Showing posts with label Lie. Show all posts
Showing posts with label Lie. Show all posts

Wednesday, June 1, 2011

ప్రపంచం మీ గుప్పిట్లో...

 http://www.prajasakti.com/images_designer/article_images/2011/4/24/aptn-1303669315342.jpg
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక సామాన్య రైతు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు. సమస్యల్లో ఉన్న ఇరుగుపొరుగు వారికి మంచి సలహాలిచ్చి ఆదుకుంటాడని మంచి పేరుంది ఈ పెద్ద మనిషికి. ఒక రోజు ఆ దేశ రాజు ఆ గ్రామం నుంచి వెళ్తూ.. మన రైతు గురించి, ఆయన మంచి గురించి, అతనిచ్చే సలహాల గురించి విని ఆయన్ను పిలిపించి అడిగాడు రోజూ నీ సంపాదన ఎంతా అని. ఒక రూపాయని చెప్పాడు.

రూపాయికి ఎంతో విలువున్న రోజులవి. ఆ రూపాయిని ఎలా ఖర్చు పెడ్తున్నావన్నాడు రాజు. ఒక పావలా తినేస్తాను, రెండో పావలా అప్పుగా ఇస్తాను. మూడో పావలాతో అప్పు తీరుస్తాను. నాలుగో పావలాని పారేస్తాను అన్నాడు ఆ రైతు. ఇదో పజిల్‌లాగా, మెదడుకు మేత వేసే సమస్యాపూరణం లాగా గోచరించింది రాజుకి. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పవయ్యా అన్నాడు రాజు. మొదటి పావలా నాకు నా భార్య తిండి ఖర్చులకు వినియోగిస్తాను. రెండో పావలా పెట్టుబడిగా నా పిల్లల మీద వెచ్చిస్తాను. రేపు నాకు నా భార్యకు వృద్ధాప్యంలో పిల్లలు తోడు నీడగా ఉంటారనే ఆశతో. మూడో పావలాతో నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాను. మిగిలిన నాలుగో పావలాను బీద వారికి దానం చేస్తానన్నాడు. సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి రాజుకి ఏకకాలంలో. ఈ పజిల్ జవాబుని వేరెవ్వరికీ చెప్పవద్దని, తన ముఖాన్ని వంద సార్లు చూసాకే ఎవరికైనా చెప్పాలని ఆజ్ఞాపించాడు రాజు. సరేనన్నాడు రైతు.

రాజధాని చేరిన రాజు రైతు జీవన శైలిని ఒక చిక్కు ప్రశ్నగా మార్చి దాన్ని విప్పమన్నాడు. ఎంత తలబద్దలు కొట్టుకున్నా ఎవ్వరికీ సమాధానం దొరకలేదు. మంత్రి కనుగొన్నాడు రాజు ఒక గ్రామానికి వెళ్లటం. అక్కడో రైతుని కల్సుకోవటం. వెంటనే ఆ గ్రామం చేరుకొని మన రైతును కల్సుకొని ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పమన్నాడు. రాజుకు మాటిచ్చాను. చెప్పలేనన్నాడు రైతు. వంద నాణాలు బహుమతిగా ఇచ్చి ఇప్పుడు చెప్పమన్నాడు మంత్రి. ఆ నాణాల మీద రాజు శిరస్సు ముద్రించి ఉంది. వంద నాణాలపై వంద రాజు ముఖాలు. ఇంకేం. ఎలాంటి సమస్యా లేదు అనుకుంటూ జవాబు చెప్పాడు రైతు మంత్రికి. హుటాహుటిన మంత్రి రాజధానికి తిరిగొచ్చి రాజుకు సమస్యాపూరణం చేశాడు. ఆశ్చర్యపోయిన రాజు మంత్రిని అడిగాడు సమాధానం ఎవరు చెప్పారని. నిజం తెల్సుకున్న రాజు ఆగ్రహావేశాలతో గ్రామం నుంచి రైతును రప్పించి నిప్పులు చెరిగాడు. శాంతంగా విన్న రైతు రాజా తమరే సెలవిచ్చారు కదా. తమరి వంద ముఖాలు చూసే దాకా ఎవ్వరికీ జవాబు చెప్పొద్దని. మంత్రి ఇచ్చిన వంద నాణాల మీద తమరి ముఖార విందాన్ని వంద సార్లు చూసాకే సమస్యని పూరించానని ఎంతో వినయ విధేయతతో చెప్పాడు.

రైతు రుజువర్తనుడే కాదు నమ్మదగ్గ వ్యక్తి. ఇచ్చిన మాటకు విలువిస్తాడు అని ఆగ్రహించి సన్మానించాడు. మనందరం ఆ రైతు లాగా జీవితంలోని ముఖ్యాంశాలను గ్రహిస్తే అడ్డదోవలు తొక్కుతూ ఈ సమాజాన్ని అల్లకల్లోలం చేయాల్సిన అవసరం ఉండదు కదా! వృద్దాప్యంలో తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించి వెట్టిచాకిరి చేయించుకునే ప్రబుద్ధులు ఎందరో! లేకుంటే చేతులు శుభ్రంగా డెటాల్‌తో కడుక్కొని తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి అంకితం చేయటం. ప్రేమతో గౌరవంగా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో ఆదరించే వారు భూతద్దంలో వెతికితే గాని కనబడదు. ఎంత దురదృష్టం. మాతృదేవోభవా, పితృదేవోభవా అనే సంస్కృతికి నిలయమైన మన భారతంలో ఎన్ని అపశృతులు. ఇతరుల సహాయం కోసమే మానవ జన్మ అని మన శాస్త్రాలు, పురాణాలు, పెద్దలు ఘోషిస్తుండగా.. పట్టపగలే బందిపోటు దొంగల్లా దేశాన్ని, మనల్ని దోచేస్తూ, దేశ సంపదను స్విస్ బ్యాంకులకు తరలిస్తున్నారు మనకు అండదండగా నిలవాల్సిన పెద్దమనుషులు. ధనార్జనకు అడ్డదారులేకాదు. రాజమార్గాలు ఉన్నాయని నిరూపించే ప్రయత్నమే ఈ నిజ జీవిత గాధలన్ని. పదండి ముందుకు ఈ చిన్న ప్రపంచం మన గుప్పిట్లోకి ఎలా వచ్చిందో తెల్సుకుందాం.
http://suryaa.com/Main/gallery/2010/Sep/07/world.jpg
ప్రపంచం మీ గుప్పిట్లో....
రిలయన్స్ మొబైల్ ఫోన్ ప్రకటనలకు ఇది ట్యాగ్‌లైన్.. నేను రాసిందే 2003లో. నిజంగా ప్రపంచం మన గుప్పిట్లోనే ఉంది కదూ నేడు. మా పని అమ్మాయికి ఆవిడ పతి దేవుడైన సెక్యూరిటీ గార్డుకి, మావంటావిడకు, ఆవిడ కుటుంబ సభ్యులందరికీ, మన పోస్టుమ్యాన్‌కు, మన డ్రైవర్లకి, మా మానవరాలికి, మీకు ... నాకు... ఎవ్వరికీ ఇది లేందే జరగదు ఒక్క క్షణం కూడా. సర్వాంతర్యామి మొబైల్. చిన్నా పెద్దా, రాజు పేద, ఆడామగా... ఎలాంటి తేడాలు చూపకుండా అందరికీ అండదండ గా నిలుస్తూ ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చింది ఈ మొబైల్ ఫోన్. చాలా వస్తు, సేవలు, విలాసాలు కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఈ ప్రపంచంలో ఒక్క మొబైల్ ఫోన్ ఎలాంటి బేధాలు చూపకుండా అందరినీ అలరిస్తోంది. మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. ఒక్కోసారి మీకనిపించదూ ఈ మొబైల్ ఫోన్ లేకుండా ఇంతకాలం మనం ఎలా జీవిస్తూ వచ్చామా అని.

అరచేతిలో ఇమిడిపోయి ఎంతో సింపుల్‌గా ఇన్నోసెంట్‌గా కనబడే ఈ మొబైల్ ఫోన్ వెనక ఎన్నో సంవత్సరాల కృషి దాగి ఉంది. రెండు సంస్థలకు చెందిన ఇంజనీర్ల ద్వారా - మోటరోలా, ఎటి అండ్ టి - ఇది ఆవిష్కరించబడింది. ఈ రెండు సంస్థలు కమ్యూనికేషన్ రంగంలో ఉద్దండులే. మోటరోలా టూవే రేడియో టెక్నాలజీతో నిష్ణాతులు కాగా ఎటి అండ్ టి క్లిష్టమైన సెల్యులార్ టెక్నాలజీలో ప్రసిద్ధులు. ఈ రెండు సంస్థలు కలిసి చేసిన కృషికి ఫలితమే నేడు మన జేబుల్లో ఇమిడిపోయి మనతోనే ఎల్లవేళలా ఉండే మొబైల్ ఫోను. అసలు ఈ రెండు సంస్థలు మొదలుపెట్టింది కార్‌ఫోన్ రేంజిని పెంచుదామని. కార్ ఫోన్లు ల్యాండ్ ఫోన్లకు చెందిన రేడియో ఫ్రీక్వెన్సీకి ముడిపడి ఉన్నాయి. ఈ ప్రీక్వెన్సీ రేంజ్‌ని డ్రైవర్ ఎక్కడకు వెళితే అక్కడదాకా పొడిగించాలంటే మరో కొత్త కమ్యూనికేషన్ పద్ధతిని కనుగొనాల్సి ఉంది.

అప్పట్లో వాడుకలో ఉన్న టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమయ్యే పనికాదు. కొత్త టెక్నాలజీ కనుగొనటానికి ఎన్నో సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటగా ఒక కొత్త సెల్యులార్ సిస్టమ్‌ని కనుగొని దాని కోసమై ప్రభుత్వం క్లియరెన్స్‌లను పొందటం. రెండోది ఒక కొత్త ప్రొటోటైపు తయారు చేయటం. దీనికి సంబంధించిన నమూనాలు గాని, ఇతర సమాచారం గాని ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే పూర్తిగా ఇదొక వినూత్న ఆవిష్కారం. మోటరోలా ఇండస్ట్రియల్ డైరెక్టర్ రూడీ క్రాలాప్ ఈ పరిశోధనల గురించి వివరిస్తూ "మేం కనుగొంటున్న దాన్ని షూ ఫోన్'' అని పిలిచే వాళ్లం. ఎందుకంటే అది ఒక బూటులాగా రూపం సంతరించుకుంటోంది. చివరకు సెప్టెంబర్ 1, 1983న మోటరోలా సరికొత్త చరిత్రను సృష్టించింది. అమెరికాకు చెందిన యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, డివైఎన్ఎ టిఎసి 800ఎక్స్ ఫోన్‌ను అంగీకరించింది. ఈ ఫోన్ ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ మొబైల్ ఫోను. పదేళ్లు.. 10 కోట్ల డాలర్ల (450 కోట్ల రూపాయలు) పెట్టుబడికి ఫలితంగా ఉద్భవించిన మొబైల్ ఫోను ఇది.
http://www.travisfitzwater.com/wp-content/uploads/2010/02/dreambig.jpg
కార్ ఫోను రేంజ్‌ని పెంచుదామనుకొన్న చిన్న ప్రయత్నం ప్రపంచాన్ని, మనందరి గుప్పిట్లోకి తెచ్చింది. ఈ మొబైల్ ఫోను నేడు అందరికీ ఎలా కాసుల వర్షం కురిపిస్తోందో మనందరికీ తెలిసిందే. ఒక మంచి ఆలోచన, శ్రమ, దాని ఫలితం పది మందికి ఎలా ఉపయోగపడుతుందో, వారి జీవితాలను ప్రభావితం చేస్తుందో వివరించేదే ఈ మొబైల్ ఫోన్ కథ. అలాంటివే ఈ అధ్యాయం - పేరు ప్రతిష్టల ఫలితమే డబ్బు- లో మనం ముచ్చటించుకున్న ఇతర నిజ జీవిత కథలు కూడా. వాల్ట్ డిస్నీ యానిమేషన్ చరిత్ర, సింఫనీ కూలర్ విజయ గాధ, స్టార్ బక్స్ కాఫీ కప్పుతో ఘన విజయం, హాట్ మెయిల్ హాట్ హాట్ కీర్తి తద్వారా దక్కిన లక్ష్మీ కటాక్షం. యాపిల్ కంప్యూటర్ మెకింతోష్ ఆవిష్కరణ. అది సాధించిన అద్భుత విజయాలు. సోనీ వాక్‌మెన్ ఆవిష్కరణ. అది మన జీవిత సర ళిపై వేసిన చరగని ముద్ర. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్య బర్గర్, ఒక చిన్న ఐడియాతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన మెక్‌డొనార్డ్స్. ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం - మైక్రో చిప్ ద్వారా మానవజాతి జీవిత గమనాన్ని మార్చివేసిన కథాకమామిషు. చివరిగా ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చిన మొబైల్ ఫోన్ అద్భుత ఆవిష్కరణ. ఇవన్నీ ఇలాంటివి మరెన్నో... చిన్నా పెద్దా నిజ జీవిత గాధ లు.http://us.123rf.com/400wm/400/400/kjpargeter/kjpargeter0607/kjpargeter060700180/478803-the-world-in-your-hands--3d-render.jpg
వేలల్లో, లక్షల్లో .. మనకు చెప్పేది ఒక్కటే:
ప్రతిభకు ఫలితం పేరు ప్రతిష్టలు. వాటి ఫలితం డబ్బు. ధనార్జనకు రాచబాట ఇదే. మోసాలు, అన్యాయాలు, అరాచకాలు కాదు. అవి తెచ్చే సంపద కేవలం తాత్కాలికం. మోసపోయిన వారి తిట్లు, శాపనార్ధాలు, మనకు దీవెనలు కాదు కదా! ఆలోచించాల్సిన విషయం ఇది. సువిశాలమైన ఈ ప్రపంచంలో అందరికీ ఉన్నాయి అవకాశాలు. అవి అందిపుచ్చుకొని హాయిగా ఆనందంగా ఉండటమే మన కర్తవ్యం. 
http://drjeffadams.com/wp-content/uploads/2008/07/dream-big.jpg
కలలను, గమ్యాలను విడనాడొద్దు! కలతో, కృషితో నాస్తి దుర్భిక్షమ్!
- ఎజి కృష్ణమూర్తి

Monday, October 25, 2010

' అబద్ధం ' చాలా చిన్న బలమైన పదం.

అబద్ధం...నేటి నిజం!

అబద్ధం చెప్పటం కొందరికి ప్రాణావసరం. మరి కొందరికి సరదా. ఇంకొందరికి ఒక జీవన విధానం. తరచి చూస్తే- మన చుట్టూ అనేక అబద్ధాలు. రోజూ వీటిలోనే మనం బతుకుతూ ఉంటాం. జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పని వ్యక్తి ఎవరూ ఉండరు. అసలు మనం ఎందుకు అబద్ధం చెబుతాం? దానికి కారణాలేమిటి? ఈ విషయాలను డోరతి రో- 'వై వుయ్ లై' అనే పుస్తకంలో కూలంకషంగా చర్చించారు. అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న ఈ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు.


"అవతల వ్యక్తులను మోసం చేయటానికి ఉపయోగించే పదాలను కాని, చర్యలను కాని అబద్ధాలు అని మనం పిలుస్తాం. చాలా సార్లు మనం ఇతరులకు వాస్తవం చెప్పం. అబద్ధం చెబుతాం. కొన్ని సార్లు మనకు మనమే అబద్ధం చెప్పుకుంటాం. అబద్ధం అనే పదం చాలా చిన్నదే. కాని ఇది చాలా బలమైన పదం.


ప్రయోగిస్తే మనసులోకి సూటిగా దిగుతుంది. అందుకే ఎక్కువ మంది ఈ పదాన్ని ఉపయోగించటానికి ఇష్టపడరు. భాషాపరంగా చూస్తే అబద్ధానికి కచ్చితమైన అర్థం ఏదీ లేదు. వివిధ సమాజాల్లో దీనిని విభిన్నరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక సారి రోమ్ విశ్వవిద్యాలయంలో ఫెరారీ కంపెనీ ప్రెసిడెంట్, ఫియట్ కంపెనీ ఛైర్మన్ ల్యూకా కార్డిరో-మోంటిజీమోలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. "నేను స్కూల్లో ఉన్నప్పుడు కాపీ చేయటంలో ప్రపంచ ఛాంపియన్‌నని చెప్పొచ్చు.


ఈ విషయంలో నాకు ఎవరూ పోటీ ఉండేవారు కాదు. తెలివైన వారి పక్కన కూర్చోవటానికి ఏదో ఒక మార్గం వెతికేవాడిని. వారి దగ్గర కూర్చుని అంతా కాపీ కొట్టేవాడిని'' అని ల్యూకా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ఈ అంశం గురించి ఫ్రాంక్స్ ఎక్స్ రోకా అనే పాత్రికేయుడు వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఒక వ్యాసం రాశాడు. 'అమెరికాలో విద్యార్థులు ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని సేకరించి ఉపయోగించుకుంటూ ఉండొచ్చు.


కాని పక్క విద్యార్థుల నుంచి కాపీ కొట్టి.. దానిని తమ సొంత ప్రతిభగా ప్రదర్శించుకోరు. ఇది చాలా గర్హించదగ్గ విషయం''అని ఆ వ్యాసంలో వ్యాఖ్యానించాడు. అంతేకాదు 'ఇటలీలో కాపీ చేయటాన్ని ఒకరి పట్ల విశ్వాసానికి, విద్యార్థుల మధ్య బంధానికి చిహ్నంగా భావిస్తూ ఉండొచ్చు. చాలాసార్లు మోసగాళ్లు జీవితంలో పైమెట్టు ఎక్కలేకపోవచ్చు


. కానీ కాపీరాయుళ్ల మాత్రం పైకి వస్తారనటానికి నిదర్శనాలు ఉన్నాయి' అని ల్యూకాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారం లేపాయి. ఇటలీకి చెందిన అనేకమంది మేధావులు ఈ వ్యాఖ్యలను ఖండించారు...


ఎందుకు?
అబద్ధం ఆడి తప్పించుకు పోవచ్చని చాలామంది భావిస్తూ ఉంటారు. చాలా మందికి ఈ అలవాటు చిన్నప్పుడే అబ్బుతుంది. కొందరు చెప్పే అబద్ధాలు ఇట్టే తెలిసిపోతాయి. అవి అబద్ధాలని మనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉండదు. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన అంశం- మనకు మనం అబద్ధం చెప్పుకోవటం.


ముందుగా ఒక విషయాన్ని నిజమని నమ్మటం మొదలుపెట్టి దానిని ఇతరులకు చెప్పటం మొదలుపెడతారు. అది బయటకు వస్తుందేమోననే భయంతో- వాస్తవాన్ని కప్పిపుచ్చటానికి మరొక అబద్ధం చెబుతారు. అది అబద్ధమనే అనుమానం రాకుండా ఉండటానికి ఇంకొకటి చెబుతారు. ఇలా ఒక వలను అల్లుతారు.


కొందరు మంచి పని చేయటం కోసం అబద్ధం చెప్పామనో.. ఒక ఉన్నతమైన విలువను కాపాడటం కోసం అబద్ధం చెప్పామనో కూడా చెబుతూ ఉంటారు. కాని చాలాసార్లు అవతల వ్యక్తులు వీటిని గుర్తిస్తారు.అయినా భయం వల్లనో, గౌరవం వల్లనో బయటకు చెప్పరు.


మౌనమే నీ భాష..
కుటుంబ జీవితం ఒక పెద్ద అబద్ధాల పుట్ట. అయితే కొందరు చాలాసార్లు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోతారు. అలాంటి సమయాల్లో మౌనమే పెద్ద ఆయుధంగా మారుతుంది. "ఎంత తక్కువ మాట్లాడితే- పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి'' అనే సిద్ధాంతాన్ని కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు.


సాధారణంగా కుటుంబంలో అతి శక్తివంతమైన వ్యక్తి అబద్ధాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు- మౌనాన్ని ఒక బలమైన ఆయుధంగా వాడుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు మా ఇంట్లో మా అమ్మకు ఏదైనా విషయం చెప్పటం ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండిపోతుంది.


నన్ను ఏదైనా విషయంలో శిక్షించాలన్నా.. నేను విమర్శలు చేస్తున్నప్పుడు అడ్డుకోవాలన్నా ఆమె ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తుంది. మా ఇంటికి సంబంధించిన చాలా రహస్యాలు ఇప్పటికీ నాకు తెలియదు. ఎప్పుడైనా రహస్యాల వైపు సంభాషణలు మళ్లినప్పుడు- అమ్మ మౌనం వహిస్తుంది. కొన్నిసార్లు అబద్ధం కూడా చెబుతుంది. ఆ విషయం ఆమెకు కూడా స్పష్టంగా తెలుసు.


'పిల్లలకు అన్ని చెప్పలేం కాబట్టి అబద్ధం చెప్పినా పర్వాలేదు' అని ఆమె నమ్ముతుంది... ఎవరికైనా చెప్పవచ్చు కానీ..
మనకు మనం అబద్ధాలు చెప్పుకోవటం మొదలుపెట్టినప్పుడు వాస్తవానికి దూరంగా జరిగిపోవటం మొదలుపెడతాం. తెలియకుండానే కళ్లకు గంతలు కట్టేసుకుంటాం. "కొందరికి కొంత కాలం పాటు మనం అబద్ధాలు చెప్పవచ్చు. కాని ఆ తర్వాత అది సాధ్యం కాదు. అయితే మనకు మనం ఎప్పటికీ అబద్ధాలు చెప్పుకుంటూ బతికేయవచ్చు'' అంటాడు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిమన్ హోగర్ట్.


కొత్త జీవులను కనుక్కోవటానికి జీవ శాస్త్రవేత్త తన అధ్యయనాలను కొనసాగించవచ్చు. కొత్త రసాయనాలను కనుగొనటానికి రసాయన శాస్త్రవేత్త పరిశోధనలు చేయవచ్చు. కాని మనుషుల్లో కొత్త రకం ప్రవర్తనను కనిపెట్టడం చాలా కష్టం. మన చుట్టూ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాని మనం మాత్రం తరతరాలుగా ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం...


మనకు తెలుసు..
అబద్ధం ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. ప్రతిరోజూ మనకు అనేక మంది అబద్ధాలు చెబుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటంలో వ్యక్తులు, సంస్థలు అనే తేడా కూడా ఏమీ లేదు. చాలాసార్లు ఇలాంటి అబద్ధాల వలన మనకు హాని కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం- ప్రతి కంపెనీ తన వార్షిక ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.


కంపెనీ సైజు పెరిగే కొద్దీ వార్షిక నివేదిక కూడా ఆకర్షణీయంగా తయారవుతూ ఉంటుంది. దీనిలో షేర్‌హోలర్డ్స్‌ను ఆకట్టుకొనే అంశాలెన్నో ఉంటాయి. ఈ నివేదికలు చదవటానికి చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అయితే ఈ భాష వెనక అనేక అబద్ధాలను కప్పిపెడతారు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణను చూద్దాం.


2007వ సంవత్సరపు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ వార్షిక నివేదికను 2008, ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేశారు. "రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ (ఆర్‌బీఎస్) చాలా బాధ్యతాయుతమైన కంపెనీ. మా అధ్యయనాల ఆధారంగా షేర్‌హోల్డర్స్‌కు లాభదాయకమైన వాటిని ఎంపిక చేస్తాము..'' అని ఉంది. కాని ఆ ఏడాది షేర్ హోల్డర్స్‌కు తెలియకుండా ఆ బ్యాంకు రిస్కుతో కూడిన అనేక పెట్టుబడులు పెట్టింది.


చివరకు బ్యాంకు దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం సాయంతో తిరిగి కోలుకుంది. దీని ఆధారంగా చూస్తే- సాధారణంగా ఇలాంటి నివేదికల్లో బయటకు చెప్పేది ఒకటి.. వాస్తవ పరిస్థితి మరొకటి ఉంటుందని తేలుతుంది. 
వై వుయ్ లై
రచయిత్రి: డోరతి రో
ప్రచురణ: ఫోర్త్ ఎస్టేట్, లండన్
ధర: రూ. 350
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాల్లోను దొరుకుతుంది