Sunday, October 24, 2010

పట్టు దలే పేట్టుబడి...


 గమనించారో లేదో, సాధారణ వ్యక్తుల అసాధారణ విజయాల ద్వారా కేవలం వారికి సుఖ సంతోషాలే కాదు, మానవ కళ్యాణం కూడా జరుగుతూ వస్తుంది. ఫోర్డు కల సాకారమై మనకి కార్లు, రోడ్లు.ఎడిసన్ కలలు సాకారమై మనకో కొత్త ప్రపంచం, సరికొత్త జీవితం. స్వామినాథన్ గమ్యాల సాకారంతో మనదేశంలో హరిత విప్లవం. రైట్ బ్రదర్స్ కలలు నిజమై మానవ జాతికి రెక్కలొచ్చినాయి.ధీరూభాయ్ ధర్మమా అని మన లోని కొన్ని లక్షల మంది సామాన్యులకు మనమూ విజేతలవగలమనే స్ఫూర్తి, ధైర్యం వచ్చినాయి.ఇలా అందరి సొంత విజయాలు వారికే పరిమితం కాకుండా మన జీవితాల్లో కూడా పెనుమార్పులు తెచ్చినాయి. నిజానికి వీరెవ్వరూ మానవజాతి కళ్యాణానికి నడుంబిగించి రంగ ప్రవేశం చేయలేదు. తమ కలలను.. జీవించాలనే తపనతో కార్యోన్ముఖులైనారు.

ఫలితమేమిటంటే వారి విజయాలు మానవ విజయాలుగా మారినాయి. గొప్ప విషయం కదా ! ఈకోవకు చెందిన మరో వ్యక్తి మన మధ్యలోనే ఉన్నాడు. మనందరికి ఎంతో మాన్యుడు, స్ఫూర్తిదాత. మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తి. ఆయన ఎవరో కాదు మన అబ్డుల్ కలామ్ గారు.బాల్యంలో కూటికి, గుడ్డకి, స్కూలు ఫీజుకి అన్నింటికీ అనునిత్యం యుద్ధం. ఓర్పు, చిరునవ్వు, స్వశక్తిపై, తన కలలు గమ్యాలపై అపారమైన నమ్మకం. ఇవే కాక ఎంతో పాజిటివ్ థృక్పధం. జీవన పోరాటంలో ఇవీ ఆయన ఆయుధాలు. ఫలితంగా విజయ పరంపర. భారత్‌లోని అత్యున్నత పురస్కారం భారతరత్న తన సొంతం చేసుకున్న మహోన్నతుడు...రాకెట్ సైన్సులో అసామాన్యమైన ప్రతిభ కనబరిచి. అంతటితో ఆయన విజయ ప్రస్థానం ఆగలేదు. మన దేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఉత్త రాష్ట్రపతి కాదు.. మనందరం ఎంతో అభిమానించి, ప్రేమించి, గౌరవించిన రాష్ట్రపతిగా. మనదేశ చరిత్రలో అంతటి ప్రేమాభిమానాలు పొందిన మరో రాష్ట్రపతి లేడంటే అతిశయోక్తి కాదేమో !అబ్దుల్ కలామ్ గారు నావలను నిర్మించే జైనుల్లాబుద్దీన్ కుమారుడు. రామేశ్వరం సొంత ఊరు. బీద కుటుంబం అయినప్పటికి తల్లిదండ్రుల ప్రేమానురాగాలు ఆ బీదరికపు బాధలను మరుగుపర్చాయి.

కలాంలో మేలైన భావసంపద, మంచి చెడుల గురించి అవగాహన, సద్భుద్ధి, పరోపకారం, సద్భుద్ధులను, జ్ఞానఖనిని తల్లిదండ్రులు ఆయనకు కానుకగా ఇచ్చారు. ఈ జ్ఞాన ఖనే తన స్వ గ్రామంలోని మాస్క్ స్ట్రీట్ నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దాకా నడిపించింది.సామాన్యంగా ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు అపారమైన సంపద తరతరాలకి సరిపడా డబ్బుదస్కాలు వదిలి వెళ్లాలనుకుంటారు కాని ఎందరు తల్లిదండ్రులు సద్భుద్ధి, జ్ఞాన సంపద పరోపకారం లాంటి గుణగణాలను తమ పిల్లలకు తమ వారసత్వంగా ఇస్తారో ఆలోచించాల్సిన విషయమే!! ముఖ్యంగా నేటి కాలమాన పరిస్థితుల్లో సంపదే సర్వస్వంగా భావించే నేటి సమాజంలో దానిని పొందేందుకై అన్ని అడ్డదారులు బాహాటంగా తొక్కే తల్లిదండ్రులకు భావి కలామ్ ఎలా లభిస్తారు ? మరి దేశం మాటేమిటి ?? కలామ్ గారికి చిన్నప్పటి నుంచి ఒక గొప్ప కల ఉండేది. నేడు మనలాంటి వారికి అదో సర్వసామాన్య కలలా గోచరించవచ్చు. కాని దేశపుటంచున ఒక కుగ్రామంలో బీదరికంలో కొట్టుమిట్టాడుతూ, దినపత్రికలు అమ్మే కుర్రవానికి. తానో పైలట్ కావాలనుకోవటం చాలా పెద్ద కలే కదా !!

సముద్రపుటొడ్డున నిలిచి, ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షులను చూస్తూ. ఏదో ఒకనాడు తనూ అలా ఎగరాలనే కలలు కనేవాడు కలామ్. ఈ కలలే ఆయన భావి జీవితానికి మార్గదర్శకాలైనాయి. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు కలామ్. ఇదంత సులభంగా జరగలేదు. తన సోదరి బంగారు నగలు ఆయన చదువుకి పెట్టుబడిగా మారాయి. డబ్బుకి ఎంత ఇబ్బందిగా ఉండేదంటే మాంసాహారం నుంచి పూర్తి శాకాహారానికి మారిపోవాల్సి వచ్చింది. అయితే లక్ష్మీ కటాక్షం తర్వాత కూడా పూర్తి శాకాహారిగా, ధూమ మద్యపానాలకు దూరంగా ఉండి పోయాడు కలామ్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ లభించినా ఆకాశయానం కోరిక తీరలేదు. తనకెంతో ఇష్టం, జీవిత గమ్యమైన ఎయిర్‌ఫోర్సు పైలట్ ఉద్యోగం లభించలేదు. నిరాశ నిస్పృహలతో రిషికేష్ వెళ్లాడు కలామ్. అక్కడేమైన జవాబులు దొరుకుతాయేమోననే ఆలోచనతో. అక్కడ ఒక ఆశ్రమంలో స్వామి శివానంద బోధించిన బోధ తనెప్పుడు మరువలేనిది.

"ఏవైనా కోరికలు హృదయాంతరాల్లో జనించినవైతే అవి నిర్మలంగాను, ఎంతో బలమైనవిగాను ఉంటే, వాటికి ఎంతో గొప్ప విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది. మన మెదడు విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ శక్తి ప్రతిరాత్రి ప్రకృతిలో పయనించి, తిరిగి ఉదయం జాగృతమైన మెదడులోకి ప్రవేశిస్తుంది. కాస్మిక్ తరంగాలతో ఎంతో బలోపేతమై.. ఈ ప్రక్రియ వల్ల మన కోరికలు సాకారమవుతాయి. ఇది నిత్యం. ఇది సత్యం కనుక నీ విషయంలో కూడా నీ కోరికలు నెరవేరుతాయి... తప్పకుండా.. ఎంత తప్పకుండా అంటే.. ప్రతిరోజు ఉదయించే సూర్యునిలా ప్రతి ఏడు వచ్చే వసంత కాలంలా...''

దీన్నే మరో విధంగా చెప్పాడు వాల్ట్ డిస్నీ మహాశయుడు.. "నీ కంటూ కలలుంటే, అవి తప్పక నెరవేరుతాయని..'' కుదుటపడ్డ మనసుతో తిరిగి వచ్చిన కలామ్, 1958 వ సంవత్సరంలో భారత డిఫెన్స్ మినిస్ట్రీలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్‌గా చేరాడు. నెలకి 250 రూపాయల వేతనం. నేడు ఈ మొత్తానికి ఏమంత విలువ లేనప్పటికీ ఆరోజుల్లో అది మంచి వేతనమే. తాను ఎంతగానో కాంక్షించిన ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం పొందలేకపోయినప్పటికి దానికి సంబంధించిన శాఖలోనే పనిచేస్తున్నందుకు కాస్తో కూస్తో తృప్తిగా ఉండేది కలామ్‌కి.. అక్కణ్ణుంచి కలామ్ జీవితం ఎక్కలేని ఎత్తుల్లేవు.. ఎగరలేని ఆకాశపుటంచుల్లేవు. భారత దేశపు మొట్టమొదటి స్పేస్ మిషన్ టీమ్‌లో ఒక సభ్యుడు కలామ్. రాకెట్ నిర్మాణంలో ప్రావీణ్యుడు.

ఆనాడు రుషికేష్‌లో స్వామి శివానంద్ ప్రవచనం భవిష్య వాణి నిజమైనాయి. కలామ్ కలలు, కోరికలు సత్యమైనవి. ఆయన హృదయాంతరాళం నుంచి బయలుదేరినవి. వీటిని ప్రకృతి, పంచభూతాలు దీవించి అవి సాకారమయ్యే దిశగా కలామ్‌ని నడిపించినాయి. కలామ్ నేతృత్వంలో రూపుదిద్దుకొన్న భారత్ గైడెడ్ మిసైల్ ప్రొగ్రామ్ మనదేశానికి శక్తిని గౌరవ మర్యాదలే కాకుండా కలామ్‌కి ఎంతో పేరు ప్రతిష్టలనార్జించినాయి. అత్యున్నత పదవి, అత్యున్నత పురస్కారం, ప్రజల గుండెల్లో అపారమైన ప్రేమాభిమానాలు. ఎక్కడ రామేశ్వరంలోని అతి బీద కుర్రవాడు..! ఎక్కడ భారత దేశపు రాష్ట్రపతిగా, భారత రత్నగా వెలుగొందిన డాక్టర్ అబ్దుల్ కలామ్..!! ఒకే జీవితం. కలలని, గమ్యాలను బట్టి సాగే జీవన యానం. మన కలామ్ గారి జీవిత కథ, జీవన యాత్ర మనను ఉత్తేజ పరిచి, కొందరినైనా ఆకాశపు అంచులను తాకేలా ప్రోత్సహిస్తుందా???

మన తల్లిదండ్రుల ద్వారా మనం పొందిన పెంపకం, మనం పుణికి తెచ్చుకున్న విలువలు, సంస్కారం మీద ఆధారపడ్డ విషయం ఇది. కేవలం ధనార్జన కోసమే జీవితాన్ని అడ్డదారులు తొక్కించకుండా, సన్మార్గంలో, మంచి విలువలతో కూడా పేరు ప్రఖ్యాతులు, వాటితో పాటు లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. మన జీవిత కాలంలోనే. ఇది సాధ్యమే. మనందరికీ అందుబాటులో ఉన్న మార్గమనేనని పదేపదే చెప్పేవే. మనం గత 12 వారాలుగా ముచ్చటించుకుంటున్న జీవిత గాథలన్నీ. పెద్ద పెద్ద కలలు కనటం, వాటిని జీవిత గమ్యాలుగా మార్చుకోవటంతో నే ఇటువంటి ప్రస్థానం మొదలయ్యేది.

"ఏవైనా కోరికలు హృదయాంతరాల్లో జనించినవైతే అవి నిర్మలంగాను, ఎంతో బలమైనవిగాను ఉంటే, వాటికి ఎంతో గొప్ప విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది. మన మెదడు విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ శక్తి ప్రతిరాత్రి ప్రకృతిలో పయనించి, తిరిగి ఉదయం జాగృతమైన మెదడులోకి ప్రవేశిస్తుంది''. 
- ఎజి కృష్ణమూర్తి

No comments: