరు.

ఇవి కొందరి అభిప్రాయాలు, ఆలోచనలు కాగా మరికొందరి దృష్టిలో పేట్రేగిపోతున్న స్వార్థం, లంచగొండితనం మన దేశ భవిష్యత్తును చావుదెబ్బకొడుతున్నాయని. వీరు ఇచ్చే ఉదాహరణ ఆనాటి బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ మన దేశానికి స్వాతంత్య్రం రాబోతున్న సమయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు..

"అధికారం రోగ్సు (మోసగాళ్లు), రాస్కెల్స్ (దుష్టులు, పోకిరివాళ్లు), ఫ్రీ బూటర్స్ (దోచుకునే వాళ్లు, కొల్లగొట్టేవాళ్లు) హస్తగతమౌతుంది. భారత దేశంలోని నాయకులందరూ 'లో కేలిబర్'- తక్కువ మేధాశక్తి, బలహీన వ్యక్తిత్వాలు గల వారుగా ఉంటారు. తీయని పలుకులు, బుద్ది హీనత్వం వారి సొంతం. అధికారం కోసం తమలో తాము యుద్ధాలు చేసుకుంటారు. ఫలితంగా రాజకీయ అంతర్యుద్ధాలతో దేశం నష్టపోతుంది..''
నేడు జరుగుతున్న కథే ఇది. మనమంతా కష్టపడి చర్చిల్ మాటలను నిజం చేసుకుంటున్నాం. రాజకీయ అంతర్యుద్ధాలు, ముఠాతత్వాలు, అలసత్వం, స్వార్ధం ఎలాంటి భయభక్తులు, కంట్రోల్సు లేకపోవటం దేశాన్ని భ్రష్టు పట్టించి, పలు దేశాల కన్నా, సహజ సంపదలున్నా మనమింకా బీదరికం, రోగాల్తో కొట్టుమిట్టాడి పోతున్నాం.

ఈ చీకట్లో కాంతి పుంజాల్లాంటి వారు నేటి యువత. వారు చూపిస్తున్న అసాధారణ చొరవ, ప్రజ్ఞాపాటవాలు. మనం సాధిస్తున్న కాస్తో కూస్తో నేటి ప్రగతికి మూలకారణాలు. నిజానికి ఈ దేశ భవిష్యత్తుకి, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కీలకమైన వారు మన దేశ యువతే.

నేడు దేశం గర్వింప దగ్గ వ్యాపారవేత్తలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పలు రంగాలకు చెందిన నిపుణులు.. వీరందరూ ఎంతో చిన్నవారే. గతంలో లాగా తలలు పండితేనే విజయాలు వరించాల్సిన అవసరం లేదు నేడు. కొత్త ఉత్పాదనల ఆవిష్కరణలతో, సరికొత్త టెక్నాలజీలతో ఎంతో మంది యువకులు నాలుగు పదుల వయస్సు రాకముందే పేరు ప్రతిష్ఠలు అవి తెచ్చే ధన సంపదలతో తులతూగుతున్నారు దేశ విదేశాల్లో.. ఇవన్నీ స్వార్జితమైనవి.

కష్టపడి సంపాదించుకున్నవి. మనకు మార్గదర్శకమైనవి వీరి ప్రయోగాలు, విజయాలు. వీరెవ్వరూ కుటుంబ పలుకుబడి మీద, పెట్టుబడుల మీద, తరతరాలుగా వస్తున్న వ్యాపారాల పైన, వృత్తుల పైన ఆధార పడకుండా తమ తమ సామ్రాజ్యాలను సృష్టించుకొన్నారు పట్టుదలతో.. గమ్యాలతో రేయింబవళ్లు ఏకం చేసి.. ఇలాంటి వారు వందల్లో, వేలల్లో, లక్షల్లో విజయాలను తమ కైవసం చేసుకుంటుంటే నేటి భారతంలో మనమూ ఆ పని చేయొచ్చు కదా! వారు మనలాగే సామాన్యులే కదా.. స్వశక్తిపై నమ్మకం ఉంచుకుని ముందడుగు వేసిన వారే కదా ! వారూ మనలాగే రెండు కాళ్లు, రెండు చేతులు, రెండు కళ్లు.. ఇంకా ఇతర శరీర అవయవాలు కలవారే కదా !!!

వారిలో ఎంతమంది మనలాగే అట్టడుగు సమాజం నుంచి లేచివచ్చి ఈ సువిశాలమైన ఆకాశం కింద తమ అస్థిత్వాన్ని నిరూపించుకున్నవారే. తమ ఉనికిని పదిల పరుచుకున్నవారే. వీరిలో ఒకరు మనందరికి ఎంతో సుపరిచయమైన ధీరూభాయి అంబానీ గారు. ఎంతో క్లుప్తంగా వారి గురించి ముచ్చటిస్తాను ఇక్కడ.. ఎందుకంటే వారి గురించి రెండు పుస్తకాలు (ధీరూభాయిజమ్, ఎదురీత), పలు వ్యాసాలు, గతంలో రాయటం జరిగింది.
దేశాభివృద్ధి గురించి, నేటి భారతంలోని వ్యాపార విజయాల గురించి, గమ్యాలతో పట్టుదలతో ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురొడ్డి పోరాడి దేశంలోని లక్షల మందికి స్ఫూర్తిదాయకమైన నాయకుడు ధీరూభాయి. అందుకని వారి జీవిత విశేషాలు, ఇక్కడ క్లుప్తంగానైనా ముచ్చటించుకోవటం అవసరం.

వారు వ్యాపార రంగ ప్రవేశం చేసినప్పుడు మన దేశంలోని పరిస్థితులు నేటికి పూర్తిగా విరుద్ధం. లైసెన్స్ కోటారాజ్ తీవ్రంగా రాజ్యమేలుతున్న రోజులవి. సామాన్య కోరికలు కూడా ఆకాశంలో నక్షత్రాల్లా అందకుండా పోయిన రోజులవి. అన్నిటికీ కొరతలే పాలడబ్బాల నుంచి ప్లెయిన్‌లో సీటు దాకా.

అన్నిటికీ పరపతి కావాలి. ఫోను కావాలన్నా, స్కూటర్ కావాలన్నా, బ్యాంకులో లోను కావాలన్నా... పరపతి, ఆపై ఓర్పు మెండుగా ఉండాల్సిన కాలమది. ఫోను, స్కూటర్ వగైరాలు గృహ ప్రవేశం చేయాలంటే పది పదిహేను సంవత్సరాల నిరీక్షణ అవసరం. ఈ పరిస్థితుల్లో కలలకు, గమ్యాలకు, పట్టుదలకు చోటేది..!?

నిరీక్షణ, ఓర్పు- రెండే ప్రధాన జీవితావసరాలు ఆ రోజుల్లో. వ్యాపార రంగం నత్తనడకన నడుస్తున్న కాలం. వ్యాపారస్తులంటే అనుమానంతో చూడబడుతున్న సమయం. అటువంటి దేశ కాల పరిస్థితుల్లో రంగప్రవేశం చేసి తన జీవిత కాలంలోనే, ముప్ఫై ఏళ్ల లోపే అంతర్జాతీయ శ్రేణికి చెందిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు ధీరూభాయి.

పాలడబ్బాలకు పరపతి ఉపయోగించాల్సిన దేశంలో, అంతటి వ్యాపార సా మ్రాజ్య స్థాపనలో ఆయన ఎన్ని అడ్డంకులు, కష్టాలు ఎదుర్కొని ఉంటారో ఊ హించుకోండి.అందువల్లే ఆయన మనలాంటి సామాన్యులకు స్ఫూర్తిదాత, మా ర్గదర్శకుడయ్యారు. ఈ దేశంలో సామాన్యులు కూడా గొప్ప కలలు కని వాటిని తమ తమ జీవిత కాలాల్లోనే సాకారం చేసుకునే ధైర్యాన్ని మనలో కలిగించారు.

ధీరూభాయి అంత ఎత్తు ఎదగాలని నేడు కలలు కనే యువకులు లక్షల్లోనే ఉంటారు మనదేశంలో.. మన ఆలోచనా విధానంలో ఈ పెనుమార్పు ఆయన సాధించిన విజయాల వల్లే ఏర్పడింది. ఇన్ని విజయాలు సాధించిన ధీరూభాయి 28 డిసెంబర్ 1932న హీరాచంద్, జమునాబెన్ అంబానీలకు ఐదో సంతానంగా గుజరాత్‌లోని చోర్‌వాడ్‌లో పుట్టాడు.

హీరాచంద్ టీచరు. ఆనాటి పలువురిత ఉపాధ్యాయుల్లాగా బీదవాడు హీరాచంద్. చెప్పుల్లేని కాళ్లు, వంటికి రెండే రెండు జతల బట్టలు, స్కూలు ఫీజు కట్టాలంటే. తనే స్వయంగా ఏదైనా చిన్న వ్యాపారం చేసి సంపాదించాల్సిన పరిస్థితులు. బజ్జీలు చేసి వచ్చిన లాభాలతో స్కూలు ఫీజు కట్టేవాడు చిన్న ధీరూభాయి.

ఎస్ఎస్ఎల్‌సి పాసయ్యాక తన 17వ ఏట కుటుంబాన్ని పోషించటానికి బ్రిటీష్ కాలనీ అయిన ఎడెన్‌కి వెళ్లారు. అడుగులోనే హంసపాదన్నట్లుగా ఏ ప్యాసింజర్ షిప్‌లోనూ సీటు దొరకలేదు. సమయంలో చేరకపోతే ఉద్యోగం మాయమవుతుంది. కార్గో షిప్‌లో ప్రయాణం చేసి గడువులోగా ఎడెన్ చేరుకున్నాడు.

శుద్దమైన బ్రిటీష్ ఇంగ్లీష్ భాష అక్కడి వాడుక భాష. తనకు ఇంగ్లీష్‌తో అంతగా పరిచయం లేదు. మరో సమస్య. ఇలా జీవితాంతం అన్నీ సమస్యలే. తొమ్మిదేళ్ల అనంతరం ఎడెన్ నుంచి బాంబే వచ్చి కొద్దిపాటి మూలధనంతో ఆహార దినుసుల ఎగుమతి-దిగుమతి వ్యాపారం మొదలు పెట్టారు. ఇతర వ్యాపారులతో సమస్యలు. మెల్లగా ఎదిగి యార్న్ వ్యాపారంలోకి ప్రవేశించి 1966లో తమ సొంత బట్టల తయారీకి మొదలుపెట్టారు.

'విమల్' ఆ వస్త్ర సంపద పేరు. గమ్యం పద్ధతుల మీద పూర్తి నమ్మకం, అవగాహన ఉన్న వ్యక్తి ధీరూభాయి.
ఏ వ్యాపారం చేసినా, అందులో ప్రధమ స్థానం ఆక్రమించాలన్నది గమ్యం.
పద్ధతులు- ఉత్తమ శ్రేణికి చెందిన టెక్నాలజీ, మానవ వనరుల సహాయంతో అత్యుత్తమ ఉత్పాదనలకు పెద్దపీట వేశారు.
వ్యాపారమన్నాక జీవితంలో లాగానే ఎత్తుపల్లాలు, హెచ్చుతగ్గులు సహజం.

కనుక వాటి నుంచి పారిపోకుండా, ఎదురొడ్డి పోరాడి విజేత కావాలన్నది మరో వ్యూహం. ఈ ప్రయాణంలో మంచి టీము, వారికి స్ఫూర్తినిచ్చే ఛాలెంజెస్, జీత భత్యాలు సంస్థతో మమేకమయ్యేలా పరిసరాలు, పరిస్థితులు సమకూర్చటం మరో వ్యూహం.

నేను 23 ఏళ్లు వారితో కలిసి పని చేశాను. ఏనాడు నేను ఒక ఉద్యోగస్తుణ్ని 9 నుంచి 5 దాకా పనిచేసి. నెలాఖరున జీతం పుచ్చుకుని అంటీముట్టనట్లు వ్యవహరించలేదు. వారి కుటుంబంలో, వారి కలల్లో, గమ్యాల్లో, కష్టాల్లో ,సుఖాల్లో మాలాంటి వారు భాగస్తులు, ఇది మా కృషి వల్లకాదు. వారి చొరవ వల్లే.

ప్రభుత్వ పరంగా, పోటీ దారుల నుంచి, పత్రికల నుంచి పెను సమస్యలే ఎదురయ్యాయి ధీరూభాయికి . పోరాడారే తప్ప పారిపోవాలనుకోలేదు. విదేశాల్లో సెటిల్ కావటం ఆ రోజుల్లో చాలా ఫ్యాషనబుల్, ధీరూభాయికి కాదు. జీవితాంతం మధ్యతరగతి విలువలు ఎదుటివాడికి సహాయం చేసే తత్వం ధీరూభాయిది. ప్రతిభకు పట్టం కట్టేవారు, మాలాంటి వారంటే బోలెడంత ప్రేమాభిమానాలు. ఎంతో గౌరవించేవారు.
భారతీయ వ్యాపార రంగంలోని పలువరి దిగ్గజాలతో నాకు పరిచయాలున్నప్పటికి ధీరూభాయి లాంటి వ్యాపార వేత్తను, వ్యక్తిని మరెవరిలో చూడలేదు. ధైర్యం.. గమ్యాలు .. వాటిని చేరుకునే విధానాలు.. అన్నీ సుసాధ్యాలేనని నమ్మే పాజిటివ్ వ్యక్తిత్వం.. ఇతరులను నమ్మి, వారికి బాధ్యతలను అప్పగించగలిగిన ధైర్య సాహసాలు.. గొప్ప కలలుకనే ఆత్మస్థైర్యం, వాటిని ఎలాగైనా చేరుకోవాలనే తపన. అసాధ్యమైన కలలంటూ ఏవీ ఉండవనే గాఢ విశ్వాసం.

ధీరూభాయి గారి అస్త్రాలు ఇవన్నీ. అతి సామాన్యుడు, అసామాన్యుడైనాడు కేవలం మూడు దశాబ్దాల్లో, తన జీవిత కాలంలోనే. ఇది అందరికీ సాధ్యమేనని నమ్మి, మనని నమ్మించి, మనలో కలల్ని, గమ్యాల్ని ప్రేరేపించగలిగారు ధీరూభాయి ఇదే ఆయన విజయం. 
-ఎజి కృష్ణమూర్తి

కృషితో నాస్తి దుర్భిక్షం

ఇష్టపడే రంగం ఒకటి.
ఉదర పోషణార్థమై మరో రంగంతో ముడి.
అందుకే అనుదినం నిరాశ, నిస్పృహ. ఇది మనలో నూటికి తొంభై తొమ్మిది మందికి పరిచయమైన అనుభవమే కదా.
నా మిత్రుడొకడున్నాడు- ప్రబీర్ పురకాయస్త అని.. ముద్రాలో నాతో కలిసి దాదాపు పది సంవత్సరాలు పని చేశాడు. వృత్తిరీత్యా అడ్వర్‌టైజింగ్ రంగానికి చెందిన వాడైనా. ఆయనకి పూర్తి తృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది ఫొటోగ్రఫీ.

ప్రతి ఏడు హిమాలయాల్లోకి వెళ్లి ఆ పర్వత శ్రేణుల అలౌకిక సౌందర్యాన్ని తన కెమెరాలో బంధించి పుస్తకాలు ప్రచురించేవాడు.
అంతర్జాతీయ స్థాయికి చెందిన పుస్తకాలు.
వృత్తి ప్రవృత్తి - రెండూ ఏకం కావాల్సినవేననే నిబంధన ఎక్కడా రాసి లేదు. రెండు వేరువేరైనా, కన్నకలల్ని ఇష్టపడే రంగంలో సాకారం చేసుకోవచ్చు.
నాకు వృత్తి, ప్రవృత్తి రెండు ఒకటే. ఎటువంటి నిరాశా లేదు.
రెండు వేరువేరైనా సరే ప్రబీర్ అసాధారణమైన ప్రతిభా పాటవాలు కనబర్చాడు ఫొటోగ్రఫీలో. తృప్తి, సంతోషంతో నిండిన జీవితం ప్రబీర్‌ది. జీవితంలో ఇటువంటి ఎందరో మహానుభావులు మనకు దర్శనమిస్తూ ఉంటారు.

ఈ రెండు తరగతుల వారేకాకుండా, మరో తరహాకు చెందిన వ్యక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే మనకు కనబడుతుంటారు.
కాంక్షించే రంగంలో ప్రవేశించలేక ఉన్న రంగాన్ని ఇష్టపడక, అశాంతితో అసంతృప్తితో జీవితాలు వెళ్లబుచ్చేవాళ్లు కోకొల్లలు.
వారికి జీవితం నిత్యం సంగ్రామమే.
ఈ మనస్వత్వం, ఈ అలవాటు నా ఉద్దేశంలో ఎంతో నిష్ప్రయోజనకరమైనవి.

ప్రేమించే పనిని చేయి..
లేదా చేసే పనిని ప్రేమించు..
రెండూ కాకుండా, చేసే పనిని ద్వేషిస్తాను, ప్రేమించే పని చేయటానికి అవసరమైన అర్హతలను పొందనూ అంటే, జీవితం అనుక్షణం ఒక సంగ్రామం లాగానే మిగిలి పోతుంది.
సర్ సివి రామన్ గారినే ఉదాహరణగా తీసుకుందాం. మనకు స్ఫూర్తినిచ్చే ప్రపంచ విఖ్యాతిగాంచిన కొద్దిమందిలో ఒకరు రామన్ గారు. ఆయన అమితంగా ప్రేమించేది ఫిజిక్స్‌ను, ఆ రంగంలో రీసెర్చిని..అయితే ఆయన చేరిన మొదటి ఉద్యోగం అకౌంట్స్‌లో. రెండింటింకి వీసమెతైనా సంబంధముందా !?

పర్‌ఫెక్టు చదువు, పర్‌ఫెక్టు ఉద్యోగం అవసరం లేదు జీవితంలో ఏదైనా సాధించాలంటే.
మనసుంటే మార్గముందంటారు కదా పెద్దలు. మనసుంటే పట్టుదల, పట్టువదలని విక్రమార్కుడి లాంటి పట్టుదల సహజంగానే అబ్బుతుంది మనకి.
ఆ పట్టుదలే మనని మన కలల ప్రపంచాన్ని సాకారం చేసుకునేలా చేస్తుంది.
ఆ పట్టుదలకు మారుపేరు సర్ సివి రామన్.
నవంబర్ 7, 1888న ఒక ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించాడు రామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ అక్కడ ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఫిజిక్స్, మేథమెటిక్స్‌లలో ప్రావీణ్యుడు.

తమిళులకు తండ్రి పేరు ఇంటి పేరుగా మారుతుంది. కనుక వెంకట రామన్, చంద్రశేఖర్ వెంకట్ రామన్ - సివి రామన్‌గా మారిపోయాడు.
17వఏటనే పట్టభద్రుడయ్యాడు రామన్. చిన్నప్పట్నుంచీ అన్ని త రగతులలో ఫస్టే మన రామన్. సంగీతమన్నా, సైన్స్ అన్నా ప్రాణం.
15వ ఏట ప్రెసిడెన్సీ కాలేజీ మద్రాసులో డిగ్రీ కోసం చేరిన రామన్‌కి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురైంది. అది ఆయన్ను తన కాలేజీలో అందరికీ తెలిసేలా చేసింది.
పొట్టిగా, మరీ చిన్న కుర్రాడిలా ఒకతన్ని చూశాడు తన క్లాసులో ప్రొఫెసర్ ఎలియట్.
పొరపాటున తన క్లాసులోకి వచ్చాడేమో ఈ బుడతడనుకొని. ఆ కుర్రవాణ్ణి ప్రొఫెసర్ అడిగాడు "నీవు బిఎ స్టూడెంట్ వా'' అని. "యస్ సర్ '' అన్నాడు ఆ కుర్రాడు.

"నీ పేరేంటి ?'' "సివి రామన్''
ఈ సంఘటన మన చిన్ని రామన్‌ను కాలేజిలో అందరికీ పరిచయం చేసింది.
1905లో పట్టభద్రుడైన రామన్ ఆ యేడు ఫస్ట్ క్లాసు తెచ్చుకున్న ఒకే ఒక విద్యార్థి. గోల్డ్ మెడలిస్టు కూడా.
వెంటనే ఎంఎ ఫిజిక్స్‌లో చేరాడు అదే కాలేజీలో..
1907లో డిస్టింక్షన్‌తో ఎంఎ పట్టా పుచ్చుకున్నాడు. అంతవరకు మద్రాసు యూనివర్సిటీలో ఎవ్వరికీ రానన్ని ఎక్కువ మార్కులతో.
సైన్సుకి ఆ రోజుల్లో ఏమంత ప్రాముఖ్యత కాని, ఆ రంగంలో ఉన్న వారికి ఎక్కువగా అవకాశాలు గాని ఉండేవి కావు. తన అన్న బాటననుసరించి 'ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్' పరీక్షలు రాసి, వాటిలో కూడా ప్రథమ స్థానంలో నిలిచి తన పందొమ్మిదో ఏట అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్‌గా చేరాడు కలకత్తాలో.

చదువుకుంది ఫిజిక్స్‌లో
తను మనస్ఫూర్తిగా ప్రేమించింది ఫిజిక్స్‌ను. ఉదరపోషణార్థమై ఎంచుకున్న వృత్తి అకౌంట్స్.
అయితే ఇవేవి రామన్ కలలకు, గమ్యాలకు అడ్డు నిలువ లేదు.
ముందు చెప్పుకున్నాంకదా మనసుంటే మార్గముంటుందని ; పట్టుదల - విక్రమార్కుని పట్టుదల, మనసుంటే మనకు అబ్బుతుందని.
మనసుంది రామన్‌కి ఫిజిక్స్‌లో కృషి చేయాలని. అకౌంట్స్ ఉద్యోగం అడ్డుగా నిలువలేదు.
పగలంతా అకౌంట్స్ ఉద్యోగం - రాత్రంతా ఫిజిక్స్‌లో రీసెర్చ్.
ఒక రోజున తన ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ "ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్'' అనే బోర్డును చూశాడు రామన్.
ఉత్సుకతతో ఆ బోర్డు ఉన్న భవనం లోపలికి వెళ్లాడు. విశాలమైన రూములో పలు రకాలైన సైంటిఫిక్ పరికరాలు. ఫిజిక్స్‌లో పరిశోధనలకు అనువైన ప్రదేశంలాగా గోచరించింది.
డాక్టర్ అమృత్ లాల్ సర్కార్ ఆ సంస్థకు ఆనరరీ సెక్రటరీ. ఆయన్ను సంప్రదించగా రామన్‌కు అనుమతి లభించింది తన రీసెర్చిని అక్కడ నిరాటంకంగా చేసుకొనేందుకై.
ఇంకేం స్వర్గ ద్వారాలు తెరుచుకున్నంత సంతోషపడిపోయాడు రామన్. ఆ ప్రయోగ శాలలో పదేళ్ల పాటు తానొక్కడే నిర్విరామంగా కృషి చేసి 27 రీసెర్చి పేపర్లను ప్రచురించాడు. ఎంత నిర్విరామంగానంటే కొన్ని రోజులు తిండి, నిద్రల గురించి కూడా మర్చిపోయాడు. తన నివాసాన్ని లేబ్ పక్కకు మార్చుకున్నాడు. ల్యాబ్‌కి తన ఇంటికి మధ్య రాకపోకలకై ఒక దారి, దానికో తలుపు.

ఎనిమిది గంటలు ఆఫీసు..మిగతా పదహారు గంటలు ల్యాబ్‌లో ఇదీ దినచర్య.
పదేళ్ల పాటు.. ఫలితం 27 పేపర్లు
ఈ సంకలనమే ప్రపంచ విఖ్యాతి పొందిన 'రామన్ ఎఫెక్ట్'గా మనందరికీ సుపరిచియం.
ఈ వ్యాసాలు, ఈ రామన్ ఎఫెక్టే 1930లో అంటే రామన్‌కి 42 ఏళ్ల వయస్సులోనే ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి.
ఆసియా ఖండంలోనే ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి సైంటిస్ట్ శ్రీ రామన్.
వృత్తి వేరు. ప్రవృత్తి వేరు.
తాను చేసిన రీసెర్చి ల్యాబ్‌లో ఉన్న సదుపాయాలు, పరికరాలు ఎంతో సామాన్యమైనవి. ఆ రోజుల్లో వాటి విలువ కేవలం 300 రూపాయలు.
అవకాశాలు మనని వెతుక్కుంటూ రావు... మనమే వాటిని వెతుక్కుని చేజిక్కించుకోవాలి.
అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు కనబడతాయి. మనమే వాటిని అధిగమించాలి.
నారు పోసి, నీరు పోసి పంట పండించి వడ్డించి వార్చరు ఎవ్వరు మనకోసం.
మనమే స్వయంకృషితో, ఏం కావాలన్నా దాన్ని సాధించుకోవాలి.
పర్‌ఫెక్ట్ చదువు, పర్‌ఫెక్ట్ ఉద్యోగం, పర్‌ఫెక్ట్ కుటుంబం, పర్‌ఫెక్ట్ నగరం.. ఏవీ అవసరం లేదు. పర్‌ఫెక్ట్ మనసు కావాలి. అప్పుడు పర్‌ఫెక్ట్ మార్గం దానంతటదే వస్తుంది. దాంతోపర్‌ఫెక్ట్ పట్టుదల కూడా..

ప్రతి విజేత కథ చెప్పేది ఇదే. విజేత కావాలనుకునే ప్రతి వ్యక్తికి ముందున్న ఒకే ఒక మార్గం కూడా ఇదే.
ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల..
అప్పుడు అన్నీ సుసాధ్యాలే..
ఆలోచించి చూడండి...
-ఎజి కృష్ణమూర్తి